జ్ఞాపకాల తరంగిణి-70

0
13

A Ship Bound for India

[dropcap]క[/dropcap]లత నిదర, పడక కుదరక అటూ ఇటూ పొర్లాడుతున్నా. ఏవేవో పాత జ్ఞాపకాలు.. నిద్రాభంగమై లేచి కంప్యూటర్ ముందు కూర్చున్నా. అప్రయత్నంగా నా వేళ్లు బెర్గ్‌మన్ అని టైప్ చేశాయి. ఇంగ్మార్ బెర్గ్‌మన్ జీవిత చరిత్ర, ఆయన సినిమాల పేర్లు కంప్యూటర్ తెర మీద ప్రత్యక్షమయ్యాయి. యథాలాపంగా ‘A Ship Bound for India’ పేరు మీద నొక్కాను. నీరవ నిశీధివేళ 1947 నాటి నలుపు తెలుపు సినిమా ఏకాగ్రంగా, ఆసాంతం చూసేసరికి వేకువయింది.  సుమారు 2 గంటలు సినిమా చూసి అలసిన కన్నులతో నిద్రపోయాను.

ఈ సినిమా గురించి నాలుగు మాటలు రాసేదాకా మనసు ఊరుకోలేదు. బెర్గ్‌మన్ సినిమాలతో పరిచయం ఉంది. వీకెండ్, సెవెంత్ సీల్, వైల్డ్ స్ట్రాబెరీస్, సైలెన్స్ సినిమాలను బెర్గ్‌మన్ చిత్రోత్సవంగా నెల్లూరులో మా ప్రొఫిల్మ్ ఫిల్మ్ సొసైటీలో ప్రదర్శించాము. వైల్డ్ స్ట్రాబెరీస్ పూనె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠ్యాంశం. పలు పర్యాయాలు అందులో దృశ్యాలు ప్రదర్శించి పాఠం చెబితే విన్నాను కూడా. బెర్గ్‌మన్ నాకు ఎంతో ప్రీతిపాత్రమైన దర్శకులలో ఒకరు.

బెర్గ్‌మన్ మూడవ సినిమా ‘A Ship Bound for India’, విడుదలై బాక్సీఫీసు వద్ద అపజయం చవి చూసింది. దర్శకుడిగా అతనికి అప్పటికేమీ పేరు లేదు – ఏదో రంగస్థలం మీద కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించడం, ఒకటి రెండు సినిమాలకి స్క్రిప్ట్ రాయడం తప్ప.

యవ్వనదశలో ప్రవేశిస్తున్న యువకుడు తాగుబోతు, పరమ అహంకారి అయిన తండ్రి చేతుల్లో క్షణక్షణం నరకం అనుభవించిన బాధామయమైన జీవితం ఈ సినిమా ఇతివృత్తం. బెర్గ్‌మన్ బాహిర ప్రకృతిని చూపడం కన్నా మనిషిలోని అంతర్గత ఆలోచనలను, భావాలను, అతని హృదయంలో పోటెత్తే సంక్షోభాలను ప్రదర్శించడానికే సినిమాను మాధ్యమంగా వాడుకొన్నాడు. మనిషి, మనిషి అంతరంగంలో సంఘర్షణ ఆయన చిత్రాలన్నిట్లో కనిపిస్తుంది. మానవ సంబంధాలను విశ్లేషించి ప్రేక్షకుల ముందు పెడతాడు. Söderhjelm రాసిన నాటకాన్ని ‘A Ship Bound for India’ పేరుతో స్వీయ దర్శకత్వంలో తీశాడు. స్క్రీన్ ప్లే కూడా బెర్గ్‌మనే రాసుకొన్నాడు.

సినిమాలో ప్రధాన పాత్ర జోనాస్ ఏడేళ్ళ తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి ప్రియురాలు Sally ని కలుసుకుంటాడు. జోనాస్ సముద్ర తీరంలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఉసుళ్ళ పుట్ట లోంచి ఉసుళ్లు వెలికి వచ్చినట్టు అతని మస్తిష్కంలోంచి జ్ఞాపకాలన్నీ తోసుకుని వెలికి వస్తాయి. తండ్రీ తనయుల మధ్య ఉండవలసిన సన్నని విభజన రేఖను చెరిపేసి, తాగుబోతు తండ్రి క్షణ క్షణం తనను శారీరికంగా, మానసికంగా హింసించడం, ‘గూనివాడు’, ‘గూనివాడు’ అని తండ్రి సంబోధించడంతో తనకు ‘hunchbacked sailor’ అని ముద్ర పడిపోవడం ఒకటొకటిగా గుర్తొస్తాయి. సినిమా కథనం అంతా ఫ్లాష్‌బ్యాక్‍లతో, వెనకా ముందు సంఘటనల వివరాలు మనముందు నిలుస్తాయి.

