జ్ఞాపకాల తరంగిణి-80

0
9

యోగవాశిష్టం నుంచి లవణరాజు కల – కథ

(Time Space Paradox – Full Story of King Lavana and The Sorcerer – From YogaVasishta – Ashutosh Chawla Blog ఆధారంగా)

లవణరాజు కల – కథ

1. లవణరాజు – మాంత్రికుడు:

సభలో ఆగంతకుడు తన మాంత్రిక శక్తులను గురించి చెప్పుకుంటూ, ఎటువంటి మాయనైనా ప్రదర్శించగలనని అంటుంటే, లవణరాజు అతని వైపు సందేహాస్పదంగా చూచారు. ముఖంలో ఎటువంటి భావం కన్పించనీయకుండా, లవణరాజు తన లోపల నవ్వుకొన్నారు.

2. మాంత్రికుడు:

లవణరాజు సభాసదుల ముఖాల వైపు ఒక్కసారి పరిశీలనగా చూచారు. మంత్రుల కళ్ళల్లోను అదే అనుమానాస్పదమైన భావం వ్యక్తమవుతోంది. కొందరు సభాసదులు మాంత్రికుణ్ణి చూచి రకరకాలుగా స్పందించారు. మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యకుండా కొందరు పైకి నవ్వారు, కొందరు కళ్ళు మూసుకొన్నారు, మరికొందరు తమ ఇష్టదేవతల పేర్లను మనస్సులో స్మరిస్తూ భయంతో వణికారు. కొందరు రాజుగారిపై నమ్మకముంచి ఆయన వంక చూచారు.

అసహజంగా, వింతగా కన్పిస్తోన్న మాంత్రికునివైపు లవణరాజు పరిహాసంగా చూచారు. మాంత్రికుడు సభలో తన శక్తులు ప్రదర్శించడానికి రాజుగారి అనుజ్ఞ కోరాడు.

మాంత్రికుడు రంగురంగుల ఈకలతో అలంకరించి ఉన్న తురాయి ధరించి ఉన్నాడు. బహుశా తనను గుర్తుపట్టకుండా ఉండడానకేమొకేమో అతను ముఖానికి ఎర్రరంగు పులుముకొన్నాడు. అతని ముఖంలో సగభాగాన్ని నల్లని మీసాలే ఆక్రమించి ఉన్నాయి. కళ్ళు ఎర్రగా అసాధారణంగా ప్రకాశిస్తున్నాయి. మాంత్రికుడి భుజం మీద ఎక్కిన ఒక పంచరంగుల చిలక అతను మాట్లాడే ప్రతి వాక్యంలోని చివరి మాటను కీచు గొంతుకతో తిరిగి పలుకుతోంది. ఆ వాతావరణం ఏదో కృత్రిమంగా, అసాధారణంగా అనిపిస్తోంది. మాంత్రికుడు రెండు చేతులతో నెమలీకల కట్టను దృఢంగా పట్టుకొని ఉన్నాడు – ఆ ఈకలు ఏ మాత్రం చలించినా పెద్ద ప్రమాదం సంభవిస్తుందన్నట్లు.

“నీవు సృష్టించే మాయతో నా కళ్ళు కప్పగలవా?” ఎట్టకేలకు లవణరాజు పెదవి విప్పి, మాంత్రికుడి చేతుల్లోని నెమలీకల కట్టను ఎగాదిగా చూస్తూ ఎగతాళిగా అన్నారు. ఆ మాటలు మాంత్రికుడిని, అతని చేతుల్లోని నెమలీకల కట్టను పరిహసించినట్లనిపించింది. మాంత్రికుడు లవణరాజు గారి పరిశీలనాత్మకమైన చూపులను పట్టించుకోకుండా, రాజుగారి వైపు చూచి, ఒక చిరునవ్వు నవ్వి “మీరు నాకు అనుజ్ఞ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా?” అన్నాడు.

సలహా కోసమన్నట్లు ఒకసారి లవణరాజు మంత్రిగారి వైపు చూపులు సారించారు. మాంత్రికుడి మాటల్లో నమ్మకం కుదరక, లవణరాజు గారిని చూచి నవ్వాడు. సాధారణ సభాసదులకు కాస్త వినోదం కలుగుతుందనే అభిప్రాయంతో, వీధుల్లో ప్రదర్శనలిచ్చే ఆ దేశద్రిమ్మరి గారడీ వాడి ప్రదర్శన వల్ల అపాయమేమీ ఉండదని భావించి, లవణరాజు అంగీకార సూచకంగా, తల పంకించారు.

