జ్ఞాన తృష్ణ

0
13

[dropcap]ప్ర[/dropcap]తిభా గ్రామర్ స్కూల్. నగరంలోనే ఎంతో పేరున్న పాఠశాల. ఆ బడిలో ఫిఫ్థ్ క్లాస్ ఎ సెక్షన్.

“అందరూ మాథ్స్ హోమ్ వర్క్ బుక్స్ తెచ్చి ఇక్కడ పెట్టండి… క్లాస్ వర్క్ తీసి నేనిచ్చే సమ్స్ చేయండి.” నాన్సీ టీచర్ చెప్పగానే పిల్లలంతా పుస్తకాలు తీసుకువెళ్ళి ఆమె టేబుల్ మీద పెట్టారు.

“నువ్వు పెట్టలేదేం?” రోహిత్ ని అడిగాడు కిషన్.

“నేను హోమ్ వర్క్ చేయలేదురా.”

“ఎందుకనీ? టీచర్ ఊరుకోరు కదా…” రోహిత్ ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు కిషన్.

“చెయ్యాలనిపించలేదు. నాకసలు చదువు మీద ఇంటరెస్ట్ లేదు…”

“చదువుకోకపోతే పెద్దయ్యాక ఉద్యోగం ఎలా వస్తుందిరా?”

“అక్కరలేదురా, మాకు బోలెడన్ని బిజినెస్సులున్నాయి.” నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు రోహిత్.

“సైలెన్స్… లెక్కలు చేయండి.” డస్టర్ తో టేబుల్ మీద తట్టింది నాన్సీ టీచర్.

అందరూ తల వంచుకుని లెక్కలు చేస్తుంటే పుస్తకం ఎదురుగా పెట్టుకుని చేస్తున్నట్టు నటిస్తున్నాడు రోహిత్.

అటూ ఇటూ తిరుగుతూ పిల్లల్ని గమనిస్తున్న నాన్సీ వీళ్ళ టేబుల్ దగ్గరకు వచ్చి గమనిస్తూ నిలుచుంది.

ఖాళీగా ఉన్న రోహిత్ నోట్ బుక్ వాడినామెకు పట్టిచ్చింది.

“రోహిత్, ఏమైంది? ఎందుకు చేయటం లేదు నువ్వు?”

జవాబుగా తలవంచుకున్నాడు రోహిత్.

“హోమ్ వర్క్ చేసావా?” లేదన్నట్టు తల ఊపాడు. వాడి కళ్ళలో భయంతో పాటుగా ఏదో తెలియని నిర్లక్ష్యం.

“సాయంత్రం స్కూల్ అయ్యాక నా దగ్గరకు రా. మిస్ చేయకు. పిల్లలూ, అందరూ లెక్క చేసారా? జవాబు ఎంత వచ్చింది?” అంటూ తన కుర్చీ వైపుకు వెళ్ళిపోయింది నాన్సీ.

***

“టీచర్ రమ్మన్నారు కదరా.” స్కూలయ్యాక బ్యాగ్ సర్దుకుంటూ అడిగాడు కిషన్.

“ఇంటికి వెళ్ళిపోతాను. మా తాతయ్యకి బాగాలేదని చెప్తాను.”

“అబద్ధమా? తప్పు కదరా…”

“స్టాఫ్ రూమ్‌లో టీచర్లందరికీ చెప్పి ఇన్‌సల్ట్ చేస్తుంది టీచర్. ఉహు, నేను ఆమెను మీట్ అవను. ఇంటికి వెళ్ళిపోతాను…” రోహిత్ ముఖం భయంతో నిండిపోయింది.

“అలా ఏమీ ఉండదురా… టీచర్ చాలా మంచివారు.” కిషన్ మాటలు పూర్తి కాకుండానే,

“రోహిత్, నాతో మా ఇంటికి వస్తావా?” అని అడిగింది నాన్సీ టీచర్ క్లాసురూం లోకి అడుగుపెడుతూ.

“మా తాతయ్యకి…” రోహిత్ మాట పూర్తి కాకుండానే, “మీ నాన్నగారికి ఫోన్ చేసి అనుమతి తీసుకున్నాను. మళ్ళీ గంటలో పంపించేస్తానని చెప్పాను. పద వెళదాం.” అతని చేయి అందుకుంది.

ఎదురు చెప్పలేక బెరుకుగా  చేయి అందించి, ఆమెతో పాటుగా ఆమె ద్విచక్రవాహనం ఎక్కాడు రోహిత్.

