జ్ఞాపకాల తరంగిణి-50

0
7

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]మా[/dropcap] నాయన విద్యావాచస్పతులు కాళిదాసు వెంకట సుబ్బాశాస్త్రి గారు, మా తల్లి రమణమ్మగారు. తండ్రిగారి జననం 1883 ప్రాంతం – మరణం 1953 సెప్టెంబర్ 30వ తేది. స్వస్థలం టంగుటూరు, కొండపి మార్గంలో 7వ మైలు వద్ద తూమాడు అగ్రహారం. మా నాయనగారు అగ్రహారీకులు. వీరి తాత పట్టాభిరామ చయనులు, తండ్రి చెంచురామయ్య. ఈ చెంచురామయ్య గారికి 1.వెంకటసుబ్బమ్మ, 2.పురుషోత్తమయ్య, 3.వెంకటసుబ్బాశాస్త్రి, 4.ఆదిలక్షమ్మ, 5.వెంకటరమణమ్మ, 6.పట్టాభిరామశాస్త్రి సంతానం. తాత పట్టాభిరామయ్య చయనంచేసి పట్టాభిరామ చయనులుగా ప్రసిద్ధి చెందారు. ఆయన మంత్రశాస్త్రవేత్త.

విద్యావాచస్పతులు కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి గారు. మరణం 30-9-1953. సుమారు 70 ఏళ్ల వయసులో

మా నాయన గారు విజయదశమి నాడు అమ్మమ్మగారి ఇంట, నెల్లూరు జిల్లా, ఆత్మకూరు సమీపంలోని పొంగూరు గ్రామంలో జన్మించారు. తండ్రిగారి వద్ద ప్రాథమిక విద్య ముగిసిన తర్వాత రాజంపేట సమీపంలోని కొర్లగుంట గ్రామంలో వరసకు అన్న అయిన దాయాది ఇంట్లో వుండి కొంతకాలం చదువు సాగించారు. ఆ తర్వాత కాళహస్తి సమీపంలోని ఒక గ్రామంలో వైష్ణవ గురువు వద్ద పంచకావ్యాలు అభ్యసించారు. అక్కడ నుంచి తమిళదేశంలోని శ్రీ పెరుంబుదూరు వెళ్ళి ఒక మహావైష్ణవ పండితుణ్ణి ఆశ్రయించారు. ఆ గురువుగారి వద్ద పాణిని ఆసాంతం అధ్యయనం చేశారు. శ్రీ పెరుంబుదూరులో ఉన్నంత కాలం మధ్యాహ్న భోజనం గుళ్ళో ప్రసాదంతో జరుపుకొని, రాత్రిపూట భోజనం ఒక ప్రభుత్వాధికారి – రిజిస్ట్రార్ గారి యింట. నాలుగేళ్ళు తనకు భోజనం పెట్టిన గృహస్థుకు పంచకావ్యాలు పాఠం చెప్పారు. నాయన గారికి వేదాధ్యయనం చేయాలని బలమైన కోరిక ఉన్నా స్వరం పట్టుబడక ఆ ప్రయత్నం విరమించుకొన్నారట. అయితే వైదిక సంస్కృత వ్యాకరణం సమగ్రంగా అధ్యయనం చేశారు. సంస్కృత సాహిత్యం, వ్యాకరణాల్లో ఆయన మహాపండితులని, నిష్ణాతులని పేరు సంపాదించుకొన్నారు.

విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అల్లూరులో పొంగూరు సీతారామయ్య సోమయాజులు కుమార్తెను పెళ్ళి చేసుకొన్నారు. కొద్దికాలం బాపట్ల సంస్కృత పాఠశాలలో పనిచేసి, నెల్లూరు సమీపంలోని జేజేపేటలో, తర్వాత తుమ్మగుంటలో సంస్కృతపాఠశాల నడిపారు. ఇక్కడ ఆయన వివక్ష పాటించకుండా ‘శూద్రుల’కు సంస్కృతం నేర్పించినట్లు మరుపూరు కోదండరామరెడ్డి తెలిపారు. పుష్పగిరి పీఠాధిపతులు ఆయనను ఆస్థాన పండితులుగా నియమించి, కనిగిరి తాలూకా వీరరాంపురంలో శివాలయ జీర్ణోద్ధరణ బాధ్యత అప్పగించారు. ఏడాదిపాటు అక్కడే ఉండి ఆలయం పునరుద్ధరణ చేశారు. ఆ వూళ్ళో వుండగానే భార్య మగబిడ్డను ప్రసవించి, తొమ్మిదోరోజు బాలింత వాయువుతో చనిపోయింది. పదినెలల తర్వాత ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు.

కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి గారి మిత్రులు కళాప్రపూర్ణ మరుపూరు కోదండరామరెడ్డిగారు

1922 జూలైలో నెల్లూరుకు ఏడు మైళ్ళ దూరంలోని పల్లిపాడు గ్రామంలో చతుర్వేదుల రాఘవయ్యగారు శ్రీ తిలక్ విప్రపాఠశాల నెలకొల్పి, మా నాయన గారిని ప్రధానాచార్యులుగా నియమించారు. సుమారు అయిదేళ్ళు అక్కడ విద్యార్థులను పరీక్షలకు తయారు చేశారు. పల్లిపాడు అగ్రహారంలో బ్రాహ్మణ కుటుంబాల వారంతా ఆయనకు ఆత్మీయులయ్యారు. అక్కడే ఆయుర్వేదం పైన ఆసక్తి కలిగి, విద్యార్థులకు వైద్యం కూడా నేర్పించడం మొదలు పెట్టారు. 1939లో డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారు అధ్యక్షులుగా వ్వహరిస్తున్న Central Board of Indian Medicine, Madras ఆయనకు B గ్రేడు ఆయుర్వేద వైద్యులుగా ఆయుర్వేద వైద్యవృత్తి చేసుకునేందుకు గుర్తింపు-certificate ఇచ్చింది కాని ఆయన వైద్యాన్ని వృత్తిగా ఎన్నడూ కొనసాగించలేదు.

తూమాడువద్ద ముసి అనే నది

నాయన గారు 1927లో పల్లిపాడు విడిచిపెట్టి నెల్లూరులో స్థిరపడ్డారు. మళ్ళీ కొంతకాలం పుష్పగిరి ఆస్థాన పండితులుగా వుంటూ నెల్లూరులో అన్నవరం రాఘవాచార్యులుగారి వద్ద ప్రస్థానత్రయం చదివారు. తమ గురువు రాఘవాచార్యులు పరమపదించిన పిమ్మట, వారి స్థానంలో నెల్లూరు కాశిఖేలవారి అగ్రహారం లోని వేదాంతమందిరంలో సుమారు యిరవైరెండేళ్ళు ప్రతిదినం ఉదయం ప్రవచనం చేశారు. నెల్లూరులో విద్యావంతులు, న్యాయవాదులు, పురప్రముఖులు ఆ సమావేశాలకు హాజరయ్యేవారు. వేదాంత మందిరంలో ప్రతి సంవత్సరం శంకరజయంతి సభల్లో శాస్త్రిగారి ఉపన్యాసాలు వినడానికి పురప్రముఖులు వచ్చేవారు. ఆయన అద్వైతప్రవచనంలో గొప్ప ఖ్యాతి గడిచారు. 1930-45 మధ్య నెల్లూరులో జరిగిన సాహిత్యసభల్లో వారు తరచూ పాల్గొని ఉపన్యసించినట్లు స్థానిక పత్రికలు రాశాయి. నెల్లూరు రాయాజివీధిలోని, పుష్పగిరి మఠంలో సంస్కృతపాఠశాల నెలకొల్పి సుమారు పది సంవత్సరాలు నిర్వహించారు. ఇందులో కడప, నెల్లూరు జిల్లాల్లోని దూరప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు సంస్కృతం అభ్యసించారు. 1937లో శాస్త్రిగారు పొగతోట, కస్తురిదేవినగర్‌లో నివేశనస్థలం కొని ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు. నెల్లూరికి 7 మైళ్ల దూరంలోని గొలగమూడి గ్రామంలో భూములు కొని పూర్తిగా వ్యవసాయం మీదే దృష్టి పెట్టి, కృషీవలుడిగా జీవించారు. వ్యవసాయ యోగ్యంగా లేని పొలాలను కొని వాటికి మరమ్మత్తులు చేసి సేద్యానికి యోగ్యమైన పొలాలుగా తయారు చేసేవారు. ఇందుకు చాలా సమయం, ధనం వెచ్చించేవారు.