3. గారడీ ప్రదర్శన:

మాంత్రికుడు రాజుగారి పట్ల మహా విధేయత ప్రదర్శిస్తున్నట్లుగా పైకి నటిస్తూ నమస్కరించి, తన శక్తియుక్తులను తక్కువగా భావించే వారెవరైనా సభలో ఉన్నారా అని తీక్షణమైన చూపులతో నలువైపులా పరికించి, నాలుగడుగులు ముందుకువేసి సింహాసనం ఉన్న ఎత్తైన వితర్ది మెట్ల వద్ద ఆగి, గుడ్లు మిటకరించి చూస్తూ అలా నిలబడ్డాడు. నెమలీకల కట్టను చేతులతో పట్టుకొని నిలబడ్డ మాంత్రికుణ్ణి కాస్త సంతోష పెట్టడానికన్నట్లు లవణరాజు కూడా అతని వైపు తదేకంగా చూస్తున్నారు. మాంత్రికుడు ప్రదర్శించబోయే గారడీ తమ చూపుల నుంచి ఎక్కడ తప్పించుకుంటుందో అన్నట్లు సభాసదులు నిశ్శబ్దంగా అతడి వైపే చూస్తున్నారు.

చీమ చిటుక్కుమన్నా వినబడే నిశ్శబ్దం సభలో. మాంత్రికుడి పెదవుల నుండి సన్నగా, అస్పష్టంగా, ఏవో శబ్దాలు వెలువడుతున్నాయి. మాంత్రికుడు ఏవో వింత మాటలను బాగా స్వరం తగ్గించి ఉచ్చరిస్తున్నాడు. సింహాసనానికి రెండు వైపులా నిలబడి వింజామరలు వీస్తున్న అందమైన కన్యలు ఇద్దరూ ఆకస్మికంగా ఏదో చలిగాలి వీచినట్లు భయంతో కళ్ళు మూసుకొన్నారు.

ఒక్కసారిగా మాంత్రికుడు నెమలీకల కట్టను రాజు సముఖంలో ఊపసాగాడు. సభాసదనం వెలుగుల మెరుపులతో నిండిపోయింది. ఏం జరుగుతుందో అన్నట్లు సభాభవనంలో కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలముకొంది గాని రంగురంగుల వెలుగు బిందువులు అంతటా తేలుతున్నాయి తప్ప మరేమీ కన్పించలేదు.

మొత్తం ప్రపంచం తన చెప్పుచేతల్లో ఉన్నట్లు మాంత్రికుడు వ్యవహరిస్తున్నాడు. భయవిహ్వలులైన సభాసదుల పెదవులపై విరిసిన దరహాసం మరుక్షణంలో మాయమయింది. తమ ప్రియతమ ప్రభువుకలా జరిగిందేమిటని అందరూ విస్తుపోయారు.

4. రాజుగారు:

రాజుగారు సింహాసనంపై శిలావిగ్రహంలాగా కదలికలు లేకుండా ఉండిపోయారు. ఆయన కన్నులు తెరచుకుని ఉండి, తన ముందు ఏదో అదృశ్యంగా ఉన్న వస్తువును చూస్తున్నట్లనిపించింది. కనీసం క్షణకాలమైనా ఆయన రెప్పలార్పలేదు. చిత్రంలోని మనిషి కళ్ళలాగా రాజుగారి కళ్ళు అలా తెరచుకొనే ఉండిపోయాయి. రాజుగారు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటి నుంచీ ఎరిగిన ముసలి మంత్రి రాజ సింహాసనం వద్దకు పరుగెత్తి, ఆయనను తనచేతులతో స్పృశించి, రాజు సజీవంగా ఉన్నట్లు గ్రహించారు. రాజు గారి గుండె ఆగిపోలేదు, కొట్టుకుంటూనే ఉంది. ఆయన నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస పీలుస్తున్నారు గానీ శరీరంలో కొంచెం కూడా చలనం లేదు.