***

దారిలో కూరగాయలమ్మే దుకాణం దగ్గర బండి ఆపి దిగింది నాన్సీ. ఆమెతో పాటు రోహిత్ కూడా దిగాడు. అతనికి ఏమాత్రం ఆమెతో వెళ్ళాలని లేదు. ఇంటికి పారిపోయి వీడియో గేములు ఆడుకోవాలని మనసు లాగేస్తోంది. అయినా టీచర్ కనుక తనను తాను నియంత్రించుకుంటూ ఆమె పక్కన నిలబడ్డాడు.

దుకాణంలో తన ఈడు వాడే ఒకబ్బాయి ఉన్నాడు. కూర్చుని నోట్ బుక్‌లో ఏదో రాసుకుంటున్న వాడల్లా,  నాన్సీని చూడగానే ఒక్క ఉదుటున లేచి, ఆమె అడిగిన కూరలను తూచి ఇచ్చాడు.

“ఏరా శ్యామూ, అమ్మ లేదా?” అడిగింది నాన్సీ వాడికి డబ్బులిస్తూ.

“మార్కెట్ కి వెళ్ళింది టీచర్… అమ్మ రాగానే నేను వస్తాను…” అన్నాడు.

“అలాగే, నేనిచ్చిన హోం వర్క్ చేసేసావుగా… వచ్చేయ్ త్వరగా…” చేతిలోని కూరగాయలున్న పేపర్ కవర్‌ను రోహిత్‌కి అందించి, “రోహిత్, కొంచెం ఈ కవర్ పట్టుకుని కూర్చోవా?” అని అడిగింది.

తలూపి అందుకున్నాడు రోహిత్.

మరొక్క నిమిషంలోనే నాన్సీ ఇల్లు చేరారిద్దరూ. చిన్న డాబా ఇల్లు. వరండాలో కుర్చీలు వేసి ఉన్నాయి. నాన్సీ పిల్లలిద్దరూ అక్కడే చాప మీద కూర్చుని చదువుకుంటున్నారు. ఒకరు టెంత్, మరొకరు ఇంటరూ చదువుతున్నారా ఇద్దరు అమ్మాయిలూ.

“రోహిత్, అక్కల దగ్గర కూర్చోమ్మా… ఇప్పుడే వస్తాను…” అంటూ కూరగాయల సంచీ అందుకుని లోపలికి వెళ్ళింది నాన్సీ.

“హేయ్, నీ పేరేమిటి, ఏ క్లాసు చదువుతున్నావు?” మొహమాటంగా కూర్చున్న రోహిత్ బిడియాన్ని పోగొట్టటానికి అడిగింది చిన్నమ్మాయి రోజీ.

“రో…రో…రోహిత్ అండీ…”

“అండీ కాదమ్మా, అక్కా అని పిలవాలి…” నవ్వుతూ చెప్పింది పెద్దమ్మాయి జాస్మిన్.

ఈలోగా లోపలనుంచి వచ్చిన నాన్సీ రోహిత్‌ని దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడసాగింది. ఇంటిలో అమ్మానాన్నల కబుర్లు, రోహిత్ హాబీల గురించి అడిగింది. భయం తగ్గి, ఆమె అంటే కొంచెం చనువు ఏర్పడటంతో కొద్దిగా ఫ్రీ గా మాట్లాడసాగాడు రోహిత్.

“ఇందాక శ్యామూని చూసావు కదా… వాడు రెండో క్లాస్‌లో ఉండగా వాళ్ళ నాన్న చనిపోయాడు. ఫీజులు కట్టలేక గవర్నమెంట్ స్కూల్‌కి పంపిస్తోంది వాళ్ళమ్మ. ఇక్కడికే వచ్చి, రాత్రి ఎనిమిది వరకూ చదువుకుని వెళతాడు. వాడి క్లాసులో ఫస్ట్ వాడే… మరి నీకు అలా క్లాసులో ఫస్ట్ రావాలని లేదా?” బుజ్జగింపుగా అడిగింది నాన్సీ.

“నాకు లెక్కలు అసలు రావు టీచర్…” బెరుకుగా జవాబిచ్చాడు రోహిత్.

“ఆసక్తి ఉంటే ఏదైనా నేర్చుకోవటం పెద్ద విషయం కాదు రోహిత్. నేను నేర్పిస్తాను… లేదంటే అక్కల దగ్గర నేర్చుకో…” రోహిత్ ముఖంలోని అప్రసన్నతను గమనించనట్టుగా చెప్పింది నాన్సీ.

“సరే…” అయిష్టంగా తల ఊపాడు రోహిత్. మర్నాటి నుంచి తనతోనే ఇంటికి వచ్చి చదువుకోమని చెప్పింది నాన్సీ.

