జ్ఞాపకాల తరంగిణి-53

2
9

[dropcap]జ[/dropcap]మ్మూ నుంచి శ్రీనగర్‌లో ప్రవేశించే ముందే, సాయంత్రం 5.30కి దారిలో అవంతీపుర టౌన్ తగిలింది. మా డ్రైవర్ అవంతీ స్వామి ఆలయ శిథిలాల వద్ద కారు ఆపి చూచి రమ్మన్నాడు. ఎ.ఎస్.ఐ. సంరక్షణలో ఫుట్‌బాల్ గ్రౌండంత విశాలమైన స్థలంలో ఆలయం శిథిలాలన్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఆలయ సముదాయంలో శివకేశవులకు రెండు ఆలయాలు ఉండేవట. ఉత్పల రాజవంశీయుడు అవంతీవర్మన్ క్రీ.శ. 8వ శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించాడని, ఆ రాజవంశాన్ని వివరించే శిలాశాసనం అక్కడ ఉందని తెలుస్తోంది. కాశ్మీరీ పాలకుడు సికందర్ షామిరి ఈ ఆలయాన్ని, మరొక ఆలయం మార్తాండ సూర్య ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు, అవంతీశ్వర స్వామి ఆలయం ఆలయ శిథిలాలు మట్టి కింద కప్పబడి ఉండేవని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు వెలికితీసి సంరక్షిస్తున్నట్లు తెలిసింది. ఒక విశ్రాంత హైస్కూలు చరిత్ర టీచరు మాకు గైడ్‌గా ఉండి ఆలయ శిథిలాలన్నీ తిప్పి వివరించాడు. సాయంకాలం సూర్యకాంతిలో ఆ శిల్పాలన్ని అద్భుతంగా అనిపించాయి. గత వైభవాన్ని తలచుకొన్నప్పుడు ఎవరికైనా కాస్త దిగులు వేస్తుంది.

అవంతి స్వామి శిథిలాలు

శ్రీనగర్‍కు సుమారు గంట ప్రయాణంలో ఉన్న మార్తాండ సూర్య దేవాలయం కూడా ఇదే పరిస్థితిలో ఉందట. ఆలయం ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడినట్లు, అవంతీశ్వరస్వామి ఆలయం కన్నా పెద్దదని మా గైడ్ చెప్పాడు. ఆ ఆలయ శిథిలాలు దర్శించే అవకాశం మాకు లేకపోయింది.

దాల్ సరస్సు వద్ద రచయిత, వారి శ్రీమతి

శ్రీనగర్‍లో మే 29 నుంచి 30, 31 మూడు రోజులు ఉండి 31 మధ్యాహ్నం బయలుదేరి కార్గిల్ వెళ్ళాలనుకొన్నాము. మా బృందంలో ఒకరిద్దరు తప్ప అందరూ కాశ్మీరు చూచే ఉన్నారు. నా శ్రీమతి అమర్‌నాథ్ యాత్ర సమయంలో పెహల్‌గావ్, శ్రీనగర్ చూడడమే కాక, ఒక రాత్రి బోట్ హౌస్‍లో ఉన్నది. నేను 1986లో పెహల్‌గావ్, సోన్‌మార్గ్ మొదలైన ప్రదేశాలు దర్శించి ఉన్నాను. అందరం శ్రీనగర్ నడిబొడ్డులో ఉన్న శంకరాచార్య పర్వత దర్శనంతో కాశ్మీరు యాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకొన్నాము. ఉదయమే బయల్దేరి శంకరాచార్య పర్వతం మీదకి టాక్సీలోనే వెళ్ళాము. గుడి వద్ద దాదాపు 50 మంది సైనికులు, బారికేడ్లు, చాలా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. సెల్‌ఫోన్‌లు, ఇతర గేడ్జెట్‍లు, కెమెరాలు మెట్ల వద్దే కౌంటర్‌లో అప్పగించి మా బృందం శంకరాచార్య కొండ మీది శివలింగాన్ని దర్శించడానికి బయలుదేరారు. వైద్యుల సలహా ప్రకారం సుమారు 230 పై చిలుకు మెట్లు ఎక్కడం – అరిగిపోయిన నా మోకాళ్ళకు మంచిది కాదని, నేను నిలబడిపోయాను. దాదాపు గంట తర్వాత మా బృందం దర్శనం చేసుకొని తిరిగి వచ్చింది. 1986లో ఉదయం ఆరు గంటలకే నేను నా మిత్రులు కాలిబాటన శంకరాచార్య కొండకు బయల్దేరాము. పూజారి బాటలో కాకుండా అడ్డదారిన నిటారుగా బండల మీద దబదబ అడుగులు వేసిపోతుంటే ధైర్యం చేసి మేము కూడా అతన్ని అనుసరించి కొండ ఎక్కేశాము. పైన 10-15 మెట్లు ఎక్కితే, తలుపులు లేని గుడిలో పెద్ద శివలింగం. అప్పుడప్పుడే సూర్యోదయం అవుతోంది. మంచు దోమతెర కప్పుకొని నగరం అంతా నిద్రపోతున్నట్లు అనిపించింది. గుడి ముంది కొన్ని చినార్ వృక్షాలు, కొండ మీది నుంచి ఎటు చూచినా నగరమంతా కనబడుతుంది. అక్కడి స్థానికులు శంకరాచార్య పర్వతాన్ని సులేమాన్ పర్వతమని వ్యవహరిస్తారు. ఇప్పుడు కూడా ఆలయంలో నిత్య పూజ జరుగుతోంది.

