జ్ఞాపకాల తరంగిణి-8

2
10

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

నా బాల్యం, కొన్ని జ్ఞాపకాలు

ట్రంకు రోడ్డులో గారడీ ప్రదర్శనలు

[dropcap]బా[/dropcap]ల్యం అంటే నెల్లూరులో సినిమాలు, టౌనుహాల్లో జరిగే సభలు, నెల్లూరు ట్రంకు రోడ్డులో గారడీ ప్రదర్శనలు.

టౌనహాల్ రేబాల లక్ష్మీ నరసారెడ్డి పురమందిరము 1915 ఏప్రిల్ లో కట్టారు

ట్రంకు రోడ్డును పొగ తోటను విడదీస్తూ మల్లప్ప పంట కాలువ. కాలువ దాటడానికి పొగతోట, కొత్త హాలు (సినిమాహాలు) వద్ద మాత్రమే వంతెనలు. ఏనూనో, కందిపప్పో అయిపోతే ఇంట్లో వాళ్ళు బండారు సుబ్బరాయుడు అంగడికి పోయి తెమ్మని పంపేవాళ్ళు. కోఆపరేటివ్ బ్యాంక్ ముందుకు రాగానే అక్కడ జరుగుతున్న గారడీ ప్రదర్శన పిల్లలకు గొప్ప ఆకర్షణ. గుంపులో జొరబడి ముందు వరుసలో కూర్చొనేవాళ్ళం చేతులు కట్టుకొని. కాశిం సాహెబు ప్రదర్శన ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్లీ చూసేవాళ్లం. చాలా మంచి తెలుగు మాట్లాడే 45 ఏళ్ల గారడీ చేసే మనిషి తెల్లని పైజామా, లాల్చీ, తలకు, బుర్ర మీసాలకు వెలిసిపోయి ఎర్రగా మారిన రంగు, చాలా భారీ విగ్రహం, నవలల్లోని ఏ రాజ వంశానికో చెందిన మనిషేమో అని మాకు అనిపించేవాడు. అతని భార్య పూలపూల పైజామా, లేదా చీరె ధరించి నేల మీద గొంతు కూర్చొనే సందర్భానికి తగినట్లు డోలక్ మోగించేది. ఆమె కూడా నిమ్మపండు చాయ మనిషి. కాశిం సాహెబుకు 12, 14 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలు, తెల్లటి పైజామా లాల్చీలు తొడిగి రామలక్ష్మణుల్లా ముచ్చటగా కన్పించేవారు. దాదాపు గంటన్నరసేపు ప్రదర్శన సాగేది. పిల్లలు కూడా కొన్ని గారడీ, మ్యాజిక్‌లు చూపించేవారు. కాశిం సాహెబు చేతుల్లో డమరుకం పదేపదే మోగుతూ ఏదో ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించేది. కాశిం సాహెబు ప్రదర్శన చివర ‘రత్నపురుషరాయి’ అనే ఒక మందును, పగడం మాదిరిగా వున్న రాయిని నీళ్లు పోసిన గాజుగ్లాసులో వేసి ఏభైసార్లు అట్లా తిప్పి తిప్పి, ఆ నీరు తాగితే ఏ రోగమైనా పోతుందనేవాడు. కాశిం సాహెబు హిమాలయాల నుంచి తెచ్చినట్లు చెప్పే ఆ రాయిని పల్లెటూరి జనం ఎగబడి కొనేవారు. రూపాయి చాలా పెద్దమొత్తమే ఆరోజుల్లో. ప్రదర్శన పూర్తై కందిపప్పో, నూనో కొనుక్కొని ఇంటికి వెళ్లేసరికి వంట పూర్తయి, మాకు వీపు మీద రెండు దెబ్బలు పడేవి. కాశిం సాహెబు గారడి చూసిన ఆనందంలో దెబ్బలు ఒక లెక్కలోకి రావు.

1932 ప్రాంతంలో నెల్లూరు వర్ధమాన సమాజం సభ్యులు నెల్లూరు రోడ్ల ప్రక్కన మొక్కలు నాటి పెంచారు. వి. ఆర్. కళాశాల ఎదుట ఇప్పుడు టౌన్ బస్ లు ఆగే చోట, కో ఆపరేటివ్ బ్యాంక్ ముందు, వినాయక సినిమా హాలు గోడవద్ద నాటిన చెట్లు మహా వృక్షాలై గుర్రబ్బళ్లకు, రిక్షావాళ్లకు, గారడీ వాళ్ల ప్రదర్శనలకు నెలవులైనాయి.