తండ్ర్రి కెప్టెన్ Alexander Blom మునిగిపోతున్న నౌకను కాపాడే బాధ్యతను విడిచిపెట్టి, ఎక్కడో పానశాలల్లో తిరుగుతూంటే, నావికులందరూ నిర్బాధ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు, జోనాస్ నౌక మునిగిపోకుండా salvage చేసి కాపాడే బాధ్యతను పైన వేసుకుని, నావికులందరిని కూడగట్టి పని ఆరంభిస్తాడు.

తండ్ర్రి కెప్టెన్ Blom ఒక పానగృహాన్నుంచి మరో పానగృహానికి వెళ్ళి తాగుతూ, బార్లో నృత్యం చేసే Sally అనే యువతిని వెంటబెట్టుకొని, ఆమెతో సహజీవనం చేయబోతున్నట్టు భార్యకు, కుమారుడికి చెప్తాడు. తనకు(Captain Blom కు) తీవ్రమైన నేత్ర వ్యాధి వచ్చిందని, త్వరలోనే తాను అంధుడు కాబోతున్న సమాచారం కూడా వైద్యుడి ద్వారా అప్పుడే తెలుస్తుంది.

జోనాస్ తండ్రి వెంటవచ్చిన నర్తకి Sally ని తీసుకొని సముద్ర తీరంలో వివిక్త ప్రదేశానికి వెడతాడు. ఆ స్వచ్ఛమైన ప్రకృతి మధ్య ఇద్దరు పరస్పరం ఇష్టపడుతున్న విషయం గ్రహిస్తారు. జోనాస్ Sally ని వెంటబెట్టుకొని నౌకలోకి వచ్చినప్పుడు తండ్రి Captain Blom అసూయతో మండిపడతాడు.

నౌకను కాపాడే పనిలో ఉన్న కుమారుడిని నానా మాటలు అని,  ‘గూనివాడివి, నీ ముఖం చూడలేన’ని, ‘నౌక మునిగిపోకుండా రక్షించడం నీకేం తెలుసు’, ‘నీవొక సహాయకుడివి ఈ నావలో’ అనీ అంటాడు. అన్ని మాటలన్నా సహించడమే కాకుండా జోనాస్ రహస్యంగా చేతిలో ఉంచుకున్న కత్తిని జారవిడిచి, తండ్రి మాటలు పట్టించుకోకుండా తనకు గాలిని అందించే శిరస్త్రాణాన్ని ధరించి, దాని లోపలికి గాలిని పంపు చేసే పరికరాన్ని తండ్రి చేతికిచ్చి, తన నడుముకు కట్టుకున్న మోకును కూడా తండ్రి చేతికే అప్పగించి నీళ్ళల్లోకి దూకి నౌక అడుగు భాగంలో ‘కీల్’ ఉన్న భాగానికి వెళ్ళి మరమ్మత్తు పని ప్రారంభిస్తాడు. Captain Blom ఈర్ష్య, అసూయలతో దగ్ధమైన మనస్సులో ఆధిక్యభావం (superiority complex), అహానికి లొంగి – జోనాస్ తన ప్రాణాల రక్షణ బాధ్యత, తనకు అప్పగించిన మోకును విడిచిపెట్టేయడమేగాక, గాలిని పంపు చెయ్యకుండా ఊరుకుంటాడు. అదృష్టవశాత్తు జోనాస్ మృత్యువు కోరల్లోంచి తప్పించుకుని నీళ్ళ అడుగు నుంచి ఎట్లాగో పైకి రాగలుగుతాడు ప్రాణాలతో.

నర్తకి Sally తాను జోనాస్‌ని ప్రేమిస్తున్నట్లు Captain Blom తో కుండబద్దలు కొట్టినట్టు చెప్పటమే కాక, అతని ముఖంపైనే, “నువ్వు అన్ని విధాలా అసమర్థుడివి” అంటుంది. Captain Blom అహం దెబ్బతిని, తాము నివాసముంటున్న నౌకాగృహాన్ని ధ్వంసం చేసి, ఇంకా ఆవేశం చల్లారక, పానశాలకి వెళ్ళి పూటుగా మద్యం సేవించి, అక్కడ ఎవరితోనో కొట్లాటకు దిగుతాడు. పోలీసులు అతన్ని  అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తప్పించుకొనేందుకు కిటికీలోంచి దూకి కిందపడి చచ్చిపోతాడు. ఈ విషాద సంఘటన తర్వాతే జోనాస్ ఇండియాకి వెళ్ళే ఓడలో నావికుడిగా చేరి వెళ్ళిపోతాడు.

