జ్ఞాపకాల తరంగిణి-72

0
12

హంగరి కళాచిత్ర దర్శకుడు మిక్లోష్ యాన్‌ఛో రెండు చిత్రాలు

[dropcap]హం[/dropcap]గరి సోషలిస్టు దేశంగా ఉన్న కాలంలో మార్క్సిస్టు, కళాత్మక సినిమా దర్శకుడు మిక్లోష్ యాన్‌ఛో (MIKLOS JANESCO) ప్రజాకంటకులైన నియంతలను విప్లవం ద్వారా తొలగించాలని ‘ఇలెక్ట్రా మై లవ్’ సినిమాలో ప్రబోధిస్తాడు.

మిక్లోష్ యాన్‌ఛో చిత్రాలలో స్మరణీయమైన మరో చిత్రం ‘రెడ్ సాం’ (RED PSALM), 1890లో హంగరి పేద కౌలుదారి రైతులు భూస్వాముల మీద చేసిన తిరుగుబాటే ఈ సినిమా కథాంశం. హంగరి భాషలోని ‘రెడ్ సాం’ సినిమా పేరును ఆంగ్లంలో ‘అండ్ ది పీపుల్ నెవర్ ఫర్‍గెట్’ గా అనువదించారు. ఈ సినిమా కాన్స్ (కేన్స్ కాదు) అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడడమే కాక, మిక్లోష్ యాన్‌ఛో ఉత్తమ దర్శకుడి పురస్కారం (Critic’s Award) అందుకున్నాడు. ఈ చిత్రంలో అరవిరిసిన కుసుమంగా దృశ్యమానమయ్యే దర్శకుని కళాప్రతిభ ‘ఇలెక్ట్రా మై లవ్’ పరిపూర్ణ వికసిత పుష్పంగా దర్శనమిస్తుంది. బైబిల్‌లో ఒక ఉపాఖ్యానాన్ని ‘రెడ్ సాం’ చిత్ర ఇతివృత్తంగా గ్రహించినా, దర్శకుడు మతాభినివేశం రవంత కూడా ప్రదర్శించకుండా, ఆ భావనలకు అతీతంగా చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో కన్పించే పాత్రలు పౌరాణిక పాత్రలు కాక, ఆయా వర్గాల ప్రతినిధులుగా అనిపిస్తారు.

మిక్లోష్ యాన్‌ఛో హంగరి విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసిన ఆంత్రోపాలజీ వంటి సామాజిక శాస్త్రాలు, అతనికి ఎంతో ఇష్టమైన మార్క్సిస్ట్ సిద్ధాంతం హంగరి సమాజాన్ని అర్థం చేసుకొని విశ్లేషించుకోడానికి సహకరించాయి. ‘రెడ్ సాం’ ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకోవడంలోనే కాక, ఆ కథను సినిమా మాధ్యమంలోకి పరివర్తనం చెయ్యడంలోను అతను అనేక ప్రయోగాలు చేశాడు. విశాలమైన బయళ్ళలో వందలమంది నటీనటులతో సుదీర్ఘమైన దృశ్యాలను (shots) చిత్రీకరించాడు. చిత్రీకరణలో పాల్గొంటున్న నటీనటులకు అసలు చిత్రీకరణ (shooting) జరుగుతోందో లేదో తెలిసేది కాదు. లాంగ్ షాట్ నుంచి కెమెరాను ‘జూమ్’ చెయ్యడం వంటి ప్రయోగాలు చేశాడు. మొత్తం ‘రెడ్ సాం’ చిత్రాన్ని 24 దృశ్యాలలో (shots) చిత్రించాడు. నటీనటులను నగ్నంగా ప్రదర్శించినా, అవి దర్శకుడు ‘వివేచన’తో చిత్రీకరించిన దృశ్యాలని విమర్శకులు భావించారు.

‘రెడ్ సాం’ను పురాగాథగా, ఒక కల్పన-ఫాంటసీగా, మరే పేరుతో పేర్కొనాలో విమర్శకులు తేల్చుకోలేకపోయారు. కొందరు ‘మేధో సంబంధమైన’ సినిమా అని ప్రశంసించారు. స్త్రీ శక్తి, జానపద సంస్కృతి, జానపద సంగీత నృత్యాలు కథలో అంతర్భాగంగా ఇమిడిపోయి మరల మరల కన్పిస్తూ చిత్రంలో ప్రతిపాదించబడిన ప్రధాన అంశాన్ని ప్రేక్షకుల దృష్టికి తెస్తుంటాయి. బ్రెహ్ట్ నాటక కళా సిద్ధాంతం ప్రభావం ఈ చిత్రం మీద ఉన్నదని కొందరంటారు. దర్శకుడు ఈ చిత్రంలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతాడు గాని, సమాధానాలు చెప్పడు.