వినాయక సినిమా హాల్ నెల్లూరు

గారడీ వాళ్లలో కొందరు ప్రదర్శన చివర తాయెత్తులు అమ్మేవారు. తాయెత్తు వుచితం, కాకపోతే మానవ రక్తంతో శుద్ధి చెయ్యాలి. గారడీవాడు చేతి మీద గాటు పెట్టుకుని తాయెత్తును ఆ నెత్తురుకు తాకించి ఇచ్చేది. గారడీవాడు ఒక రకమైన జీర గొంతుపెట్టి ‘‘వెంకటయ్య నూకలమ్మ పొలమునంత దున్ని దున్ని అలసిపోయి అరుగు మీద పండుకొనియె..’’ అని పాడుతుంటే జనం నవ్వేవాళ్లు. ఆ హాస్యం మాకు అర్ధంకాక పొయ్యేది. ఎందుకు నవ్వుతున్నారో అని అటూ ఇటూ చూసేవాళ్ళం. వెంకటయ్య నిద్రలేచి చూసుకుంటే ‘‘బొడ్లో రూపాలు’’ కనిపించవు. “వాని కాలికొచ్చినదెబ్బ, చేతికొచ్చిన గుద్దు, గల్లుమని రాలెనే రూపాలు’’ అని పాట ముగించేవాడు. గారడీ వాళ్ల మనిషే జనంలో వుండి పిలవగానే స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నట్లు పాల్గొనేవాడు. వాడిని గారడీ ద్వారా నిద్రలోకి పంపి, పైన తెల్ల గుడ్డకప్పి గారడీ ఆరంభించేవాడు. వాడి పొట్ట మీద తాయెత్తులడబ్బా పెట్టి “ఈ బాబు ఏ రంగు చొక్కా తొడుక్కు న్నారు?’’ అంటే ‘ఎర్రరంగు’ అని సమాధానం రాగానే మేమంతా విస్మయంలో.. పెట్టె తీసేస్తే సమాధానం చెప్పలేడు. ‘‘తాయెత్తు మహిమ’’ అని నిద్రలో వున్న అతడు అంటుంటే జనం కూడా నమ్మి తాయెత్తులు కొనేవాళ్లు. చాలా నాటకీయంగా “పొలం గట్టు మీద నడుస్తున్నావు. నాగుపాము పడుకొనివుంది. తొలగి దారిస్తుంది. శత్రువు కత్తితో పొడవబోతాడు, తాయెత్తు మెళ్లో వుంటే వంగి నమస్కారం చేసి తలవంచుకుని వెళ్లిపోతాడు’’ ఇట్లా అద్భుతమైన ఏక పాత్రాభినయం, డోలు, డక్కీల మ్రోత ఒకపక్కన, గొప్ప వాతావరణం సృష్టించబడేది. మరొక సంగతి చెప్పి మా చిన్ననాటి నెల్లూరు వినోదాల సంగతి ముగిస్తాను. కోయదొరల మూలికల ప్రదర్శనలు, పళ్లపొడి అమ్మేవాళ్ల ప్రదర్శన రెండింటిలోనూ వాళ్లు నన్ను ఎంపిక చేసుకొని మూలిక నాచేత నమిలించి చక్కెర తినిపించడం, పళ్ల పొడితో పళ్ళుతోమించి గాజు ముక్కను నాచేత నమిలించడం చేశారు. మూలిక నమిలిన తర్వాత రోజంతా నోటికి రుచి తెలియలేదు. గాజు పెంకు నమిలి వుమ్మి నీటితో నోరు శుభ్రం చేసుకున్నా నాలో ఏదో చెప్పుకోలేని భయం కొన్నాళ్లు. చిన్నపిల్లలు ఇప్పుడు మరో రకంగా మోసపోతారు.

