జ్ఞాపకాల తరంగిణి-77

0
12

మెకంజీ కైఫియత్తులు

[dropcap]ఇ[/dropcap]టీవల ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సంబంధించి కొన్ని గ్రామాల కైఫియత్తుల ఫొటోకాపీలు చదివి, డిసైఫర్ చేసి కాపీ చేయడం కోసం నా వద్దకు పంపబడ్డాయి. ఎన్నడో 1780-1820 ప్రాంతాలలో కల్నల్ కాలిన్ మెకంజీ గుమాస్తాలు ఇంగ్లీషులో గ్రంథస్థం చేసిన కైఫియత్తులివి. అర్ధ శతాబ్దం క్రితం పి.హెచ్.డి. పరిశోధన కోసం మద్రాసు జి.ఓ.ఎం.ఎల్. (Madras Government Oriental Manuscript Library) లో ఏడాది పాటు మెకంజీ సంపుటాలను, బ్రౌన్ స్థానిక చరిత్ర సంపుటాలను చదివి నోట్సు తీసుకొన్న అనుభవంతో ఈ కైఫియత్తులు చదివి, తిరగ రాసే పనికి పూనుకొన్నా.

కొంత కృషిచేసి రాత అలవాట్లు బోధపరుచుకొంటే, ఈ కైఫియత్తులు చదవడం తేలికవుతుంది. ఇంగ్లీషులో, మంచి దస్తూరీతో రాయబడ్డా, ఆనాటి రాత పద్ధతులు మనకు కొత్తగా ఉంటాయి. లేఖకులకు ఆంగ్ల భాషా వ్యాకరణంతో, స్పెల్లింగులతో పెద్ద పట్టింపు లేకపోవడం వల్ల కూడా చదవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తరచూ పదం ఇదా, అదా అని సందేహం..

మెకంజీ సేకరించిన తెలుగు పత్రాలన్నీ దాదాపు కైఫియత్తులే. కాలిన్ మెకంజీ సర్వేయర్ జనరల్‍గా ఉన్న కాలంలో తన గుమాస్తాల ద్వారా స్థానిక చరిత్రలు, శాసనాల నకళ్ళు, రాతప్రతులు, కళాత్మక వస్తువులు సేకరించాడు. ఏలూరుకు చెందిన బ్రాహ్మణ యువకుడు కావలి బొర్రయ్య మెకంజీకి ఆత్మీయుడైన బంటు. దురదృష్టవశాత్తు బొర్రయ్య పసివయస్సులో చనిపోతే అతని తమ్ములు లక్ష్మయ్య, రామస్వామి మెకంజీ కోసం పని చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకాలో కైఫియత్తులు సేకరించిన వారిలో నారాయణరావు, మరికొందరు పండితులు కూడా ఉన్నారు. ఈ గుమాస్తాలు ఊరూరికి, గ్రామ గ్రామానికి వెళ్ళి గ్రామ పెద్దలు వివరించిన అనేక విషయాలు గ్రంథస్థం చేశారు, గ్రామాల్లో కనిపించిన ప్రతి శాసనం ఎత్తి రాశారు, లభించిన రాతప్రతులు సేకరించారు. మెకంజీ సంచయంలో ఉర్దూ, పార్శీ, అరబిక్, తెలుగు, ఇతర దక్షిణాది, భారతదేశ భాషల్లో పత్రాలున్నట్టు గమనించాను. చేత్తో తయారయిన దళసరి కాగితంపైన కరక్కాయ సిరాతో రాయబడిన, బైండు చేయబడిన సంపుటాలివి.

శిథిలమవుతున్న మెకంజీ సంపుటాలకు సి.పి.బ్రౌన్ నకళ్ళు తయారు చేయించాడు. బ్రౌన్ కాపీ చేయించిన 419 సంపుటాలను ‘లోకల్ రికార్డ్స్’ పేరుతో వ్యవహరిస్తారు. వీటినే తెలుగులో ‘స్థానిక చరిత్రలు’ అంటారు. నేను జి.ఓ.ఎం.ఎల్.లో బ్రౌన్ సంపుటాలను పరిశోధిస్తున్న రోజుల్లో (1968-69) అక్కడి ఉద్యోగి తీర్థం శ్రీధరమూర్తి అనే గొప్ప పండితుడు, సజ్జనుడి సహకారం లేకపోతే, ఆ సంపుటాల దుర్గమారణ్యంలోకి ప్రవేశించటం అసాధ్యం అయ్యేది. నిడదవోలు వెంకటరావు, వారి కుమారులు సుందరేశ్వరరావుకు జి.ఓ.ఎం.ఎల్.లో మంచి అనుభవం ఉండడం వల్ల హైదరాబాదు నుండి మద్రాసు వెళ్లే నా వంటి పరిశోధకులకు సలహాలిచ్చి సహకరించేవారు.

