జ్ఞాపకాల తరంగిణి-81

0
9

యోగవాశిష్టం నుంచి లవణరాజు కల – కథ

(Time Space Paradox – Full Story of King Lavana and The Sorcerer – From YogaVasishta – Ashutosh Chawla Blog ఆధారంగా)

లవణరాజు కల – కథ

9. పెళ్ళి:

[dropcap]వే[/dropcap]టాడడం నేర్చుకొన్నాను, జంతువులను కోసి మాంసాన్ని వేరు చేయడం నేర్చుకొన్నాను. మాలపల్లె ప్రజల మాదిరే మురికితో, చెమట వాసనలతో జీవించడం అలవాటు చేసుకొన్నాను. కల్లు తాగి పెద్దగా కేకలు వేయడం నేర్చుకొన్నాను. చిన్న మాంసం ముక్క కోసం, లేదా భూమి కోసమైనా కొట్లాడడం నేర్చుకొన్నాను. ఇంట్లో వాళ్ళను పెద్దగా కేకలు వేయడం, అరవడం అలవాటు చేసుకొన్నాను. కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకొన్నాను. మళ్ళీ వచ్చి భార్యను క్షమాపణ కోరడం నేర్చుకొన్నాను. నా ప్రాణంలా కన్నబిడ్డలను అపురూపంగా చూచుకోడం నేర్చుకొన్నాను. వర్షాకాలం తడుస్తూ, శీతాకాలం చలికి వణికిపోతూ, ఎండల్లో మలమల మాడడం అలవాటు చేసుకొన్నాను. బతికిఉన్న పాముల్ని తినడం, చీకటీగలు పెరుకుతూంటే బాధను భరించడం ప్రతిదీ అలవాటు చేసుకుని ముమ్మూర్తులా ‘చండాలుడి’గా మారాను.

10. కరువు కాలం:

కాలచక్రం గిర్రున తిరిగింది!

వృద్ధుణ్ణయ్యాను. అరవయ్యో పడి పైన బడుతోంది. ఎండిపోయిన నా ముసలి ముఖంపై తెల్లటి గడ్డం పెరిగింది. బాధలు, ఆందోళనలతో ముఖం ముడతలు పడింది. అన్నిటికీ కోపగించుకోవడం, అందరి మీదా కోపం వస్తుంది. ఎక్కడా తాగడానికి నీళ్ళు లేవు. చాలామంది చనిపోయారు. కొందరు కార్చిచ్చులో దూకి ప్రాణాలు విడిచారు. కొందరు పల్లె విడిచి ఎక్కడెక్కడో మరణించారు. ముదుసలి అత్తామామలను పల్లెలో విడిచి, నేను భార్యా పిల్లలతో పల్లె వదిలిపెట్టాను.

11. ప్రయాణం:

ఇద్దరు కుమారులను రెండు భుజాల మీద కూర్చోబెట్టుకొని మేమెంత దూరం నడిచామో! ఆ రోజు సాయంత్రం అక్కడక్కడ తాళవృక్షాలతో ఉన్న ఆ పర్వత ప్రాంతానికి చేరుకొన్నాము. భుజాలపై ఉన్న బిడ్డలని కింద దించి, విశ్రాంతి కోసం నేలమీద కూలబడ్డాను. అలసి సొలసిన భార్యాపిల్లలు అక్కడే నేల మీద పడి నిద్రపోయారు. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో తోచలేదు. మా కోసం మృత్యుదేవత కాచుకొని ఉన్నట్లనిపించింది. అప్పటికే నా భార్య ఊపిరందక కొట్టుకుంటోంది. నేల మీద పడి ఉన్న ఎండు తీగలాగా నా కుమార్తె ఒళ్లెరగకుండా నిద్ర పోతోంది. నా పెద్ద కుమారుడు నా పక్కనే, నా కాళ్లను పెనవేసుకొని పడుకొన్నాడు. వాడి కళ్ళల్లో తేమ ఎండిపోయి, ఆ కళ్ళు ఏదీ గమనిస్తున్నట్లు లేవు. నా చిన్న కుమారుడు నా పక్కకు పాకి వచ్చి “ఆకలి, తినడానికి మాంసం ఇవ్వు. తాగడానికి నెత్తురు కావాలి” అంటున్నాడు.

వాణ్ణి ఓదార్చాను, పరిస్థితిని వివరించినా, ఏడుస్తున్న వాణ్ణి ఓదార్చడం నా వల్ల కాలేదు.

“నా మాంసం తిని, నా రక్తం తాగు” కోపంగా అన్నాను.

“నాకు చాలా ఆకలిగా ఉంది. ఇవ్వు నాన్నా” వాడంటున్నాడు.