కొండ దిగిన తర్వాత, మా కారు గుల్మార్గ్ దారి పట్టింది. దారిలో ధాబాలో టిఫిన్ తిన్నాము. ఉత్తరదేశీయ హిందువులే ధాబా నిర్వహిస్తున్నట్లు అనిపించింది. అక్కడ్నించి గుల్మార్గ్ వెళ్ళేటప్పటికి పది దాటింది.

గ్లేసియర్ వద్ద తాత్కాలిక దాబా

గుల్మార్గ్‌లో హోటళ్ళు, లాడ్జిలు, గుర్రాలను అద్దెకిచ్చేవాళ్ళు, అక్కడి శైత్యాన్ని తట్టుకోవడానికి కోట్లు అద్దెకిచ్చేవాళ్ళు అందరూ మా చుట్టూ మూగారు. మాలో ఒక దంపతులు ఎలాంటి చలికి ఆగే కోట్లూ, స్వెటర్లూ లేకుండానే గుర్రాల మీద స్కేటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్ళారు. కొందరు కాలినడకన మంచు ఘనీభవించిన ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. మా దంపతులం కార్లు ఆగిన చోటనే నిలబడి అక్కడి వినోదమంతా చూస్తూ గడిపాము. సుమారు 12 గంటల తర్వాత – మంచు, స్కేటింగ్ చూడడానికి వెళ్ళిన మా మిత్రులు వెనక్కి వచ్చారు. గుల్మార్గ్‌లో ఒకటి రెండు రోజులు ఉండి అక్కడి ప్రకృతి దృశ్యాలను ఆనందించాలని గాని ఒక పూట చూచి వచ్చేది కాదనిపించింది. గుల్మార్గ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు పెద్ద కార్ల బారులో ఇరుక్కొని రెండు గంటలు దాటిన తర్వాత, ఎప్పుడో మా హోటల్‌కు చేరాము.

