జ్ఞాపకాల పందిరి-1

75
9

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నా జ్ఞాపకాలు ఎందుకు?:

జీవితం, నడుస్తున్న చరిత్ర. ఎన్నో అనుభవాలు మూటగట్టుకుని ముందుకి సాగిపోతుంటాం. అందులో గుర్తుంచుకోదగ్గవి, మరచిపోదగ్గవి, ఆనందాన్నీ దుఃఖాన్ని సింహావలోకనం చేసుకోదగ్గవి కూడా ఉంటాయి. కొందరికి అవి మరుగున పడ్డ సన్నివేశాలైపోతాయి. కొందరు వీటిని ఎప్పటికి మననం చేసుకుంటూనే ఉంటారు.

మరి ఇక్కడ నా జ్ఞాపకాలు ఎందుకు? వందల, వేల సంఖ్యల్లో పాఠకులు ఉన్న ఈ మన ‘సంచిక’లో నా జ్ఞాపకాల అవసరం ఏముంది? అవసరం వుంది. అందరి జ్ఞాపకాలు, ఈ మన సమాజానికి అవసరమే!

కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!

అవునో కాదో మీకే తెలుస్తుంది, మరి… పదండి ముందుకి.

***

జీవితం అనేక దశలను కలిగి ఉంటుంది. ఒక్కో దశలోనూ ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో కొన్ని మరచిపోలేని జ్ఞాపకాలుగా గుర్తుండి పోతాయ్. వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకుని మానసిక తృప్తిని పొందుతాం. కొన్ని జ్ఞాపకాలు నిరాశనూ, నిస్పృహనూ, తిరిగి గుర్తు చేస్తుంటాయి. గతాన్ని తవ్వుకోవడం – అది మంచైనా, చెడ్డైనా కొందరికి అసలు ఇష్టం ఉండదు. కొందరికి ఆ జ్ఞాపకాలు జీవితాంతము తమతోనే పయనిస్తూ, సింహావలోకనం చేసుకోమంటుంటాయ్. నేను ఈ కోవకు చెందినవాడినే.

ముఖ్యంగా, నా విద్యార్థి దశ, ఇతరులతో పోలిస్తే, చాలా క్లిష్టమైనది, వ్యథలతో నిండినది. ఐతే.. దంత వైద్య విద్యార్థిగా, నేను చాలా ఆనందంగా, గౌరవప్రదంగా పూర్తి చేశానని చెప్పడానికి ఏమాత్రం సందేహించను. అందుకే, ఆ దశ మర్చిపోలేనిది. జ్ఞాపకాల దొంతరలు నిత్యం గుర్తు చేస్తూ, కితకితలు పెడుతూనే ఉంటాయి. అందుకే, నా పూర్వ విద్యార్థి మిత్రులతో, నా దంత వైద్య కళాశాల జ్ఞాపకాలు కలిసి పంచుకోవడానికి ఆశపడుతున్నాను.

నేను దంత వైద్య రంగాన్ని నా కెరీర్‌గా ఎందుకు ఎంచుకున్నాను?:

నేను నాగార్జున సాగర్‌లో (హిల్ కాలనీ) ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన తరువాత, హైదరాబాద్‌లోని చింతల్‌బస్తీలో, అప్పుడే ఏర్పాటైన కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, బి.ఎస్సి డిగ్రీలో చేరాను. అది 1974వ సంవత్సరం. పెద్దన్నయ్య కె.కె.మీనన్, నన్ను రష్యాలో మెడిసిన్ చేయించడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలుడై, చాలా నిరుత్సాహపడ్డాడు. అప్పుడు నా చేత మెడిసిన్ కోసం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశ పరీక్ష రాయించాడు. అప్పటికి ఎం.సెట్.. ఇంకా రంగప్రవేశం చేయలేదు. ఈలోగా మా చిన్నన్నయ్య డా. కె. మధుసూదన్, ఒక అప్లికేషన్ తెచ్చి పూర్తి చెయ్యమన్నాడు. అది బి.డి.ఎస్. అడ్మిషన్ ఫామ్. ఆ కాలంలో కేవలం ఇంటర్మీడియేట్ మార్కుల మెరిట్‌ను బట్టి, ప్రాంతాలవారీగా, రిజర్వేషన్లను పాటిస్తూ… అభ్యర్థులను ఎంపిక చేసేవారు.