వి.ఆర్.కాలేజీ మైదానంలో

వి.ఆర్. హైస్కూలు, కళాశాల క్రీడా మైదానం

1950-60 మధ్య నెల్లూరులో కుస్తీ పోటీలు తరచూ నిర్వహించేవారు. సుప్రసిద్ధ పహిల్వాన్ లు దారాసింగ్, కింగ్ కాంగ్ వంటి వారంతా నెల్లూరులో జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. నెల్లూరు వి.ఆర్. కాలేజి మైదానంలో ఈ ప్రదర్శనలు సాయంత్రం 4 తర్వాత ఎత్తుగా నిర్మించిన వేదిక మీద నిర్వహించేవారు. చాలా ముందుగానే ప్రచారం, కాటా కుస్తీ అనీ పోటీ కుస్తీ అని ఏవేవో పేర్లు. మా నెల్లూరు వస్తాదు కాంతారావుగారు ఆ రోజుల్లో చాలా పేరు ప్రఖ్యాతి పొందారు. కాంతారావు గారే ప్రదర్శనలను తెరవెనుక వుండి నడిపారో! ప్రదర్శనలు చూడడానికి టికెట్ పెట్టేవారు. పిల్లలం వి.ఆర్.సి మైదానం ప్రక్కన టౌన్ హాల్ ప్రహరీగోడ మీద కూర్చొని, ఎత్తుగా వుండే చెట్ల కొమ్మల్లో కూర్చొని కుస్తీ ప్రదర్శనలు చూసేవాళ్లం. ఈ ప్రదర్శనల గెలుపు ఓటములకు కూడా గారడీ ప్రదర్శనల్లో మాదిరే ఏదో ‘ఏర్పాటు’ వుండి వుంటుంది. తర్వాత కాంతారావు సినిమా నిర్మాత అయ్యారు.

నెల్లూరు కాంతారావు… అంతస్తులు చిత్రంలో రేలంగి, భానుమతి గార్లతో

వామపక్ష భావాలున్న వ్యక్తి. పార్టీ చీలిక తర్వాత CPM ను సమర్థించారు. ఆ రోజుల్లో ఆ భారీ విగ్రహం, ఆ మనిషిని చూస్తే ఏదో గొప్ప ఆకర్షణ. కాంతారావు అన్న కనకం బాబుగారు వి.ఆర్. హైస్కూల్లో మా డ్రిల్లు టీచరు, నిండైన విగ్రహం, తెల్లని చొక్కా, కాకి అర్ధ నిక్కరులో వుండేవారు. పిల్లలను బాగా ఆడించేవారు. వీరి మరొక సోదరుడి కుమారుడే పురంధర్, నా కన్న చిన్నవాడు. స్నేహశీలి. లెఫ్ట్ టు లెఫ్ట్ గ్రూపుల్లో పనిచేస్తూ చాలా సార్లు అరెస్టయి నిర్బంధంలో వున్నాడు. పురంధర్ చాలా సౌమ్యుడు. నాకు బాగా పరిచయం. ఆ కారణంతోనే సర్వోదయ కాలేజీలో విద్యార్థులు, ఇతరులూ నా జోలికి వచ్చేవారు కాదు.

స్వర్గీయ పురంధర్ (రెడ్ షర్టు), నేను, వెనుక సామాజిక కార్యకర్త కుర్రా వసుంధర.

ఈ కుటుంబంలోని పుష్ప రాజ్ నాతో కలిసి పి.యు.సి. చదివి వరంగల్‌లో ఎంబిబియెస్‌లో చేరి మధ్యలో చదువు మానుకొని వ్యాపారాల్లో దిగాడు. రామారావుగారి యోగి వీరబ్రహ్మం సినిమా హక్కులు (జిల్లాకు) కొని బాగా ధనార్జన చేశాడు. ఎంతమందికి జ్ఞాపకం వుందో 1954 లోనేమో, నెల్లూరు వి.ఆర్.కళాశాల ఫుట్.బాల్ గ్రౌండ్.లో ఆలిండియా సాకర్ కప్పు పోటీలు జరిగాయి. జలంధర్ వంటి దూరప్రాంతాలనుంచి టీములు పోటీలో పాల్గొన్నాయి. వారంరోజులు టౌనంతా ఒకే సందడి. దీనికీ టిక్కెట్లు పెట్టారు. షరా మామూలే. టౌన్ హాల్ గోడమీద ఎక్కి కూర్చుని కొన్ని పోటీలు చూచాము. ఆ రోజుల్లో క్రికెట్ ఇంత వేలంవెర్రిగా లేదు. నెల్లూరు, బిట్రగుంట ఫుట్ బాల్ టీంలు అప్పుడప్పుడూ స్నేహపూర్వకంగా పోటీలు పెట్టుకొని ఆడేవి. బిట్రగుంట టీంలో ఆటగాళ్లు ఆంగ్లో ఇండియన్ పిలగాళ్ళే. ఆ దినాల్లో బిట్రగుంట చాలా ముఖ్యమైన స్టేషను. అప్పటికి రైల్వే ఉద్యోగుల్లో సగభాగం ఆంగ్లో ఇండియన్లే. క్రీడల్లో వారి పిల్లలు ముందుండేది.

