జ్ఞాపకాల పందిరి-105

28
10

పేదవాడు.. పేదవాడిగా మరణించకూడదు…!!

[dropcap]పే[/dropcap]దరికం అనేది రాచపుండు లాంటిది. అంటే పేదరికం యెంత సమస్యాత్మకమో, పేదరికాన్ని భరించడం యెంత కష్టమైనదో, పేదవాడికి అర్థం ఆవుతుంది. అందుకే ప్రపంచంలో యావత్ సమాజమూ, ఉన్నవాళ్లు, లేనివాళ్లు అని రెండు ప్రధాన వర్గాలుగా విడిపోయిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ వ్యత్యాసం అలా కొనసాగుతూనే వుంది, క్రమంగా కొంత శాతం ప్రజలు తమ శాయశక్తులా కష్టపడి,అన్ని అందుబాటులోవున్న వనరులను సద్వినియోగం చేసుకుని పేదరికాన్ని తరిమికొట్టినవారు/తరిమి కొడుతున్నవారూ లేకపోలేదు. కానీ కొద్దితేడాలతో ఆ వ్యత్యాసం అలా కొనసాగుతూనే వున్నది. దానికి ఆయా ప్రజలూ, ప్రభుత్వాలు కారణమే అనిపిస్తుంది. కొన్ని పార్టీలు – ప్రభుత్వాలూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ పార్టీల/ప్రభుత్వాల మనుగడ కోసం, ఉచిత పథకాలు ప్రవేశపెట్టి ఆయా ప్రజలను, ప్రజల పనితనాన్ని, వాళ్ళ శ్రమశక్తిని నిర్వీర్యం చేస్తూ, వారి జీవితాలలో శాశ్వత ప్రగతి కనిపించకుండా తాత్కాలిక తాయిలాలతో పబ్బం గడిపే కుయుక్తులు, మంత్రతంత్రాల వలను ఆయా ప్రజల మీదికి విసురుతున్నారు. అలా పేదవాడు మోసపూరిత పథకాలకు ఆశపడి, బానిసగా మారి, చివరకు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. జరుగుతున్న మోసాన్ని గ్రహించలేక పోతున్నాడు. అలా పేదరికం తర తరాలకు, ఒక గొలుసు మాదిరిగా కొనసాగుతూనే వుంటున్నది. జరుగుతున్న మోసం గ్రహించే స్థితిలో సామాన్యుడు లేడు.

తాయిలాల మోజులో ప్రశ్నించే హక్కును కోల్పోనున్నాడు. ఓటు బ్యాంకు లో తానూ మరొక సభ్యుడిగా నమోదు అయిపోతున్నాడు. అయితే కొంతమంది మేధావులు చెప్పినట్టు ‘పేదవాడిగా పుట్టటంలో తప్పు లేదు కానీ, పేదవాడిగా మరణించడం నేరం,,!’ అన్నది నిజమే అనిపిస్తున్నది. జన్మతః పేదవాడుగా పుట్టడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ తాను చేయవలసినంత కృషి చేయకపోవడం వల్లనే, శ్రమించక పోవడం వల్లనే, చావును కూడా పేదరికంతోనే కౌగలించుకుంటున్నారన్న విషయం విదితమవుతోంది.

కష్టపడితే సాధించ లేనిదంటూ ఏమీలేదు. పేదరికం కూడా అలాంటిదే. రాచపుండును, ప్రాథమిక దశల్లో కనుగొనినట్లైతే దాని నుండి పూర్తిగా విముక్తి పొందవచ్చును, అదే రకంగా సకాలంలో స్పందించగలిగితే పేదరికాన్ని సైతం పారద్రోలే అవకాశాలు ఉంటాయి. అవి ప్రజల తెలివితేటల మీద, శక్తియుక్తుల మీదా ఆధారపడి ఉంటాయి. అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలేగానీ, మనకు ఎదురు రావు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇది ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన విషయం అది కూడా పెదకూలీల గురించి. కోస్తాప్రాంతంలో పంటపొలాల్లో (వరి) పనులు ముందుగా అయిపోయేవి. అప్పుడు కూలీలు ఖాళీగా ఉండకుండా, రేవు దాటి నెలలకొద్దీ పశ్చిమ గోదావరి జిల్లాలో పంట పనులకు (ఊడ్పులు-కోతలు వగైరా) వెళ్లేవారు. స్థానికంగా పనులు ఉన్నన్నాళ్ళు ఉండిపోయేవారు. దీనిని అక్కడి భాషలో ‘ఏటవతలికి’ అనేవారు. ఇలాంటి విషయాలన్నీ స్వర్గీయ కె.కె. మీనన్ గారు తన నవల ‘బాకీ -బతుకులు’లో చాలా వివరంగా రాశారు. ఇలాంటి పనులు చేసుకుని ఆర్థికంగా బలపడినవారు చాలామంది వున్నారు. కేవలం కూలీలుగా మిగిలిపోయిన వారూ వున్నారు.

