జ్ఞాపకాల పందిరి-112

22
11

మా ఇంట్లో.. ఆడపిల్లలు..!!

[dropcap]త[/dropcap]ల్లిదండ్రులు అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైనా వారి సంతానం, వారి పెంపకాన్ని బట్టి, పరిస్థితుల అనుకూలతను బట్టి, విద్యా సదుపాయాలను బట్టి, విద్యావంతులు కావచ్చు, లేదా ఎలిమెంటరీ స్థాయిలోనే చదువుకు స్వస్తి పలకవచ్చు, లేదా కొంతమంది అక్షరాస్యులుగాను మరికొంతమంది నిరక్షరాస్యులుగానూ మిగిలిపోవచ్చు. కొన్ని చోట్ల విద్యారంగంలో చొచ్చుకుపోవడానికి, పిల్లల్లో తగినంత ప్రతిభ వున్నా, పేదరికం అడ్డుకట్టగా నిలుస్తుంది. తద్వారా పెద్ద చదువులు చదవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ డబ్బుకు అత్యంత ప్రాధాన్యత వుంది. పుష్కలంగా డబ్బు వుండి అన్నిరకాల సౌకర్యాలు వున్నా కొందరికి చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో తెలివి వుండి కూడా తల్లిదండ్రుల నిర్ణయాల పరంగా ఆడపిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతుంటాయి. బడి/కళాశాల, దూరంగా ఉండడమో, ఆడపిల్లకు త్వరగా పెళ్లి చెయ్యాలనో, ఇలా రకరకాల కారణాల మూలంగా కొన్ని కుటంబాలలో ఆడపిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అయితే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎక్కువ శాతం ఎన్ని కష్టాలనైనా అధిగమించి, తమ కూతుళ్లను విద్యాధికులుగా చేయడానికే అధికంగా మొగ్గు చూపుతున్నారు. అలాగని చదువుకున్నవాళ్లంతా గతంలోలా వంటింటికే పరిమితం కావడం లేదు.

తమ విద్యార్హతకు సరిపడ ఉద్యోగాలలో స్థిరపడుతున్నారు. ఈరోజున తమ కాళ్ళమీద తాము నిలబడగలుగుతున్నారు. జీవితంలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా, ఒడిదుడుకులు చుట్టుముట్టినా దైర్యంగా నిలబడగలుగుతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు లేదా స్త్రీలు చేపట్టని పని అంటూ ఏమీ లేదు. ఒకప్పుడు ఫలానా ఉద్యోగాలు (డాక్టర్లు, నర్సులు, టీచర్లు ఆయాలు, వగైరా) మాత్రమే మహిళలు చేయగలరు అన్నట్టు పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బాలికల పాఠశాలల నుండి, మహిళా కళాశాలల వరకూ విద్యా సదుపాయాలూ వచ్చాయి. ఆటోలు నడపడం నుండి అంతరిక్షంలో దూసుకు పోయే పరిస్థితులు వనితలోకం సంపాదించుకోగలిగింది. ఇదంతా విద్య లేదా చదువుతో ముడిపడి వున్న అభివృద్ధి.

ఈ రోజున భర్తతో పాటు భార్య ఉద్యోగం చేయడం వల్ల సాంకేతికపరమైన ఇబ్బందులు కొన్ని ఎదురైనా, కుటుంభం ఆర్థికంగా ఎదగడానికి, స్థిరపడడానికి ఉపయోగ పడుతున్నది. అయితే యెంత పెద్ద ఉద్యోగం చేసినా, యెంత డబ్బు సంపాదించినా ఇప్పటికీ, భర్తల పెత్తనంలోనే కొంతమంది స్త్రీమూర్తుల ‘ఏ.టి.ఎం.కార్డులు’ మసలుతుంటాయి. ఇది దురదృష్టకరం. అలాగే చదువుకున్న లేదా ఉద్యోగస్థులైన మహిళలపైన ఒక అభియోగం కూడా లేక పోలేదు. అదేమంటే, ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ మహిళల్లో జీవితంపైన ఒకవిధమైన నిర్లక్ష్యం, మిడిసిపాటు, గర్వం ఏర్పడడం వల్ల సంసారిక జీవితం మీద తగినంత శ్రద్ధ చూపడం లేదని, అందుకే చాలా మంది వివాహాలు సంవత్సరం కూడా తిరగక ముందే విడాకుల వరకూ పయనిస్తున్నా యనీను. దీనిని పూర్తిగా సమర్థించలేకపోయినా జరుగుతున్నది మాత్రం వాస్తవం. ఏది ఏమైనా ఒకనాటి పరిస్థితులు కాకుండా ఇప్పుడు ఆడపిల్లలు విద్యావంతులై, ఉద్యోగాలు చేసుకుంటూ తాము ఒకరిపై ఆధార పడకుండా తమ కాళ్ళమీద తాము నిలబడగలగడం నిజంగా మంచి పరిణామం.