నెల్లూరుకు పద్మశ్రీ మోదీ రాక.

నా బాల్యంలో గుర్తుండిపోయిన సంఘటన నెల్లూరుకు పద్మశ్రీ డాక్టర్ మోది రాక. 1954లో కాబోలు వారు నెల్లూరు వచ్చి కొన్ని రోజులు పేదప్రజలకు స్వచ్ఛందంగా కంటివైద్యం చేశారు. వి.ఆర్.కళాశాల క్రీడా మైదానంలో వందలవేలమంది వైద్యంకోసం వచ్చిన వారిని నిలబెట్టారు, లైనుగా. మేము హైస్కూలు పిల్లలం వలంటీర్లుగా పనిచేశాము. ఎండలో నిలబడినవారికి మంచినీళ్లు అందించడం వంటి బాధ్యతలు వలంటీర్లం నిర్వహించాము. మోదీగారు బహిరంగంగానే రోగులను పరీక్షించి తమ అనుచరులకు ఏదో చెప్పేవారు. ఆ సూచన ప్రకారం ఒక అచ్చుకాగితం చేతిలో పెట్టేవారు.

అందులో రోగులు మరిన్ని పరీక్షలు చేయించుకోవాలనో, పొరలు ఆపరేషను చేయించుకోవాలనో ఉండేది. నా సొంత అన్నయ్య చెంచురామయ్యకు 16 సంవత్సరాల వయసు నుంచి కంటిచూపు తగ్గిపోవడం మొదలై తన చదువులు అంతటితో ఆగిపోయాయి. పెద్దమ్మవారుపోసి దిగినతర్వాత పూర్తిగా తగ్గకముందే తలస్నానం చేశాడని, అందువల్ల చూపు పోతోందని అనేవారు. అట్లా అయ్యాక ఇంటిపట్టున ఉండకుండా తను ఊళ్ళు తిరగడం మొదలుపెట్టాడు. పండితకుటుంబం, నమకం, చమకం, పురుషసూక్తం, మంత్రపుష్పం వంటివన్నీ తను చక్కగా చెప్పేవాడు కనుక ఎక్కడకు వెళ్ళనా అన్నంపెట్టి ఆదరించేరోజులు అవి. తనను గురించి ఎవరైనా తెలియజేస్తే నాయనో, పెద్దక్కో వెళ్ళి తీసుకుని వచ్చేవాళ్ళు. మాట వినకపోయే సరికి వాణ్ణి వదిలేశారు. సుప్రసిద్ధ కంటివైద్యులు మోది నెల్లూరు వస్తున్నారని తెలిసి ముందుగానే ఇల్లు చేరాడు. అన్నయ్యను వెంటపెట్టుకొని నేను వరుసలో నిలబడ్డాను. గంటల నిరీక్షణ తర్వాత డాక్టర్ మోదీగారు మా అన్నయ్య వద్దకు వచ్చి పరీక్షించి ఏదో రంగుకాగీతం చేతుల్లో పెట్టి కదిలిపోయారు. ఆ చీటీప్రకారం రెండోరోజు సాయంత్రం డాక్టర్ గారు వి. ఆర్.కాలేజీలో ఒక గదిలో కూర్చుని తన పరికరాలతో క్షుణ్ణంగా పరీక్షించి పంపారు. మా అన్నయ్య చాలా ఉత్సాహంగా ఉన్నారు, తన చూపు తిరిగి వస్తుందని. గదివెలుపలికి వచ్చి కాగితం విప్పాను. ఎర్రరంగు కాగితం. అందులో Not curable అని పెద్ద అక్షరాలలో వుంది. అన్నయ్యకు ఏమీ చెప్పలేను. ఆక్షణం నేను ఒక తమ్ముడిగా అనుభవించిన వేదనను వివరించడానికి మాటలులేవు. చివరకు ఎలాగో విషయం చెప్పాను. అన్నయ్య మౌనంగా నావెంట ఇంటికి వచ్చాడు. ఒక్క మాట మాట్లాడలేదు. రెండు రోజుల తర్వాత మళ్ళీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నాయన చనిపోయినపుడు కూడా తను లేడు. నేను SSLC పరీక్షలు రాసిన ఏడు కాబోలు, శ్రీశైలం సమీపంలోని అగ్రహారంలో జ్వరంతో నెలరోజులుగా మంచంపట్టాడని, అతన్ని ఇంట్లో ఉంచుకొని ఆదరిస్తున్న కుటుంబంవారు పోస్ట్ కార్డు రాశారు. మా పెద్దక్కయ్య వెళ్ళి నెల్లూరు తీసుకొని వచ్చి వైద్యం చేయించింది. జ్వరం తగ్గిన తర్వాత అన్నయ్యను మావూరు గొలగమూడి తీసుకొని వెళ్ళారు, కాస్త విశ్రాంతిగా వుంటాడని. దురదృష్టవశాత్తు తర్వాత వారానికే అన్నయ్య పోయారు. మలేరియా తన రక్తాన్నంతా తాగేసింది. తన చామనచాయరంగు దేహం తెల్లగా పాలిపోయినట్లైంది. నా బాల్యంలో ఇదొక మరపురాని విషాదం.

