జ్ఞాపకాల తరంగిణి-58

2
9

నూబ్రా లోయకు ప్రయాణం – పేంగోంగ్ త్సో సందర్శన:

[dropcap]నూ[/dropcap]బ్రా లోయకు నేను తప్ప మా బృందం మొత్తం వెళ్లారు. నా శ్రీమతి, మిత్రులు శ్రీ ఎం. దశరధరామయ్య వివరించిన యాత్రానుభవాలను అక్షరరూపంలో పెట్టాను.

లదాక్ ల్యాండ్‌స్కేప్. న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో

ఉదయం పలహారం తర్వాత, నాలుగు రోజుల ప్రమాయణానికి అవసరమైన సామాగ్రి తీసుకొని అందరూ టాక్సీలో బయల్దేరారు. ఉదయం లదాక్ నుంచి ఖర్‍దుంగ్ లా కనుమ దాటి వెళ్లే వాహనాలను అనుమతిస్తారు. మధ్యాహ్నం వైపు నుంచి లే నగరంలోకి వచ్చే వాహానాలను అనుమతిస్తారు. మన మిలటరీ వారే అంతా నియంత్రిస్తారు. ఈ ప్రయాణంలో గైడ్‌గా షచుకుల్ గ్రామ యువతి సోనమ్ వెంటవచ్చింది.

గైడ్ సోనం ఛోస్డాల్

లదాక్ భాషలో ‘లా’ అంటే పర్వతాల మధ్య కనుమ. పదిహేడు వేల అడుగుల పైచిలుకున ఉన్న ఖర్‌దుంగ్ లా పాస్ ఒక్కటే ప్రపంచంలో అంత ఎత్తున వాహానాలు తిరగడానికి వాడుకలో ఉన్న కనుమ మార్గం. లే నగరంలో బయల్దేరిన కాసేపటికి వెనక్కి తిరిగి చూస్తే, పళ్లెంలో పచ్చని ధాన్యం నెరపితే ఎట్లా ఉంటుందో అట్లా కనిపించింది నగరం. దట్టమైన పాప్లర్ వృక్షాలు అటువంటి భ్రమ కలిగించాయి. ఖర్‌దుంగ్ లా – లే నగరానికి ఉత్తరంగా ఉంది. దారంతా ఇరుకైన మట్టి మార్గం. దూరంగా పర్వతాల మీద ఎవరో తట్టలతో మంచు తెచ్చి పోశారేమో అన్నట్లుగా అక్కడక్కడా తెల్లని మంచుతో నల్లని పర్వతాలు. SOUTH PULLU చెక్ పోస్టు వద్ద కారు కాసేపు ఆగింది. అక్కణ్ణించి మార్గం మరింత ప్రమాదకరంగా అనిపిస్తుంది. కరిగిన మంచు నీరు రోడ్డు మీద ప్రవాహంలాగా ఉండి చిత చితలాడుతోంది. చివరకు అత్యున్నత ప్రదేశం ఖర్‌దుంగ్ లా పాస్ వచ్చింది.

ప్రపంచంలోనే అత్యున్నత పర్వత కనుమమార్గం ఖర్‌దూంగ్ లా కనుమ

చాలా చలి. అక్కడ కనుమ ఎత్తు సూచించే నిర్మాణం వద్ద టూరిస్టులందరూ ఫోటోలు తీసుకొంటారు. మిలిటరీ వాళ్లు అక్కడ యాత్రికులకు వేడి వేడి టీ అందిస్తూ, పది నిమిషాలకు మించి ఆగవద్దని హెచ్చరిస్తూన్నారు. అంత ఎత్తైన ప్రదేశంలో ప్రాణ వాయువు చాలా తక్కువగా ఉంటుంది. ఏ క్షణంలో అయినా శ్వాస పీల్చుకోడం కష్టం కావచ్చు. అక్కడ ఆగిన క్షణంలో ఏ పర్యాటకుడికైనా మనమేనా ఖర్‌దుంగ్ లా పాస్ పైకి వచ్చాము అని కించిత్ గర్వం, ఆనందం కలగక మానదు.