మా ఇంట్లో ఆడపిల్లలు దీనికి ముఖ్య ఉదాహరణ. మా అమ్మ పూర్తి నిరక్షరాస్యురాలైనా తన కూతుళ్లను, కోడలిని, మనవరాళ్లను విద్యాధికులుగా చూసింది. ఒక సాధారణ కుటుంబం నుండి ఆ రోజుల్లో ఆడపిల్లలు మంచి చదువులు చదువుకుని జీవితంలో స్థిరపడడం సాధారణ విషయం కాదు.

రచయిత పెద్దక్క… మహానీయమ్మ.కానేటి (నాగార్జున సాగర్)

మా పెద్దక్క కుమారి కానేటి మహానీయమ్మ ప్రాథమిక విద్య మా వూరు దిండి ప్రాథమిక పాఠశాలలోనూ, హైస్కూల్ విద్య అప్పటి తాలూకా కేంద్రమైన రాజోలులో కమలమ్మ గారి వసతి గృహంలో వుండి పూర్తి చేసింది. కాలేజీ విద్య (పి.యు.సి, – బి.ఎస్.సి,) అప్పటి డబ్ల్యు.జి.బి. కాలేజీ (వెస్ట్ గోదావరి భీమవరం కళాశాల) భీమవరంలో పూర్తి చేసింది. అలాగే బి.ఎడ్. కోర్సు రాజమండ్రిలో పూర్తి చేసింది. తన జీవిత కాలం అంతా నాగార్జున సాగర్ (దక్షిణ విజయపురి)లో విద్యాశాఖలో పని చేసి, చివరి రోజుల్లో కేన్సర్ వ్యాధితో మరణించింది. ఆమెది అంతా త్యాగమయ జీవితమే! నేను ఇంటర్మీడియెట్ కోర్సు అక్క దగ్గర వుండి (1972-74) చదువుకున్నాను. మా నాయనకు కొనసాగింపుగా, అక్క దగ్గరే క్రమశిక్షణ నేర్చుకున్నాను.

రచయిత చిన్నక్క…భారతి.మట్టా; బావగారు…స్వామిరావు.మట్టా (సికింద్రాబాద్)

రెండవ అక్క శ్రీమతి మట్టా భారతి దేవి. ప్రాథమిక విద్య మా వూరిలోనే పూర్తి చేసింది. హైస్కూల్ విద్య పాక్షికంగా రాజోలు హై స్కూల్‌లో కమలమ్మ గారి వసతి గృహంలో వుండి చదువుకుంది. ఎస్.ఎస్.ఎల్.సి -మాత్రం నాగార్జున సాగర్‌లో పెద్దక్క మహానీయమ్మ దగ్గర వుండి దక్షిణ విజయపురి హై స్కూల్‌లో పూర్తి చేసింది. తర్వాత పెద్దన్నయ్య కె.కె. మీనన్ దగ్గర వుండి, హైదరాబాద్ లోని కమలా నెహ్రు పాలిటెక్నిక్‍లో, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ పూర్తి చేసి, మొదట లేబర్ డిపార్ట్‌మెంట్ లోనూ, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ లోనూ ఆ తర్వాత రైల్వే శాఖలో స్థిరపడింది. రిటైర్మెంట్ తర్వాత చివరిరోజుల్లో చిన్నక్క కూడా ఆలస్యంగా రోగ నిర్ధారణ జరిగి తను కూడా కాన్సర్ వ్యాధితో మరణించింది.

రచయిత మేనకోడలు…స్వాతి (ఎడమ), పెద్ద వదిన….శిరోరత్నమ్మ (కుడి) హైదరాబాద్

మా పెద్ద వదిన శ్రీమతి శిరోరత్నమ్మ (పెద్దన్నయ్య కె.కె. మీనన్ భార్య) మొదట ఎల్.సి.ఈ (డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్) కాకినాడలో చదువుకుని హైదరాబాద్ లోని చీఫ్ ఇంజనీర్-పబ్లిక్ హెల్త్ ఆఫీసులో సూపర్వైజర్‌గా పని చేస్తూ, నైట్ కాలేజీలో బి.టెక్. పూర్తి చేసి సీనియర్ ఇంజనీర్‍గా పదవి విరమణ చేసి పిల్లల దగ్గర విశ్రాంత జీవితం గడుపుతున్నది.