నా శ్రీమతి నేత్రరుగ్మత

ఈ సందర్భంలో ఒకవిషయం చెప్పాలి. నేను మా పెద్దమ్మ మనుమరాలిని చేసుకున్నాను. నా శ్రీ మతికి 32 సంవత్సరాల వయసులో తలనొప్పి మొదలైంది. డాక్టర్లు ఆమె బాగానే ఉందని కంటివైద్యులకు చూపించమనేవారు. దాదాపు నెల్లూరులో చూడని కంటివైద్యులు లేరు, కానీ తన బాధ నివారణ కాలేదు. కొత్తగా MS పాసైన కంటివైద్యుడు ఒకరు పరీక్షించి, గ్లకోమా పరీక్ష చేయించుకోమన్నారు. నెలరోజలు తిరిగాము. ఏకంటి డాక్టరుకూ తీరికలేదు ఆ పరీక్ష చేయడానికి. చివరకు హైదరాబాదు సరోజినిదేవి కంటి ఆసుపత్రికి వెళ్లి చూపించుకొన్న మరుసటిరోజే ఆమె ఎడమకంటికి గ్లకోమా ఆపరేషన్ చేశారు. అప్పటికి ఆమె ఎడమకన్ను చూపు చాలా భాగం పోయింది. తనకు ఓపెన్ యాంగిల్ గ్లకోమా అన్నారు. ఇది చాపకింద నీరులాగ వస్తుంది. 40 సంవత్సరాలుగా ఆమె యల్. వి. ప్రసాద్ కంటివైద్యశాలో సంవత్సరానికి నాలుగు పర్యాయాలు నెల్లూరు నుంచి హైద్ వెళ్ళి పరీక్షలు చేయించుకొని వస్తుంది. నాలుగు పర్యాయాలు ఆపరేషన్లు అయ్యాయి. ఆ విధంగా కొంత చూపును కాపాడుకోగలిగింది.

నా విద్యార్థులు ఇద్దరు ఈ వ్యాధితో అంధులయ్యారు. నీటికాసులు లేదా గ్లకోమా వంశపారంపర్యంగా రాదు, కానీ కొందరు స్త్రీలు తమ సంతానానికి సంక్రమింపజేయగలరు. It is not hereditary, but occurs in families. కుటుంబాల్లో కొంతమందికి రావచ్చు. దీనికి నివారణ లేదుకాని రోగాన్ని అదుపుచేయవచ్చు. మా అన్నయ్యకు బాల్యంలోనే ఓపెన్ యాంగిల్ గ్లకోమా వచ్చివుంటుందని అనుకొంటున్నాను. మా పెద్దమ్మ 60 సంవత్సరాలకు అంధురాలైంది. ఇప్పుడు నాకుమారులలో ఒకరు ఏటా రెండుసార్లు కంటిపరీక్షచేయించుకోవాలి. మా తోడల్లుడి పిల్లలలో ఒకరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గ్లకోమా గురించి ప్రతి పౌరునికి అవగాహన అవసరం.