మంత్రిగారు రాజుగారిని మాటిమాటికీ కుదుపుతూ పేరుపెట్టి పిలుస్తున్నారు. రాజుగారిలో ఏ మాత్రం కదలిక లేదు. ఆయన ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లనిపించారు.

సభాసదుల వైపు తిరిగి నిశ్శబ్దంగా ఉండమని మంత్రిగారు సైగ చేశారు.

ఒక్కసారిగా సభలో ‘అయ్యో, అమ్మో’ శబ్దాలన్నీ నిలిచిపోయాయి, నిశ్శబ్దం అలముకొంది.  ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా రాజుగారివంక చూస్తున్నారు. అందరి చూపులు రాజుగారి పైనే.

మంత్రులు బాగా కంఠం తగ్గించి తమలో తాము ఏదో చర్చించి, ఏం చెయ్యాలో తోచక, అశక్తులై ఆందోళన పడుతూ తమ తమ స్థానాల్లో కూర్చుని వేచివున్నారు.

ఈ విధంగా రెండు గంటలు గడిచిపోయాయి.

అకస్మాత్తుగా రాజుగారి శరీరంలో చలనం ఆరంభమై,  దేహం పైకిలేచి దేనిపైకో ఎగిరి దూకుతున్న చందంగా కంపించసాగింది. ఆయన శరీరం సింహాసనం మీద నుంచి తూలి పడబోయింది.

రాజుగారిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్న అంగరక్షకులు ఒక్క ఉదుటన ముందుకు వచ్చి, బలిష్ఠమైన బాహువులతో ఆయనను పడిపోకుండా పట్టుకొని, మెల్లగా సింహాసనంపై కూర్చోబెట్టారు. రాజుగారి దేహం నుంచి స్వేదధారలు ప్రవహిస్తుంటే, ఆయన మెల్లగా స్పృహలోకి వచ్చారు.

ఆయన దేన్నో వెదుతుకున్న చందంగా చుట్టూతా తలతిప్పి చూచారు గాని ఎవరినీ గుర్తు పట్టినట్టు లేదు; ఏదో గందరగోళంలో ఉన్నట్లనిపించింది.

రాజుగారి దేహం నుండి స్వేదజలం ధారాపాతంగా స్రవిస్తోంది. మంత్రులందరూ ఆందోళనతో సింహాసనం చుట్టూ నిలబడి ఉన్నారు. కొందరు అస్థానులు ఆ దుష్ట మాంత్రికుణ్ణి వెదకి పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికిపోగులు పెట్టేందుకు సిద్ధమయ్యారు కూడా.

రాజుగారు అస్పష్టంగా ఏవో మాటలు గొణిగినట్టు అన్నారు. అంతా తన చుట్టూ మూగి ఉండడం చూచి ఆయన కాస్త భయపడినట్లనిపించింది.

వృద్ధమంత్రి రాజుగారి మనస్సులోని గందరగోళాన్ని అర్థం చేసుకొన్నట్లుంది; రాజుగారి ఆత్మీయులైన ఒకరిద్దరిని తప్ప, మిగతావారందరినీ అక్కడ నుంచి పంపించి వేశారు.

“మీరంతా ఎవరు? నేనెక్కడ ఉన్నాను? ఎవరి ఆస్థానం ఇది? నా భార్యా బిడ్డలేరి? వాళ్ళనేం చేశారు?” రాజు దయాహృదయుడైన వృద్ధమంత్రిని ప్రశ్నించారు.

వృద్ధ మంత్రి దయతో కూడిన చల్లని మాటలతో రాజుగారిని ఓదార్చి, అద్దాన్ని తీసుకురమ్మని పక్కనే నిలబడి ఉన్న దాసీకన్యను ఆజ్ఞాపించారు.

అన్నీ తనకు తెలుస్తున్నట్లు రాజుగారి కన్నులు మెరిసాయి. ఆయన పెద్దగా నవ్వడం ఆరంభించి, మళ్ళీ పూర్వపు మహారాజు మాదిరే వ్యవహరించడం మొదలుపెట్టారు.