ఆశ్చర్యం ఏమిటంటే, అప్పటివరకూ దంత వైద్యం అనే వృత్తి విద్యా కోర్సు ఒకటి ఉందని నాకు తెలీదు. మా చిన్నన్నయ్య ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది! ఫలితాల కోసం, ఉస్మానియా వైద్య కళాశాల ఆఫీసుకు వెళ్ళినప్పుడు, సంబంధిత క్లార్క్ “నీకు మెడిసిన్‌లో సీటు రాలేదు కానీ, డెంటల్ లిస్ట్‌లో నీ పేరు వుంది చూడు” అన్నాడు. అతను చెప్పినట్టుగానే నా పేరు లిస్టులో(1975) వుంది. నేను పెద్దగా బాధపడలేదు, సంతోషమూ పడలేదు గాని, మామూలుగా ఆఫీసునుండి బయటకు వచ్చాను. అప్పుడు, వరండాలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడుకుంటూ వున్నారు.

నన్ను చూసి ‘మీకు బి.డి.ఎస్‌లో సీటు వచ్చిందా ?’ అని అడిగింది, ఆ.. తెల్లటి అమ్మాయి నవ్వుతూ.

‘అవునండీ ‘అన్నాను నేను మామూలుగా. ఆమె ఎవరో కాదు ‘పెరియోడాన్షియా’ లో పి.జి. చేసిన నా క్లాస్‌మేట్, డా. జె. క్రాంతి. అప్పటివరకూ ఆవిడతో మాట్లాడుతున్నది, మరెవరో కాదు, నాకు అత్యంత ప్రియమిత్రుడు, నన్ను అతిగా ప్రేమించిన నా శ్రేయోభిలాషి, స్వర్గీయ డా. జి. డేవిడ్ రాజు. అలా వాళ్లిద్దరూ ప్రారంభంలోనే, మంచి స్నేహితులు అయిపోయారు.

నా సీటు విషయం మా అన్నయ్య దృష్టికి తీసుకు వెళ్ళినప్పుడు, ఆయన ప్రొఫెసర్ కృష్ణ కుమార్ (ఫిజీషియన్ ) గారిని సంప్రదించి, ఆయన సలహా మేరకు పచ్చజండా ఊపడం జరిగింది. తక్షణం నేను అడ్మిట్ కావడం జరిగింది. అప్పుడు దంత వైద్య కళాశాల పరిపూర్ణంగా ఏర్పాటు కానందున, పరిపాలన అంతా, ఉస్మానియా వైద్య కళాశాల ఆధీనంలో ఉండేది. అందుచేత ‘డెంటల్ వింగ్ ‘అనేవారు.

అదండీ — కావాలని నేను ఎంచుకున్న ప్రొఫెషన్ కాదిది. అలా అని, బాధపడింది లేదు. ఈ కోర్సు చదివినందుకు నేను గర్వపడుతున్నా. పైగా సమాజంలో దీని ద్వారా ఎంతో గొప్ప పేరు సంపాదించుకోగలిగాను. రచయితను కాగలిగాను, ఆకాశవాణి -దూరదర్శన్‌లలో మంచి బ్రాడ్ కాస్టర్ కాగలిగాను, ఉపన్యాసకుడిని కాగలిగాను.