ఇలెక్ట్రా మై లవ్:

ఈ చిత్రం మిక్లోష్ యాన్‌ఛోకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. గ్రీకు పురాణ గాథల్లో – తన తండ్రిని చంపి రాజ్యాన్ని అపహరించిన హంతకుణ్ణి వధించి ప్రతీకారం తీర్చుకొన్న ఇలెక్ట్రా పేరు మీద – కొందరు స్త్రీలలో వ్యక్తమయ్యే ఒక విపరీత మనస్తత్వానికి మానసిక శాస్త్రజ్ఞులు ‘ఇలెక్ట్రా కాంప్లెక్స్’ అని నామకరణం చేశారు. హంగరి నాటక రచయిత László Gyurkó ఈ విపరీత మనస్తత్వం కథాంశంగా ఒక రూపకాన్ని రచించాడు. మిక్లోష్ యాన్‌ఛో ఈ నాటక కథను స్వేచ్ఛగా ‘ఇలెక్ట్రా మై లవ్’ సినిమాగా చిత్రానువాదం చేశాడు.

ఇలెక్ట్రా తండ్రి అగెమెమ్‍ నాన్ (Agamem non) ను చంపి ఎజస్టస్ (Aegisthus) రాజ్యాధికారాన్ని అపహరించి, ప్రజలను క్రూరంగా అణచివేసి, నిర్దాక్షిణ్యంగా నియంతృత్వాన్ని నెలకొల్పుతాడు. ఈ నియంత మీద ఇలెక్ట్రా సోదరుడు ఒరెస్టిస్ (Orestes), అతని అనుచరులు తిరుగుబాటు చేస్తారు గాని, నియంత ఎజస్టస్ విప్లవాన్ని అణిచివేసి, విప్లవకారులను చంపుతాడు. ఇలెక్ట్రా తన సోదరుడు, ఇతర విప్లవకారుల పార్థివదేహాల కోసం ఎదురుచూస్తూ, నియంత ఎజస్టస్‌ను చంపి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది.

పదిహేనేళ్ళు గడుస్తాయి. నియంత ఇలెక్ట్రాను మరింత అవమానపరచడానికి ఒక  మరుగుజ్జు వాడిని పెళ్ళాడమని బలవంత పెడ్తాడు. ఇలెక్ట్రా సోదరి తాను పరిస్థితులతో రాజీ పడీ, ఇలెక్ట్రాను కూడా లొంగిపొమ్మని సలహా ఇస్తుంది.

ఇలెక్ట్రా అనాథ కాదు, ఒక బానిస కాదు, కారాగార శిక్ష అనుభవిస్తున్న దయనీయురాలు కాదు. తన ధ్యేయం న్యాయమైనదది, అంతిమ విజయం తనదేనని ఆమె ప్రతి కదలికలో, మాటలో, చేతలో వ్యక్తమవుతుంది. గొప్ప సంకల్ప బలమున్న స్త్రీగా, విప్లవాగ్నికి ప్రతీకగా అనిపిస్తుంది. ఎజస్టస్ అధికారాన్ని చేపట్టినప్పుడు జరిపిన వేడుకల్లో ఇలెక్ట్రా తానే రాజ్యానికి నిజమైన వారసురాలైనట్టు గర్వంగా, తల ఎత్తుకొని మసలుతుంది. లోకులు మాత్రం ఆమె పిచ్చిదని భావిస్తారు.

ఈ చిత్రంలో రాజకీయ, సాంఘిక సంఘర్షణలను దర్శకుడు అనేక ప్రతీకలతో, సంకేతాలతో స్ఫురింపజేస్తాడు. ‘ఇలెక్ట్రా మై లవ్’ను పౌరాణిక చిత్రమనో; పగ, ప్రతీకారం తీర్చుకొనే కుటుంబ గాథనో ప్రేక్షకులు పొరపాటు పడకుండా దర్శకుడు చిత్రీకరణలో చాలా జాగ్రత్తలు పాటిస్తాడు. చిత్ర కథనం క్లిష్టమైన విధానంలో కొనసాగడం వల్ల, హంగరి, గ్రీకు పురాణ గాథలలో, సంస్కృతులతో పరిచయం లేని ప్రేక్షకులకు సినిమా అర్థం చేసుకోవడం కొంత క్లిష్టంగా వుంటుంది. ఐతే సినిమా అంతటా జానపద సంగీతం, బాలే నృత్య స్పర్శ ఈ లోపాన్ని కనిపించనీయదు.

71 నిమిషాల నిడివి గల ‘ఇలెక్ట్రా మై లవ్’ చిత్రంలో 12 నిడుపాటి దృశ్యాలు (Long Shots, సినిమా పరిభాషలో కాదు) మాత్రమే ఉన్నవి. మూవీ కెమెరాతో ఒకసారి ఎంత నిడివి గల దృశ్యం చిత్రీకరించవచ్చో, అంత నిడివి గల దృశ్యాలు ఈ చిత్రంలో ఉన్నవి. వందలమంది నిరుపేద రైతులను సైనికులు హింసలకు గురిచేయడం వగైరా దృశ్యాలలో నృత్య కళాకారుల బృందాలు ఒక ప్రత్యేకమైన రీతిలో (highly stylized) ఆంగికాభినయాన్ని ప్రదర్శిస్తాయి. అశ్వాలు హుందాగా, ఠీవిగా విన్యాసాలు చేస్తాయి. సినిమా చూస్తున్నంత సేపూ ఒక అలౌలిక స్వప్నానుభూతి కలుగుతుంది.