తమ్ముడు ఆశీర్వాదం. ఈద(సరిపల్లి-పగోజి)

అలాగే, గతంలో ఒకానొక సమయంలో గల్ఫ్ దేశాలలో, గృహ సహాయకుల అవసరం ఏర్పడింది. ఆ అవసరాన్ని ప్రపంచంలోని పేదదేశాలలోని అనేక ప్రజలతో పాటు మనదేశంలోని చాలామంది పేదప్రజలు కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అందులో నేను స్వయంగా గమనించిన ఉభయ గోదావరి జిల్లాలు కూడా వున్నాయి. కొందరు మధ్యవర్తుల ద్వారానూ, మరికొందరు తెలిసినవారి ద్వారాను గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రయోజనం పొందిన వారూ వున్నారు, ఘోరంగా మోసపోయి అనేక వ్యథలకు గురి అయినవారూ (తక్కువ శాతంలో) వున్నారు.

సంవత్సరాల తరబడి అక్కడ వుండి ఆస్తులు సంపాదించుకుని కుటుంబాన్నీ అభివృద్ధి పథం వైపు నడిపించినవారూ వున్నారు, అదేవిధంగా వారు జల్సాలకు అలవాటు పడడమే గాక ఇంటి దగ్గర వున్న కుటుంభానికి అనవసర అలవాట్లు నేర్పించడం మూలాన, సంపాదించిందంతా హారతి కర్పూరంలా కరిగించి, తర్వాత చేతులెత్తేసిన వారూ వున్నారు. వీరికి ఇంకా భిన్నంగా ఇంటిదగ్గర భార్యా పిల్లలు, ఇంటి యజమాని గల్ఫ్ దేశాల్లో వున్నా లేదా భార్య విదేశాలలో పనిచేస్తూ భర్తా-పిల్లలూ ఇంటిదగ్గర వున్నా, అవగాహన లేనివాళ్లు, ముందు చూపు లేనివాళ్ళూ సంపాదించిన ఆస్తులు నిలబెట్టుకోలేక పోయారు. జాగ్రత్త పడ్డవాళ్ళు ధనికుల జాబితాలో చేరిపోయారు. మొత్తం మీద ఆయా గ్రామాల్లో ఆర్థికపరమైన పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కువశాతం పూరిగుడిసెలు, పెంకుటిళ్లుగానూ, మేడలూ -మిద్దెలుగానూ రూపాంతరం చెందాయి. అలా కొన్ని గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. అనేక పేద కుటంబాలు, మధ్యతరగతి స్థాయికి, అంతకంటే పైకి ఎగబ్రాకాయి. ఒకప్పుడు సైకిలు కూడ కొనుక్కొని స్థాయిలోలేని పేదకుటుంబాల ఇళ్లల్లో ఖరీదైన మోటారు సైకిళ్ళు, కార్లు దర్శనమిస్తున్నాయి. ఇది పెద్ద మార్పు. ఈ నేపథ్యంలో మా బంధువులు చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్లి సంపాదించుకున్నవాళ్ళు వున్నారు, చితికిపోయినవాళ్ళూ వున్నారు. ఎవరి గురించో ఎందుకు మా తమ్ముడు (పిన్ని కొడుకు – సరిపల్లి గ్రామం, ప. గో. జి) విషయమే ఒక ఉదాహరణగా మీ ముందు వుంచుతాను.

మనుమలు-పెద్ద మనవరాలుతో ఆశీర్వాదం

మా పిన్నివాళ్ళ కుటుంబం వ్యవసాయాధారిత రైతు కుటుంబం, మాకంటే మెరుగ్గానే ఉండేది. పిల్లలు చిన్నగావున్నంత వరకూ వాళ్లకు ఎలాంటి ఆర్థిక సమస్య లేదు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్లకు ఆర్థిక అవసరాలు పెరిగాయి. మా పిన్ని సంతానం ముగ్గురిలో మధ్యవాడు, నాకు తమ్ముడు ఆశీర్వాదం ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదువుకుని ఇక చదవలేక చేతులెత్తేశాడు. అంతమాత్రమేకాదు పక్కవూరి అమ్మాయిని ప్రేమించి అతికష్టం మీద పెళ్లి చేసేసుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం కాకుండా కొడుకు పుట్టేసాడు. అప్పటికి గానీ అసలు జీవితం అంటేఏమిటో అతనికి తెలిసి రాలేదు. కస్టాలు రుచిచూడడం ప్రారంభమైంది. చంటి పిల్లవాడికి తల్లి పాలు చాలక, పాలు కొని పట్టించే స్తోమత లేక పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అలాంటి పరిస్థితిలో ఆపద్భాంధవుడిలా ఒక బంధువు ఆదుకున్నాడు. ఆయన అప్పటికే గల్ఫ్ (దోహా -ఖతార్) దేశంలో పని చేస్తుండడం వల్ల, మా తమ్ముడికి వర్క్ పర్మిట్ వున్న వీసా పంపించాడు. ఎవరో కాస్త ఆర్థిక సహాయం చేశారు.