ఖర్‌దూంగ్ లా పాస్ వద్ద ఫోటోలు తీసుకొంటూ, వేడి టీ తాగుతూ

అక్కణ్ణించి ఇంక కిందికి దిగడమే, గత సంవత్సరం కురిసి ఘనీభవించిన మంచు ఇప్పుడిప్పుడే కరిగి దారంతా నీటి ప్రవాహం. బురద రోడ్డు మీద డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండి వాహనాలు నడుపుతారు. ఇంతలోనే NORTH PULLU వచ్చింది. అక్కడ కారు కాసేపు విశ్రాంతి కోసం ఆగింది. రోడ్డుకు రెండు వైపులా టెంట్లు వేసి తాత్కాలికంగా కాంటీన్‌లు నడుపుతున్నారు. ఈ బృందం కూడా ఇక్కడ మళ్లీ కాఫీ ఫలహారాలు సేవించింది. SOUTH PULLU నుంచి NORTH PULLU ప్రయాణానికి 2½ గంటలు పట్టింది. ఈ పర్వతాల మధ్య, మార్గాల్లో ఎంత దూరం అని కాదు, ప్రయాణం ఎన్ని గంటలు అని తెలుసుకోవాలి. కొన్ని సార్లు వాహనాలు చెడిపోతే కార్లు బారుగా గంటల కొద్ది నిలిచిపోతాయి.

నూబ్రా లోయ:

నార్త్ పుల్లు నుంచి రోడ్డు ఏటవాలుగా ఉండి, అంతా దిగడమే, క్రమంగా దారిలో మంచు మాయమైంది. దూరంగా నల్లగా కనిపించే పర్వతాల మీద తెల్లని మేఘాలు, అక్కడ కూడ మంచు కురిసి చాలా అద్భుతంగా అనిపించే దృశ్యం. కాసేపటికి కారు సింధూ నదికి ఉపనది అయిన SHYOK నదీ పరీవాహ ప్రాంతానికి చేరింది. ఇక్కడి నుంచి నూబ్రా లోయ మొదలవుతుంది. ఈ లోయలోనే షయోక్, నూబ్రా నదులు కలిసి పెనవేసుకొని కొంత దూరం ముందుకు సాగి మళ్లీ విడిపోతాయి. షయోక్, నూబ్రా నదీ పరీవాహ ప్రాంతం, లోయ సముద్రమట్టం నుంచి పదివేల పై చిలుకు అడుగుల ఎత్తులో ఉంది. బార్లీ, గోధుమ పొలాలతో, ఫల వృక్షాలతో లదాక్ పెరటి తోటగా ప్రసిద్ధి కెక్కింది. దారిలో దిస్కిత్ గ్రామం, గ్రామంలో కొండ పైన దిస్కిత్ బౌద్ధమఠం, 30 మీటర్ల ఎత్తున నిర్మించిన మైత్రేయ విగ్రహం ఉన్నాయి. కారు విగ్రహం దగ్గరకు వెళ్తుంది. ఈ విగ్రహం పాకిస్థాన్‌కు అభిముఖంగా ఉంటుంది. చాలా దూరానికి కూడా కనిపిస్తూంటుంది. దిస్కిత్ బౌద్ధమఠం చాలా ప్రాచీనమైనది. దిస్కిత్ సుమారైన గ్రామం. ఇక్కడ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉందట.

జమ్మూ, కాశ్మీర్, లదాక్ యాత్రకు వెళ్ళిన రచయిత బృందం

హుండర్ రెండు మూపురాల ఒంటెలు:

దిస్కిత్ నుంచి పదికిలో మీటర్ల దూరంలో హుండర్ అనే గ్రామం, గ్రామానికి సమీపంలో విశాలమైన సైకత సమతల ప్రదేశం, ఆ తర్వాత పర్వతాలు. కార్లను చిన్న వంతెన సమీపంలో ఆపుతారు. సెలయేరు వంటి నూబ్రా నది చిన్న వంతెన దాటితే హుండర్ సైకత స్థలం, అక్కడ రెండు మూపురాల ఒంటెల మీద కాసేపు విహరించడం పర్యాటకులకు సరదా, స్థానికులకు జీవనోపాధి కూడా. సిల్కు రూట్ వాడుకలో ఉన్న కాలంలో మధ్య ఆసియా నుంచి వర్తకులు ఈ ఒంటెల పైన సరుకుల రవాణా చేసేవారు. సిల్కు మార్గం మూతపడిన తర్వాత, కొన్ని ఒంటెలను ఇక్కడ విడిచి పెట్టారు.