కోఠి నుండి అఫ్జల్‌గంజ్:

ఉస్మానియా మెడికల్ కళాశాల కోటీలో ఉన్నందున, మొదటి ఆరునెలలు పి.పి.సి (ప్రీ ప్రొఫెషనల్ కోర్సు) అధ్యయనం అక్కడే ఉండేది. మళ్ళీ ఇంటర్ చదూతున్న భావన కలిగేది. ఇక్కడ నాకు నచ్చిన ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ జార్జి పాచ్ కో. ఆయన బోధనా విధానం అతి సరళం, మహా గొప్పది. చాలా సునాయాసంగా బోధించేవారు. అలాంటి లెక్చరర్స్ బహు అరుదుగా వుంటారనడంలో సందేహం లేదు. సాయంత్రం పూట ఉస్మానియా మెడికల్ కళాశాలలోనే ప్రాక్టికల్ క్లాసులు ఉండేవి. ఆ ఆరు నెలల కోర్సు చాలా ఆనందంగా, హాయిగా గడిచిపోయింది.

పి.పి.సి. పాస్ అయిన తరువాత, బి.డి.ఎస్. మొదటి సంవత్సరం క్లాసులు మొదలయ్యాయి. అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పక్క గల్లీ ఆనుకుని ఉన్న కొన్ని పురాతన కట్టడాల్లో బి.డి.ఎస్. తరగతులు, ప్రాక్టికల్స్ జరుగుతుండేవి. మా బ్యాచ్ చేరిన మొదటి సంవత్సరం, డెంటల్ వింగ్ చీఫ్‌గా ప్రొఫెసర్ తజమ్మల్ హుస్సేన్ గారు ఉండేవారు. ఆయన ప్రత్యేక అంశం ‘ఓరల్ – సర్జరీ’. ఇప్పుడు దానినే ‘మాక్సీలో ఫిషియల్ సర్జరీ’ అంటున్నారు. దేశ వ్యాప్తంగా, మంచి టీచర్‌గా ఆయనకు పేరు ప్రతిష్ఠలున్నట్టు చెప్పుకునేవారు. ఆయనను చూస్తే భయం వేసేది. విద్యార్థుల డ్రెస్ కోడ్ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. హాస్యంలో అందెవేసిన చెయ్యి. ఉర్దూలో మంచి జోక్స్ వేసేవారు. దురదృష్టవశాత్తు ఆయన పాఠాలు వినే అవకాశం మాకు లేకుండా పోయింది. ఆయన హయాంలో, అంటే 1978 వరకూ డెంటల్ వింగ్, డెంటల్ కళాశాలగా, రూపాంతరం చెందలేదు. ఆయన తర్వాత ప్రొఫెసర్ శేషాద్రి గారు, డెంటల్ వింగ్ చీఫ్ కావడం, తదుపరి, అది ప్రభుత్వ దంత వైద్య కళాశాలగా రూపాంతరం చెంది స్వీయ పాలనలోనికి రావడం జరిగింది. ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దంత వైద్య కళాశాల మొదటి ప్రిన్సిపాల్‌గా చరిత్రకెక్కారు. మేము బి.డి.ఎస్. మొదటి సంవత్సరం నుండి ఫైనల్ ఇయర్ వరకు ఆ భవన సముదాయములోనే గడిపాము. తరువాత కళాశాల రెండు చోట్లకు స్థానభ్రంశము చెంది ప్రస్తుతం వున్నచోట (ఉస్మానియా ఆసుపత్రి పక్కన) స్థిరపడింది.

ప్రోస్థటిక్ ల్యాబ్ – ఒక ప్రత్యేకత:

ప్రొస్థెటిక్ ల్యాబ్ ఒక కర్మాగారంలా ఉండేది. పరికరాలు, చిన్న చిన్న యంత్రాలు, ప్లాస్టర్ బస్తాలు కలిగిన పొడవైన హాలు, పొడవైన బల్ల, దానికి ఒక్కొక్కరికి ఉపయోగపడే లాకర్లు ఉండేవి. ప్రొఫెసర్ గారి చాంబర్ హాలు ముఖద్వారానికి ఆనుకుని ఉండేది. అప్పుడు ప్రోస్తోడెంటిక్ ప్రొఫెసర్‌గా ప్రొ. శ్రీరామమూర్తి గారు ఉండేవారు. ఆయనకు అసిస్టెంట్లుగా స్వర్గీయ డా. ప్రేమానందం గారు, డా. ఎం.ఎస్. గౌడ్ గారు ఉండేవారు. ముగ్గురూ… మూడు రకాల వ్యక్తిత్వాలను కలిగి ఉండేవారు. డా. ప్రేమానందం గారు, డెంటల్ మెటీరియల్స్ సబ్జక్ట్ చాలా బాగా బోధించేవారు. ల్యాబ్‌కు ఆయువుపట్టు అన్నట్టుగా ఒక వ్యక్తి ఉండేవారు. డెంటల్ టెక్నీషియన్ అన్నమాట. ఆయనే, శ్రీ ఎడ్వర్డ్. ఎల్. బాబు. నన్ను చాలా ఆత్మీయంగా చూసుకునేవారు. గొప్పగా అభిమానించేవారు. ఆ కాలంలో ఎడ్వర్డ్ బాబును గుర్తు పెట్టుకోని విద్యార్థి ఎవరూ వుండరు. దానికి కారణం ఆయన పనితనం. మిలటరీలో పనిచేసి వచ్చిన బాబు, ప్రోస్థటిక్ పనిలో సిద్ధహస్తుడు. మంచి సలహాలు ఇచ్చేవారు. డెంచర్స్ చేయడంలో, వాటికి తగినంత పాలిష్ పెట్టి సహజత్వం కల్పించడంలో ఆయనకు ఆయనే సాటి. మాతృభాష తెలుగుతో పాటు -ఆంగ్లం, తమిళం, మలయాళం వంటి భాషలను అనర్గళంగా మాట్లాడగల దిట్ట. సహృదయత, స్నేహశీలత, మెండుగా వున్నఅలాంటి వ్యక్తులను మరచిపోవడం కష్టం.

ల్యాబ్‌లో డెంటల్ మెటీరియల్స్ విచ్చలవిడిగా వుపయోగించి పాడుచేసేవాళ్ళం. అది ఇప్పుడు తలుచుకుంటే, వళ్లు గగుర్పొడుస్తుంటుంది.

ఇది నువ్వు రాసిందేనా…!?:

నాకు ఇంటర్మీడియట్‌లో ఉండగానే, రచనా వ్యాసంగం మీద, అది కూడా మాతృభాష తెలుగులో మక్కువ ఎక్కువ ఏర్పడింది. అది ఇప్పటి వరకూ నన్ను అంటి పెట్టుకుని నాతో పాటే పయనిస్తున్నది. అయితే, నేను బి.డి.ఎస్-రెండవ సంవత్సరంలో ఉండగా అనుకుంటాను, దంత వైద్యం గురించి తెలుగులో ఒక వ్యాసం రాసాను. అది ఒక ప్రముఖ పత్రిక (ఈనాడు/ఆంద్ర పత్రిక – గుర్తు లేదు) లో అచ్చయింది. కానీ,నా వ్యాసం పత్రికలో వచ్చిన విషయం ఎవరికీ చెప్పలేదు. ఆ వ్యాసం పేరు, ‘కట్టుడు పళ్ళు అవసరమా?’. అయితే, నా పుస్తకంలో వున్నఆ పేపర్ కటింగ్ ఎవరో చూచి, దానికి విస్తృత ప్రచారం తెచ్చారు. నాకు ఇష్టం లేకపోయినా, బలవంతంగా, ప్రోస్థటిక్ ల్యాబ్‌లో వున్న డా. ప్రేమానందం గారికి చూపించారు. ఆయన వ్యాసం సాంతం చదివి, నన్ను పై నుంచి క్రిందికి రెండుమూడు సార్లు చూచి, ముఖం అదోలా పెట్టి – “ఇది నువ్వే రాశావా?’’ అని పేపర్ కటింగ్ నా చేతిలో పెట్టారు. ఆయన మాటకు నా ప్రాణం చివుక్కు మంది. మానసికంగా చాలా కృంగిపోయాను. లోలోపల దుఃఖం పెల్లుబికింది. నిశ్శబ్దంగా బయటికి వచ్చేసాను. ఆయన దగ్గర నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను.

