జ్ఞాపకాల తరంగిణి-79

0
12

ఇచ్ఛామతీ తీరాన – అందమైన ప్రయాణం

“The essence of my literature is the depiction of vastness of space and passing of time” అని బెంగాలీ నవలాకారుడు బిభూతిభూషణ్ బందోపాధ్యాయ ఒక మిత్రునికి రాసిన లేఖలో తన సాహిత్య దృక్పథాన్ని వివరిస్తాడు. అనంతమైన ప్రకృతి విలసనాన్ని, కాలం నిదానంగా, మెలమెల్లగా సాగిపోవడాన్ని బిభూతిభూషణ్ ‘ఇచ్ఛామతీ తీరాన’ నవలలో చిత్రించాడు. వివిధ ఋతువుల్లో తన వేగాన్ని మార్చుకొంటూ అవిశ్రాంతంగా సాగిపోయే ఇచ్ఛామతీ ప్రవాహాన్ని మానవ జీవితానికి ప్రతీకగా నిలుపుతూ, రచయిత సాగించిన సత్యాన్వేషణ ఈ రచన. బిభూతిభూషణ్ మిగతా రచనలు వనవాసి, పథేర్ పాంచాలి, అపరాజితుడు, చంద్రగిరి శిఖరం, దూరాంతరం లను కూడా హెచ్.బి.టి. సంస్థ ఇంతకు మునుపే ప్రచురించి తెలుగు పాఠకుల కృతజ్ఞతకు పాత్రమైంది.

నా పదహారవ ఏటనే పథేర్ పాంచాలి సినిమా చూచే అవకాశం లభించింది. తర్వాత పథేర్ పాంచాలి ట్రయాలజీని ఎన్నెన్నో పర్యాయాలు చూచాను. పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‍లో ప్రొఫెసర్ సతీశ్ బహాదూర్ ‘పథేర్ పాంచాలి’ని తరగతుల్లో బోధిస్తే వినే అవకాశం కల్గింది. పథేర్ పాంచాలి, అపరాజిత వంటి సినిమాలను రివరైన్ మూవీలని, ఆ నవలలను రివరైన్ నావల్స్ అని పేర్కొంటారు. తెలుగులో ‘మూగమనసులు’ చిత్రాన్ని రివరైన్ మూవీ అనవచ్చు. డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి నవల ‘వెలుగు వెన్నెల గోదారి’ ఆ విభాగంలో ప్రముఖంగా పేర్కొనదగిన నవల.

ఇప్పటి బంగ్లాదేశ్‍కు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మధ్య ఇచ్ఛామతి చిన్ననది పాయ ఒకటి ప్రవహిస్తోంది. బిభూతిభూషణ్ బందోపాధ్యాయ ఈ ఇచ్ఛామతి నది తీరం వెంట తరతరాలుగా జీవించిన ప్రజల అనుభవాలు, ఆకాంక్షలను తనదైన ‘సౌందర్య దృష్టి’తో ఈ నవలగా చిత్రించాడు. మనుషుల లోని వెలుగు నీడలను, మంచి చెడులను వాస్తవికంగా ప్రదర్శిస్తూ, 1860 ప్రాంతాల బెంగాలీ గ్రామీణ దృశ్యాలను, అక్కడి ప్రకృతిని అద్భుతంగా రూపు కట్టించాడు. గ్రామాల్లోని అగ్రహారీక బ్రాహ్మణుల జీవితం, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, పద్ధతులు, భోజన ప్రియత్వం అన్నీ..

నీలిమందు పంట చాలా లాభాలు తెచ్చిపెట్టడంతో దొరలు, వాళ్ళ తాబేదార్లు, ఏజంట్లు తమ మనుషుల ద్వారా రైతుల చేత బలవంతంగా నీలిపంట సాగు చేయించారు. దివాన్ రాజారాం తెల్లవారి బంటుగా దౌర్జన్యంగా రైతులచేత నీలి సాగు చేయిస్తూ మాట వినని వారిని దండధారులైన తాబేదార్లతో హత్యలు కూడా చేయిస్తాడు.

భవానీ బరూజ్ సాధువులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ, ఏభై ఏళ్ల వయసులో పాంచ్‌పోతా గ్రామానికి వచ్చి స్థిరపడతాడు. రాజారాం వివాహ వయస్సు దాటిపోయిన తన ముగ్గురు చెల్లెళ్లను భవానీకి కట్టబెట్టి, తన అగ్రహారం భూమిని కూడా వరకట్నంగా అతనికి ఇస్తాడు. భవానీ మాదిరే ఆ గ్రామంలో చాలా బ్రాహ్మణ కుటుంబాలు ఏ పన్ను చెల్లించనవసరం లేని అగ్రహారం పొలం మీది అయివోజుతో సుఖ జీవితం సాగిస్తుంటారు. ఆ గ్రామం మధ్యలో చండీ మండపం అతి ముఖ్యమైన ప్రదేశం. పనీపాటా లేనివాళు, బ్రాహ్మణులు ఉదయం నుంచి, రాత్రి వరకు, అక్కడ గుమిగూడి పొగ తాగుతూ, చదరంగం ఆడుతూ పొద్దుబుచ్చుతారు. ఆ ఊరి విప్రులకు బ్రహ్మోత్తర (tax free) భూముల ద్వారా లభించే అయివోజు అన్ని ఖర్చులకూ సరిపోతుంది, కుటుంబ ఖర్చులకు పని చేయాల్సిన అవసరమే ఉండదు.