హుండర్ ఇసుక మైదానంలో రెండు మూపురాల ఒంటెలమీద స్వారీ

కొందరు సాహస యువకులు హుండర్ ఇసుక దిబ్బల మీద కార్లో విహరించి వినోదిస్తారు. హుండర్ గ్రామం ఇప్పుడిప్పుడే పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి వస్తోంది. ఆ రోజు రాత్రి మన బృందం హుండర్ హోటల్లో విశ్రమించారు. హోటల్ యజమాని, సేవకుడు, వంటవాడు అంతా ఒక్కరే. హోటల్ చాలా శుభ్రంగా ఉండడమేకాక, బాత్ రూంలలో కమోడ్ సౌకర్యం ఉండడం విశేషం. హోటల్ యజమాని ఇచ్చిన టీ సేవించి రోజంతా ప్రయాణంతో అలసట వల్ల వెంటనే నిద్రలోకి జారుకున్నారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎప్పుడో హోటల్ యజమాని నిద్ర లేపితే అందరూ డైనింగ్ హాలుకి వెళ్లారు.

హుండర్‌లో ఒంటెలమీద స్వారీ

టాంగ్ త్సే:

మన బృందం ఉదయం ఫలహారం ముగించి పేంగోంగ్ త్సో సరస్సు సందర్శనకు ఉత్సాహంగా బయలుదేరింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దారిలో వాహానాలు తారసపడలేదు. సాయంత్రానికి టాంగ్ త్సే గ్రామం చేరారు. టాంగ్ త్సే లో అడుగడుగునా మిలిటరీ కనిపిస్తుంది. టాంగ్ త్సే గ్రామం చాంగ్ తాంగ్ పీఠభూమిలో చాలా భాగం టిబెట్ లోనూ, కొంత భాగం లదాక్ లోకి విస్తరించి ఉంది. 14000 అడుగుల పైచిలుకు ఎత్తున ఉన్న ఈ అతి శీతల ప్రాంతంలో సంచార జాతికి చెందిన పశువుల కాపరులు మాత్రమే నివసిస్తారు. టాంగ్ త్సే తహసిల్ నుంచి అంతా ఈ పీఠభూమిలో భాగమే. సాయంత్రానికి టాంగ్ త్సే చేరారు. ఇక్కడ స్థానికులు, పర్యాటకులు అనే వివక్ష లేకుండా మిలిటరీ చెక్ పోస్టులో గుర్తింపు కార్డులు, అనుమతి పత్రాలు పరీశీలించిన తర్వాతే వాహానాలు ముందుకు సాగడానికి అనుమతి లభిస్తుంది. దుర్బోక్ అనే చిన్న పల్లె దాటిన తర్వాత, కారు షచుకుల్ పల్లె చేరేవేళకు సూర్యాస్తమయం అయింది. హిమాలయ పర్వత పాదాల వద్ద, నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్న షచుకుల్ పల్లె అప్పటికే గాఢనిద్రలోకి జారుకున్నట్లనిపించింది. లదాకీ భాషలో ‘షచుకుల్’ అంటే ‘తూర్పు వైపుకు ఒక మూలకు తిరిగి ఉన్నది’ అని అర్థమట. అక్కడ కొండల వైపు నుంచి చిన్న చిన్న జలధారలు ఈ పల్లె వైపుకు ప్రవహించడం వింతగా అనిపించింది. ఈ నీటితో గ్రామీణులు చిన్న చిన్న పెరటి మళ్లతో ఆకుకూరలు పెట్టారు.