యంగ్ ఫొటొగ్రాఫర్ మొగల్ ఉద్యానవనాల్లో

రెండో రోజు ఉదయమే మొగల్ ఉద్యానవనాలు తిరిగి వచ్చాము. ఆ ఉద్యాన వనాలు మేము దిగిన హోటల్‍కు కాస్త దగ్గరలోనే ఉన్నాయి కూడా. మా టాక్సీ డ్రైవర్ ఒక ముస్లిం యువకుడు. నెమ్మదస్థుడు. మేము కోరకుండానే మహమ్మద్ ప్రవక్త కేశాన్ని జాగ్రత్త చేసిన హజరత్‌బల్ దర్గా చూపించాడు. ఇతర మతస్థులను కూడా అనుమతిస్తారు. దాల్ సరస్సు ఒక వైపు కొండల వాలులో మొగల్ గార్డెన్స్, మరొక వైపు ఈ దర్గా ఉంది. దర్గా ముందు నుంచే కాశ్మీరు విశ్వవిద్యాలయానికి వెళ్ళాలి. 1986లో ఇక్కడ జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌లో నేను ఒక పత్రాన్ని సమర్పించాను కూడా. ఎందుకో అప్పుడు ఈ దర్గాను చూడలేదు. ఉదయం 11 గంటల వేళ శ్రీనగర్ నడిమధ్యలో ఉన్న జామియా మసీదు దర్శించాము. మసీదు వద్ద కారు దిగుతున్నప్పుడు – మసీదు ప్రధాన ద్వారం ముందే ఒక స్థానిక పోలీసు ఆఫీసరును ఆరు నెలల క్రితం కాల్చిచంపిన వార్త మనసులో మెదిలి కాస్త భయం వేసింది. చాలా పెద్ద మసీదు. ఇరవైవేల మంది ఒక్కసారిగా కూర్చొని ప్రార్థన చేసుకునే సౌకర్యం ఉంది. మసీదు ప్రాంగణంలోనే స్త్రీలు ప్రార్థన చేసుకోవడానికి ఒక ఆవరణ ఏర్పరిచారు. మూడు వైపులా పెద్ద ద్వారాలు, పశ్చిమం వైపు కుడ్యం. మసీదు పెద్దలు మమ్మల్ని చాలా గౌరవంగా చూచారు. నా శ్రీమతిని స్త్రీలు ప్రార్థన చేసుకొనే ఆవరణకు తీసుకొని వెళ్ళి చూపారు. ప్రతి వ్యక్తి ప్రార్థన చేసుకోవడానికి సరిపోయే తివాసీలు, మసీదులో పరచిఉన్నాయి.

శ్రీనగర్ జామా మసీదు ప్రవేశద్వారం వద్ద ఇద్దరు నడివయసు స్రీలు మౌల్వీ గారితో

మసీదు ద్వారం వద్ద కొందరు మౌల్వీలు కూర్చొని ఉన్నారు. మనం జాతకాలు చూపించుకోడం, మంచీ చెడు పండితుల నడిగి తెలుసుకొన్నట్లే కాశ్మీరీ ముస్లిం స్త్రీలు వాళ్లనడిగి తెలుసుకొంటున్నారు. మసీదు వెలుపల పెద్ద బజారు, అంగళ్లు. మావాళ్ళు కొన్ని శాలువలు, స్మారికలు కొన్నారు. శ్రీనగర్‍లో స్థానిక పంజాబీ స్త్రీలు కొందరు ముసుగు వేసుకొని కొందరు ముసుగు లేకుండా ఆ మార్కెట్‍లో బట్టలు కొంటూ కనిపించారు. ముస్లిం స్త్రీలకు కూడా బురఖా ఐచ్ఛికమనిపించింది. మా గైడ్ లడాకీ బౌద్ధ మతస్థురాలు. ఆమె మసీదు లోపలికి రాకుండా బయటే ఉండిపోయింది. తర్వాత బస్ స్టాండ్, డౌన్ టౌన్, అసెంబ్లీ, తదితర ప్రదేశాలన్నీ తిరిగి చూశాము.

మా టాక్సీ డ్రైవర్ చెప్పకుండా ఉంటే హరిపర్వత్ మీది శారికాదేవి ఆలయాన్ని చూసే అవకాశం లభించేది కాదు. నగరంలో ఒకవైపు హరిపర్వత్ పేరుతో చిన్న పర్వతం, దాని మీద శారికా దేవి ఆలయం, మరొక చివర సిక్కుల గురుద్వారా, ఒక దర్గా, కోట ఉన్నాయి. ఆలయానికి సుమారు 200 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. చాలా వెడల్పుగా, ఎత్తులేని మెట్లు ఏర్పాటు చేశారు. కాశ్మీరు పండిత్‍ల ఆరాధ్య దేవత గుడి శారికాలయం. మెట్లెక్కి పైకి వెళ్తే, పైన స్వయంభూ అయిన ఒక పెద్ద శిలను శారికాదేవిగా ఆరాధిస్తారు. శిలపైన శ్రీచక్రం యంత్రం చెక్కబడి ఉంది. ఈ శిల స్వయంభూవు, చెక్కి ఏర్పాటు చేసినది కాదు. 18 హస్తాలు ఉన్న శక్తిగా ఈ స్వయంభు దేవిని భావిస్తారు.

