వందేళ్ల ఏకాంతం – నవలా పరిచయం
[dropcap]గా[/dropcap]బ్రియెల్ గార్షియా మార్క్వెజ్ ‘One Hundred Years of Solitude’ నవలను పి. మోహన్ తెలుగులోకి అనువదించి, ప్రచురించి అందుబాటులోకి తెచ్చారు గనక నా వంటి వాళ్ళకు ఆ నవలను చదివి ఆనందించే అవకాశం లభించింది.
మార్క్వెజ్ లేటిన్ అమెరికాలోని కొలంబియా దేశస్థుడు. ఆయన స్పానిష్ భాషలో రచించిన ఈ నవల మొదట 1967లో అచ్చయింది. తర్వాత ఇంగ్లీషు వంటి అనేక భాషలలోకి అనువదించబడింది. మార్క్వెజ్ జర్నలిస్టుగా జీవితం ఆరంభించినా, కాల్పనిక సాహిత్య రచయితగా స్థిరపడ్డాడు. ‘వందేళ్ళ ఏకాంతం’ కంటే ముందే కథలు నవలికలు రాసి ప్రసిద్ధుడైనా, ‘One Hundred Years of Solitude’ నవలకు నోబెల్ బహుకృతి అందడంతో ఈ నవల 50 భాషల్లోకి అనువదింపబడి ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. మార్క్వెజ్ పుట్టి పెరిగిన ‘అరకటాకా’నే ఈ నవలలో ‘మకోండో’ పల్లెగా చిత్రించబడింది. రచయిత అనుభవంలోని ప్రజాజీవితం, సంఘటనలు, కొలంబియా సమకాలీన చరిత్ర ఈ నవలలో ప్రతిబింబించాయి. కల్పనకు మించిన కల్పనగా అనిపించే వాస్తవికత ఈ నవలకు ఆయువుపట్టు. ఇందులో వచ్చే పాత్రలు, సంఘటనలు నిజంగా జరిగినవే. మార్క్వెజ్ 18 నెలల పాటు అప్పుల వాళ్ళ బాధల మధ్య అవిశ్రాంతంగా ఈ నవలా రచన చేశాడు. తన సామ్యవాద స్వప్నాన్ని కూడా ఈ నవలలో సూచిస్తాడు. మార్క్వెజ్ సాహితీవేత్తగా తాను గడించిన ధనాన్ని సామాజిక ప్రయోజనాలకు, ప్రజా ఉద్యమాలకు ఖర్చు పెట్టిన ప్రజా పక్షపాతి.
‘మన కాలపు మన ఇతిహాసం’గా ప్రసిద్ధి పొందిన ‘వందేళ్ళ ఏకాంతం’ మౌఖిక సంప్రదాయాలు, లిఖిత సంప్రదాయాలు, జానపద కథల రీతులను తనలో ఇముడ్చుకొంది. మాంత్రిక వాస్తవాల చరిత్రకు చక్కెర పూత ‘వందేళ్ళ ఏకాంతం’ నవల. కొలంబియా గ్రామీణ జీవిత నేపథ్యంలో నవల ఇతివృత్తాన్ని రచయిత అద్భుతంగా చిత్రించారు. మేజికల్ రియలిజం రచనా విధానంలో కవోష్ట రుధిరంలో రగిలే అలవి గాని కోరికలు, ఒడలు జలదరించే భయాలు, చెదిరిన కలలు, చల్లారిన విప్లవాలు, కొన ఊపిరితో మిగిలిన ఆశలు, బిక్కు బిక్కుమనే ఏకాంతాలు – మరెన్నో ఈ నవలలో నిక్షిప్తమయ్యాయి. నవలా రూపంలోని ఈ కథ ప్రతి ఒక్క ఊరి కథ, మకోండో ఊరి చరిత్ర.