షచుకుల్ పల్లె:

షచుకుల్ చిన్న చిన్న రాళ్లతో, ఇసుక దిబ్బలతో ఎగుడుదిగుడుగా ఉంది. దూరంగా విసిరేసినట్లు అక్కడక్కడ రాళ్లు. డ్రైవర్ దోర్జి చాలా అవస్థపడి కారును గైడ్ సోనమ్ ఇంటి వరకు తీసుకొని వెళ్లాడు. మట్టితో కట్టిన ఇల్లు అది. సంధ్య చీకట్లతో బృందం సభ్యులందరూ కారు దిగి ఇంట్లోకి వెళ్లడానికే కష్టపడ్డారు. రెండతస్తులుగా కట్టిన ఆ మట్టి రాళ్ల కట్టడంలో కింది భాగంలో మూడు గదులు, పైన వంటిల్లు. మరో రెండు చిన్న చిన్న గదులు. చేపట్టుగోడ లేని చెక్క మెట్ల మీదుగా పై అంతస్తులోకి వెళ్లాలి. కొయ్యదుంగపైన తడికెలు పరచి, పైన మట్టితో అలికిన ఇంటికప్పు. లదాక్‌లో ఇంటికప్పులన్నీ ఇట్టాగే ఉంటాయి. అలికిన నేల మీద తివాచీలు, బొంతలు పరుస్తారు.

షచుకుల్ మోనాస్టరి. షచుకుల్ మఠం సౌజన్యంతో

షచుకుల్ గ్రామ సౌరవిద్యుత్ కేంద్రం రోజు రెండు మూడు గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తుంది. చిన్న చిన్న ఎలక్ట్రిక్ బల్బులు మినుకు మినుకు మంటున్నాయి. వాటికి తోడు కిరోసిన్ బుడ్లు. ఉండుండి ఏదో పిట్టల అరుపులు, కింది భాగంలో పశువులు చేసే చప్పుడు లేకపోతే, మరో గ్రహంలో ఉన్న భావన కలుగుతుంది.

షచుకుల్ మోనాస్టరి, నృత్యం చేస్తున్న భక్తురాలు, courtesy shachukul monastery

ఇంటికి కాస్త దూరంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకి సోనమ్ ఈ బృందంలోని మహిళలను రెక్క పట్టుకొని నడిపించుకొని వెళ్లింది. ఆరు బయలులో, ఆ రాత్రి వేళ తల పైకెత్తి చూస్తే, మబ్బులు లేని ఆకాశంలో వేల వేల నక్షత్రాలు, పెద్ద పెద్దగా కనిపించాయి! ఆ తారల వెలుగు భూమ్యాకాశాలను కాంతిమయంగా మార్చేసింది. ఈ బృందానికి ఇదొక అపూర్వమైన అనుభవం. ఇందువల్లనే మన ప్రభుత్వం వేధశాలను (observatory) పేంగోంగ్ త్సో సరస్సు ప్రాంతంలో ఏర్పాటు చేసింది.

ఆ రాత్రి గైడ్ సోనమ్ తల్లిగారు ఛో టింగ్ జంగ్మా వంట చేస్తోంటే సోనమ్ సోదరి శిరీంగ్ (చిరంజీవి అని అర్థమట) సహాయం చేసింది. అందరికి వంట గదిలోనే భోజనం పెట్టారు. ఆవుపాలతోనో, మేకపాలతోనో చేసిన ఛీస్ కలిపిన ‘తుప్పా’ పింగాణి గిన్నెల్లో వడ్డించారు. అలసి, కళ్ల మీద నిద్ర ఆవహించిన వాళ్లకు రుచులతో పని లేదు. పెట్టింది తిని, పక్క గదిలో హీటరు చుట్టుతా ఏర్పాటు చేసిన పడకల మీద పడి అంతా నిద్రకుపక్రమించారు. సోనమ్ సోదరులిద్దరూ సగం రాత్రి గడిచే వరకు, పిడకలు, కట్టెలు వేస్తూ, కిరోసిన్ చల్లుతూ, హీటర్‌లో మంట ఎగదోస్తూనే ఉన్నారు. ఈ బృదంలో కొందరికి మానస సరోవర తీరంలో గడిపిన రాత్రి అనుభవం గుర్తొచ్చిందట!