కాల్చిన నా శరీర మాంసాన్ని, నా రక్తాన్ని బిడ్డలకు ఇవ్వడానికి తీర్మానించుకొని, అక్కడ రాలిపడిన ఎండు చిదుగులతో మంట వేశాను. జ్వాల నిలువెత్తున మండడంతో నేనా మంటలో దూకాను!”

లవణరాజు క్షణకాలం చెప్పడం ఆపాడు. సభలో మృత్యు నిశ్శబ్దం ఆవరించింది.

“..అప్పుడే నేను సింహాసనం పై నుండి ఇక్కడ పడ్డాను.” లవణరాజు పెద్దగా నవ్వుతూ సభాభవనం నుంచి వెళ్ళిపోయారు.

లవణరాజు చెప్తున్న కథ ఏకాగ్రంగా వింటోన్న ఆయన మిత్రులు, మంత్రులు మాంసంతో చేసిన విగ్రహాల మాదిరి వారి వారి స్థానాల్లో నిశ్చలంగా ఉండిపోయారు. లవణరాజు గారి నవ్వు దూరంగా వారికి ఇంకా వినిపిస్తూనే ఉంది. వాళ్ళీ విషయాన్ని ఇక చర్చించాలని భావించలేదు.

12. లవణరాజు చండాల వాటికను సందర్శించుట:

మరుసటి రోజు లవణరాజు తాను వింధ్య పర్వతాలకు వెళుతున్నట్లు ప్రకటించారు. చండాల వాటిక అంటూ ఒకటుండేదా అని తెలుసుకోడానికే వింధ్య పర్వత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎందుకు ఉండకూడదు? ఆ పర్వత ప్రాంత జీవితం తనకు అనుభవమైంది. అక్కడి ప్రతి ఇసుక రేణువు తనకు పరిచయమే! అంతా స్వప్నానుభవమనీ, వాస్తవం కాదని లవణరాజుకు వివరించడానికి మంత్రులు ప్రయత్నించారు గాని, వారి మాటలను వినిపించుకోకుండా వెళ్ళే ముందు తన గురువు వశిష్ఠుడి అనుజ్ఞను వేడారు. “సత్యాన్వేషణలో తప్పేమీ లేదు, మీ సత్యాన్వేషణ వృథా కాదు” అని మహర్షి ఆశీర్వదించారు.

లవణరాజు అనుచరులతో వింధ్యాచలానికి బయల్దేరారు. అడవిలో ఎన్నో ప్రదేశాలు అన్వేషించారు. కార్చిచ్చులో దగ్ధమైన అరణ్యాన్ని గుర్తించారు. కొందరు ముదుసలి స్త్రీలు అస్తులు, బూడిద వద్ద నేలపై దొర్లాడుతూ ఏడుస్తున్నారు. ఒక ముసలి తల్లి పెద్దగా రోదిస్తూ రాగాలు తీస్తోంది. తెల్లని చక్కనైన తన అల్లుడు, నల్లని కుమార్తె కోసం ఆమె ఏడుస్తోంది. మనుమలు, మనుమరాలు పేర్లు పెట్టి పిలుస్తూ ఏడుస్తోంది. రాజు గుర్రం దిగి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె కుటుంబాన్ని గురించి విచారించారు. రాజు సభలో అనుభవించిన భ్రాంతి కథనే ఆమె ఏడుస్తూ వివరిస్తోంది. తన అల్లుడి కథ చెప్తోంది.

లవణరాజు దిగ్భ్రాంతికి గురై, ఆ చండాల స్త్రీ జీవనానికి ఏర్పాట్లు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, చండాలుడిగా భ్రాంతిలో తను తిరిగిన ప్రదేశాలన్నీ కొంత తడువు చూచి, ఎన్నో సంశయాలు, ప్రశ్నలు మనస్సులో వేధిస్తోంటే అంతఃపురానికి మరలాడు.

13. రాజసూయ యాగం:

తన కోసం నేలమీద పరిచిన కృష్ణాజినం మీద లవణరాజు ధవళ వస్త్రాలు కట్టుకొని నిరలంకారంగా వశిష్ఠుని ఆశ్రమంలో ఉపవిష్టులై ఉన్నారు.

గురువు వశిష్ఠుల వారు కాస్త ఎత్తైన పీఠం మీద ఉపవిష్టులై, సాలోచనగా కనులు మూసుకొని ఉన్నారు. శిష్యుడు అడిగిన ప్రశ్నలను గురించి మహర్షి తన లోపల ఆలోచన చేస్తున్నారు.