ప్రజలు ప్రాణాలు నిలబెట్టుకొనేందుకు అవసరమైన నిత్యావసరాలు మాత్రం సరఫరా చేస్తూ, ఎదురు తిరిగితే బ్రతుకు మీద ఆశ వదులుకోవలసిందే అనే భయాన్ని కలిగింది కుక్కిన పేనుల్లా పడి ఉండే దశను కల్పిస్తాడు నియంత ఎజస్టస్. తిరగబడ్డ రైతులను ఘోరంగా శిక్షిస్తూ మిగతా వారికి గుణపాఠం నేర్పుతాడు. భయంతోనే, భయం వల్లే ప్రజలు విధేయులై ఉంటారని అతనికి తెలుసు. స్త్రీ పురుషులను నగ్నంగా నిలబెట్టి కొరడాలతో కొట్టించడం వంటి దృశ్యాలు ఈ అంశాన్ని విశదీకరించడం కోసమే. ఇలెక్ట్రా సోదరుడు మారువేషంలో నియంత వద్దకు వచ్చి తాను అగెమెమ్‍ నాన్ కుమారుడు ఒరెస్టిస్‌ని చంపానని చెప్పడంతో, నియంత హృదయంలో ఒక మూల నక్కి ఉన్న భయశేషం తొలగిపోతుంది. అతడు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలను ఆనందోత్సవం జరుపుకోమని ఆజ్ఞాపిస్తాడు. ఇలెక్ట్రా మారువేషంలో ఉన్న తన సొదరుణ్ణి గుర్తించలేక, అతనే తన భ్రాతృ హంతకుడని భావించి పొడిచి చంపుతుంది గాని, ఒరెస్టిస్ తన దివ్య శక్తులతో పునర్జీవితుడవుతాడు. ఒరెస్టిస్ కనిపించగానే ప్రజలలో నిద్రాణంగా ఉన్న తిరుగుబాటు భావనలు జాగృతమై నియంత మీద విరుచుకుపడతారు.

సినిమా జానపద, పురాణ కథలా సాగి, ముగింపులో ఆధునిక కాలంలోకి మారిపోతుంది. ఒరెస్టిస్, సహ విప్లవకారులు ఎర్రరంగు హెలికాప్టర్‍లో దిగి, నియంతను రివాల్వర్లతో కాల్చి చంపుతారు. ఇలెక్ట్రా, ఆమె సోదరి, సోదరుడు ఒరెస్టిస్, విప్లవకారులు హెలికాప్టర్ ఎక్కి వెళ్లిపోవడంతో నాటకీయంగా సినిమా ముగుస్తుంది.

సోవియట్ సోషలిస్ట్ దేశాల కూటమిలో హంగరి సభ్యురాలుగా ఉన్న కాలంలో దేశ ప్రజల అవసరాలు తీరక, ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చింది. కళాకారుల సృజనాత్మక అభివ్యక్తి మీద ఆంక్షలు, విధి నిషేధాలు ఉన్న సమయంలోనే మిక్లోష్ యాన్‌ఛో ఒక నిగూఢమైన, నైరూప్య కథన శిల్పాన్ని ఆశ్రయించి సమకాలిక రాజకీయ వ్యవస్థ మీద విమర్శగా ఈ సినిమాను తీశాడని కొందరు భావించారు.

మరణ భయాన్ని జయిస్తే, నియంతలను ఎదిరించవచ్చని, సత్యాన్ని నిర్భయంగా ప్రకటించే ధైర్యం కలుగుతుందని ఇలెక్ట్రా పాత్ర ఆచరణతో నిరూపిస్తుంది. ఆమె ధీరవనిత. ఆమె దేన్నీ మరిచిపోదు. “ఒక్కరు మరచిపోకుండా గుర్తు పెట్టుకుంటే చాలు, ఎవరూ మరచిపోరు” అంటుంది. ఎన్నో ఏళ్ళు గతించినా, విప్లవానికి సరైన సమయం కోసం కాచుకొని ఉంటుంది. చిత్రం ఆరంభంలో జన సమూహాలు నియంతను నుతిస్తూ, అతను పెట్టే బాధలను ఓర్చుకోలేక పరుగులు తీస్తూ, వ్యక్తిత్వం లేని మరబొమ్మల మాదిరి అగుపిస్తారు. ఈ ప్రజా సమూహాలే తర్వాత, భయదమైన ఇలెక్ట్రా విప్లవ శక్తికి ప్రతీకలుగా అనిపిస్తారు.

నిత్యం విప్లవాగ్ని విహంగం (Phoenix bird) సూర్యోదయంతో పాటుగా పునరుత్థానం చెందకపోతే, ప్రజలు నిష్క్రియులుగా మార్తారని ఈ చిత్రం భంగ్యంతరంగా సూచిస్తుంది.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here