అప్పట్లో, ఆంద్ర పత్రిక (సంపాదకులు శ్రీ వీరాజీ) విజయవాడ నుండి వెలువడేది. ఆదివారం ప్రత్యేక అనుబంధంతో కూడిన పత్రిక, హైదరాబాద్‌కు శనివారం సాయంత్రం వచ్చేసేది. అందులో ఒక వ్యాసం రాసాను. దానిని నేనే స్వయంగా తీసుకెళ్లి గురువుగారు డా. ప్రేమానందం గారికి చూపించాను. ఆయన వ్యాసం సాంతం చదివి, నా భుజం తట్టి, అభినందిస్తూ, “నువ్వు భవిష్యత్తులో మంచి రచయిత అయ్యేలా కనిపిస్తున్నావు” అని ఆశీర్వదించారు.

అలా.. ఆయన రెండు రకాల మాటలు నన్ను ప్రేరేపించి, ఉత్తేజితుడిని చేసి, నన్ను ఒక కవిగా, రచయితగా, వ్యాసకర్తగా, రేడియో బ్రాడ్‌కాస్టర్‌గా మలిచాయని చెప్పక తప్పదు. అందుకే డా. ప్రేమానందం గారిని ఎప్పటికీ మరచిపోలేను.

ఆ.. ప్రోత్సాహం ఈ నాటికి నా చేత, దంత వైద్య విజ్ఞానానికి సంబంధించి తెలుగులో సాధారణ పాఠకుల కోసం నాలుగు పుస్తకాలు రాయించింది. మూడు కథాసంపుటాలు, ఒక కవితా సంపుటి, ఒక స్మృతి గాథ వ్రాసే అవకాశాన్ని కలిగించింది. దంత వైద్యం చదువుకుని ఉండకపోతే.. ఈ రచనా వ్యాసంగం అనే ప్రవృత్తి నాకు సాధ్యమయ్యేది కాదని అప్పుడప్పుడు అనిపిస్తుంది.

ఇతను ప్రొఫెషనల్ విన్నర్…!!:

బి.డి.ఎస్.లో చేరిన రెండో సంవత్సరం అనుకుంటాను, డెంటల్ వింగ్ నోటీసు బోర్డులో, ఒక ప్రకటన నన్ను ఆకర్షించింది. అది ఏమిటంటే ప్రతి సంవత్సరం, జాతీయ స్థాయిలో ఐ.డి.ఏ పక్షాన కాన్ఫరెన్స్ జరిగే ముందు ‘కౌన్సిల్ ఆన్ డెంటల్ హెల్త్’ వారు, టీచింగ్ స్టాఫ్‍కు, విద్యార్థులకు కొన్ని అంశాలలో పోటీలు పెట్టి, గెలుపొందిన వారికి కాన్ఫరెన్స్‌లో బహుమతులు అందజేసేవారు. దానికి సంబంధించిన ప్రకటన అది.

అంశాలలో – వ్యాసం, నాటిక, కథ, మోడల్ తయారీ, చమత్కార సంభాషణ మొదలైనవి వుండి, దంత సంరక్షణ ఆధారంగా ఉండాలన్నది సారాంశం.