5. మహారాజుగారు మంత్రిని ప్రశంసించుట:

మహారాజు గారు తన గదిలో పానీయం సేవిస్తూ కాస్త  బలం పుంజుకుని సుఖాసీనులై ఉన్నారు. వారి ఆత్మీయ మిత్రులు, మంత్రులు వారి వారి స్థానాల్లో ఆసీనులై, ఆయన తన అనుభవాలను వివరిస్తే వినాలని కుతూహలంగా ఉన్నారు. రాజుగారు మర్యాదాపూర్వకంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపైన వృద్ధ మంత్రి ఆసీనులై ఉన్నారు.

మహారాజు గారు చైతన్యాన్ని తిరిగి పొందగానే, మాంత్రికుడు మళ్ళీ సభలో అందరికీ కన్పించి, కొంచెం వినోదంగా మహారాజు గారి వంక చూస్తూ, నిశ్శబ్దంగా తన ఆసనంలో ఆసీనుడై ఉన్నాడు. అతని ఎర్రని కళ్ళల్లో ఏదో తుంటరి నవ్వు ద్యోతకమవుతోంది.

“ప్రియ నేస్తమా! మిమ్మల్ని అభినందిస్తున్నా! మీరు ప్రదర్శించిన గారడీ విద్యను మెచ్చుకొంటున్నా! ఇతరులను మాయామోహంలో ముంచే విద్యలో మీరు ఆ నారాయణుడి కంటే తక్కువేమీ కాదు. చాలా గొప్పగా ఉంది మీ గారడీ!” అంటూ మహారాజు మంత్రుల వంక చూచి తల పంకించారు. మరుక్షణమే వజ్ర వైడూర్యాలు, స్వర్ణాభరణాలు నింపిన పళ్లేలతో అక్కడికి వచ్చిన దాసీకన్యలు ఆ పళ్ళేలను మంత్రి ముందుంచి ఒక మూలకు వెళ్ళి నిలుచున్నారు.

“మహానుభావా! మీరు ప్రదర్శించిన విద్య ఈ ఆభరణాల కన్నా అమూల్యమైనది. దయచేసి వినయపూర్వకమైన ఈ పురస్కారాలను అంగీకరించండి!” అంటూ మహారాజుగారు మాంత్రికుణ్ణి అర్థించారు.

“మీకు కావలసిందేదైనా అడగండి. మీ కోర్కెను తీర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా” మహారాజు వినయంగా అర్థించారు.

“రాజా నాకీ బహుమతులేవీ అవసరం లేదండి! నా కర్తవ్యాన్ని నిర్వహించానండి!” – తన ఆసనం నుచి లేచి, రాజుగారికి నమస్కరించి మాంత్రికుడు వినయంగా అన్నాడు.

“దయచేసి నాకు సెలవు ఇప్పించండి” అంటూ మాంత్రికుడు మరొక పర్యాయం తన చేతుల్లోని నెమలీకల కట్టను గాలిలోకి ఊపాడు. అంతే, అతను నిలబడిన చోట ఫెళ్ళున ఒక మెరుపు, మరుక్షణంలో అతను అంతర్ధానమయ్యాడు.

6. మహారాజు తన కథ వివరించుట:

“మహారాజా! అసలేం జరిగింది? మీకేమయింది? దయచేసి జరిగినదంతా వివరంగా మాకు చెప్పండి!” మహారాజు సముఖంలో ఆసీనులైన వృద్ధమంత్రి అడిగారు.

మాంత్రికుడు నిలబడ్డ వైపు ఆశ్చర్యంగా చూస్తూ; చూపు మరల్చకుండా ఉన్న మహారాజు తన జవాబు కోసం కుతూహలంగా వేచి ఉన్న మంత్రులవైపు  ముఖం తిప్పి, తాను చైతన్యాన్ని కోల్పోయినప్పుడు జరిగినదంతా గుర్తు తెచ్చుకోడానికా అన్నట్లు క్షణకాలం కళ్ళు మూసుకొని, మళ్ళీ కళ్ళు తెరచి మాట్లాడారు.