‘వందేళ్ళ ఏకాంతం’ నవలా కాలం:
సుమారు 1800 నుంచి 1930 వరకు జరిగిన సంఘటనల ననుసరించి నవలా కాలాన్ని సంభావించుకోవచ్చు. కొలంబియా దేశ గ్రామీణ నేపథ్యంలో నవల సాగుతుంది. పసిఫిక్ మహసముద్రం ఒక వైపు, మిగతా అన్ని వైపులా లేటిన్ అమెరికాలోని చిన్న చిన్న దేశాలు. స్పానిష్ వలసపాలకుల నుంచి అప్పుడప్పుడే విముక్తి పొదిన కొలంబియా – అనాదిగా ఉంటున్న ఆదివాసి ప్రజలు (రెడ్ ఇండియన్లకి సంబంధించిన సంతతి), స్పానిష్ జాతియులకూ, రెడ్ ఇండియన్లకు జన్మించిన మిశ్రజాతి ప్రజలు. కొలంబియాలో స్థిరపడిన స్పానిష్ వారు కలసి నివసిస్తున్న దేశం. అనంతమైన ప్రకృతి వైవిధ్యం, వృక్ష, జంతు సంపదలతో విలసిల్లే కొలంబియాలో ఒక కల్పిత గ్రామం మకోండోలో కథంతా జరుగుతుంది.
‘వందేళ్ళ ఏకాంతం’ నవల కథ నడిమి భాగం నుంచి ఆరంభమవుతుంది. కల్నల్ ఔరిలియానో ఫైరింగ్ స్క్వాడ్ ఎదురుగా నిలిచి, మృత్యువును ఎదుర్కుంటున్న సందర్భంలో అతని మనోనేత్రం ముందు శైశవం నాటి విషయాలు కదలాడుతాయి. తన తండ్రి మంచుగడ్డను చూపించేందుకు వెంట తీసుకొని వెళ్ళడం నుండి, అన్ని బాల్యస్మృతులు గుర్తొస్తాయి.
పూర్వం మర్కాదియో వంశంలో ఎవరో వావి, వరుస కాని స్త్రీని పెళ్ళాడడం వల్ల పందితోకతో శిశువు పుట్టినట్లు ఒక కథ. దురదృష్టవశాత్తూ అర్కాదియో కూడా సోదరి వరుస అయ్యే ఉర్సులా ఇగువరాన్‍ను పెళ్ళి చేసుకోవటంతో తనకూ అటువంటి శిశువే పుట్టవచ్చుననే భయం పట్టుకొంటుంది. అటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి ఉర్సులా ఇనుప కచ్చడం మొలకు ధరించి ఉంటుంది. మర్కాదియో బుయోందియోపై కోడిపందెంలో ఓడిన ఆసామి మర్కాదియో మగతనం లేనివాడని పరిహాసం చెయ్యడంతో రోషంతో ఇంటికి వచ్చి భార్య ఉర్సులా ఇనుప కచ్చడం తొలగించి ఆమెతో సంగమిస్తాడు. అతని వంశంలో సమయభంగం చేస్తే పందితోకతో శిశువు జన్మించవచ్చనే భయం మాత్రం ఉంటుంది గాని, మానవ సహజమైన బలహీనతల వల్ల ఒక్కొక్కప్పుడు నియమాన్ని పాటించరు.
మర్కాదియో బుయోందియో, అతని ఈడు యువ మిత్రులు కలిసి వాసయోగ్యమైన ప్రదేశాన్ని అన్వేషిస్తూ వలస బయలుదేరుతారు. దారిలో భార్య ఉర్సులాకు ప్రసవమై మగ శిశువు జన్మిస్తాడు. చివరకు ఈ బృందం దారిలో ఒక చోట ఆగి మకోండో పేరుతో ఒక పల్లెను నెలకొల్పి స్థిరపడతారు. ఈ వలస బైబిల్‍లో ‘ఎక్సోడస్’ గాథను గుర్తు చేస్తుంది. నవలలో అనేక సంఘటనలు విరామం లేకుండా నాలుగేళ్ళు కురిసిన వర్షాలు, క్షామం వంటి విషయాలు, క్రైస్తవ పురాణ కథలను గుర్తు చేస్తాయి.