మా బృందం పైకి వెళ్ళే సమయానికి పూజ పూర్తయి, పూజారి పండిట్ భక్తుల కోసం తీర్థ ప్రసాదాలు అక్కడే పెట్టి వెళ్ళిపోయాడు. హరిపర్వతం మీది నుంచి చూస్తే శ్రీనగర్ పట్టణం, దాల్ లేక్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు పండిట్లు శారికాదేవి బొమ్మను పెట్టుకొని కేంపుల్లో తల దాచుకొన్న చోటే ఆరాధించవలసిన పరిస్థితి వచ్చింది. దేవాలయం మెట్ల వద్ద మా టాక్సీ నిలిపిన ప్రదేశంలో మధ్య తరగతి కంటే కొంచెం దిగువ తరగతి ముస్లింల ఇళ్ళు ఇరుకిరుకుగా ఉన్నాయి. మెటల వద్ద కొందరు 17-18 సంవత్సరాల యువకులు కూర్చొని ఉన్నారు. హరిపర్వతం మీది గుడి పేరేమని అడిగినప్పుడు తమకు తెలియదని చెప్పారు. వాళ్ళలో కొందరు కాలేజీ చదువులకు వచ్చారు. కొందరు ఇంజనీరింగ్ చదవాలని కోరుకుంటున్నారు. ఒక కుర్రాడు సల్మాన్ ఖాన్ ఫ్యానట. సల్మాన్ ఖాన్ మీద అన్యాయంగా కేసు పెట్టారన్నాడు. సినిమాలు ఎక్కడ చూస్తారు? అని అడిగితే టి.వి.లో, వీడియోల్లో అని, ఎన్నో ఏళ్ళ క్రితమే సినిమా హాళ్లు మూసేసారని చెప్పారు. కాశ్మీరు, ముఖ్యంగా శ్రీనగర్ టూరిజం పరిశ్రమ మీద ఆధారపడి ఉంది. మా టాక్సీ డ్రైవర్ పాతికేళ్ళ యువకుడు. ఇంట్లో తను కాక అయిదుగురు పెద్దవాళ్ళు ఉన్నారట. నెల జీతం ఎనిమిది వేళని కాబోలు చెప్పాడు.

మా హోటల్ బాయిస్‌లో ఇద్దరు బయటి కుర్రాళ్లు. ఒకరు కేరళ పిల్లవాడు, మరొకడు బెంగాల్ లోని జల్పాయ్‌గురి ప్రాంతం వాడు. చాలా తక్కువ జీతాలకు వాళ్ళను పెట్టుకొని ఉంటారనిపించింది.