గ్రామీణ నేపథ్యంతో వచ్చిన వాడిని కనుక ఆంగ్లంలో రాయడం, మాట్లాడడంలో నాకు అంతగా ప్రావీణ్యం లేదు. కానీ, ఎలాగైనా రాయాలని పట్టుదల పెరిగింది. కానీ, ఈ విషయం ఎవరితోనూ చర్చించలేదు. దంత సంరక్షణ, నేపథ్యంగా తెలుగులో వ్యాసం రాసేసాను. మరి దానిని ఆంగ్లంలోకి తీసుకురావడం ఎలా? నా ఆలోచనలకు బుర్ర వేడెక్కిపోతున్న తరుణంలో, నాకు ఒక సహృదయిని మనస్సులో మెదిలింది. అంతే – ‘సాహసం సేయరా.. డింభకా.. !’ అని మనస్సులోనే అనుకున్నా.

మరునాడు డెంటల్ వింగ్‌లో.. ప్రోస్థటిక్స్ ప్రాక్టికల్స్ క్లాసు అనుకుంటాను. నేను బయటికి వచ్చి ఆ అమ్మాయిని బయటకు రమ్మని సైగ చేసాను. మేమిద్దరం అప్పటివరకూ.. మామూలుగా పలకరించుకోవడం తప్ప — పట్టుమని పది నిముషాలు ఆత్మీయంగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు. ఆవిడ నా నిశ్శబ్ద పిలుపును గ్రహించి, బెదురు.. బెదురుగా.. బయటికి వచ్చి ఏమి అడుగుతానో/ఏమి చెబుతానో అన్న ఆత్రుతతో నా ముఖం లోనికి చూసింది. కూల్‌గా విషయం చెప్పాను – నా తెలుగు వ్యాసము అనువాదం చేసిపెట్టమని. దానికి ఆవిడ చాలా సంతోషంగా అంగీకరించారు. తర్వాత రోజు నా తెలుగు వ్యాసం ఆవిడకు ఇచ్చాను.

రెండు రోజుల్లో అది ఆంగ్ల వ్యాసంగా తయారై నా చేతిలోకి వచ్చింది. వెంటనే అది సంబంధిత చిరునామాకు పంపించేసాను. కౌన్సిల్ ఆన్ డెంటల్ హెల్త్ ఆఫీసు అప్పట్లో ఇండోర్‌లో ఉండేది. చైర్మన్‌గా ప్రొఫెసర్ వేద్. పి. జలీలి ఉండేవారు. ఇంతకీ నా వ్యాసాన్ని ఆంగ్లీకరించిన మహానుభావురాలి పేరు చెప్పనే లేదు కదా! ఆవిడ ఎవరో కాదు నా సహాధ్యాయిని, డా. జయంతి గారు. ఇప్పటికీ నా రచనలు చదివి ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే… నాకు తెలిసి అప్పటి వరకూ డెంటల్ వింగ్ నుండి ఇలాంటి పోటీలలో పాల్గొన్న దాఖలాలు లేవు… అంటే, నేనే ఆరంగేట్రం చేసినట్టు లెక్క! అదృష్టవశాత్తు, ఆ సంవత్సరం నాకు ప్రథమ బహుమతి లభించింది – విద్యార్థుల విభాగంలో. నా సంతోశానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సంవత్సరం కాన్ఫరెన్స్ పూనాలో జరిగింది. నన్ను కాన్ఫరెన్సుకు రమ్మని ప్రొఫెసర్ శ్రీరామమూర్తి గారు చెప్పారు, కానీ.. అప్పటి నా ఆర్ధిక పరిస్థితి వల్లనైతేనేమి, కొంత భయం వల్లనైతేనేమి నేను కాన్ఫరెన్సుకు హాజరు కాలేకపోయాను.

అయితేనేమి నా పక్షాన డా. శ్రీరామమూర్తి గారు అప్పటి కేంద్రమంత్రి గోఖలే గారి చేతులు మీదుగా అందుకుని, తర్వాత, ప్రొస్థెటిక్ క్లాసులో ప్రత్యేకంగా దాని గురించి వివరించి, నాకు అభినందనలు తెలిపి బహుమతి కప్పు నాకు నా సహాధ్యాయుల కరతాళ ధ్వనుల మధ్య చేతిలో పెట్టారు. అది నాకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది.