‘ఆ మాంత్రికుడెవరు? ఈ మాయని ఎందుకు కల్పించాడు? స్వప్నంలోనైనా మనసా వాచా కర్మణా ఏ తప్పు చేయని తానెందుకు ఈ వేదన అనుభవించవలసి వచ్చింది? ఈ భ్రాంతి నా మనస్సులో ఎందుకు వాస్తవం అనిపించింది? రెండు గంటల అనుభవం చండాల వాటికలో ఎన్నో సంవత్సరాల జీవితానికి సమానమెట్లా అయింది?’ చాతకపక్షి వర్ష బిందువుల కోసం వేచి ఉన్నట్లు రాజు సమాధానం కోసం గురువు సముఖంలో వేచి ఉన్నారు. బ్రహ్మకుమారులు వశిష్ఠులొక్కరే ఈ సంశయాలన్నింటినీ నివర్తించగలరని రాజుగారికి తెలుసు.

ఈ అనుభవం వివరంగా రాజుగారికి గుర్తుండిపోయింది. తన పూర్వీకుడు యుధిష్టిరుడు రాజసూయ యాగం చేసి స్వర్గప్రాప్తి పొందినట్లు ఆయన విన్నారు. తను ఆ యాగాన్ని మనోవేదికపై చేయాలి. దేనిమీదైనా సుదీర్ఘ కాలం మనస్సును కేంద్రీకరించగల్గిన శక్తి తనకుంది. లవణరాజు తన పూజా గృహంలో ఆవిష్టులై మనసులో ప్రతి వివరం విస్మరించకుండా రాజసూయ యాగం నిర్వర్తిస్తున్నట్లు భావించారు. మనస్సులోనే యాగ వస్తు సంభారం సేకరించినట్లు, అధ్వరులు, బ్రాహ్మణులు యాగశాలకు వచ్చినట్లు భావించుకొన్నారు. అంతరంగంలో యాగంలో ఎన్నో దానధర్మాలు చేసినట్లు ఊహించుకొన్నారు. ఆ రోజు సూర్యాస్తమయ సమయానికి సంవత్సర కాలం యాగం చేసిన అనుభూతిని పొందారు. సమాధి స్థితిలో నుంచి లేచిన తర్వాత,   ‘ఇది మనసుకొక వినోదం’ అనుకొంటూ యాగ విషయాలన్నీ మరచిపోయారు.

“మహర్షీ! నేను యాగం నిర్వర్తించాను!” వశిష్ఠుల వారితో రాజు అన్నారు.

“యాగం చేసిన వ్యక్తి నిజజీవితంలో చాలా బాధను అనుభవించవలసి ఉంటుందని మీకు తెలుసు గదా! యాగాన్ని మనసులోనే నిర్వహించారు కనుక, మీరు మనస్సులోనే వేదనని అనుభవించవలసి వచ్చింది.”

“దేవేంద్రుడు తన ప్రతినిధిని మాంత్రికుడి రూపంలో మీ అంతరంగ వేదికపై వేదన కలిగించేందుకే పంపాడు. ఇంత మాత్రమే! ఇంకేమీ కాదు!” అన్నారు మహర్షి.

వశిష్ఠుల వారి వివరణ విని రాజుగారు చిరునవ్వుతో నవ్వి, భక్తి పూర్వకంగా తల ఊపుతూ నమస్కరించారు.

14. కాలమే మనస్సు:

వశిష్ఠముని తన వివరణ కొనసాగించారు.

“కాలమంటే అర్థం ఏమిటని మీ మనస్సులో సంశయం ఉంది. కాలం అంటే ఏమిటి? లోకంలో అనేక సంఘటనలు జరుగుతాయి. ఈ లోకంలో ‘కాలం, ప్రదేశం’ (time and space) అనే నిర్దుష్టమైన భావనలు లేవు. ప్రతి సంఘటన తనకు సంబంధించిన ‘స్థల కాల’ సరిహద్దులు కలిగి ఉంటుంది. అడవిలో చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతున్న సమయంలో ప్రతిక్షణం ఒక కల్పం అనిపించినట్లు అన్నారు. బ్రహ్మదేవుడికి ఒక రోజు మానవులకు కల్పం. అదే సంతోషకరమైన అనుభవమయితే కల్పకాలం క్షణకాలం మాదిరి అనిపించేది. మనస్సు యొక్క ఇష్టాయిష్టాలను అనుసరించి దీర్ఘకాలం, క్షణకాలం అనే కొలమానాలు- మనసుకి సంబంధించినవి ఏర్పడుతాయి. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో స్థలకాలాల వేదికపై జీవిస్తారు. వ్యక్తులు కలుసుకొన్నప్పుడు మనోభావాల వినియమం చేసుకొంటారు. అప్పుడు అందరికీ సంబంధించిన నిరవధికమైన కాలం అనే భావన మనస్సులో ఏర్పడుతుంది.