ఉదయం ఇంటి పక్కన పశువుల దొడ్డిలో పశువులను చూడడానికి అందరూ వెళ్లారు. మేకలు, గొర్రెలు, డిమోలు (ఆడ యాక్‌లు), ఆవులు, పశ్మీనా మేకలు… శిరీంగ్ మందను బీళ్లకు తోలుకొనిపోయే ప్రయత్నంలో ఉంది. అందరూ అక్కడ ఫోటోలు తీసుకొన్నారు.

పేంగోంగ్ త్సో ప్రయాణం:

ఉదయం మోమోల పలహారం తిని సముద్ర తటానికి 14250 అడుగుల ఎత్తున ఉన్న పేంగోంగ్ త్సో సరస్సు వద్దకు బయలుదేరారు. భారత్, టిబెట్ మధ్య ఉప్పు నీటి సరస్సు. ఇది 5 కి.మీ వెడల్పు, 51 కి.మీ పొడవుగా ఉంటుంది. పెంగోంగ్ త్సో 60 % టిబెట్ లోనూ, 40% లదాక్ లోనూ విస్తరించి ఉందట. ఖచ్చితమైన విభజన రేఖ ఏమీ లేదట! 1962 యుద్ధంలో సరస్సు తీరం కూడా ఫిరంగుల గర్జనలతో ప్రతిధ్వనించింది!

పేంగోంగ్ సరస్సు తీరంలో

శీతాకాలం ఘనీభవించిన సరస్సు వేసవి రాకతో కరిగి నీలాకాశాన్ని ప్రతిఫలిస్తోంది. సూర్యరశ్మిలో కలిగే ప్రతి స్వల్ప మార్పుకూ సరస్సు రంగులు మారుతూ సందర్శకులను ఆహ్లాదపరుస్తోంది. ఈ సరస్సులో జలచరాలేవీ కన్పించలేదు, ఏవో కొన్ని పక్షులు తప్ప. సరస్సు తీరం వెంట పర్యాటకులను యాక్‌ల మీద ఎక్కించి కొందరు స్థానికులు తిప్పుతున్నారు. తీరం వెంబడి అక్కడక్కడా తాత్కలికంగా ఏర్పాటు చేసిన హోటళ్లు, సావనీర్లు అమ్మే అంగళ్లతో సందడిగా ఉంది. కొన్ని రాత్రులు తీరం వద్దే గడపడానికి సిద్ధపడే సాహసులకు టెంట్ హౌస్‌లు గూడా ఏర్పాటయ్యాయి. ప్రశాంతమైన సరస్సు తీరంలో ఏదో జాతర వాతావరణం నెలకొన్నది. తిరుగు ప్రయాణంలో టాంగ్ త్సే లోని పేంగోంగ్ రెసిడెన్సీ హోటల్లో మధ్యాహ్న భోజనం చేసి, దీపాలు పెట్టే వేళకు షచుకుల్ గ్రామం చేరారు.

ఆ రాత్రి సోనమ్ తల్లి అతిధులకు ‘చాషుల్’ అనే సూపు వంటి పదార్థం, నమ్ కీన్ చాతో రాత్రి భోజనం పెట్టింది. అతిథులకు ఉప్పు, వెన్నతో చేసిన టీ ఇచ్చి అలరించటం లదాకీల సాంప్రదాయం. పనికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో సోనమ్ తండ్రికి పొదలో కుందేలు పిల్లలు కనిపిస్తే పట్టుకొని వచ్చాడు. తెల్లగా బొచ్చుతో ఆ కుందేళ్లు చాలా ముచ్చటగా ఉన్నాయి.

సోనమ్ కుటుంబం:

ఆ రాత్రి అందరూ విశ్రాంతిగా – ఆతిథ్యం ఇచ్చిన సోనమ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సోనం చెల్లి శీరింగ్ మాటల పుట్ట! వయస్సులో పెద్దదైన శ్రీమతి సత్యవతిని ‘దాదీ’ అని సంబోధిస్తూ చాలా ముచ్చట్లు చెప్పంది. ఆమె తల్లిది పేంగోంగ్ సరస్సు దగ్గరలోని పల్లె. “మా అమ్మ బాల్యమంతా పశువులకాపరిగానే గడచిపోయింది. పెళ్లయి షచుకుల్ వచ్చాక ఇక్కడి పశువుల పోషణ భారమంతా తన పైన వేసుకొన్నది” అన్నది శీరింగ్, కాస్త బాధను వ్యక్తంచేసే కంఠస్వరంతో. ఆమె తండ్రి కన్నా తల్లి ఎనిమిదేళ్లు పెద్దదట! లదాకీలలో వయోభేదాన్ని పట్టించుకోరు.