అనుకొన్న ప్రకారం మూడో రోజు మధ్యాహ్నం శ్రీనగర్‌లో బయల్దేరి, రాత్రికి దారిలో హోటల్లో ఉండి, తెల్లవారి ప్రయాణం కొనసాగించాలని అనుకొన్నాము. తీరా బయల్దేరే సమయంలో ట్రాఫిక్ జామ్ వల్ల జోజిలా పాస్ వైపు వెళ్ళే వాహనాలను సోన్‍మార్గ్‌లో నిలిపివేస్తున్నారని విని, ప్రయాణాన్ని తెల్లవారికి వాయిదా వేసుకొన్నాము. మా బృందంలో సభ్యులు ఎవరికి వారే శ్రీనగర్ మరొక పర్యాయం చూద్దామని బయల్దేరారు. నేను మరొక మిత్రుడు కాలి నడకన మొగల్ గార్డెన్స్ చూచి వచ్చాము. సాయంత్రం దాల్ సరస్సులో చిన్న దీవి మీద చినార్ వృక్షాల దృశ్యం చాలా బాగుంది. అక్కడ్నించి కాలినడకన శ్రీనగర్ ఊళ్ళోకి వెళ్ళాము. జీలం నది ఇరుదరుల మీద నగరం విస్తరించి ఉంది. నది మీద తొమ్మిది చోట్ల కొయ్య వంతెనలున్నాయి. మంత్రులు, గొప్ప అధికారులు నివసించే ప్రాంతం మీదుగా నడిచి రాత్రి ఏడు గంటలకు హోటల్‍కి వచ్చాము. దారిలో ఎక్కడా పోలీసులు, మరెవరు మీరెవరని మమ్మల్ని అడగలేదు, ప్రశ్నించలేదు. మావాళ్లు కొందరు కశ్మీరు శాలువలు, ఇతర సావనీర్లు కొని తెచ్చుకొన్నారు. ఆ రాత్రి హోటల్ వాళ్ళు ముక్తసరిగా భోజనం పెట్టారు. మధ్యాహ్నం వీడ్కోలు లంచ్ ఏర్పాటు చేశారు గదా!

ఒకటవ తేదీ వేకువ జామున శ్రీనగర్‌లో బయల్దేరి 8 గంటలకు సోన్‌మార్గ్ చేరాము. 54 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటలు పట్టింది. మేము బయల్దేరే సమయంలోనే వార్మర్‍లు, స్వెటర్లు వగైరాలు ధరించి తయారుగా ఉన్నాము కాబట్టి సోన్‌మార్గ్‌లో చలిని తట్టుకోగలిగాము. ముప్ఫై ఏళ్ళ క్రితం చూచినప్పుడు సోన్‌మార్గ్ చిన్న ఊరు. ఇప్పుడు టౌన్‌గా, టూరిస్టు కేంద్రంగా ఎదిగింది. పర్యాటకుల కోసం పర్వత సానువుల్లో స్టార్ హోటళ్ళు కట్టారు. సమీపంలో పెద్ద పోలో క్రీడా మైదానంలో కొందరు గుర్రాలకు శిక్షణ ఇస్తున్నారు. ధాబా హోటల్‍లో టిఫిన్ తిని తీరిగ్గా సోన్‌మార్గ్ చూశాము. ఉదయం 11 గంటల తర్వాత గాని జోజిలా పాస్ వైపు వెళ్ళే వాహనాలను విడిచిపెట్టరు.

ఉదయం సోన్‌మార్గ్‌లో ఫలహారం

శ్రీనగర్ నుంచి జోజిలా పాస్ వరకు రోడ్డు మెలికలు తిరుగుతూ, పర్వత సానువుల నడుమ సతత హరితారణ్యాలను దాటుకుంటూ ప్రయాణం కన్నుల పండుగగా ఉంటుంది. అక్కడ నుంచి వర్షాభావం వల్ల ఎండినట్లుండే ప్రదేశాలు మొదలవుతాయి. వినీలాకాశం, మొక్కా, మోడు లేని భయంకరమైన ఎడారి ప్రాంతం. బోసిపోయినట్లున్న పర్వతాల నడుమ వంకర టింకరగా సాగే రోడ్డు. అక్కడక్కడా బార్లీ పొలాలు అంతస్తులుగా పేర్చినట్టు. పుష్పించిన అడవి చెట్లు, నిర్మలమైన హిమాని నదాలు, పొలాలకు ఎగువన ఎత్తుగా వెల్లవేసిన రెండు మూడంతుస్తుల ఇల్లు పెద్ద పెద్ద బాల్కనీలతో కనిపిస్తాయి.

