జ్ఞాపకాల పందిరి-103

26
6

ఇదేమి శిక్ష..!!

[dropcap]అ[/dropcap]ల్లరి చేయడం పిల్లల హక్కు! అల్లరి అంటే ఏమిటో తెలియని స్థితిలో పిల్లల అత్యుత్సాహాన్ని ‘అల్లరి’ అనాలేమో. వాళ్ళ దృష్టిలో అది ఒక క్రీడ. దానివల్ల కలిగే లాభనష్టాల గురించి పిల్లలకు తెలియదు. హద్దులు దాటితే ఏదైనా వికృతంగా తయారవుతుంది. కన్నవారికి అది ఆనందం అవుతుందేమో గానీ ఎదుటివారికి అభ్యంతరంగా మారుతుంది. అల్లరిని అదుపు చేయవల్సిన బాధ్యత తల్లిదండ్రులదే! అల్లరి చేస్తున్నాడని అదే పనిగా చావబాదే తల్లిదండ్రులు కూడా వున్నారు. కేవలం పిల్లలను దండించడం వల్ల, వాళ్ళు అల్లరి మానేస్తారని అనుకోవడం తప్పు. పిల్లలకు నచ్చచెప్పడం ద్వారా అల్లరి మాన్పించాలి గాని అదే పనిగా కొట్టడం వల్ల బండబారిపోతారు గానీ మారరు.

అది తెలీక చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు సరైన మార్గదర్శనం చేయకుండానే, ఏ చిన్న తప్పుచేసిన (అది తప్పు అని వాళ్లకు తెలియదు కదా!) అల్లరి చేసినా, పిల్లలు అన్న జ్ఞానం మరచి గొడ్డును బాదినట్టు బాదేస్తారు. దీనివల్ల పిల్లలు తల్లిదండ్రులు ఊహించిన దానికి భిన్నంగా తయారవుతారు. దెబ్బలకు అలవాటు అయి క్రమంగా బండబారిపోయి తర్వాత దెబ్బలను కూడా లెక్కచేయరు. తద్వారా తప్పులు చేయడంగానీ అల్లరి చేయడంగాని మానరు. ఇది చాలా సున్నితమైన సమస్య.

పిల్లలు అల్లరిచేసినా, తప్పులు చేసినా దానికి పూర్తి బాధ్యతను తల్లిదండ్రులు లేదా పిల్లల సంరక్షకులు వహించక తప్పదు. చిన్నపిల్లలకు ఆ వయస్సుకు తగ్గట్టుగా మృదువుగా, ఏది మంచి, ఏది చెడ్డ అన్నది చెప్పాలి. ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అన్నది కూడా పిల్లల బుడి బుడి నడకల స్థాయిలోనే వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. మన ఇంట్లో మన పిల్లలు అల్లరి చేస్తేనేమి? అని కొందరు ఎదురు ప్రశ్నించవచ్చు. మరి పిల్లలతో ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అల్లరి చేయరని గ్యారంటీ ఏముంది?

రచయితతో చిన్న బావమరిది జాషువా. పాండ్రాక (విజయవాడ)

నాకు మంచి పేరున్న వైద్య మిత్రుడు ఉండేవాడు. ఆయన శ్రీమతి సాధారణ గృహిణి. మా ఇరుకుటుంబాల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉండేవి. మంచి కుటుంబం. వారికి ముగ్గురు మగపిల్లలు ఉండేవారు. అందులో ఒకరు మా అబ్బాయి క్లాస్‌మేటే, మరో అబ్బాయి మా అమ్మాయి క్లాస్‌మేట్. అంతా బాగా ఉండేవారం. కానీ ఎప్పుడైనా వారాంతరంలో మా ఇంటికి వచ్చినప్పుడు నేను టివి, రిఫ్రిజిరేటర్, టేప్ రికార్డర్ వంటి వస్తువుల దగ్గర కాపలాగా ఉండేవాడిని. వాళ్ళు యెంత అల్లరి చేసినా తల్లిదండ్రులు అసలు పట్టించుకునేవారు కాదు. వస్తువు పోతే తిరిగి సమకూర్చుకునే పరిస్థితి నాకు అప్పుడు అసలు లేదు. అలా వుంటాయి పరిస్థితులు. అలాంటి పిల్లలను చూసిన ఇతరులు తక్షణం అనేమాట “ఇదేమి తల్లిదండ్రుల పెంపకం” అని.

