జ్ఞాపకాల తరంగిణి-73

2
12

మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మన్నం రాయుడు గారితో నా అనుబంధం

[dropcap]2[/dropcap]011. స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ మనసు ఫౌండేషన్ కోసం గురజాడ అప్పారావు సర్వలభ్య రచనల సంకలనం సంపాదక బాధ్యత స్వీకరించి పని చేస్తున్నారు. ఆయన నాకు గొప్ప మిత్రులు. గోపాలకృష్ణ ఈ ప్రయత్నంలో తనకు సహాయం చేయమని కోరారు. గోపాలకృష్ణ గురజాడ ఇంగ్లీషు ఉత్తరప్రత్యుత్తరాలను చదివి, బోధపరుచుకొని డిసైఫర్ చేసి ప్రెస్ కాపీ తయారు చేస్తున్నారు. నేను గురజాడ తెలుగు రచనలు ఏ ఏ పత్రికల్లో మొదటి పర్యాయం అచ్చయ్యాయో పరిశోధించి సేకరిస్తున్నాను. విశాలాంధ్ర ప్రచురణ సంస్థ వారు – అవసరాల సూర్యారావు చేత గురజాడ లేఖలను, దినచర్యలను, నోట్సును తెనుగు చేయించి పుస్తక రూపంలో తెచ్చి గురజాడ రచనలకు గొప్ప ప్రచారం తెచ్చారు.

1976 ప్రాంతంలో విశాలాంధ్ర ప్రచురణ సంస్థ తన వద్ద ఉన్న గురజాడ రికార్డును పరిశీలించడానికి నార్ల, కె.వి.ఆర్, వంటి పండితులకు అవకాశం కల్పించింది. గురజాడ ఇంగ్లీషు రచనలను, అవసరాల అనువాదంతో పోల్చుతూ పురాణం సుబ్రహ్మణ్య శర్మ – వారం వారం, దాదాపు పాతిక వ్యాసాలు రాసి, గురజాడ ఇంగ్లీషు రచనలను అవసరాల ఎట్లా తప్పుగా అర్థం చేసుకొని తెలుగు చేశారో నిరూపించారు.

సీనియర్ జర్నలిస్టు, రచయితా, గురజాడ అంటే ప్రాణం పెట్టే గోపాలకృష్ణ మొదటి నుంచీ ఒక రచయిత తొలుత ఏ భాషలో రచనలు చేశారో, ఆ రచనలను ఆ భాషలోనే ప్రచురించాలని, ఆ తర్వాత వాటిని ఎవరైనా అనువదించ వచ్చునని, గురజాడ విషయంలో అంతా అపసవ్యంగా జరిగిందని భావించి, గురజాడ రికార్డు పరిశీలించి, ఇంగ్లీషు ఉత్తరాలను చదివి ఎత్తి రాయడం ఆరంభించారు. ఆ రోజుల్లోనే ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సహకారంతో గురజాడ రికార్డు అంతా స్కాన్ చేయించిన డిజిటల్ కాపీ గోపాలకృష్ణకు అందింది. అంతకు ముందు 1989 నుంచి గోపాలకృష్ణ, నేను వీలైనప్పుడల్లా హైదరాబాదు తార్నాకా లోని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్‌కు వెళ్ళి రికార్డు పరిశీలించి, కొన్ని ఉత్తరాలు కాపీ చేసేవాళ్ళం. డిజిటల్ కాపీ మాకు లభించిన తర్వాత, గోపాలకృష్ణ కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చొని, గురజాడ లేఖలు చదివి కాపీ చెయ్యడం ఆరంభించారు. అప్పుడే వారు మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. మన్నం వెంకట రాయుడు గారిని గురజాడ ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రచురించమని కోరారు. 2012 సెప్టెంబరు 21న గురజాడ 150వ జయంతి సందర్భంగా గురజాడ సమగ్ర రచనల సంపుటాన్ని ప్రచురిద్దామని, ఆ సంపుటానికి గోపాలకృష్ణను సంపాదకులుగా ఉండి పని సాగించమని కోరారు. గోపాలకృష్ణ నా ఆత్మమిత్రుడు కనుక, ఈ బృహత్కార్యంలో తనకు సహాయం చేయమని కోరారు.

ఈ విధంగా గురజాడ రచనల మీద పని జరుగుతున్నప్పుడు నేను గురజాడ కవితలు, కథలు, వ్యాసాలు మొదట ఏ ఏ పత్రికల్లో ప్రచురించారో పరిశోధించి మొదటి ముద్రణలను సేకరించే పనిలో పడ్డాను. దురదృష్టం – గోపాలకృష్ణ కేన్సర్ వ్యాధిగస్థుడైనా పని మాత్రం కొనసాగిస్తూనే వచ్చి, గురజాడ ఇంగ్లీషులో రాసిన 145 లేఖల వరకు చదివి నిర్దుష్టమైన శుద్ధ ప్రతి తయారు చేశారు.