సోన్‌మార్గ్ నుంచి హిమాని నదాలను (గ్లేషియర్స్) చూచి రావచ్చు. వెళ్ళి రావడానికి అరపూట పడుతుంది. మొదటిసారి వచ్చినప్పుడు కాలినడకన నేను హిమ ప్రవాహాల వరకు నడిచి వెళ్ళాను. గుర్రాల మీద వెళ్లదలచుకున్న వాళ్ళకు గుర్రాలు అద్దెకు లభిస్తాయి. హిమ ప్రవాహాల వద్ద స్లెడ్జి బండ్ల మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్తారు. స్థానికులకు ఈ రకంగా పని దొరుకుతుంది. సోన్‌మార్గ్‌లోనే కొందరు కాశ్మీరీ కొండజాతుల సంచార జాతుల ప్రజలను చూశాము. గుజార్లు, బక్రీవాలాలు సంచారజీవులు. ముస్లింలే కాని వారి జీవన విధానం, సంస్కృతి భిన్నమైనవి.

సోన్‍మార్గ్ వద్ద సంచారజాతుల వాళ్ళు

శ్రీనగర్ నుంచి సోన్‌మార్గ్ వరకు వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ట్రాఫిక్ బాగా పలచగా ఉంటుంది. సోన్‌మార్గ్ నుంచి అరగంట ప్రయాణంలో మంచు దట్టంగా పేరిన కొండవాలు తలం మీద టూరిస్టులు స్లెడ్జి బండ్ల మీద జారుతూ ఆనందిస్తున్నారు. కొందరు స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. టూరిస్టుల కోసం గుడారాలు వేసి కేంటినులు నిర్వహిస్తున్నారు. యువజనంతో ఆ ప్రదేశం కోలాహలంగా ఉంది. మా దంపతులం కార్లలో కూర్చునే ఆ దృశ్యాలు చూచి ఆనందించాము.

సోన్‌మార్గ్ వద్ద యాచకురాలు. ఫొటోకు 10 రూపాయలు అడిగి తీసుకున్నది

ఉదయం  బయల్దేరుతున్నప్పుడే టాక్సీ డ్రైవర్ “జోజీలా పాస్ దాటి వెళ్లాలి కదా! మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుందేమో” అనగానే నాలో ఏదో గిలి, భయం పట్టుకొన్నాయి, బైటకి చెప్పలేకపోయినా. 74 సంవత్సరాల వాడిని, ఏ అనారోగ్యం లేకపోయినా ఆ మాటతో నాలో ఏదో జంకు ఏర్పడింది. జోజీలా కనుమ సుమారు 12 వేల అడుగుల ఎత్తులో ఉండి, శ్రీనగర్ ప్రాంతాన్ని కార్గిల్, వేలీతో కలుపుతుంది. ఆరు నెలల పాటు ఈ మార్గం మంచులో కప్పబడి మూసివేయబడి ఉంటుంది. అప్పుడు విమాన మార్గమే శరణ్యం. 2016లో ఏప్రిల్ మాసాంతంలోనే జోజీలా పాస్ తెరిచారు. దారి వాహనాల రాకపోకలకు కాస్త స్థిర పడడానికి సమయం పడుతుంది కాబట్టి మేము మే మాసాంతంకు ప్రయాణం పెట్టుకొన్నాము. ఇంకా దారంతా పల్చటి మంచు. మంచు కరిగి కిందకి కాలువల్లా ప్రవహిస్తోంది. ఒక వైపు కొండ కొట్టి రోడ్డు వేశారు. మరొక వైపు అగాధమైన లోయ. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాగాము. బాల్‌తాల్ అనే ప్రదేశం నుంచే జోజీలా కనుమ పైకి వెళ్ళడం మొదలవుతుంది. ఈ ప్రదేశం నుంచే అమర్‍నాథ్ యాత్ర చేసినట్లు నా శ్రీమతి చెప్పింది. మా మిత్రులు ముందుగానే మంచి నీరు, ఆహారం దండిగా కారులో ఉంచుకోమని, ఏదైనా ఇబ్బంది అయితే ఉపయోగపడతాయని అన్నారు. నెమ్మదిగా జోజీలా పాస్ దాటుకొని ద్రాస్ అనే చిన్న టౌన్‍కు వచ్చాము. 2025 కల్లా ఈ కనుమ వద్ద సొరంగ మార్గం పూర్తయి వాడుకలోకి వస్తుందని విన్నాము. చుట్టూ కొండలు, రోడ్డుకు ఇరువైపులా మట్టి రాళ్ళ గోడలతో కట్టి ఇళ్ళ పైన రేకులు పరచి ఉన్నారు. ద్రాస్ టౌన్ వద్ద 1998-99లో జరిగిన యుద్ధంలో ప్రాముఖ్యం వహించబడిన టైగర్ హిల్ శిఖరం ఇక్కడి నుండి కనిపిస్తూ ఉంటుంది. రోడ్డు పక్కన నాలుగైదు చిన్న హోటళ్లున్నాయి.