మళ్ళీ ఏడేళ్ళ తర్వాత జోనాస్ సొంత ఊరికి తిరిగి వచ్చి ప్రియురాలు Sally ని కలుసుకొంటాడు. ఆమె పూర్వం మాదిరే మద్యశాలల్లో నృత్యం చేస్తూ, పాత పద్ధతిలోనే జీవిస్తూంటుంది.

Captain Blom నర్తకి Sally ని నౌకాగృహానికి తీసుకువచ్చి, అక్కడే ఉంటుందని చెప్పినప్పుడు కుటుంబ సభ్యులకు అతని ఆలోచనలు తెలుస్తాయి. భార్యను, కుమారుణ్ణి విడిచిపెట్టి,అతను ఆ నర్తకితో ఎక్కడికో దూరతీరాలకు పారిపోవాలనుకుంటాడు.

Captain Blom ఒంటరిగా ఉన్నప్పుడు అతని భార్య “నువ్వు నీళ్ళలోకి డైవ్ చేసి, పడవ క్రింది భాగానికి రిపేర్ల కోసం వెళ్ళిన ప్రతి పర్యాయం, గాలి పంపుతో గాలి సరఫరా చేస్తున్నప్పుడల్లా నీకు ప్రాణదానం చేసి, పునర్జీవితం ఇస్తున్నట్లనిపించేది!” అని అంటుంది. అందుకు సమాధానంగా Captain Blom యవ్వనంలో తనకు లభించని సుఖాలన్నీ ఇప్పుడు అనుభవించటానికి Sally ని తీసుకొని పారిపోతున్నానంటాడు. “What is left for me?” అని అతని భార్య గద్గద స్వరంలో భర్తను ప్రశ్నిస్తుంది. తనతో ఉండిపొమ్మని ఎంతగానో ప్రాధేయపడుతుంది.

బెర్గ్‌మాన్ ఈ సినిమాలో కుటుంబంలో, దాంపత్యంలో స్త్రీలు అనుభవించే క్రౌర్యం, అమానవీయ అసమానతలను ప్రదర్శిస్తాడు. కుటుంబం స్త్రీకి ఎటువంటి రక్షణ, తలదాచుకొనేందుకు చోటు కల్పించలేదని వ్యాఖ్యానించాడనిపిస్తుంది. పురుషుడు తనలోని లోపాలను, బలహీనతలను మరుగుపరుచుకొంటూ స్త్రీల జీవితాలతో ఆడుకోగలడని చెప్పదలచుకొన్నాడనిపిస్తుంది.

బెర్గ్‌మన్ చిత్రాలలో పాత్రలు లోపల ఏమీ దాచుకోకుండా తమ తమ అవసరాలు, వాంఛలు, ద్వేషభావనలు ఇతరులు గుర్తించి గ్రహించాలని భావిస్తాయి. ‘A Ship Bound for India’ చిత్రంలో కౌమారదశ వదిలి యవ్వనంలో ప్రవేశిస్తున్న యువ జోనాస్‍ను తండ్రి ఆధిపత్య భావం, గర్వంతో “నీ గూని శరీరాన్ని నా ముందు చూపించకు” వంటి చవకబారు మాటలతో బాధించడం, భార్యతో నియంత లాగా ప్రవర్తించడం వంటి విషయాల వల్ల కుమారుడు జోనాస్‍లో ఆత్మన్యూనతా భావం గాఢంగా పాతుకొని పోతుంది. అతనికి గూని లేకపోయినా తరచూ తారసపడ్డవాణ్ణల్లా “నేను గూనివాణ్ణా?” అని అడుగుతూనే ఉంటాడు. సినిమా ముగింపులో అతడు అదే మాటను Sally ని అడిగినప్పుడు ఆమె లేదు పొమ్మంటుంది. చిత్రహింసలకి గురి చేయబడ్డ బాల్యానికి, స్వేచ్ఛ లేని యవ్వనదశకు సంకేతంగా, ఆ నావలో ఇరుకిరుకు గదులు, ఎటూ కదలడానికి వీలులేని స్థితి, Sally ని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు తండ్రి – “ఈరోజు నుంచి ఈమె జోనాస్ పడక మీద పడుకుంటుంది. వాణ్ణెక్కడయినా సద్దుకోమను” అన్న ఒక్క మాటలో అతడు ఎదిగిన కుమారుణ్ణి చూసే విధానమంతా ప్రేక్షకులకు తెలిసిపోతుంది.