వెంకటరిగి సంస్థానం గ్రామాలకు సంబంధించి వందల కొద్ది కైఫియత్తులు చదివాను. వెంకటగిరి ఆలయంలో, ఇతరత్రా సేకరించిన తెలుగు, పార్శీ శాసనాలు, రాతప్రతులు కూడా ఈ సంపుటాల్లో ఉన్నాయి.

మహిమలూరు కైఫియత్

మెకంజీ గుమాస్తాలు వెంకటగిరి వెలమ పాలకులు ”వెలుగోటి వారి వంశావళి”ని నెల్లూరులో ఖరీదు చేసినట్లు బంగోరె పరిశోధనలో తేలింది. డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య ఈ వెలుగోటి వారి వంశావళిని పరిష్కరించి, సుదీర్ఘమైన ఉపోద్ఘాతం రాశారు. 1939లో మద్రాసు విశ్వవిద్యాలయం ఈ గ్రంథాన్ని ప్రచురించింది. నేలటూరి వెంకటరమణయ్య ఈ వంశావళిలో వచ్చే వ్యక్తులను, సంఘటనలను చరిత్రతో చక్కగా సమన్వయించి ఉపోద్ఘాతం రాయడం వల్ల వెలుగోటి వారి వంశావళి ఒక ఆకర గ్రంథంగా గుర్తింపు, గౌరవం పొందింది.1891లోనే వెలుగోటి వారి వంశావళిని ఎవరో మద్రాసులోని ఫోస్టర్ ప్రెస్‌లో అచ్చు వేశారు.

వెలుగోటి వారి వంశావళి ఒక కవి, ఒక కాలంలో రాసిన గ్రంథం కాదు. వెలుగోటి వంశకీర్తిని నుతిస్తూ వందిమాగధులు, భట్టుకవులు చెప్పిన పద్యాలు, మల్లన, రేటూరి రంగరాజు తదితర కవుల రచనల్లో పద్యాలు ఇందులో చేరిపోయాయి. వెంకటగిరి పాలకుల్లో 21వ తరం కుమార యాచమనాయని చరిత్రతో ఈ వంశావళి ముగుస్తుంది.

‘వెంకటగిరి కైఫియత్’ పేరుతో లభించిన కైఫియత్‍లో వెంకటగిరిలో 1808 ప్రాంతాల్లో జరిగిన దారుణమైన సంఘటనలు, చెంగాటి పెద్దన్న, అతని కుటుంబం, పరివారం అందరూ మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవడం వంటి విషయాలు రికార్డయ్యాయి. కైఫియత్ గ్రంథస్థం చేసిన గుమాస్తాలు సంఘటనలు జరుగుతున్న సమయంలోనే వెంకటగిరి వచ్చి, కథనాన్ని గ్రంథస్థం చెయ్యడం వల్ల చిన్న చిన్న వివరాలతో సహా పూసగుచ్చినట్లు, కళ్ళకు కట్టేట్టుగా సంఘటనలు ఉంటాయి. 1805లో వెంకటగిరి సంస్థానం జమీందారైన 15 సంవత్సరాల మూడవ బంగారు యాచమనాయుడు, కొత్త దివాను సుబ్రహ్మణ్యం చెప్పుడు మాటలు విని, తన సొంత మేనమామ, పూర్వపు దివాను అయిన చెంగాటి పెద్దన్నను అవమానిస్తాడు. పెద్దన్న సకుటంబ, సపరివారంగా ఆత్మహత్య చేసుకొంటాడు. వెంకటగిరి జమీందార్లు రాయించుకొన్న వంశచరిత్రల్లో కూడా వెంకటగిరి కైఫియత్ లోని విషయాలను కాదనలేకపోయారు.

కైఫియత్తులు చరిత్రకు ఆధారాలుగా పనికి వస్తాయి గాని, ప్రధానమైన ఆకరాలుగా (ప్రైమరీ సోర్సెస్‍గా) వాటిని వాడుకోలేము. ఇతర కథనాలను, ఆధారాలను బలపరచడానికి కైఫియత్ కథనాలు ఉపయోగపడతాయి. వెంకటగిరి జమీందారు శ్రీ వెలుగోటి శ్రీరాజగోపాలకృష్ణ 1891లో అచ్చయిన ఈ వెంకటగిరి కైఫియత్ కాపీలన్నీ స్వాధీనం చేసుకొని మూటగట్టించి తమ గ్రంథాలయం సరస్వతీ నిలయంలో ఒక మూల పెట్టించాడు, ఎవరూ చదవకుండా.