ఒకప్పుడు పశుపోషణతో జీవించిన షచుకుల్ గ్రామంలో ఇప్పుడు అయిదారు ఇళ్ల వాళ్లు మాత్రమే పశుపోషకులుగా మిగిలారు. ఊరు ఊరంతా మిలిటరీలో పనులు, బార్డరు రోడ్ల నిర్మాణంలో (BRO) కూలీలుగా, చిరుద్యోగులుగా మారిపోయారు. కొందరు విదేశి పర్యాటకులకు హోం స్టే సౌకర్యాలు ఏర్పాటు చేసి సంపాదించుకొంటున్నారు. సోనమ్ తమ్ముడు మాత్రం లక్నోలో ఎం.ఏ. చదువుతన్నాడట! అన్న షచుకుల్‌లో రోడ్డు నిర్మాణ కార్మికుడు. సోనమ్, చెల్లెలు శీరింగ్ కొంత కాలం డెహ్రాడూన్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ టిబెటియన్ కాలనీలో పేయింగ్ గెస్టులుగా నాలుగేళ్లున్నరట! “అమ్మకు మోకాళ్లు అరిగిపోయి నడవలేకపోవడంతో ఉద్యోగం మానుకొని నేను పశువుల వెంట వెళుతున్నా” శీరింగ్ కొంచెం బాధగానే అన్నది. ఆమె పశువుల వెంట వెళ్లే అనుభవాలను ఆమె మాటల్లోనే చదవండి.

పశువుల కాపరి శీరింగ్ అనుభవాలు:

“నేను మంద వెంట పోతే నా మూడు కుక్కలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. నా ఆహారంతో పాటు, వాటికీ ఆహారం తీసుకొని పోతాను. మాకు డిమోలు (ఆడ యాక్‌లు) గోవులు, దూడలు, గొర్రెలు, మేకలు, పశ్మీనా మేకలు మొత్తం రెండు వందల వరకు ఉన్నాయి. మగ యాక్ లకు సంరక్షణ అవసరం లేదు. గుర్తు కోసం ముద్రలు వేసి విడిచి పెడ్తాం. పల్లెలోని యాక్ లన్నీ మందలా తిరుగుతూ కొండల వద్ద మేస్తాయి. ఎప్పుడైనా మంచు పులుల (snow leopard) యాక్ లను, ఇతర జీవాలను చంపడం కద్దు.”

“పశులకాపర్లం బీళ్లలో ఆచ్ఛాదనకు టెంట్లు వేసుకొంటాం. శీతాకాలంలో మరీ డిసెంబరు మాసాంతానికి మేతకు కటకట అవుతుంది. పశువుల్ని మేపుకుంటూ 40 కిలోమీటర్లు దూరం వరకూ వెళ్తూ, రోజుల తరబడి గుడారాల్లోనే ఉంటాం. కిరోసిన్, ఆహార పదార్థాలు, పాత్రలు వెంట తీసుకొనిపోతాం. బయట నీళ్లు గడ్డకట్టినా, బండల మధ్య నుంచి ప్రవహించే నీళ్లు గడ్డకట్టవు. ఆ నీళ్లే పశువులకు ఆధారం. పాలిచ్చే పశువులను మాత్రం ఇంటి వద్ద కాస్త ఆచ్ఛాదన ఏర్పాటు చేసి మేపుతాం.”