రచయితతో వారి అబ్బాయి రాహుల్. కానేటి (బోస్టన్-అమెరికా)

ఇంకొక విషయం ఏమిటంటే ఎదుగుతున్న పిల్లల ఎదురుగా తల్లిదండ్రులు సరసాలాడడం, దుర్భాషలాడుకోవడం, కొట్లాట పెట్టుకోవడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం వంటివి చేయడం వల్ల ఆ ప్రభావం పిల్లల మీద తప్పక పడుతుంది. పిల్లలను చదువుకోమని, తల్లిదండ్రులు పెద్ద సౌండ్‌ పెట్టి టి.‍వి, చూడడం, పాటలు వినడం పిల్లలను పెడత్రోవ పట్టిస్తాయి. అంతమాత్రమే కాదు, పిల్లలకు – తండ్రి గురించి తల్లి చెడుగా చెప్పడం, అదే విధంగా తల్లి గురించి చెడుగా తండ్రి చెప్పడం వంటివి పిల్లలను అయోమయంలో పడేసి వారిని చెడు మార్గంలోకి నెట్టేసే పరిస్థితులు ఏర్పడతాయి. పిల్లల్లో క్రమశిక్షణ లోపిస్తుంది, ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడడో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబాలలో, సంసారాలలో బీటలు వారే పరిస్థితులు ఏర్పడతాయి. అందుచేతనే పిల్లలు ఏమి చేసినా, ఎక్కడో తల్లిదండ్రులు తప్పు చేసినట్టుగా భావించవలసి ఉంటుంది. పిల్లల ఎదుగుదల దశ చాలా సున్నితమైనది. ఆ సమయంలో వినిపించే ప్రతిమాట, కనిపించే ప్రతి దృశ్యం వాళ్ళ మస్తిష్కంలో ముద్రపడిపోతుంది. అందుకే పిల్లల పెంపకం అనుకున్నంత సులభం కాదు. జాగ్రత్తలు పాటిస్తే కష్టమైన పని కూడా కాదు.

చిన్నప్పుడు రాహుల్ (కుడి)

ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మా అబ్బాయి (రాహుల్) మా చిన్న బావమరిది (జాషువా) బాల్యంలో నాకు ఎదురైన చిన్న సంఘటన గురించే – సుమారుగా పాతిక సంవత్సరాల క్రితం మాట. నేను మహబూబాబాధ్ ఆసుపత్రిలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న రోజులు. మా అబ్బాయికి (రాహుల్ కానేటి) నాలుగైదు సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. మా చిన్న బావమరిది (జాషువా సుందర్. పాండ్రక) మా వాడికంటే కొన్ని సంవత్సరాలు పెద్దవాడు. సెలవులు ఉన్నప్పుడల్లా మా బావమరిది విజయవాడనుండి మహబూబాబాద్‌కు మా ఇంటికి వచ్చేవాడు. ఇద్దరు అక్కలు, ఒక అన్న తర్వాత చాలా కాలానికి పుట్టినవాడు (అందుకే చిన్ని.. అని పిలుస్తారేమో) చాలా గారాబంగా పెంచేవారు. అల్లరి బాగా చేసేవాడు, చిలిపి పనులెన్నో చేసేవాడు. ఇంట్లో అతడి చేష్టలను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. నాకు మాత్రం కాస్త భయపడేవాడు. అతనొక్కడే నన్ను ‘బావగారు’ అని పిలుస్తాడు. (పెద్ద బావమరది, మరదలు నన్ను ‘మామయ్య’ అని పిలుస్తారు).