సుఖ స్వప్నంలా సాగిపోతున్న, ఆ గ్రామీణుల జీవితాలలో లార్డ్ మేయో హత్య (1860), జర్మన్లు నీలిమందుకు ప్రత్యామ్నాయ పదార్థాన్ని ఆవిష్కరించడం, రైతుల తిరుగుబాటు వంటి బయట జరిగిన సంఘటనలు ఊహించరాని పెనుమార్పులు తెస్తాయి. తెల్లదొరలు నీలిపంట సేద్యం కట్టిపెట్టి తమ దేశానికి వెళ్ళిపోతారు. రైతులు తమ ఇష్టం ప్రకారం వ్యవసాయ పంటలు పెడతారు. దేశంలో జరుగుతున్న సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో ప్రభుత్వం దుడుకుగా ప్రవర్తించడం మాని, ఆచితూచి చర్యలకు పూనుకోవలసి వస్తుంది. చాప కింద నీరులా వస్తున్న ఈ మార్పులను పట్టించుకోక, మితిమీరిన ఆత్మస్థైర్యంతో వ్యవహరించిన దివాన్ రాజారాం ప్రతీకార హత్యలో ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది.

ప్రస్తావన వశంగా నవలలో వచ్చే చిన్న చిన్న పాత్రలు కొన్ని మనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భజగోవింద బరూజీ కోడలు నిస్తారిణి భర్త ప్రేమను గాని, అత్తమామల గౌరవాన్ని గాని పొందలేక, చెడు దారి పడుతుంది. భవానీ పెద్ద భార్య తిలోత్తమ సాంగత్యంలో ఆమె సన్మార్గంలోకి వస్తుంది. నయాపాల్ చిరు వ్యాపారి. తెలివితేటలతో ధనవంతుడైనా, ఆ దంపతులు సంస్కారయుతంగా వ్యవహరిస్తారు.

హంతకుడూ, దోపిడిదొంగ అయిన హలాపెకిలో మార్పు వచ్చి సాధు జీవనం అనుసరిస్తాడు. బ్రాహ్మణ గృహిణి ఉగ్రకాళికలా దోపిడిదొంగలను ఎదుర్కుంటుంది. తెల్లదొర ఉంపుడుగత్తె గయ సాధ్విగా పరిణమిస్తుంది. ఆమెను పెళ్ళి చేసుకోవాలని కలలు గన్న అమీన్ ప్రసన్న చక్రవర్తి చివరకు ఆమెకు ఆత్మీయ మిత్రుడవుతాడు. నిరుపేద బ్రాహ్మణ ఆయుర్వేద వైద్యుడు రాం కనయ్ చక్రవర్తి కవిరాజ్ రాజారాం చేతుల్లో చావడానికైనా సిద్ధపడతాడు గాని, అతడు చెప్పమన్నట్లు దొంగసాక్ష్యం చెప్పడానికి మాత్రం ఒప్పుకోడు.

ఈ నవలలో రచయితకు ప్రతినిధి అనిపించే పాత్ర భవానీ చటర్జీ. నవలలో పరిణామాలన్నింటికీ ఇతను వ్యాఖ్యాతగా అనిపిస్తాడు. జీవిత గమనంలో వివిధ దశల గుండా సాగుతూ, తనను తాను సమీక్షించుకొంటూ మార్పును అంగీకరించే సజీవ పాత్రగా అతడు అనిపిస్తాడు. భవానీ ధన సంపాదన కాంక్ష లేని వ్యక్తి. ఉన్నదాంతో సర్దుకుపోతూ జీవితం పట్ల ఒక అద్వైత దృష్టిని, స్థితప్రజ్ఞతను ఏర్పరుచుకొంటాడు.

నవల మధ్య మధ్యలో సమకాలిక సంఘటనలను రచయిత ప్రస్తావిస్తాడు. నార్మన్ బెతూన్ కలకత్తాలో బాలికా పాఠశాల నెలకొల్పడం, లార్డ్ మేయో హత్య, జర్మన్లు నీలిమందుకు ప్రత్నామ్నాయంగా రసాయన రంగును ఆవిష్కరించడం, 1860 రైతుల తిరుగుబాటు వంటివి కొన్ని మాత్రమే.

కన్యాశుల్కం నాటకంలో లాగా బైరాగులు, సన్యాసులు ఆఖాడాలో కూర్చుని గంజాయి పీల్చడం వంటి దృశ్యాలు; పండిన వెలగపళ్ళ వాసన అడవంతా గుబాళించడం, ‘పాంచ్‍పోతా’ గ్రామానికి ఇరువైపులా నీలిపంట సాగు  ఆగిపోయాక, ఆ ప్రాంతమంతా తురాయి, టేకు, కానుగ వృక్షాలతో అడవి వలె మారిందంటాడు నవల ముగింపులో. “..అన్నింటినీ దాటుకుని ఇచ్ఛామతీ నిరంతర వాహిని విశాలమైన ఉప్పునీటి నదినీ, నదీ ముఖద్వారాన్నీ దాటుకుని రామ్ మంగళ్, గంగా సాగర్‍లను దాటుకుంటూ మహా సముద్రం వైపుగా ప్రవహిస్తూనే ఉన్నది” అనే వాక్యాలతో నవల ముగుస్తుంది.

సోదరి శ్రీమతి కాత్యాయని చాలా సమర్థవంతంగా నవలను తెలుగు చేయటమే కాక, పుస్తకం చివర కొన్ని బెంగాలీ పదాలకు వివరణలు ఇచ్చి పాఠకులకు సహాయపడ్డారు. ప్రకృతిని, మనిషిని ప్రేమించే ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకం ‘ఇచ్ఛామతీ తీరాన’.

(పేజీలు 268, వెల: ₹300, ప్రతులకు – హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 040-23521849)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here