ఉదయం 8 గంటల సమయంలో సోన్‌మార్గ్‌లో తిన్న టిఫినే, అందరం ద్రాస్‍లో టిఫిన్ చేసి కారు ఆపి, కార్గిల్ వార్ మెమోరియల్ చూడడానికి వెళ్ళాము. టైగర్ హిల్‌ను పాకిస్థాన్ సైనికుల స్వాధీనం కాకుండా మన వీరులు అశేష త్యాగాలు చేసి కాపాడారు. కార్గిల్ వార్ మెమోరియల్ అంటే కార్గిల్ జిల్లాలో ఉందనే తప్ప, కార్గిల్‌లో ఉందని కాదు. శ్రీనగర్ – కార్గిల్ రోడ్డుకు కుడివైపున విశాలమైన మైదానం, నేపథ్యంలో హిమాలయాలు గంభీరంగా కనిపిస్తూంటాయి. మన జాతీయ జెండా చాలా పొడవైన ధ్వజస్తంభం మీద గాలికి రెపరెపలాడుతూ దూరం నుంచి కనిపిస్తూంటుంది. అమర వీరుల వివరాలన్ని అక్కడ రాళ్ళ మీద కంచు ఫలకాలు అతికించి వాటి మీద చెక్కేరు. సాయంత్రం 4 గంటలకు సైనికుల కవాతు తర్వాత, ఒక సైనికుడు గంభీరమైన కంఠస్వరంతో కార్గిల్ స్మారక ప్రదేశాన్ని గురించి వివరించాడు. కొద్దిమంది పర్యాటకులం మాత్రమే అక్కడ ఉన్నాము. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ వీరుల త్యాగాలను స్మరిస్తూ, అందరం ప్రయాణానికి సన్నద్ధమయ్యాము. ద్రాస్ నుంచి 12 కి.మీ. దూరంలోనే మన దేశానికి పాకిస్థాన్‍కి మధ్య సరిహద్దు రేఖ కనిపిస్తుంది. ద్రాస్ టౌన్ మానవులు నివసించే అతి శీతల ప్రాంతాల్లో ఒకటి. శీతాకాలంలో మైనస్ 21 సెంటీగ్రేడ్‌కు ఉష్ణోగ్రత పడిపోవచ్చు.

కార్గిల్ యుద్ధ స్మృతి ప్రదేశం వద్ద ఇద్దరు సైనికులతో రచయిత బృందం

సాయంత్రం సుమారు 6 గంటలకు టాక్సీ కార్గిల్ చేరింది. లడాక్ లో లే, కార్గిల్ రెండు చిన్న సిటీలు. జోజోలా పాస్ దాటినప్పటి నుంచి పొడవాటి పాప్లార్ వృక్షాలు తప్ప మరే వృక్షాలు కనిపించలేదు. కొండలన్నీ శిలామయంగా బోసిగా కనిపించాయి. టిబెట్‍లో పుట్టిన ఇండస్ నది కార్గిల్ గుండా లే కు వెళ్ళి, తర్వాత పాకిస్థాన్‌లో ప్రవేశిస్తుంది. కార్గిల్‌లో అత్యధిక సంఖ్యాకులు షియా మహమ్మదీయులు. హిందూ, బౌద్ధులు అల్ప సంఖ్యాకులు. కారులో వెళ్తుంటే ఇండస్ నదిని చూచి చాలా సంతోషించాము. కార్గిల్ రెండు కొండల మధ్య విస్తరించిన నగరం. మా గైడ్ డోల్మా మాతో పాటు ఉండడమే కాకుండా కార్గిల్‌లో మా కోసం స్టార్ హోటల్ బుక్ చేసింది. గదుల్లో 24 గంటలు విద్యుచ్ఛక్తి, గీజర్లు వగైరా ఏర్పాట్లన్నీ ఉన్నాయి. శ్రీనగర్ నుంచి కార్గిల్‌కు సుమారు 204 కిలోమీటర్ల దూరమే కానీ, ఈ పర్వత ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితిని బట్టి బాగా అలసిపోయామనే చెప్పాలి.