బుయోందియోల రెండో తరంలో హోస్ ఆర్కాదియో 14 సంవత్సరాల వయసుకే ఒక బిడ్డకు తండ్రై, జిప్సీల బృందంలోని 11 సంవత్సరాల బాలికను ప్రేమించి, జిప్సీల వెంట ఎటో వెళ్ళిపోతాడు. తల్లి ఉర్సులా కుమారుడి కోసం ఐదు నెలలు ఎక్కడెక్కడో వెతికి, నిరాశతో మకోండో చేరి – తన కుమారుడికి, ప్రశ్న చెప్పే స్త్రీ పిలార్ తెరేసాకు పుట్టిన శిశువును తెచ్చుకొని సాకుతుంది. ఈ కుర్రాడు చీట్ల పేక ముక్కల సహాయంతో భవిష్యత్తును చెపుతూంటాడు తల్లి లాగే. జిప్సీలతో పారిపోయిన ఉర్సులా కుమారుడు దేశద్రిమ్మరై శరీరమంతా సందులేకుండా పచ్చబొట్లు పొడిపించుకుని ఎంతో కాలం తర్వాత మకోండోకు తిరిగి వస్తాడు – ఒక రాక్షసుడి మాదిరి మహాకాయుడై.
హోస్ ఆర్కాదియో, ఉర్సులా దంపతులు తమ సంతానం – అమరంతా, రెబెకాలను రెడ్ ఇండియన్ దాసి సంరక్షణలో విడిచిపెడతారు. ఆ పిల్లలు దాసి మాట్లాడే ఇండియన్ భాషలోనే మాటలు నేర్చుకుంటారు. తర్వాత మాతృభాష స్పానిష్ నేర్చుకుంటారు. అమరంతా, రెబెరాలకు సంతానం లేదు. అమరంతా బ్రహ్మచారిగానే ఉండిపోతుంది. తర్వాత తరానికి చెందిన జోస్ ఆర్కాదియా యొక్క కుమారుడు ఆర్కాదియా శాంతా సోఫియా డి లా ను పెళ్ళి చేసుకుంటాడు. ఈ దంపతులకు ఆర్కాదియో సెగుండో, ఆర్కాదియో అనే కవల పిల్లలు. ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకే పోలిక. పెరిగి పెద్దయిన తరువాత కూడా వీరిని ఎవరూ సరిగా పోల్చుకోలేకపోవడంతో, అనేక సంఘటనలు. ఈ దంపతులకు కవల పిల్లలు కాక, రెమోడియోస్ ద బ్యూటీ అనే అపూర్వ సుందరి అయిన కుమార్తె.
అమడ పిల్లల్లో సెగుండొ ఫెర్నాండా డికేప్రియోను పెళ్ళాడతాడు. ఈ దంపతులకు జోస్ ఆర్కాదియో అనే ఒక కుమారుడు, మెమి, అమరంతా ఉర్సులా అనే కుమార్తెలు. మెమి మార్సియో బబిలోనియా అనే మెకానిక్ కుర్రాణ్ణి ప్రేమిస్తుంది. మార్సియో రహస్యంగా ప్రేయసి మెమిని కలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో సిపాయి అతణ్ణి కాలుస్తాడు. గాయపడ్డ మార్సియో జీవితాంతం మంచానికి పరిమితమై కోళ్ళదొంగ అని పరిహాసానికి గురవుతాడు. గర్భవతి అయిన కుమార్తె మెమిని ఆమె తల్లి రహస్యంగా ఎక్కడో ఒక కన్యా గురుకులం (నన్నరి)లో చేర్పించి, మెమికి పుట్టిన బిడ్డను తనే పెంచి పెద్ద చేస్తుంది.