కైఫియత్‌ల సంపుటి

1792లో టిప్పు తండ్రి హైదరాలి బహదర్ సేనలు ‘వెంకటగిరి సీమ’ను కొల్లగొట్టి దగ్ధం చేశాయి. ప్రజలు ఈ ఉపద్రవాన్ని ‘బహదరు అవాంతరం’గా గుర్తుంచుకొన్నారు. వెంకటగిరి సీమకు సంబంధించిన ప్రతి కైఫియత్తులోనూ బహదరు అవాంతరం ప్రస్తావన ఉంది. హైదరాలి ‘దౌడు గుర్రాల’ సైనికులు కార్వేటి నగరాన్ని, వెంకటగిరిని తగలబెట్టారు. వెంకటగిరి పట్టణం కాలి బూడిదయింది. సైనికుల అత్యాచారాలకు భయపడి ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రజలు ఊళ్లు విడిచి పారిపోయారు. ఈ అవాంతరం లోనే పరవస్తు వెంకట రంగాచార్యుల పూర్వులు వెంకటగిరి విడిచిపెట్టి విశాఖపట్టణం వలస వెళ్ళారు.

వెంకటగిరి సీమ కైఫియత్తుల్లో క్రీ.శ. 1640 ప్రాంతాల్లో, విజయనగర పాలకుడు మూడవ వెంకటపతి పాలన కాలంలో గోల్కొండ సైన్యాలు తిరుపతి వరకు వచ్చిన ప్రస్తావనలున్నాయి. గోల్కొండ దండయాత్రలో జరిగిన ఘోరాలను, దోపిడిని, శత్రుసంహార శతకం వివరంగా వర్ణిస్తుంది గాని, ఆ శతకకర్త పేరు తెలియలేదు. ఒక కైఫియత్తులో శత్రుసంహార శతకకర్త కలువకాల సీతాపతి అని పేర్కొనబడింది.

1828లో హెచ్.హెచ్. విల్సన్ మెకంజీ కైఫియత్తులకు వివరణాత్మకమైన కేటలాగు తయారు చేయించాడు. 1863లో రెవరెండ్ విలియం టేలర్ 3 సంపుటాల్లో మరొక కేటలాగు తయారు చేయించాడు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ నిడదవోలు వెంకట్రావు పర్యవేక్షణలో కాబోలు, బ్రౌన్ సంపుటాలకు నకళ్ళు తయారు చేయించి భద్రపరిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఆర్కైవ్సు శాఖ 1970 దశకంలో మెకంజీ కైఫియత్ లను మైక్రోఫిల్ము చేయించినా, తగిన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్త చేయలేదని విన్నాము. ఇప్పుడు ఆయా జిల్లాల స్వచ్ఛంద సంస్థలు తమ జిల్లాలకు సంబంధించిన కైఫియత్తులను ముద్రిస్తున్నాయి.

ఒంగోలు కైఫియత్తు

2019లో మెకంజీ కైఫియత్తు సూచి పేరుతో మెకంజీ సంకలనంలోని తెలుగు రాతప్రతులకు ఒక జాబితాను National Mission for Manuscripts, Department of Publication, New Delhi అచ్చు వేయించింది. ఈ సంపుటి సంపాదకులు నదుపల్లి శ్రీరామరాజు. జిజ్ఞాసువులు దీన్ని సంప్రదించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

వంగవోలు జమీందారు రాజా రామభద్రరాజు కైఫియత్తు

ఆనాటి తెలుగు ప్రజల జీవన విధానం, కుల వ్యవస్థ, ఆహారపు అలవాట్లు, జాగ్రఫీ, జాతరలు, పండుగలు, గ్రామదేవతలు, శాసనాలు వంటి అనేక విషయాలు కైఫియత్తుల ద్వారా తెలుసుకోవచ్చు. దాదాపు ఆనాటి వాడుక భాషలోనే ఈ కైఫియత్తులన్నీ గ్రంథస్థమయ్యాయి. మెకంజీ, బ్రౌన్, సర్ అర్థర్ కాటన్ వంటి మహానుభావులు తెలుగు జాతికి చేసిన సేవను ఎన్నటికీ మరిచిపోలేము.

(ఫొటోలు శ్రీ పరుచూరి శ్రీనివాస్, డాక్టర్ ఎం.వి.రాయుడు సౌజన్యంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here