రోహిత్ మాటల వలన అతని తండ్రికి రకరకాల బిజినెస్‌లు ఉన్నాయని, వాటిలో తల మునకలయ్యేలా ఊర్లు తిరుగుతూ ఉంటాడని, ఆట్టే చదువుకోని తల్లి, మంచం పట్టిన మామగారి సేవానంతరం నిత్యమూ టీవీ సీరియల్స్‌తో కాలం గడుపుతుందని, రోహిత్ వీడియో గేమ్స్‌తో కాలం గడిపివేస్తాడని అర్థమైంది. కలిగిన ఇంట్లో ఏకైక వారసుడిగా పుట్టటం వలన తాను చదువుకోకపోయినా ఫరవాలేదని రోహిత్ అభిప్రాయం. పెద్దయ్యాక, తండ్రి వ్యాపారాలకు, ఆస్తులకూ తానే వారసుడు కనుక డబ్బు సంపాదించటం పెద్ద సమస్యే కాదని అనుకుంటున్నాడు.

‘వీడిని మెల్లగా మార్చి, చదువుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలియజెప్పాలి!’ అనుకుంది నాన్సీ. అలాగే, ఒకసారి అతని తల్లిదండ్రులతో మాట్లాడాలని కూడా అనుకుని, రోహిత్‌కి లెక్కల్లో ఎంత వరకూ పరిజ్ఞానం ఉన్నదో పరీక్షించింది.

అయిదో తరగతి చదువుతున్నాడు కానీ రోహిత్ కి ఎక్కాలే సరిగ్గా రావు. నాలుగో తరగతి వరకూ వేరే ఊరిలో చదివి, ఈ ఏడాదే ఇక్కడికి వచ్చాడు.

“లెక్కలు చేయటం పెద్ద కష్టం ఏమీ కాదు రోహిత్. ముందు ఎక్కాలు నేర్చుకో. ఆ తర్వాత అన్నీ వస్తాయి…” అంటూ వాడికి రాని ఎక్కం బుక్‌లో రాసిచ్చి వల్లె వేయమని చెప్పింది. ఈలోగా శ్యామూ వచ్చి అక్కడ కూర్చుని చదువుకోసాగాడు.

వాళ్ళిద్దరి కోసం ఉప్మా చేసి తీసుకువచ్చి పెట్టింది. మంచి ఆకలి మీద ఉన్నాడేమో, ఉప్మా కూడా, వేడిగా, రుచిగా ఉండటంతో వద్దని అనకుండా తినేసాడు రోహిత్.

అతనికెందుకో టీచర్ వాళ్ళ ఇల్లు, వాతావరణం బాగా నచ్చింది. రెండు ఎక్కాలు చూడకుండా వ్రాసి టీచర్ ‘వెరీ గుడ్’ అనటంతో పొంగిపోయాడు. వాడిలో జ్ఞానమనే దాహం మొదలైంది.

***

మూడు నెలల తరువాత –

ఇప్పుడు రోహిత్ ప్రతీరోజు హోమ్ వర్క్ చేస్తున్నాడు. చురుకుగా అన్ని పోటీలలో పాల్గొంటున్నాడు. రోహిత్ తల్లిదండ్రులు కూడా నాన్సీ సూచనలననుసరించి అతనితో రోజూ కాసేపు గడపటం అలవాటు చేసుకున్నారు.

రోజూ టీచర్ ఇంటికి వెళ్ళి చదువుకోవటం వలన శ్యామూతో స్నేహం పెరిగి, వాడి దగ్గర తెలియనివి నేర్చుకోవటం, వాడికి అవసరమైన పుస్తకాలు, బట్టలు తండ్రినడిగి ఇవ్వటం అలవాటైంది. అలాగే నాన్సీ పిల్లలిద్దరితో కేరమ్స్, చెస్ లాంటి ఆటలు అలవాటై, వీడియో గేములు ఆడటం మానేసాడు. దాని బదులు ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుకోవటం అలవాటు అయింది.

ఇప్పుడు రోహిత్‌కి చదువంటే భయం, అయిష్టత, చిన్నచూపు లేవు. చదువంటే గౌరవం, శ్రద్ధ, భక్తి పెరిగాయి. అది జ్ఞానానికి తొలిమెట్టనీ, ప్రపంచాన్ని చూపించే గవాక్షమని అర్థమైంది. ఎంతో కష్టపడి చదువుకుంటున్న శ్యామూ లాంటి పిల్లలపైన ఇష్టం పెరిగింది.

అతన్ని తీర్చిదిద్దిన నాన్సీ టీచర్ కి ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here