జ్ఞాపకాల పందిరి-118

28
7

గతం గతః.. కాకూడదు..!!

[dropcap]గ[/dropcap]తం ఎందుకులే అనుకునేవాళ్లూ, గతాన్ని సింహావలోకనం చేసుకుంటూ తీపి చేదు అనుభవాలను ఒకసారి మననం చేసుకునేవారూ కూడా వుంటారు. కొన్ని విషయాలు గుర్తుకు వస్తే, గుర్తు చేసుకుంటే పోయిన రోజులే మంచివి.. అని తృప్తి పడేవాళ్ళూ వున్నారు, జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని బాధపడేవాళ్ళూ వున్నారు. మరి గతం గుర్తుకొచ్చేది ఎలా? అందరికీ ఈ సౌలభ్యం ఉంటుందా? చెప్పలేము. దీనికి తమ తమ ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. రెండూ సక్రమంగా వున్నవాళ్లు చాలా అదృష్టవంతులు, ఇది నిజంగా నిజం.

హైదరాబాద్ (కుబ్దీగూడ)లో అన్నయ్య కెకెమీనన్ తో. రచయిత వయస్సు 14 సంవత్సరాలు

ఆరోగ్యంగా ఉంటే, మెదడు చురుకుగా పనిచేస్తుంటే, గతం అంతా జ్ఞాపకం వచ్చే అవకాశం వుంది. అంటే ఎక్కువశాతం ఆరోగ్యవంతుల్లో జ్ఞాపకశక్తి అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది ఎవరికీ వారు అనుభవించే విషయం, బయటికి చెబితేకాని ఇతరులకు తెలిసే అవకాశం లేదు. వాళ్ళు ఏమి చెప్పినా అది నిజమే అనుకోవాలి.

1962..ప్రాంతం. రాజోలు(తూ.గో.జి) గొల్ల చంద్రయ్య గారి వసతిగృహం. రచయిత బల్లమీద కూర్చున్నవారిలో ఎడమ నుండి రెండవ వారు

వాటికి ఆధారాలు తక్కువ. వీటిని నిజమైన అంశాలుగా మనం పూర్తిగా నమ్మలేము. అలా కాకుండా మన జ్ఞాపకాలను రెండు పద్ధతుల్లో భద్రపరుచుకోవచ్చు. అవి, అనుభవజ్ఞులైన రచయితలు తాము చూచిన, గమనించిన అంశాలను, పుస్తక రూపంలో అక్షరబద్ధం చేసిన చరిత్రలు, రెండవది ఛాయాచిత్రాలు లేదా ఫోటోలు. ఇవి రెండూ కూడా గత జ్ఞాపకాలను లేదా చరిత్రను ముందు తరాల కోసం భద్రపరచదగ్గ అమూల్య సాధనాలు.

పాతికేళ్ల క్రితం మహబూబాబాద్ లో వుండగా రచయిత తీసిన ఫోటో… వారి కొడుకు రాహుల్, కూతురు నిహార.

అయితే ఇవి రెండూ కూడా వ్యయ ప్రయాసలతో కూడుకున్నవే. అందరికీ కాక ఏ కొందరికో మాత్రమే సాధ్యపడేవి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈ రెంటితో ముడిపడివుండడం వల్ల, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజానీకానికి ఇవి రెండూ అందని ద్రాక్షపళ్లే! అందుచేత వీటి రూపంలో ఏ కొద్దిమందికో తమ జ్ఞాపకాలను తిరిగి పదే మననం చేసుకునే అవకాశం కలుగుతుంది.

స్వగ్రామంలో, ఇంటి దగ్గర ఏటిగట్టుమీద రచయిత క్లిక్ చేసిన వారి తల్లిదండ్రుల ఫోటో. (తాతయ్య, వెంకమ్మ.కానేటి)

పుస్తకాలు, ఫోటోలు అనుకున్నప్పుడు, పుస్తకాలు చదివే సమయమూ ఓపికా, అందరికీ ఉండదు. ప్రత్యేకంగా పుస్తకాలు కొని చదివే అలవాటు చాలా మందికి ఉండదు. అది ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు, ఆసక్తి లేని పరిస్థితి కావచ్చు. ఈ నేపథ్యంలో ఛాయా చిత్రాలు లేదా ఫోటోలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆధునిక కాలంలో వీడియోలు ఈ విషయంలో అగ్రస్థానంలో వున్నాయి,అది వేరే విషయం!