రచయిత పెద్దన్నయ్య కెకెమీనన్.. కుమార్తె డాక్టర్. అపర్ణ.కానేటి..హైదరాబాద్

పెద్దన్నయ్య కూతురు (శ్రీ మీనన్ – శిరోరత్నం గార్ల మొదటి సంతానం) డా. అపర్ణ. కానేటి నేత్ర వైద్య నిపుణురాలిగా హైదరాబాద్ లోనే స్థిరపడింది. భర్త డా. కమలాకర్ కూడా నేత్ర వైద్యుడే!

రచయిత శ్రీమతి. అరుణ. కానేటి (హన్మకొండ)

నా శ్రీమతి అరుణ కానేటి, హై స్కూల్ విద్య, విజయవాడ ‘బిషప్ హాజరయ్య హైస్కూల్’ లోనూ, డిగ్రీ, విజయవాడ లోని స్టెల్లా కాలేజీ లోనూ, బి.ఎడ్. గుంటూరు లోనూ పూర్తి చేసి, కొద్దికాలం ఉపాధ్యాయిని గానూ, ఆ తర్వాత స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ (ఇప్పుడు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా)లో స్థిరపడి పదవీకాలం పూర్తికాకముందే డిప్యూటీ మేనేజర్‍గా ముందస్తు పదవీ విరమణ చేసింది.

రచయిత అమ్మాయి..నిహార. కానేటి. సికింద్రాబాద్)

ఇక నా కూతురు నిహర.కానేటి, ప్రాథమిక, హైస్కూల్, ఇంటర్మీడియెట్ చదువులు మహబూబాబాద్, హన్మకొండలో పూర్తి చేసి, జన్యు శాస్త్రం ప్రధాన అంశంగా డిగ్రీ, పి.జి. కోర్సులు హైదరాబాద్‌లో పూర్తిచేసి, చదువుకున్నదానికి భిన్నంగా, ఆకాశవాణి (ప్రసార భారతి)లో ప్రోగ్రాం ఆఫీసర్ (పెక్స్)గా స్థిరపడి హైదరాబాద్‍లో పని చేస్తున్నది.

రచయిత కోడలు…దివ్య. కానేటి (నామ) కొడుకు..రాహుల్. కానేటి. అమెరికా (బోస్టన్)

నా కోడలు శ్రీమతి దివ్య. రాహుల్, హైదరాబాద్ వాస్తవ్యురాలు. అక్కడే బి.టెక్, ఎం.బి.ఏ చేసింది. ప్రస్తుతం భర్తతో అమెరికా (బోస్టన్)లో వుంటున్నది.

రచయిత చిన్నక్క కుమార్తెలు(రచయిత మేనకోడల్లు), స్వాతి(ఎడమ)సికింద్రాబాద్, ఉషశ్రీ(కుడి)విశాఖపట్నం

చిన్నక్క భారతికి ఇద్దరు ఆడపిల్లలు. శ్రీమతి ఉషశ్రీ (విశాఖపట్నం), శ్రీమతి స్వాతి.ముదిగంటి (సికింద్రాబాద్). ఇద్దరూ హైదరాబాద్ లోనే డిగ్రీ వరకూ చదువుకున్నారు. ఇద్దరూ గృహిణులు గానే స్థిరపడ్డారు.

విద్యాపరంగా ఒక నిరక్షరాస్యురాలి మార్గదర్శనంలో ఏర్పడ్డ విద్యా కుటుంబం ఇది. ఇప్పుడు బ్రతుకు తెరువు కోసం కాకున్నా ఆడపిల్లలు శ్రద్దగా చదువుకుంటున్నారు, అవసరం వున్నవారు, ఇష్టమైన వారు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు కూడా! ఇప్పుడు స్త్రీని కేవలం వంటింటి కుందేలు అనడానికి ఏమాత్రం ఛాన్సు లేదు.

స్త్రీ విద్య అనేది తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే గాక, రేపటి సమాజ నిర్మాణానికి, విద్యాభివృద్ధికి, స్త్రీమూర్తులకు చదువు అవసరం.

ఆ మార్గంలోనే స్త్రీ – సమాజం పయనిస్తుందని ఆశిద్దాం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here