“మాంత్రికుడు నెమలీకల పింఛాన్ని ఊపినపుడు సభా భవనమంతా చిత్రవర్ణాల వెలుగుల మెరుపులతో నిండిపోవడం అందరూ చూచే ఉంటారు. మెరుపుల కాంతి మాయమైన తర్వాత నేనొక అద్భుతమైన అశ్వరాజం పక్కన నిలుచొని ఉన్నట్లనిపించింది. ఇంద్రుడి ఉచ్చైశ్రవానికున్న ఉత్తమ లక్షణాలన్నీ ఆ అశ్వానికి ఉన్నాయి. దాన్ని చూడగానే నేనెంత మోజు పడ్డానంటే, దానిపై కొంచెం సేపు స్వారీ చెయ్యాలనిపించింది. నిండు పేరోలగం, మాంత్రికుడు, నా రాజ్యం అన్నీ మరచిపోయాను. నా మనస్సులో ఆ ఒక్క కోరిక తప్ప, మరో ఆలోచన లేదు. ఒకసారి దానిపై స్వారీ చెయ్యాలి!

దానిపై అధిరోహించిన మరుక్షణమే, ఆ అశ్వాన్ని విశ్వసించి పెద్ద తప్పు చేశానని గ్రహించాను. మెరుపు వేగంతో అది దౌడుతీస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎలాగో కూర్చోడం తప్ప, నేను దాన్ని అస్సలు అదుపు చేయలేక పోయాను. అది ఎంతకాలం అట్లా దౌడుతీస్తూ ఉందో, ఎక్కడెక్కడ తిరిగిందో, ఎంతసేపు నేను దాన్ని స్వారీ చేస్తూ ఉన్నానో నాకు తెలియదు. నేను బాగా అలసిపోయి, ఆకలితో ఉన్నాను. అశ్వం ఆగకుండా పరిగెత్తుతూనే ఉంది.

ఏ ఏ పట్టణాల గుండా, ఊళ్ళ గుండా అది పరుగు తీసిందో నేనెరుగను. ఎండ వేడికి వేడెక్కిన ఇసుక ముఖంపై పడుతోంటే నేనేవో విశాలమైన ఎడారి ప్రాంతాల గుండా వెళ్తున్నట్లు గ్రహించగలిగాను. ఈ పరుగుకు కొనా మొదలు లేదనిపించింది. అసంఖ్యాకమైన మహావృక్షాలు, ముళ్ళ పొదలతో నిండిన అరణ్యప్రాంతం గుండా అశ్వం దౌడుతీస్తున్నట్లు నాకు స్ఫురించింది.

అశ్వం ఒక చెట్టు కింద నుంచి వెళ్తున్న సమయంలో ‘ఇదే అవకాశం, మళ్ళీ రాద’ని నిశ్చయించుకుని లతలు అల్లుకొని ఉన్న చెట్టుకొమ్మను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని వేలాడాను. అశ్వం అరణ్యంలోని చీకటిలోకి అదృశ్యమైంది. అప్పటికే చీకట్లు ముసురుకొంటున్నాయి. దట్టమైన చీకటిలో నా చేతులే నాకు అగపడలేదు. ఎలాగో ఆ కొమ్మ పైకి ఎక్కి, కింద పడిపోతాననే భయంతో అడవి తీగలను చేతులతో గట్టిగా పట్టుకొని కూర్చొన్నా, దగ్గరలోనే పాము బుస పెడుతున్నట్లు, ఏదో కదులుతున్నట్లనిపించింది. ఆ రాత్రి ప్రమాదం నుంచి బయటపడడానికి ఊపిరి బిగపట్టి రాత్రంతా కదలకుండా బొమ్మలా ఉన్నాను. నా జీవితంలో అంత సుదీర్ఘమైన కాళరాత్రి మరొకటి లేదు. భయంతో గడ్డకట్టుకుని పోయిన నా దేహం శీత పవనాలకు మరింత బిగుసుకొని పోయింది. మనసును విస్మృతి ఆవరించి నేనెవరినో పూర్తిగా మరిచిపోయాను. నా మెదడు మొద్దుబారిపోయింది.

సింహం సంచరించే ప్రదేశంలో లేడిపిల్ల భయంతో వణికినట్లు వణికిపోతూ రకరకాల క్రిమికీటకాలు కుడుతుంటే సహించహిస్తూ అలసి సొలసి, ఆకలితో అలమటించిపోయాను. నోరెండిపోతోంది, కాస్త ఆహారం, మంచినీళ్ళు దొరికితే ఒట్టు!