పెళ్ళిగాని అమ్మాయిలు బయళ్లలో పశువుల వెంట ఉంటారంటే అందరూ ఆశ్చర్యపోయారు. శీరింగ్ నవ్వుతూ అంది,

“దాదీ! మా జోలికి ఎవరూ రారు. ఎప్పుడైనా ఒక సారి చీకటి పడే వేళ, రాత్రిళ్లు తోడేళ్ల గుంపు మంద మీద పడి గొర్రె పిల్లల్ని, దూడల్ని ఎత్తుకొని పోతాయి. వాటి వాసన పసిగట్టగానే కుక్కలు మొరుగుతా ఉరుకుతాయి. గాని, తోడేళ్లు ఎదురు తిరిగితే జంకి నిలబడిపోతాయి. గొడ్లకాపర్లం చీటీలు కొడుతూ, రాళ్లు విసురుతాం. తోడేళ్లు ఒక్కోసారి దూడనో, మేకనో చంపి లాక్కొనిపోతాయి.”

గైడ్ సోనమ్ చెల్లి శిరీంగ్ (కుడివైపు తెల్ల జాకెట్ లో), ఆమె నేస్తం నెల్లూరులో రచయిత అతిథులుగా

ఈ అనుభవాలను వివరిస్తున్నప్పుడు ఆ అమ్మాయి ముఖంలో ఎంత ఆనందం వ్యక్తమయిందో! మళ్లీ శీరింగ్ తన అనుభవాలు వివరించడం మొదలుపెట్టింది.

“దాదీ! మీరు చూస్తే గాని నమ్మరు! మే మాసం రాగానే ఇక్కడ బీళ్లన్నీ చిత్ర చిత్ర వర్ణాల గడ్డి పువ్వులతో రత్న కంబళ్ళలాగా మారిపోతాయి. కొన్ని రకాల పువ్వులను సేకరించి మందుల్లోకి (టిబెటియన్ వైద్యం) వాడుకొంటాము. జులై, ఆగస్టు నెలల్లో సన్న జల్లు పడితే, తెల్లవారి బిళ్లల్లో ‘కర్షా’లు (పుట్టు గొడుగులు) సేకరించి, అక్కడే వండుకొని తింటాము. మే, జూన్ లో పశువులకు ఉన్ని కత్తిరిస్తాము. యాక్‌ల ఉన్ని ‘ఖులు’తో మా సంప్రదాయ దుస్తులు నేస్తారు. పశ్మీనా మేకల ఉన్ని మాత్రం చాలా విలువైనది.”

“అక్టోబరులో ఒక యాక్‌ను కోస్తే చలికాలమంతా భోజనానికి సరిపోతుంది. మాంసాన్ని చిన్న చిన్న మూటలుగా కట్టి ఇంటికప్పుకు వేలాడదీస్తాము. లదాకీలం గో మాంసం, చేపలు తప్ప అన్ని రకాల మాంసాలు భుజిస్తాము. మేం పండించే పంటలు ఏడాది కంతా సరిపోవు. గాడిదలు, గుర్రాలను కట్టి అరకలతో దున్నుతాము. బీళ్లలో ఏరిన ‘బోగోరి’ (ఎండిన పేడముద్దలు, కట్టెపుల్లలు) గాడిదల మీద వేసి తెచ్చుకొంటాం. గ్యాస్ రాక పూర్వం బోగోరితోనే వంట. బోర్లు వెయ్యక ముందు కొండల పై నుంచి ప్రవహించే ‘చుమిక్’ జలధారల నుంచే నీళ్లు తెచ్చుకొనే వాళ్లం.” శీరింగ్ షచుకల్ గ్రామీణుల జీవితాలను గురించి చాలా విషయాలు చెప్పింది.

శీతాకాలంలో ఇళ్లను వెచ్చగా ఉంచుకోడానికి ఆవుపేడ నిలువచేసుకొంటారు

శీరింగ్ తల్లి దైనందిన కార్యక్రమాన్ని గూడా వివరించింది. ఆమె నిత్యకృత్యం వేకువనే లేచి పాలు చిలకడంతో మొదలవుతుందట. పచ్చి పాలు చిలికి వెన్న తీస్తుంది. ఆ తర్వాత అన్ని రకాల పాడి పశువుల పాలు పితుకుతుంది. మధ్యహ్న భోజనం తర్వాత, తన ఈడు వాళ్లతో కలిసి ఎండలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ 2,3 గంటలు రాట్నం వడుకుంది.