తూమాడులో శివాలయం

ఒకమారు గాంధీజీ ఉపన్యసించిన సభలో విదేశీ వస్త్రదహనం జరిగింది. సభకు వచ్చిన వారంతా మిల్లు పైపంచెలు, చొక్కాలు దహనం చేశారు, సభకు వెళ్ళిన శాస్త్రి గారు మాత్రం పైపంచెను దారిలో ఒక యాచకునికిచ్చారు. జాతీయోద్యమ స్ఫూర్తితో నూలు కొని మాలవారికిచ్చి మగ్గంమీద నేసిన ధోవతులను, ఖద్దరు వస్త్రాలను ధరించారు. ఆయన ధోవతి, పైపంచె తప్ప చొక్కా వేసుకోలేదు, ఆయన ఆచారాలు, విశ్వాసాలు చాలా కఠినమైనవి. అయినా ఉదారవాది. గొలగముడి దళితవాడలో తనకు అనేక మంది మిత్రులు వుండేవారు. ఆయన ఆయుర్వేద ఔషధాలు తప్ప ఇంగ్లీషు మందులు వాడలేదు. జాతీయోద్యమ స్ఫూర్తితో తన పిల్లలందరికీ హిందీ చెప్పించారు. శాస్త్రిగారివద్ద వందలమంది విద్యార్థులు సంస్కృతం చదువుకొన్నారు. నెల్లూరు మూలపేటలో వేదసంస్కృత కళాశాల నెలకొల్పినపుడు వెంకటసుబ్బాశాస్త్రి గారిని ప్రిన్సిపల్ పదవి చేపట్టమని కోరగా ఆయన ఆ పదవిలో తన పూర్వవిద్యార్థి గాజులపల్లి హనుమచ్ఛాస్త్రిగారిని నియమించమని కోరారు. వెంకటసుబ్బాశాస్త్రిగారికి జ్యోతిషంలో గొప్ప ప్రవేశం వుంది. జ్యోతిషపండితులు స్వయంపాకుల శేషయ్యశాస్త్రి, ఉట్రవడియం కృష్ణశాస్త్రి వంటి యెందరో ప్రసిద్ధులు ఆయన శిష్యులు. వెంకటసుబ్బాశాస్త్రిగారు నెల్లూరులో స్థిరపడిన తర్వాత ఆయుర్వేదం మీద కృషి కొనసాగించారు. మిత్రులు, ఆయుర్వేద వైద్యులు పులుగండ్ల నరసింహశాస్త్రిగారితో వైద్య విషయాలు చర్చించేవారు. మేనల్లుడు కోడూరు వెంకటరమణయ్యకు, పాటూరు సుబ్బరామయ్యకు,  మరికొంతమందికి ఆయుర్వేదంలో శిక్షణ యిచ్చి పరీక్షలు పాసు చేయించారు. వాళ్ళు జిల్లా బోర్డులో వైద్యులై పేరుతెచ్చుకొన్నారు. నెల్లూరికి పండితులెవరు వచ్చినా వారిని వకీళ్ళ వద్దకు, సంపన్నుల వద్దకూ తీసుకొనివెళ్ళి పరిచయం చేసేవారు, సత్కరింపజేసేవారు. ప్రభాకర ఉమామహేశ్వర పండితులు అనే ఉత్తరాది నుంచివచ్చన పండితులొకరు శ్రీ కృష్ణుడు అయోనిజుడని నెల్లూరుసభలో ఉపన్యసిస్తూ అన్నారు. నెల్లూరు విద్వాంసులు ఆయన్ని ఖండించారు. వివాదంలో ఆ పండితుడు ఒంటరివాడయ్యాడు. వారం రోజులు గడువిస్తే, ఆ పండితులు చెప్పిన అంశాలకు గ్రంథాల్లో ఆధారాలు చూపుతానని సుబ్బాశాస్త్రిగారు సభలో విజ్ఞాపన చేశారు. వారం తర్వాత స్టోన్‌హౌస్‌పేట కన్యకా పరమేశ్వరి ఆలయంలో యేర్పాటయిన పండితసభలో వ్యాసభాగవతం, శ్రీధరవ్యాఖ్య తదితర గ్రంథాలనుంచి ఆధారాలు చూపించి వెంకటసుబ్బాశాస్త్రి ఆ బయటవూరి పండితులవారి వాదాన్ని గట్టెంకిచ్చినట్లు నెల్లురు పత్రిక ‘హిందూ బాంధవి’ వివరంగా రాసింది.

కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి గారు 1940లో కట్టిన ఇల్లు, నెల్లూరు నడిబొడ్డులో పొగతోటలో ఉంది.

వేదంవారి శిష్యులు యానాదిరెడ్డి వంటివారు, వేదం వ్యతిరేకవర్గంలో దుర్భా సుబ్రహ్మణ్యశర్మ, దీపాల వంటి పండితులు ఆయను కలిసేవారు. మరుపూరు కోదండరామరెడ్డి, వేదం నారాయణసోమయాజులు, ఇంగువ శ్రీ కృష్ణయ్య, విశ్వనాథ శ్రౌతి, రంగరామానుజాచార్యులు మొదలయిన పండితులు ఆయన సన్నిహిత మిత్రులు. 1948-49లో కంచి పరమాచార్యులు చాతుర్ మాసదీక్ష నెల్లూరులో జరుపుకున్నారు. వారు  శాస్త్రిగారిని తమ సముఖంలో వుంచుకుని విద్వద్గోష్ఠులతో కాలం గడిపారు. స్వచ్ఛందంగా శాస్త్రిగారి యింటికి ఒకరోజు భిక్షకు వచ్చారు. స్వామివారు మైపాడు సముద్రతీరానికి విహారం వెళ్ళినపుడు, వెంకటసుబ్బాశాస్త్రిగారిని వెంటపెట్టుకుని తెప్పమీద సముద్రంలో 7 మైళ్ళ దూరంవరకూ  వెళ్ళి, చాలా సేపు విహరించి వచ్చారు. శాస్త్రిగారికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అరవయ్యేళ్ళు దాటిన పిమ్మట శాస్త్రిగారు రంగరామానుజాచార్యుల వద్ద  పూర్వమీమాంస చదువుకొన్నారు. తనకు ప్రకృతి అంటే ప్రేమ. పరిసరవిజ్ఞానం, వనౌషధులు వంటి విషయాలమీద ఆసక్తి. తన సంతానానికి ప్రకృతి, మొక్కలు, ఆయుర్వేదం మీద అభిమానం కలిగించారు. ఆయనకు వ్యవసాయం పనులన్నీ కరతలామలకం. స్వయంగా పొలం దున్నేవారు. తాళ్ళు, తలుగులూ వేసేవారు. 1952లో అనారోగ్యంతో, ఏడాది పాటు మంచంపట్టి 1953 సెప్టెంబర్ 30వ తేది కన్నుమూశారు. వైష్ణవదేశంలో వైష్ణవ గురువులవద్ద చదువుకోవడం వల్ల వైష్ణవభక్తి తత్పరత అలవడింది. దానికి తోడు వారి పూర్వులకాలం నుంచి నరసింహ భక్తులు, కృష్ణభక్తులు. ఆయనది నిండైన పాండిత్యం, ప్రతిభ, ఒకరికి తలవంచని స్వేచ్ఛాప్రవృత్తి. “నిండుమనంబు నవ్యనవనీతసమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము..” పద్యం కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి గారిపట్ల యథార్థమని ఆయన సంస్మరణ సభలో మాట్లాడిన పెద్దలు నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here