డిగ్రీ విద్యార్థిగా రచయిత ఫోటో (కల్పన స్టుడియో, ఖైరతాబాద్)

ఇక్కడ ఫోటోల ప్రాధాన్యతను వివరించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. గతంలో ఫోటోలు ధనవంతుల ఇళ్లల్లోనే ఉండేవి. వారికే అది సాధ్యమయ్యేది. సామాన్యుడికి అందుబాటులోలేని కెమెరాలు వారి దగ్గరనే ఉండేవి. ఇప్పుడు మొబైల్ మనిషి జీవితంలో ప్రవేశించి, అందులో కెమెరా సదుపాయం ఉండడంతో, అతి సామాన్యుడు సైతం చిటికెలో కోరుకున్న సన్నివేశాన్ని కెమెరాలో బంధించి, అప్పటికప్పుడు చూసుకోవడమే కాకుండా, క్షణాల్లో కోరుకున్న చోటికి, కావలసిన వ్యక్తులకి పంపించుకునే వెసులుబాటు ఏర్పడింది.

1983 లో ద్వారకా హొటల్లో రచయిత పెళ్ళి రిసెప్షన్. ఫేమ్లీ ఫొటో. ఎడమ నుండి రెండవ వారు రచయిత అమ్మ, కానేటి వెంకమ్మ.

నాడు స్వాతంత్య్రం వచ్చిన తరువాత, మొదటి సారి ఎర్రకోటపై మన మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు జాతీయ పతాకం ఎగురవేసిన దృశ్యం చూడాలంటే సామాన్యుడికి ఆనాడూ.. ఈనాడూ ఫోటోలే దిక్కు. ఉభయ తెలుగురాష్ట్రాలకు ప్రతిష్ఠాత్మకమైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ దశనుండి అది పూర్తి అయ్యి ప్రజలకు అంకితం చేసేవరకూ జరిగిన పరిణామాలూ, ముఖ్యంగా కర్రమెట్లు కూలి వందల సంఖ్యలో మరణించిన జనం వంటి సంఘటనలు ఈనాటి తరం సైతం చూడాలంటే నాటి ఛాయాచిత్రాలే కదా ప్రధాన ఆధారం. నాటి రాజకీయ ప్రముఖులు, ముఖ్యంగా మన నవ రాజ్యాంగ రూపశిల్పి, నిర్మాత, భారతరత్న, బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను నేటితరం చూడాలంటే, నాటి మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను చూడాలన్నా, నోబుల్ బహుమతి గ్రహీత, గీతాంజలి గ్రంథ రచయిత, జనగణమన గీత రచయిత రవీంధ్రనాథ్ ఠాగూర్, బెంగాల్ రచయిత శరత్ చంద్ర, ఆంగ్ల నాటక రచయిత షేక్స్‌పియర్, నటుడు చార్లీ చాప్లిన్, తెలుగు పద్య కవి గుర్రం జాషువా, అంతర్జాతీయ స్థాయిలో ‘నాస్తికత్వం’ ప్రచారం చేసిన ‘గోరా’ (గోపరాజు రామచందర్ రావు, విజయవాడ) జర్నలిజంలో జాతిరత్నం శ్రీ నార్ల వెంకటేశ్వరరావు మొదలైన ప్రముఖ, ప్రసిద్ధ వ్యక్తులను చూడాలంటే నేటి తరం, ఫోటోలను ఆశ్రయించవలసిందే!