మర్కాదియో వంశంలో ఆఖరి తరంలో అమరంతా ఉర్సులా, హౌస్ ఆర్కాదియో – అక్కాతమ్ముళ్ళిద్దరూ – యూరప్ వెళ్ళి చదువుకొంటారు. తల్లి మరణశయ్యపై ఉందన్నప్పుడు మాత్రమే చివరి చూపు కోసం వారు కొలంబియాకు తిరిగి వస్తారు. చివరి తరంలో ఔరెలియానో ఎవరి సంతానమో స్పష్టంగా తెలియదు. ఆ బాలుడు ఎవరి సహాయం లేకుండా గాలికి తిరుగుతూ పెరిగి, ఎలాగో బతుకుతూ మర్కాదియో వంశ మూల పురుషుడు హోస్ ఆర్కాదియో బుయెందియోకు దేశద్రిమ్మరి జిప్సీ ఇచ్చిన చర్మపత్రాలు (scrolls) చదవడానికి కృషి చేసి, అవి సంస్కృత భాషలో రాయబడినవని కనుగొంటాడు. “ఆ తోలు కాయితాల తాలూకూ శిలాశాసనం స్వయం ప్రకాశంతో సాక్షాత్కరించింది -‘ఆద్యం వృక్షః అంతిమశ్చ పిపీలకాగ్రస్తః’ – మొదటివాడు చెట్టుకు బందీ, చివరివాడు చీమలపాలు”.
మొదటితరం ఆర్కాదియో బుయెందియోకు చిత్తచాంచల్యం వస్తే, అతణ్ణి పిల్లలు ఇంటి ముంగిట్లో చెట్టుకు బంధించి ఉంచుతారు. అతడు చివరి వరకు చెట్టు మొదలుకే పరిమితం. ఐదవ తరం అమంతా ఉర్సులా మకోండో పల్లె అంటే ప్రేమతో అక్కడే ఉండిపోతుంది. ఆమె తన అక్క కుమారుడు ఔరెలియానోతో సహజీవనం చేస్తుంది. వావి వరస తప్పి వివాహం చేసుకుని అమంత ఉర్సులా, ఔరెలియానో బబిలోనియాలకు పందితోకతో పుట్టిన నెత్తురు గుడ్డును – మృత శిశువును – గండు చీమలు తోటలోని బండలబాట మీదుగా పుట్టలోకి లాక్కెళతాయి.
మొదటి తరం ఆర్కాదియో బుయెందియో భార్య ఉర్సులాకు పరిచయస్థులెవరో పెద్ద బొమ్మను దాచిపెట్టమని ఇస్తారు. కాని వారెవరో ఎంత కాలం గడిచినా దాన్ని వెనక్కు తీసుకుని వెళ్ళరు. ఆ బొమ్మ కింద పడి పగిలి, దాన్లో రహస్యంగా దాచిన బంగారు నాణేలను ఉర్సులా నాలుగు మూటలుగా కట్టి ఇంట్లోనే భూమిలో పాతిపెడుతుంది. జీవితాంతం ఆ నిధిని యజమానికి అప్పజెప్పాలని వేచి ఉంటుంది గాని, ఆ రహస్యం తన కుమారులకు కూడా చెప్పదు, గుట్టు విప్పదు. ఆ వంశంలో వారసుడు జోస్ ఆర్కాదియోకు ఆ నిధి లభిస్తుంది. అతడు తనకు లభించిన ధనంతో విశృంఖలంగా జీవిస్తుంటే దొంగలు ఆ నిధిని దోచుకొనిపోతారు.
మకోండో ఇప్పుడు నగరంగా ఎదిగింది. మకోండో పట్టణం మితవాద మేయర్ రెమెడియో మొస్‍కాట్ తొమ్మిదేళ్ళ కుమార్తెను ఆమె కన్నా చాలా పెద్దవాడైన ఔరెలియానో ఇష్టపడితే, మేయర్ దంపతులు ఆ బాలికను అతనికిచ్చి పెళ్ళి చేస్తారు. ప్రసవం కష్టమై ఆ బాలిక చనిపోతుంది.