తర్వాత వరుసగా రెండు సంవత్సరాలు, వివిధ విభాగాలలో బహుమతుల పర్వం కొనసాగింది. నాతో పాటు, డా. శంకర్ లాల్ (మోడల్), డా. క్రాంతి, డా. ప్రణబ్, డా. రత్న సింగం వంటి వారు కూడా పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. సంవత్సరం గుర్తు లేదు గానీ,గుంటూరులో, డా. కృష్ణార్జున రావు గారి సారధ్యంలో జాతీయ కాన్ఫెరెన్స్ జరిగింది.

అక్కడ బహుమతి ప్రధాన కార్యక్రమంలో వి.పి. జలీలి గారు – “హీ ఈస్ ఏ ప్రొఫెషనల్ విన్నర్” అని ప్రశంసించడం నా జీవితంలో మరచిపోలేని మధుర ఘట్టమే మరి!

ప్రిన్సిపాల్ శేషాద్రి గారు నాకు అప్పగించిన గొప్ప పని:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దంత వైద్య ప్రాముఖ్యత కోసం, వైద్య విస్తరణ కోసం అహర్నిశలు శ్రమించి, శ్రమకు తగ్గ ఫలితాన్ని సాధించిన మహానుభావుడు కీ. శే. ప్రొఫెసర్ శేషాద్రి గారు. ఆయన కల ఫలించి ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్‌గా చరిత్రలో నమోదు అయ్యారు. అప్పటికి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్‌లో ఏకైక దంత వైద్య కళాశాల, మన ప్రభుత్వ దంత వైద్య కళాశాల.

ఎందుకో, సర్ నన్ను బాగా ఇష్టపడేవారు (జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా నేను వున్నప్పుడు, చిన్న మాటల యుద్ధం మా మధ్య జరగడం, ఇక్కడ అప్రస్తుతం అనుకుంటాను). నా పేరు కూడా చిరస్థాయిగా మన దంత వైద్య కళాశాలతో ముడిపడి వుండే పని ఒకటి ఆయన నా చేత చేయించారు. అది ఇప్పటి తరానికి తెలియదనే ఉద్దేశంతో ఇక్కడ ప్రస్తావించవలసి వచ్చింది. కళాశాలలో అంతమంది ఉండగా ఆ బృహత్ కార్యక్రమాన్ని నాకే అప్పగించడం నాకు ఆనందంగానూ, గర్వంగానూ ఉంటుంది.

ఒక రోజు నన్ను ఆయన ఛాంబర్‌కు పిలిపించుకుని, ఇతర రాష్ట్రాలకు సంబందించిన అనేక దంతవైద్య కళాశాలలకు సంబంధించిన అనేక సావెనీర్‌లు నా ముందుంచి – “ప్రసాద్, ఈ కళాశాలల ‘ఎంబ్లెమ్’లు, అన్నీ పరిశీలించి, మన దంత వైద్య కళాశాల కోసం ఒక మంచి ‘ఎంబ్లెమ్’ చేయించు” అన్నారు. ఆయన మాట కాదనలేక, ఆ పనిని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఒప్పుకున్నాను. మా కుటుంభానికి అత్యంత దగ్గర మిత్రులు, ప్రముఖ చిత్రకారులు, నవల, కథా రచయిత, కవి అయిన పెద్దలు శ్రీ శీలా వీర్రాజు గారికి విషయం చెప్పి ఇతర కళాశాలల సావెనీర్‌లు ఆయన ముందు పెట్టాను. ఒక్క రోజులోనే ఆయన మన కోసం చక్కని ఎంబ్లెమ్ గీసి ఇచ్చారు. ప్రొ. శేషాద్రి గారికి అది బాగా నచ్చింది. ప్రస్తుతం మన కళాశాలకు ఎంబ్లెమ్‌గా కొనసాగుతున్నది అదే! ఇది నాకు ఎంతో తృప్తి నిచ్చిన పని. సహృదయులు శ్రీ శీలా వీర్రాజు గారు అప్పుడు ఒక పైసా కూడా తీసుకోకుండా ఆ పని చేసిపెట్టారు, ఆయనను మన అల్యుమినీ సన్మానించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