మీరు రెండు గంటల సేపు సింహాసనంపై చలనం లేకుండా ఉండడం సభాసదులు గమనించారు. కాని ప్రతి వ్యక్తీ స్వీయ కాలమానం ప్రకారం వేరువేరుగా అనుభూతి పొంది ఉంటారు. మిమ్మల్ని ఎంతో ప్రేమించే వారికి ప్రతి క్షణం ఒక ఏడాదిగా అనిపించి ఉంటుంది. వాళ్ళంతా మీ క్షేమం కోసం మనస్సులో చాలా క్షోభ అనుభవించి ఉంటారు. శిశువు క్రీడలో నిమగ్నమై ఉన్నప్పుడు రెండు గంటలు రెండు క్షణాల్లా ఆ శిశువుకు గడిచిపోతాయి.”

“లవణా! అంతా మనస్సులో ఉంది!

మనస్సు నిర్ణయించేదే ‘కాలం అవధి’గా నిర్ణయమవుతుంది. అందరం ఆమోదించిన పద్ధతిలో నిత్య వ్యవహారంలో కాలానికి ఒక కొలత, అవధిని నిర్ణయించుకొని అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో వాడుకొంటాము. అవ్యవస్థ ఏర్పడకుండా ఇదొక వాస్తవికమైన పరిష్కారం, వాస్తవ జగత్తులో ‘కాలమ’నేది లేనే లేదు. అనుభవమొక్కటే వాస్తవం. అనుభవం యొక్క గుణాత్మకతను అనుసరించి మనసుకు కాలం కుంచించుకొనిపోయినట్లు, వ్యాకోచించినట్లు అనిపిస్తుంది.”

“చండాలుడిగా మీ అనుభవం అత్యంత బాధాకరమైనది. దాన్ని ఎన్నో ఏళ్ళుగా మీ మనస్సు భావించింది. మాంత్రికుడి గారడీ ఒక తమాషా! ఆ సంఘటన రెండు గంటలు కొనసాగినట్లు సభాసదులు భావించారు. మన సమాజం నిత్య జీవిత వ్యవహారాలు కొనసాగించడానికి సృష్టించుకొన్న హద్దులే ఏళ్ళు, నెలలు, రోజులు. ‘కాలం’ అనేదే ఒక భ్రాంతి, అవాస్తవం.”

15. మన మస్తిష్కంలో అనుభవమే జీవితం:

లవణరాజు అమృతాన్ని సేవిస్తున్నంత ప్రీతితో వశిష్ఠ మహర్షి మాటలను శ్రద్ధగా వింటున్నారు. మహర్షి కొనసాగించారు.

“మీచే సభలో అనుభూతమైన చిత్రమైన అనుభవం వాస్తవంగా చండాల వాటికలో సంభవించిందా? ముందీ మాట చెప్పండి? ఏది వాస్తవం? ఏది అవాస్తవం? స్వప్నంలో కొన్ని క్షణాలలోనే అనేక సంఘటనలు జరిగినట్లు అనుభూతి కలుగుతుంది. ఎంతో కాలం పాటు జరిగిన ఆ సంఘటనలను వివరించగలవు. మనిషి మనస్సుకు తన ఇచ్ఛని అనుసరించి కథలను కల్పించే శక్తి ఉంది. ఇది అజ్ఞానం నుంచి పుట్టింది. గొప్ప మహర్షుల వలె  ఆత్మజ్ఞానాన్ని పొది ఉంటే మన జీవితానుభవాన్ని అవాస్తవం అని తిరస్కరించ గలిగేవారమే!”

“మీరు ఒక రాజుగా, చండాలుడిగా పొందిన అనుభవాలను రెండిటినీ ‘మాయ’ (concoction) గా భావించి తిరస్కరించేవారు. కానీ ఈ చైతన్య ప్రపంచంలో మీ అనుభూతులను సత్యంగా భావించాలని అనుకొన్నారు. చండాల వాటికలో గడిపిన అనుభవాన్ని మీ మనస్సే మీకు కల్పించింది.”