2011 ఫిబ్రవరిలో నేను, నా శ్రీమతి – గోపాలకృష్ణను చూచి రావడానికి హైదరాబాదు వెళ్ళాము. అప్పటికే ఆయన పిల్లలు, చుట్టాలు అంతా చేరి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన అందరినీ గదిలోంచి వెళ్ళమని – గురజాడ సమగ్ర రచనల సంపుటం తయారు చేయడంలో నాకు అనేక సూచనలు, సలహాలు ఇచ్చి ఆ సంపుటం వెలువడేట్టు చూడమని అర్థించారు. కన్నీళ్లు ఆపుకొని నేను గదిలోంచి వచ్చేశాను. 2011 మే 27న గోపాలకృష్ణ ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు.

నేను మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. మన్నం రాయుడు గారిని గాని, వారి సోదరులను గాని అంతకు పూర్వం చూడలేదు. గోపాలకృష్ణ అభ్యర్థిస్తే రాయుడు గారు నేను సంపాదించి, పరిష్కరించి, ఎడిట్ చేసిన పొణకా కనకమ్మ స్వీయ చరిత్ర ‘కనకపుష్యరాగం’ ప్రచురణ 400 కాపీలు నాకు బహుకరించారు.

2011 జూన్‍లో ఒక రోజు మన్నం రాయుడు గారు నెల్లూరు వచ్చి కలిశారు. వారు మా ఇంటికి వస్తారని నేను ఊహించలేదు కూడా. అయితే గురజాడ సమగ్ర రచనల సంపుటానికి నన్ను సంపాదకులుగా ఉండమని కోరారు. ‘మీరు సహ సంపాదకులుగా ఉండడానికి అంగీకరిస్తే, నేను పని కొనసాగిస్తాన’ని అన్నాను. వారు అంగీకరించడంతో గురజాడ రికార్డు డిజిటల్ కాపీలు చదవడం మొదలు పెట్టాను. మా కళాశాలలో నాతో కూడా పనిచేసిన డా. మాచవోలు శివరామప్రసాద్ కూడా రోజూ ఉదయం, సాయంత్రం మా ఇంటికి వచ్చి గంటల తరబడి ఆ రాతప్రతులు చదవడంలో తోడు పడ్డారు.

2012 సెప్టెంబరు మొదటి వారం వరకు మేము పని చేస్తూ వచ్చాము. ప్రూఫులు కూడా చూచి సరిదిద్ద వలసిన తప్పులను ఫోన్‌లో చెప్పేవాణ్ణి. అలా రాయుడి గారితో నా ప్రయాణం మొదలైంది. విజయనగరంలో 2012 సెప్టెంబరు 21న ఏర్పాటైన పుస్తకావిష్కరణ సభలో రాయుడు గారు స్వర్గీయ గోపాలకృష్ణ శ్రీమతి గారి చేతనే ఆ సంపుటాన్ని ఆవిష్కరింపజేశారు. అప్పటికి రాయుడి గారితో చనువు లేదు. గురజాడ లభ్య సమగ్ర రచనల సంపుటం పుస్తకం ఏ సైజులో ఉండాలి అన్నప్పుడు అంతకు పూర్వం పుస్తకాలుగా ఏ4 సైజులో కాకుండా ⅛ డెమిలో ఉండాలని పట్టుబట్టాను. మనసు వారి పద్ధతికి విరుద్ధమైనా, వారు నా అభ్యర్థనను మన్నించి నేను కోరిన విధంగా సన్నని ఉల్లిపొర కాగితంపై చాలా అందంగా పుస్తకం తెచ్చారు.

2011 నుంచి 2022 వరకు మన్నం రాయుడు గారితో నా స్నేహం, ప్రయాణం కొనసాగుతోంది. గురజాడ సంపుటి తర్వాత, వారు జాషువా సమగ్ర రచనల సంపుటం ప్రచురణకు పూనుకొని జాషువా రచనల తొలి ముద్రణలను సేకరించే బాధ్యత నాకు అప్పగించారు. దాదాపు అనేక జిల్లా గ్రంథాలయాలు, పెద్ద పెద్ద గ్రంథాలయాలన్నీ తుఫాను గాలిలా చుట్టి వచ్చాను. నా సహకారాన్ని అభినందిస్తూ, రాయుడు గారు జాషువా సమగ్ర రచనల సంపుటం ఆవిష్కారణ సభకు నన్ను అధ్యక్షత వహించమని కోరారు. కారా మాస్టారు హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించారు.

డాక్టర్ ఎం.వి. రాయుడు గారితో

క్రమంగా రాయుడిగారితో నా సాన్నిహిత్యం పెరిగింది. కలువకొలను సదానంద సమగ్ర రచనల సంపుటం తీసుకొని వద్దామని ప్రతిపాదించాను. ‘మీరు ప్రతిపాదించారు కనుక మీరే ఆ బాధ్యత నిర్వహించండి’ అని రాయుడు గారు ఆమోదం తెలియజేశారు గాని, సదానంద కుటుంబం నుంచి సరైన స్పందన లభించక ఆ ప్రణాళిక ఆకృతి దాల్చలేదు.

2018 ఉగాది రోజు కాబోలు, రాయుడు గారు నెల్లూరు నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలోని వరికుంటపాడు లోని తమ ఫామ్‍హౌస్‍లో స్కానింగ్ సెంటర్ ప్రారంభించారు. కారా మాస్టారు చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిపించారు. రాయుడి గారి ద్వారా కారా మాస్టారు గారితో అనుబంధం పెరిగింది.

(మిగతా వచ్చేవారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here