తమకు ‘లోసార్’ నూతన సంవత్సరం పెద్ద పండుగట. శీరింగ్ మాటల్లోనే చదవండి. “లోసార్ పండుగ విందులు, వినోదాలు రెండు మూడు రోజులు సాగుతాయి. లోసార్ పండుగ రోజు మధ్యాహ్నం విందు భోజనం (పూర్తిగా మాంసాహారం) తిని, ఊరు ఊరంతా సంప్రదాయ దుస్తులు ధరించి షచుకుల్ గుంఫాకు పోయి ప్రార్థనల్లో పాల్గొంటాము. టిబెట్ పంచాంగం ప్రకారం మొదటి నెల ‘తంగ్పా’లో ‘న్యానస్ న్యుమ్నాక్’ వ్రత నియమాలు పాటిస్తాము. ఈ నెల రోజులు మాంసాహాం తినం. లే టౌన్ హోటళ్లలో కూడా ఈ రోజుల్లో శాకాహరమే పెడతారు. మౌనవ్రతం, ఒక్క పొద్దులు, శాఖాహారం వంటి కఠిన నియమాలు పాటించలేని వాళ్లు ‘నారీనస్’ అనే సడలింపున నియమాలను పాటిస్తూ వ్రతకాలాన్ని పూర్తి చేస్తారు.”

“షచుకుల్‍లో ఏప్రిల్ మాసంలో ‘దాబాంగ్’ పేరుతో స్థానికంగా పండుగ చేసుకొంటారు. ఎక్కడెక్కడి యువకులు షచుకుల్ వచ్చి పండుగ రోజు సాయంత్రం జరిగే విలువిద్య పోటీల్లో పాల్గొంటారు. గ్రామీణ యువతీయువకులంతా ప్రదర్శన చూడడానికి తరలివస్తారు. మా పల్లీయులకు ఇవే వినోదాలు, సంతోష సమయాలు!” శీరింగ్ సంతోషంగా చెప్తోంది.

షచుకుల్ గ్రామంలో పశ్మీనా మేకతో రచయిత శ్రీమతి

ఆమె పెంపుడు మేకపిల్ల ముద్దు పేరు ‘నోనో’ అట. నోనో అంటే లదాకీ భాషలో తమ్ముడట! నోనో అని పిలిస్తే చాలు అది ఎక్కడ ఉన్నా లగెత్తుకొంటూ వచ్చి ఒడిలో వాలుతుందట! మధ్యాహ్నం వేళ పశువులన్నీ మేస్తుంటే, తాను టెంట్ లో కూర్చుని అన్నం తింటూ ఏవో కూనిరాగాలు తీస్తూ కోనంగి పదాలు పాడుకొంటూ ఉంటుందట! తను పాట ఆపితే పశువులన్నీ మేత ఆపి ఒక్కసారిగా తల ఎత్తి తన వంక చూస్తాయట!

మరుసటి రోజు శీరింగ్ వెంట బీళ్లకు వెళ్లి అక్కడ ఒక రాత్రి ఉండాలన్న కోరిక, వాతావరణం అనుకూలించక రద్దవడంతో తిరుగు ప్రయాణమయ్యారు. సోనమ్ అన్నదమ్ములిద్దరూ తెల్లని శిల్కు వస్త్రాలు ‘కటక్’లు అందరి మెడల్లో వేసి, లదాకీ సంప్రదాయం ప్రకారం గౌరవించారు. సముద్ర తటానికి 17280 అడుగుల ఎత్తులో ఉన్న చాంగ్ లా పాస్ కనుమ మార్గంలో లే చేరారు. చాంగ్‌ లా పాస్ లో కారు ఎత్తుకు ఎక్కలేక పోతే కార్లో కొంత మంది దిగి నడవడానికి ప్రయత్నించారు. నాలుగడుగులు వేసేటప్పటికి ఆయాసం. వెనక నుంచి వచ్చే కారు వారు వీళ్లందరిని ఎక్కించుకొని మిగిలిన బృందం వద్ద విడిచి పెట్టారు. ఈ యాత్రలు రెండు అత్యున్నత కనుమ మార్గాలు ఖర్‌దుంగ్ లా, చాంగ్ లా ప్రయాణం గొప్ప అనుభవం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here