ఇటలీ దేశస్థుడయిన పిమొట్రా క్రెస్టోను అమరంతా, రెబెకా అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ ప్రేమిస్తారు. అమరంతా అసూయ కారణంగా, రెబెకా చనిపోతుంది. అమరంతా జోస్ ఆర్కెడోస్‍ని పెళ్ళి చేసుకుంటుంది. ఇటాలియన్ ప్రేమికుడు అమరంతా గది కిటికి వద్ద ఆత్మహత్య చేసుకొంటాడు.
ఈ నవల మ్యాజిక్ రియలిజం కథన పద్ధతితో సాగుతుంది. అతీత శక్తులు, భవిష్యత్ వాణి పలకడం వంటి సంఘటనలు ఈ రచనా ధోరణికి చెందినవే. రెమెడియస్ ద బ్యూటీ అనే పాత్ర బట్టలు ఆరవేస్తూ, వేస్తూ గాలికి ఎగిరిన బట్టలతో పాటు గాలి లోకి ఎగిరి అదృశ్యమవుతుంది. ఆమె ఎగిరిపోతుంటే మబ్బుల్లా సీతాకోకచిలుకల గుంపులు ఆమెను చుట్టుముట్టి ఉన్నట్టు వర్ణన. నవలలో ఇటువంటి కల్పనలు అక్కడక్కడా ఉన్నా తార్కిక దృష్టితో వీటిని ప్రశ్నించకుండా, నవల కథన శిల్పంలో భాగంగా సంభవించినట్లు అనుకోవాలి. దీన్ని నవల నిర్మాణంలో వైరుధ్యంగా కొందరు భావిస్తారు. తరచూ నవలలో వచ్చే పురాణాలలోని సంఘటనలు, చారిత్రక ఘటనల ప్రస్తావనను గురించి కూడా వ్యాఖ్యానాలు వచ్చాయి. అమెరికా పెట్టుబడిదారులు కొలంబియాలో అరటితోటలు పెంచి, అక్కడి శ్రామికుల సమ్మెను రాత్రికి రాత్రి అణచివేసి మూడువేల మంది శ్రామికులను హత్య చేయించిన హత్యాకాండ వార్తలను బయటకు పొక్కకుండా చేయగలిగారు గానీ, ఆ దారుణ హత్యాకాండ ప్రజల స్మృతులలో నిలిచిపోయింది. ఈ నవలలో శ్రామికుల శవాలను రాత్రికి రాత్రే రైల్లో రహస్యంగా పంపించివేసిన కథ ప్రస్తావనలు కూడ ఉన్నాయి.
క్యూబాలో ఆరంభమైన సాహిత్యోద్యమాలు, లాటిన్ అమెరికా ఆధునిక సాహిత్య ఉద్యమ ప్రభావాలు మార్క్వెజ్‍పై గాఢమైన ప్రభావాన్ని చూపాయి. యథాలాపంగా చదివితే ఈ నవల సులభంగా కొరుకుడు పడదు. విమర్శకులు ‘వందేళ్ళ ఏకాంతాన్ని’ కనీసం రెండో మారు చదవాలని సూచిస్తారు. నవలలో వచ్చే పాత్రల అసంపూర్ణమైన కోరికలు, జీవితం, ఊహలూ అన్నిటినీ విశాలమైన అర్థంలో ‘వందేళ్ళ ఏకాంతం’ అనే పేరు స్ఫురింపజేస్తుంది. నవల ఆలోచనామృతం. ఆలోచింపజేస్తుంది. ఒక మహా కావ్యాన్ని చదివి ముగించిన తృప్తినిస్తుంది.
మార్క్వెజ్ మహాకావ్యాన్ని గొప్ప నిబద్ధతతో, శ్రద్ధతో అనువదించి తెలుగువారికి అందించిన పి. మోహన్ అభినందనీయులు.