ఆశీర్వాదం కుటుంబం

నా స్థాయిలో (అప్పటికి ఇంకా చదూకుంటున్నాను) నేను వస్త్రాల రూపంలో సహాయం చేసాను. వాడు నాకంటే కొద్దినెలల మాత్రమే చిన్నవాడు. దోహా.. వెళ్ళడంతో అతని దశ మారిపోయిందని చెప్పవచ్చు. అక్కడి నుండి ఎప్పుడు వచ్చినా నాకు ఏదో గిఫ్ట్ తెస్తుండేవాడు. తర్వాతి కాలంలో కొద్ది సంవత్సరాలకు భార్యను అక్కడికి తీసుకు వెళ్ళాడు. తర్వాత అతని ఇద్దరు బావమరుదులను, చిన్న కొడుకుని, కూతురుని అల్లుడిని కూడా అక్కడకు చేర్చి ఆర్థికంగా బలపడ్డాడు. అంతవరకూ బాగానే వుంది. కొంత ఆస్తి కూడా సంపాదించుకోవడం జరిగింది. ఇక్కడ సంపాదించడం యెంత కష్టమో, సంపాదించినదానిని నిలబెట్టుకోవడామూ అంతే కష్టం! గతాన్ని మరచిపోయి ఊహాలోకంలో తేలిపోయేవాళ్లు, యెంత వేగంగా ఎదుగుతారో అంతే వేగంగా యథాస్థితికి వచ్చేస్తారు. మా తమ్ముడి విషయంలో అదే జరిగింది. మరీ యథాస్థితికి రాకపోయినా సంపాదించినది అంతా నిలబెట్టుకోలేకపొయ్యాడు. కుటుంబం అంతా ఖతార్‌లో తాను ఒక్కడు స్వగ్రామంలో ఉండడం వల్ల,అతని జీవనశైలి పట్టాలు తప్పింది. దుర్వ్యసనాలకు లోనై, చిన్నవయసులోనే మరణం అతనికి చేరువయింది. తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై తప్పక పడుతుంది. అది మా తమ్ముడి పిల్లలపై పడింది కూడా!

ఆశీర్వాదం పెద్ద కొడుకు సురేష్. ఈద (సర్పంచి-సరిపల్లి)

మా తమ్ముడి పెద్దకుమారుడు మెట్టపొలం, పంటపొలం, ఇతర స్థిరాస్తులు బాగానే సంపాదించుకున్నాడు. అయితే అతనికి రాజకీయాల మోజులో పడి, గ్రామ సర్పంచి చేయాలనే కోరిక కలిగింది. అతని కోరిక నెరవేరి మొన్నటి ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో సరిపల్లి -గ్రామసర్పంచ్‌గా ఎన్నిక అయినాడు గానీ, చాలా ఆస్తిని అమ్ముకోవాల్సి వచ్చింది. పదవి ఉండడంతో, మళ్ళీ ఖతార్ వెళ్లే ప్రయత్నం అతను చేయలేదు. అతను సర్పంచి కాకముందే అతని తల్లి కూడా చనిపోవడం విషాదకరం.

ఆశీర్వాదం చిన్న కొడుకు ఆనంద్. ఈద కుటుంబం (సరిపల్లి)
ఆశీర్వాదం…అల్లుడు… శ్రీనివాస్, కూతురు.. అరుణ(ఖతార్)
తమ్ముడు ఆశీర్వాదంతో రచయిత డాక్టర్ కెఎల్వి ప్రసాద్ (సరిపల్లి)
ఆశీర్వాదం(ఎడమ) అన్నయ్య, డా.మధుసూదన్. కానేటి(కుడి)

రెండవ కొడుకు కొన్నాళ్ళు గల్ఫ్‌లో పనిచేసినా స్థిరత్వం లేక తిరిగి స్వగ్రామంలోనే కాలక్షేపం చేస్తున్నాడు. కూతురు-అల్లుడు, ఖతార్‌లోవుండి కూడా పిల్లలను హైదరాబాద్ లోనే ఉంచి మంచి చదువులు చదివించుకుంటున్నారు. ఇలాంటి కుటుంబాలు ఎన్నో, కానీ నాకు తెలిసిన నా తమ్ముడి జీవితమే ఉదాహరణగా మీ ముందు ఉంచే సాహసం చేస్తున్నాను. ఇలా చెప్పడం ద్వారా ఆ కుటుంబాన్ని కించపరచడం గానీ, తక్కువచేసి మాట్లాడడం గానీ నా ఉద్దేశం కాదు. క్రమశిక్షణ లేని జీవితాలు ఎలా తారుమారు అవుతాయో చెప్పడమే నా ఉద్దేశం. అందుచేత పెద్దలు చెప్పినట్టుగా పేదగా పుట్టడం తప్పుకాదు, పేదగా మరణించడం తప్పు, కష్టపడి సంపాదించుకున్నది జీవితాంతం నిలబెట్టుకోలేకపోవడం పరమ తప్పు!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here