ఇక్కడ హోటల్ గదిలో గీజర్ వేసుకుని షవర్ స్నానం చేద్దామని పంపు తిప్పగానే గడ్ద కట్టేంత చల్లని నీళ్ళు తల మీద పడ్డాయి. తేరుకొని అటు వైపుకి నాబ్ తిప్పి వేడి నీళ్ళలో స్నానం చేసినా, క్షణాల్లో జ్వరం వచ్చేసింది. జ్వరంతో పాటు, కొంచెం ఆయాసం గూడా మొదలైంది. అయినా అందరితో కలిసి డైనింగ్ హాల్‍కు వెళ్ళి మంచి భోజనం చేసి గదికి వచ్చి పడుకున్నా, జ్వరం తలనొప్పి తగ్గనే లేదు. మరుసటి రోజు ఉదయం పలహారాలు చేసి పెందరాడే బయల్దేరి రెండు గంటల  ప్రయాణం తరువాత జన్‌స్కర్ నదీపరివాహక ప్రాంతం జన్‌స్కర్ లోయ గుండా ముల్‌బెక్ అనే చిన్న టౌనుకు వెళ్ళాము. ముల్‌బెక్ ఊరికి కిలోమీటరు ముందుగానే రోడ్డుకు కుడివైపు పెద్ద పర్వత శిల మీద గండరించిన చంబా విగ్రహం దూరం నుంచే దర్శనమిస్తుంది. సిల్కు రోడ్డు వాడుకలో ఉన్న సమయంలో ఈ చంబా విగ్రహం సార్థవాహుల బాటకు అభిముఖంగా ఉండేది. విగ్రహం పాదాల వద్ద రెండంతస్తుల బౌద్ధ గుఫ (మఠాన్ని) నిర్మించడం వల్ల విగ్రహం పాదాలు మరుగు పడిపోయాయి. విగ్రహాన్ని చెక్కిన కొండ పైన మరో మఠం, మఠానికి వెళ్ళే మెట్ల దారి విగ్రహం పక్క నుంచి సాగుతుంది.

చంబా విగ్రహం

చంబా విగ్రహన్ని మైత్రేయ విగ్రహం అని అంటారు. లడాక్‍లో విస్తరించిన బౌద్ధంలో మైత్రేయ విగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ విగ్రహాన్ని చెక్కిన శిలకు సమీపంలో ఖరోష్ఠి లిపిలో (కుడి నుంది ఎడమకు సాగే లిపి) కొన్ని శాసనాలు కనుగొనబడ్డాయి. టిబెట్ భూభాగంలో కొంత భాగాన్ని పరిపాలించిన హ్ది (Hde) అనే రాజు జంతుబలిని నిషేధిస్తూ వేయించిన శాసనం విగ్రహం సమీపంలోనే లభించింది. ఆ శాశనం సమీపంలోనే మరొక శాసనం జంతుహింస లేకుండా జీవించడం అసాధ్యమని వివరిస్తుంది.

చంబ విగ్రహ పాదల వద్ద మఠంలో భిక్షువు

చంబా విగ్రహ పాదాల వద్ద మఠంలో బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించి సన్యాసులు ప్రార్థిస్తున్నారు. కొద్ది మంది సన్యాసులే మఠంలో ఉన్నారు. అక్కడ్నించి ముల్‌బెక్ లోనే భోజనం ముగించి, ఆర్యుల గ్రామాలు దా, హను పల్లెలు చూడడానికి వెళ్ళాము.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here