నెల్లూరు రంగనాయకుల గుడి

రంగనాయకస్వామి తిరునాళ్ల, రథోత్సవం రోజు నెల్లూరులో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించేవారు. రథోత్సవం చాలా ఘనంగా,వైభవంగా జరిగేది. మధ్యాహ్నం మండపం వద్ద రథాన్ని నిలిపేవారు. చిన్న పిల్లలుగా వున్నప్పుడు మండపం మెట్లెక్కి ఆ రథంలోకి ప్రవేశించి దర్శనం చేసుకొని రావడం బలే సరదాగా, ఇష్టంగా వుండేది. ఈ తిరునాళ్లలో రంగుల రాట్నం ఎక్కి తిరగడం కూడా ఆకర్షణే. గరుడసేవ, ముక్కోటి రోజు ద్వార దర్శనం కూడా ప్రత్యేక ఆకర్షణ. నెల్లూరు చుట్టు పక్కల నుంచి వచ్చిన జనంతో టౌన్ సందడిగా వుండేది. కాలేజీ విద్యార్థులు కూడా ఆ జనం మధ్య తిరుగుతూ బలే సరదాగా గడిపేవారు.

రంగనాయకుల రథోత్సవం గూగుల్ ఫోటో

బొమ్మల కొలువులు

దసరా రోజుల్లో 1950- 65 వరకూ కూడా నెల్లూరులో చాలా ఇళ్లల్లో బొమ్మల కొలువు పెట్టేవారు. కొందరు ధనవంతులైన న్యాయవాదులు తదితరుల ఇళ్లల్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుకు పిలవని పేరంటంగా సాధారణ ప్రజలు వెళ్లి చూసే వాళ్లు. చూడవచ్చిన వాళ్ళకు గుగ్గెళ్ళు పెట్టేవారు. సంక్రాంతికి స్త్రీలు గొబ్బెమ్మను పెట్టి, పండుగ తర్వాత, ఊరంతా ఒకే సారిగా ఒకేరోజు, సాయంత్రం గొబ్బెమ్మను ‘వాలాడి’స్తారు. ఆ రోజు పెన్నా సైకతాల మీద రంగు రంగుల చీరెలతో వేల సంఖ్యలో మహిళామణులు, వారి దర్శనార్థం యువకులు చేర్తారు. ఇప్పుడు కూడా ‘గొబ్బెమ్మ’ వాలాడింపు’ రోజు కొన్ని వేలమంది మహిళలు పెన్నా తీరంలో కనిపిస్తారు.

నిప్పులగుండం

మా బాల్యంలో మరొక ఆకర్షణ నెల్లూరు మూలాపేట శివాలయం వెనుక వున్న ధర్మరాజ స్వామి ఆలయంలో నిప్పుల గుండం తొక్కడం. ధర్మరాజు ఆలయంలో ద్రౌపదీదేవి అగ్నికుల క్షత్రియుల ఆరాధ్య దేవత, మత్స్య కారులే అగ్నికుల క్షత్రియులు. ఈ ఆలయంలో పాండవులు, శ్రీకృష్ణుడు, ద్రౌపది విగ్రహాలున్నాయి.