కఠోర పరిశ్రమతో సాధించిన జ్ఞానం, నా యుద్ధకౌశలం అన్నీ మరచిపోయాను. నా కుటుంబం పేరు, నా దేశంపేరు కూడా గుర్తు లేవు. ఏదో విధంగ బతికుండాలనే ఇచ్ఛతో సజీవంగా ఉన్న మానవ మృగాన్ని నేను!

7. మహారాజు తన కథ వివరించుట:

సూర్యోదయం కాగానే అనంతమైన కాళరాత్రి మటుమాయమై పోయింది. నేనెక్కడ ఉన్నానో తెలిసింది. సాలీడు తన కాళ్ళను విస్తరించినట్లు నేనున్న జంబూక వృక్షం తన శాఖలను అరణ్యంలో అన్ని వైపులకూ విస్తరించింది. చెట్టు తొర్రలో చాలా పాములున్నాయి.

వెంటనే చెట్టుపై నుండి కిందకి దూకాను. వంటిపై చీలికలు, పేలికలైన బట్టలు. ఎలాగో మానాన్ని కాపాడుకొన్నా. ఇంకా నాలో సిగ్గు, బిడియం వంటి భావనలు ఎక్కడో మిగిలి ఉన్నాయి.

నా ఒళ్ళంతా చీరుకునిపోయి, కొన్ని శరీర భాగాలు నెత్తురోడుతున్నాయి; కొన్ని వాచాయి. బహుశా ఏ కొమ్మో కంటికి తగిలి ఉంటుంది; కన్నొకటి ఉబ్బి మూసుకొని పోయింది.

ఎక్కడికి పోవడం? ఎటు చూచినా ముళ్ళపొదలు, మహా వృక్షాలు. చెట్ల కొమ్మల్లోంచి పిట్టల కిలకిలరావాలు, కీటకాల సంగీతం వినిపిస్తోంది. పురుగులు నా చుట్టూ మూగుతోంటే ముళ్ళకొమ్మ చేతిలోకి తీసుకొని వాటిని చెదరగొడుతూ, నడక సాగించాను.

నా మనసులో ఒకే ఆలోచన, ఆహారం గురించిన ఆలోచన. ఏవో ఆకులూ, అలములూ తినడానికి ప్రయత్నం చేస్తే, ఘోరమైన చేదు, నోరంతా చెడిపోయింది. విషపుటాకుల రసం వల్ల నాలుక పుండు పడిపోయింది. ఏడవను కూడా కళ్ళల్లో కన్నీళ్లు మిగలలేదు. పాదాలను ముళ్ళు చీరేస్తున్నాయి. దారి కడ్డంగా ఏవో తీగలు, నా ముందు పాములు విసవిసా పారిపోతున్నాయి.

నడక సాగించాను, చాలా దూరం నడిచాను. శక్తిహీనుడనై నేలపై పడిపోతే, ఏ క్రూరమృగానికి ఆహారమవుతానోననే భయంతో లేచి మళ్ళీ నడక సాగించాను.

8. చండాల కన్య:

అరణ్యంలో ఎంత కాలం నడిచానో తెలియదు. మరణం ఆసన్నమయ్యే వరకు నడుస్తూనే ఉండాలని నిశ్చయించుకొన్నాను. చావుకు ఎదురు చూడడం తప్ప మరో గమ్యం లేదు. ఈ అరణ్యంలో ఏదైనా ఆహారం దొరకటం అసాధ్యం. మనసులో ఏ దేవతలను ప్రార్థించలేదు. మానవ రూపంలో సంచరిస్తున్న మృగాన్ని.

అట్లా నడుస్తూ ఒక మహావృక్షం కింద కూలబడి కాసేపట్లోనే నిద్ర వంటి మగతలోకి జారుకున్నాను.

సమీపంలో ఏదో శబ్దం నన్ను మేల్కొలిపింది. కళ్ళు విప్పి ఆ పొదల గుండా పరికించాను,

ఆశ్చర్యం! అడవి దారిన ఒక బాలిక నడచిపోతోంది. ఆమె నల్లటి శరీర వర్ణాన్ని, పొట్టిగా, లావుగా ఉన్న ఆమె రూపాన్ని, ఆ మురికి శరీరాన్నించి వస్తున్న చెమట వాసనను నేను ఆస్వాదించలేదు. నిలకడ లేకుండా అటు ఇటూ చలిస్తున్న కనుగుడ్లతో వికృతంగా ఉన్న ఆమె రూపాన్ని నేను గమనించలేదు. ఆమె చేతిలో అన్నం బుట్టను చూచి, ఆ భోజనం వాసన మాత్రమే ఆఘ్రాణిస్తున్నా.