జోనాస్, Sally మొదటిసారి సాగర తీరంలో పాడుపడిన గాలిమర వద్ద, వినీలాకాశం, తెలి మబ్బులు, చల్లని గాలుల మధ్య ఏకాంతంగా గడిపినప్పుడు జోనాస్ పంజరం వంటి తండ్రి పిడికిలి నుంచి బయటపడ్డట్టు బెర్గ్‌మన్ సూచించడమేగాక, ఇద్దరు ప్రేమించుకొంటున్నట్లు గ్రహించడానికి, బెర్గ్‌మన్ ఈ దృశ్యాన్ని ప్రకృతి మధ్య చిత్రించాడు. ఈ సినిమా తీసే సమయానికే బెర్గ్‌మన్ సినిమా శిల్పం పరిణతి చెందింది.

తండ్రుల నిరంకుశ ప్రవర్తన, ముసలితనాన్ని, అనారోగ్యాన్ని, రోగాలను అంగీకరించి సర్దుకోలేకపోవడం, బాధ, స్త్రీల మధ్య పరస్పర సంబంధాలు, ఆత్మహత్య చేసుకోవాలనే బలవత్తరమైన కోరికలు బీజప్రాయంగా బెర్గ్‌మన్ తొలి చిత్రాల్లోనే గోచరిస్తాయి.

బెర్గ్‌మన్ హాలీవుడ్ సినిమా చిత్రీకరణ పద్ధతులను తిరస్కరించి, తనదంటూ ఒక సినిమా శైలిని, విధానాన్ని రూపొందించుకున్నాడు. పాత్రల ముఖాల వద్దకు, చాలా దగ్గరకు కెమెరాను తీసుకువచ్చి, తెరంతా ముఖంతో నింపెయ్యడం (extreme close-ups) వంటి పద్ధతులు ప్రవేశపెట్టాడు. మనిషి ముఖం వ్యక్తం చేయలేని భావం ఏదీ ఉండదని బెర్గ్‌మన్ నమ్మకం. ‘A Ship Bound to India’ బెర్గ్‌మన్ సినిమా కళ పరిణామంలో ఒక దశను సూచిస్తుందని భావించరాదని విమర్శకులు అంటారు. ఇది అనివార్యమైన పరిణామం. మనిషి గుండె లోతుల్లోని సంఘర్షణను ‘మెలోడ్రామా’ పాత్రలు అని ముద్ర పడిన పాత్రల ద్వారా కూడా గొప్పగా వ్యక్తం చేయగలిగాడు. బెర్గ్‌మన్ ‘Crisis’, ‘A Ship Bound to India’ సినిమాల్లో కనిపించేవి మెలోడ్రామా  టైపు పాత్రలే. స్త్రీల బాధలను, అసంతృప్త జీవితాన్ని,  ఆనందం రహిత స్త్రీ పురుష సంబంధాలు అన్నీ ఆయన సినిమాలకు వస్తువులే. Sally జోనాస్‍తో అంటుంది – “I only love myself” అని, “May be I was born unhappy and make others happy” అనీ అంటుంది. ఏడేళ్ళ తరువాత జోనాస్ ఆమెతో “మనం కలిసి బ్రతుకుదాం!” అని అంటే ఆమె నిరాకరిస్తుంది. “మా తండ్రి లాగా పట్టువిడుపు లేకుండా ప్రవర్తించ” వద్దని ఆమెను ఓదారుస్తాడు జోనాస్.

ఇంగ్మర్ బెర్గ్‌మన్ స్వీడన్ చిత్ర దర్శకులు

ఇండియాకు వెళ్ళే ఓడ మంచితనానికి, స్వీడన్ సమాజంలోని సంక్లిష్ట బాధామయ జీవితం నుంచి శాంతిమయ జీవితంలోకి వెళ్ళడానికి ప్రతీకగా భావించి, ఆ పేరు పెట్టాడు బెర్గ్‌మన్. ఈ సినిమా మొదట స్వీడిష్ టెలివిజన్‍లో ఆరు వారాలు ప్రదర్శించబడింది. తర్వాత సినిమాగా ఎడిట్ చేయబడింది. అమెరికాలో, ఇంగ్లాండులో కొంచెం పేర్ల మార్పులతో విడుదలైంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శించబడి, పురస్కారాలను, గౌరవాలను పొందిన సినిమా ఇది. “A film maker with full control with his medium” అనే నిర్వచనం బెర్గ్‌మన్‌కు సరిగ్గా నప్పుతుంది. ఇప్పుడు బెర్గ్‌మన్ పేరు విస్మృతిలోకి జారిపోయి ఉండొచ్చు. అతని కళా సృష్టి, మహోన్నత చిత్రాలు మాత్రం మనకు మిగిలిపోయాయి.

( ఫొటోలు గూగుల్ సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here