మహానుభావుడి మంచి మనస్సు:

ఆయన విగ్రహం అందమైనది, మనస్సు వెన్నలాంటిది. చూడగానే నమస్కరించాలనిపించే గొప్ప వ్యక్తిత్వం, సహృదయత ఆయన చిరునామా. వెరసి ప్రొఫెసర్ పి. రామచంద్రా రెడ్డి గారు. అందరూ ఆయన దగ్గర శిష్యరికం చేయడానికి, ఆయన ఆశీస్సులు పొందడానికి, రకరకాల మార్గాలు అన్వేషిస్తుంటారు. కానీ, నా అదృష్టం ఏమో గానీ, ఆయనే నన్ను పిలిచి, ఆయన స్వంత క్లినిక్‌లో నాకు చోటు కల్పించారు. తగిన పారితోషికం ఇచ్చేవారు. అలా ఆయన దగ్గర ప్రాక్టీస్‌కు సంభందించిన ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాను. రకరకాల మనస్తత్వం గల పేషేంట్లతో ఎలా వ్యవహరించాలన్నది ఆయన దగ్గరే అర్థమైంది. ఆయన స్వంత క్లినిక్‌లో పూర్తి స్వేచ్ఛను ఇచ్చి చికిత్సలకు మార్గదర్శనం చేసిన మహానుభావుడు ఆయన.

అంతమాత్రమే కాదు, సింగరేణి కాలరీస్ ఆసుపత్రులకు డా. రామచంద్రారెడ్డిగారు ప్యానల్ డెంటల్ ఎక్సపర్ట్ గా ఉండడం వల్ల నన్ను ఆ ఆసుపాత్రుల కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఆరు నెలలు దంత వైద్య నిపుణుడిగా పనిచేసే అవకాశం ఆయన వల్లే ప్రాప్తించింది. ఆయన పెద్దవారు అయిపోయినప్పటికీ, ఇప్పటికీ, అప్పుడప్పుడు కాల్ చేసి నా యోగక్షేమాలు తెలుసుకోవడం ఆయన సహృదయతకు, వాత్సల్యానికి తార్కాణాలు.

ఇలా ప్రభుత్వ దంత వైద్య కళాశాలతో, ఇంకా ఎన్నెన్నో అనుభవాలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ ఇక్కడ వ్యక్తేకరించడం సబబు కాదేమో! నా సహాధ్యాయులు, మంచి క్రీడాకారులుగా రాణించిన వారున్నారు. పి.జి.లు చేసి ప్రొఫెసర్లు అయినవాళ్లు, ప్రిన్సిపాల్స్ అయినవాళ్లు వున్నారు. స్వచ్ఛందసేవలో రాణిస్తున్నవారూ వున్నారు. వారందరి గురించి విన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను. దంత వైద్య రంగంలో అనేక కోణాలలో సేవలు అందించిన డా. నిరంజన్ సింగ్ యాదవ్ గారి లాంటి పెద్దల స్ఫూర్తి, జీవితాంతం, చుక్కానిగా మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది.

దంతవైద్య రంగం లోనికి నేను రాకుండా ఉంటే, సమాజంలో ఇంత గౌరవం నాకు లభించి ఉండేది కాదేమో! అందుకే నా వృత్తిమీద నాకు అమితమైన గౌరవం. దంతవైద్యుడిని అయినందుకు గర్వపడుతుంటాను. ఈ రంగం లోనికి దారి చూపించిన మా చిన్నన్నయ్య డా. మధుసూదన్ కానేటికి ఎంతగానో రుణపడి వుంటాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here