ఒకే ఉదుటన ఆమె ముందుకు గెంతి, ఆమె ముందు నిలబడ్డాను. ఆకస్మికంగా అక్కడ ప్రత్యక్షమైన నన్ను చూచి ఆమె భయంతో కేక వేసింది. ఆహారం బుట్ట వైపు చూస్తూ, కుక్క యజమానురాలిని ఆహారం కోసం అర్థించిన చందంగా అన్నం పెట్టమని ఆమెను అర్థించాను.

ఆమె ఎగాదిగా నా మొహం వైపు చూచి, నేను వాస్తవంగా మనిషినేనా అని తెలుసుకోడానికి కాస్త గట్టిగా నా బుగ్గ గిల్లగానే, బాధతో అరుస్తూ, అన్నం పెట్టమని అర్థించాను.

ఆమె నవ్వుతో కాలితో నన్ను తొలగదీసుకొని వెళ్ళిపోతోంది. ఆమె వెంటపడి అన్నం పెట్టమని యాచిస్తున్నాను. ఆమె నా వైపు ఏదో కొత్తగా చూచింది.

ఆమె ముఖం ఎర్రగా ఉండి, ఏదో భూతంలా అనిపించిది. పొలంలో పని చేస్తున్న తన తండ్రి కోసం అన్నం తీసుకొని పోతున్నట్లు, ఆ అన్నాన్ని ఇతరులెవరికీ ఇవ్వడానికి సాహసించలేనని, నా వంక తిరిగి అన్నది. ఎట్లాగో నాకు తెలీదు, ఆమె పుట్టి పెరిగిన పల్లెలోనే నేనూ పెరిగి పెద్దవాడినైనట్టు ఆమె పలికిన మాటలన్నీ నాకర్థమయ్యాయి. లోపలికి పోయిన నా పొట్ట చూపించి, అన్నం పెట్టమని ఆమెను మళ్ళీ మళ్ళీ యాచించాను.

“చూడు! ఈ భోజనాన్ని నా భర్త కొక్కడికే ఇవ్వగలను. పుట్టబోయే నా బిడ్డకు తండ్రిగా ఉండడానికి నీకిష్టమేనా?” – ఆమె నా వంక జాలిగా చూస్తూ అన్నది.

నేను కాస్త సంకోచించాను.

“మా నాయన మా మాలపల్లెకు పెద్ద. నన్ను పెళ్ళాడితే, రోజుకు మూడుసార్లు నీకిష్టమైన భోజనం తినచ్చు.” అంది. ఆమె అన్నం మాట ఎత్తగానే నా నోరూరింది. నాకు మరొక జన్మ లభించినట్లయింది. నా ధ్యాసంతా అప్పుడు అన్నం పైన తప్ప మరొకదాని మీద లేదు.  అన్నం తప్ప నాకు మరేదీ కాబట్టదు.

ఆమె మాటల్ని అంగీకరించినట్లు తల ఊపాను. బుట్ట లోంచి ఒక పచ్చి మాంసం ముక్క తీసి పెంపుడు కుక్కకు పెడుతున్నట్లు ఆమె నాకు అందించింది. ఒక్క గుటకలో దాన్ని భక్షించి, మరింత ఆహారం కోసం తన వైపు చూస్తుంటే, ఆమె నవ్వి, తన దృఢమైన చేతులతో ఏదో విలువైన వేట జంతువును పట్టుకొని ఈడ్చుకొని పోతున్నట్లు, తన అయ్య పని చేసుకొంటున్న పొలం వైపు పోతూ, నాతో ఆటాడుకొంటున్నట్లు మధ్య మధ్యలో ఒక మాంసఖండాన్ని నాకందిస్తోంది. రెండు చేతులతో ఆ మాంస ఖండాలను పట్టుకొని స్వర్గం నుంచి కిందకి జారుతున్న అపూర్వ పదార్థాన్ని భక్షించినట్లు క్షణాల్లో వాటిని మింగుతున్నాను.

(తరువాయి వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here