బాల రాహుల్
రాహుల్ (ఎడమ), జాషువా (కుడి)
జాషువా (ఎడమ), రాహుల్ (కుడి)

సెలవులకు ఒకసారి మా చిన్న బావమరిదిని తీసుకుని మా ఇంటికి వచ్చారు మా అత్తగారు. ఒకరోజు నేను సాయంత్రం ఆసుపత్రి డ్యూటీ ముగించుకుని సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటుండగా, మా అబ్బాయి రాహుల్ ఏడుపు వినిపించింది. మామూలుగా చిన్న చిన్నవాటికి మా అబ్బాయి ఏడ్వడు. ఏడుస్తున్నాడంటే అదేదో పెద్ద విషయం అనుకుని వెంటనే బయటకు పరిగెత్తాను. రాహుల్ ఏడుస్తున్నాడు, చిన్న బావమరిది జాషువా సీరియస్‌గా వున్నాడు. సంగతేమిటని రాహుల్‌ని అడిగాను. వాడు ఏడుస్తూనే “చిన్ని (జాషువా) కొట్టాడు” అన్నాడు, అతని వైపు చూపించాడు. నిజానికి అబ్బాయి చెప్పినదానిని బట్టి, నేను మా బావమరిదిని కొట్టడమో, భయం చెప్పడమే చేయాలి. కానీ దానికి వ్యతిరేకంగా ఇంకా ఏడుస్తున్న నా కొడుకునే చీపురు లోని ఈన తీసుకుని కొట్టడం మొదలు పెట్టాను. ఆశ్చర్యంగా దెబ్బలు తిన్నవాడు ఏడుపు మానేసాడు, దెబ్బలు తినవలసిన వాడు ఏడ్వడం మొదలు పెట్టాడు. తన తప్పు తెలుసుకున్నాడు “బావగారూ.. రాహుల్‌ని కొట్టకండి, ఇంకెప్పుడూ రాహుల్‌ని కొట్టను” అంటూ దండాలు పెట్టడం మొదలు పెట్టాడు. నా భయానికి మావాడు బిగబట్టుకుని కూర్చున్నాడు. అనవసరంగా మా వాడిని కొట్టినందుకు లోలోపల నేను ఏడ్చుకున్నాను. వాడిని ఎత్తుకుని లోపలికి తీసుకుపోయాను.

జాషువా కుటుంబం (విజయవాడ)

అది ఇప్పటికీ అది నాకు బాధ కలిగిస్తూనే వుంది, కానీ అప్పటి నుండి మా బావమరిది అల్లరి స్థాయి తగ్గించేసాడు, నేనంటే అతనిలో భయంతో కూడిన గౌరవం ఏర్పడింది. ఆ గౌరవం, తనకు పెళ్ళై పిల్లలు కలిగినా అతను ఇప్పటికీ కొనసాగిస్తూనే వున్నాడు. వాళ్లిద్దరూ ఇప్పటికీ మంచి స్నేహితుల్లా వుంటారు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, పిల్లలు ఎదుగుదల, వారి చేష్టలు, వ్యక్తిత్వం, తల్లిదండ్రుల పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది. పిల్లల పట్ల ప్రేమగానే ఉండాలి, కానీ అవసరమైనప్పుడు క్రమశిక్షణ గుర్తు చేయవలసిందే. ప్రేమ పేరుతో గారాబం, పిల్లల భవిష్యత్తుకు స్పీడ్ బ్రేకర్ కాకూడదు. అలాగే క్రమశిక్షణ పేరుతో పెద్దలు ‘అతి’ ప్రదర్శించడం కూడా మంచిది కాదు. హద్దులు దాటితే ఏదీ మంచి ఫలితాలను ఇవ్వదు. పిల్లలను పెంచడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా ఈ రోజుల్లో అది కత్తిమీద సాము లాంటిదే!

శ్రీమతి దివ్యతో….రాహుల్ (బోస్టన్)
తల్లిదండ్రులతో, శ్రీమతితో రాహుల్.

అవసరమైనప్పుడు పిల్లలకు చిన్న చిన్న శిక్షలు, తాత్కాలిక విషయం, కానీ ఆ క్రమశిక్షణ జీవితాంతం వారితో కలిసి పయనిస్తుంది, అందులో ఎలాంటి సందేహమూ లేదు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here