నెల్లూరు ధర్మరాజు దేవళం

గూడూరులో కూడా ధర్మరాజస్వామి గుడివుంది. నెల్లూరులో మూడేళ్లకొకసారో, ఏడేళ్లకొకసారో గుడి ఎదురుగా విశాలమైన ఖాళీస్థలంలో క్రికెట్ మ్యాట్ అంత సైజులో పెద్ద గుండం వేస్తారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన పల్లెవాళ్లు గుండం తొక్కుతారట. నెల్లూరు జిల్లా కలెక్టర్ బట్టర్ వర్తు ఆత్మకథ ‘‘సౌత్ ల్యాండ్ ఆఫ్ శివా’’ (South Land of Siva) లో నిప్పుల గుండం తొక్కడాన్ని వివరంగా వర్ణించారు. ఆ రోజు ఒక యువకుడు అర్జునుడి వేషంలోనో, కృష్ణుడి వేషంలోనో ఒక ఎత్తైన స్తంభం మీదికి ఎక్కి నిమ్మపళ్లు జనం మీదికి విసురుతాడు. ఆ పళ్లు దొరికిన వాళ్లు చాలా అదృష్టవంతులని పేరుపడింది. నేనెప్పుడు గుండం తొక్కడం చూడలేదు. ధర్మరాజస్వామి ఆలయాలు నెల్లూరు జిల్లా దాటిన తర్వాత కనిపించవు. ఇది తమిళదేశ సంప్రదాయంగా అనిపిస్తుంది. తమిళనాడులో ద్రౌపది, ధర్మరాజుల ఆలయాలు కనిపిస్తాయి. ఈ అగ్నికుల క్షత్రియులైన ఆలయ పూజారులు ఆలయం వీధిలోనే నివాసం. ఇప్పటికీ వీరు మంత్రించిన మాల వేస్తారు. జిల్లేడు ఆకు తొడిమలను నూలు దారంతో కట్టి చిన్న దండగా చేస్తారు. ఉదయం పూట జ్వరం, పసిరికల రోగులకు, ఇతర రోగులకు, ముఖ్యంగా పసిబిడ్డలకు ఈ దండ వేయించడం అనే ప్రక్రియ ఇప్పుడు కూడా అనూచానంగా సాగుతుతూంది. పదో పరకో మంత్రించిన దండ వేసినందుకు తీసుకుంటారు. నా యవ్వనంలో ఈ ధర్మరాజస్వామి పూజారి రాజసింహ బాగా ప్రసిద్ధుడు. కొంతకాలం మునిసిపల్ కౌన్సిలర్ కూడా. ఈ కుటుంబాలు రంగులతో బొమ్మలు చిత్రించి పటాలు అమ్ముతారు. రాజసింహ చిత్రించిన తైలవర్ణ చిత్రాలు బాగా ప్రసిద్ధి.

నిప్పుల గుండం తొక్కడం అంటే మా గొలగమూడిలో మొహరం నాడు నిప్పుల గుండం తొక్కడం గుర్తొచ్చింది. హిందువులు కూడా మొహరం రోజు నిప్పుల గుండం తొక్కేవాళ్లు. ఇప్పుడు మొహరం రోజు గుండం తొక్కడం అన్ని చోట్లా మానుకున్నారు. సున్నీ మతస్తుల ప్రాబల్యం అధికం కావడం వల్లే మొహరం వెనకబడి పోయిందనుకుంటా. ఇక్కడే మరొక విషయం చెప్పాలి. రంజాన్ సందర్భంలో నెల్లూరులో ముసల్మానులు పులివేషాలు వేసి ప్రదర్శనలిచ్చేది. దసరాలలో హిందువులు పులివేషం వేసి ప్రదర్శనలిచ్చేవాళ్లు. ఈ పులివేషం హక్కు మాదంటే మాదని రెండు మతాలవాళ్లు కొట్టుకుచచ్చారు. ‘గలాటా’లు జరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వం మొదట మహమ్మదీయులను సమర్థించినట్లుంది. మొత్తం మీద ఘర్షణలను నివారించడానికి పులివేషం వెయ్యడం నిషేధించారు. జిల్లాకు బ్రిటిష్ కలెక్టర్లనే నియమించి ‘శాంతిని కాపాడారు.’ 1948-49 లో కాబోలు చివరిసారి ఘర్షణల్లో ఒకరెవరో చనిపోయారు. ఇప్పుడు ముసల్మాన్ల పులివేషాలూ లేవు. ఆ దసరా వేషాలూ లేవు. 1950 -60 ప్రాంతం వరకు ముస్లింలు అధికంగా వున్న జండా వీధి వంటి వీధుల్లో తిరగాలంటే ఏదో తెలియని గుబులు, భయం. ఇప్పుడు నాకు ఎందరో ముస్లిం మిత్రులు. అదంతా గతచరిత్ర, ఈ తరాల వారు ఎరగనే ఎరగరు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here