“నా వివరణ మీకు తృప్తి నివ్వకపోతే, ఇట్లు కూడా అనుకోవచ్చు. వింధ్య పర్వతానికి వెళ్ళినపుడు మీ మనసులోని ఆలోచనలనే, భావనలనే చండాల వాటికలోని జనుల మనసులు ప్రతిఫలించి, మీరు వారి మధ్య గడిపినట్లు ఆ ప్రజలు భావించి ఉంటారు. లేదా అటువంటి అనుభవమే ఆ చండాల వాటికలో రాజు అనుభవాన్ని, కథను నీ మనస్సు ప్రతిఫలించి ఉంటుంది. ఆ రాజును నేనేనని మీ మనసు భావించుకొని ఉంటుంది. లేకపోతే మాయావి మాంత్రికుడి గారడీ మీలో, ఆ చండాల వాటిక ప్రజల మనస్సులో ఒక భ్రాంతిని పుట్టించి, అందరిలో ఒకే రకమైన అనుభవాన్ని సృష్టించి ఉండొచ్చు.”

“ప్రియమైన లవణరాజా!

ఒక్క సత్యాన్ని మాత్రం గ్రహించండి!

ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొనేవరకు, మిమ్మల్ని మీరు తెలుసుకొనేంత వరకూ, మీ చుట్టూతా ఉన్న భ్రాంతులు మీ పై ప్రభావాన్ని కలిగిస్తూనే ఉంటాయి.”

“లవణరాజా మీరొక వ్యక్తి కారు. లవణరాజుగా మీ ఆత్మ, సారంలో మీ దేహం, మీ కుటుంబం, మీ మిత్రులు, మీ దేశం, మీరున్న స్థలం, మరెన్నో అసంఖ్యాకమైన వస్తువులున్నాయి. ఈ సమస్త విశ్వమే ‘లవణరాజు’. ఒక్క ‘భ్రాంతి’లో రవంత మార్పు వచ్చినా, మీరేదో పోగొట్టుకొన్న చందంగా మనస్సు వేదన పాలవుతుంది.”

“మీరు అనుభవించిన భ్రాంతిని ఒక్కసారి పరామర్శ చేసుకోండి! క్షణకాలంలో మీ అస్తిత్వాన్ని పూర్తిగా పోగొట్టుకొని, మరొక మనిషిగా పరివర్తనం చెంది చండాలుడిగా జీవించారు. పర్వత ప్రాంతాలలోని చండాల వాటికలో మీ నల్లని భార్యాపిల్లలు, వేట ప్రతీదీ మీ కొత్త వ్యక్తిత్వంలో చేరిపోయాయి. లవణరాజుగా స్వప్నం నుంచి మేల్కొన్న తరువాత, లవణరాజుగా మీకు ఆనందం లేకుండా పోయింది. తిరిగి మీలో గందరగోళం ఏర్పడింది.

మనం ఒక భ్రాంతిలో జీవిస్తాం. మన చుట్టూతా ఇతర భ్రాంతులు. ఈ లోకంలో జరిగే సంఘటనలు మిమ్మల్ని మోసపుచ్చుతాయి. ఒక పర్యాయం మీ చుట్టూతా ఉన్న భార్య, పిల్లలు, ఇల్లు, దేశం నుంచి వేరుపడినట్లయితే, ఆ భావనలకు దూరమైపోతే, మీ స్వరూపాన్ని, సహజ ప్రకృతి బ్రహ్మనే అని గ్రహిస్తారు. అప్పుడు ‘మాయాశక్తి’ భ్రాంతి మీ మనస్సునెప్పుడూ ఆవరించలేదు. చండాలవాడ భౌతిక ప్రపంచంలో మాత్రమే ఉంది. ఆత్మజ్ఞానం సంపాదించని మానవుడు తన రాచరికపు స్థితిని విస్మృతి పొందిన ఒక చండాలుడు ఈ పల్లెలో.”

“లవణరాజా! లవణరాజుగా మీ అస్తిత్వమూ మాయే. మీరు అనుభవిస్తున్న రాచరికపు జీవితం కూడా భ్రాంతే! మాంత్రుకుడు ఇంద్రుడి వార్తాహరుడు కదు! ‘బ్రహ్మన్’ యొక్క మాయాశక్తి. మనలను సత్యం నుంచి దూరంగా తీసుకొని వెళ్ళి, మాయా జగత్తు యొక్క భ్రాంతులలో పడవేసే ‘వాసన’ల వంటివి.”

వశిష్ఠ మహాముని సన్నిధిలో ఆసీనుడై గురువు బోధనలను భక్తి శ్రద్ధలతో వింటున్న లవణరాజు ఆసనం నుంచి లేచి, సెలవు తీసుకొని అంతఃపురానికి వెళ్తూ, గురు ప్రవచనాన్ని మనస్సులో మననం చేసుకొంటూ ఆత్మజ్ఞానాన్ని పొందారు.

(లవణరాజు కల – కథ సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here