1974…ఇంటర్మీడియెట్ లో… రచయిత

చంద్రుడిపై మొదట అడుగుపెట్టిన వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను, అతని మొదటి అడుగును ఫోటోల ద్వారా చూసి గత చరిత్రను అవగాహన చేసుకోవలసిందే. ఫోటో ఇలా ఇప్పుడు ఒక ప్రముఖ గుర్తింపు సాధనమై పోయింది. ఫోటోగ్రఫీ అనేది ఒక గొప్ప హాబీ, చాలా ఖరీదైనది కూడా. అందుకే ఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే ఫోటోలు ప్రముఖంగా కనిపించేవి. ఫోటోలు తీయడం యెంత ముఖ్యమైన హాబీనో, వాటిని సేకరించి దాచి పెట్టి భవిష్యత్ తరాల కోసం దాచిపెట్టడమూ ఒక కళే మరి! ఇంతటి సమాచారం మీ ముందు ఉంచే ప్రయత్నం చేయడానికి ముఖ్య కారణం ఫోటోల పట్ల, వాటి సేకరణ పట్ల, వాటిని భద్రపరచడం పట్ల నాకున్న అభిరుచి అని చెప్పక తప్పదు.

1975…ఆకాశవాణి, హైదరాబాద్, యవవాణిలో నాటిక కోసం. ఎడమ. రచయిత అన్నయ్య డా.మదుసూదన్ (విశాఖపట్నం), కుడి,రచయిత… కూర్చున్నవారిలో

నా బాల్యంలో కుటుంబ నేపథ్యం ఫోటోల గురించి ఆలోచించే పరిస్థితి కాదు. కానీ పదమూడు సంవత్సరాల వయస్సులో అనారోగ్య దృష్ట్యా నేను హైదరాబాద్‌లో వున్న పెద్దన్నయ్య కె.కె.మీనన్ దగ్గరకు వెళ్లిన తరువాత, అక్కడి వాతావరణాన్ని బట్టి, ఫోటోల వైపు దృష్టి మళ్లడం ఫోటోలు సేకరించి భద్రపరుచుకునే అవకాశం కలిగింది. ఫోటో స్టూడియోకు సంబంధించి నేను మా అన్నయ్య తోనూ తర్వాత బంధుమిత్రులతోనూ కలిసి ఫోటో తీయించుకున్నది ఖైరతాబాద్ లోని ‘కల్పన స్టూడియో’లో. అది ఇప్పటికీ ఉన్నట్లు సమాచారం. అక్కడ నలుపు తెలుపు ఫోటోలు చాలా బాగా తీసేవారు. వాటిని ఇప్పటికీ నేను జాగ్రత్తగా భద్ర పరుచుకోవడానికి ముఖ్య కారణం ఇదే!

నాలుగేళ్ల ప్రాయంలో రచయిత కుమార్తె:నిహార. కానేటి మహబూబాబాద్

నాకంటూ ఒక జీవితం ఏర్పడ్డాక, ఫోటో ఆల్బం తయారు చేసుకోగల స్థాయికి ఎదిగాక, ఫోటోలు సేకరించి ఆల్బమ్ తయారు చేసుకోవడం మొదలుపెట్టాను. స్టూడియోలో ఫోటోలు తీసుకోవడమేగాక, మా పిన్ని కొడుకు (తమ్ముడు స్వర్గీయ ఆశీర్వాదం) దోహా నుండి తెచ్చి బహుమతిగా ఇచ్చిన చిన్న కెమెరాతో కూడా తరచుగా ఫోటోలు తీసేవాడిని. అలా నా తల్లిదండ్రుల ఓ మాదిరి ఫోటోను భద్రపరుచుకోగలిగాను. నా పెళ్లి ఫోటోలు వేరుగా, నా ఫోటోలు వేరుగా, నా ఇద్దరి పిల్లల ఫోటోలు వేరుగా ఆల్బంలు తయారు చేసుకున్నాను. ఒక్కో వయసులో ఒక్కో ఫోటో పిల్లలివి భద్రపరచగలిగాను. అలాగే అమూల్యమైన పెద్దల మిత్రుల ఫోటోలు భద్రపరచగలిగాను. ఈ రోజున నేను ‘జ్ఞాపకాల పందిరి’ శీర్షికన రాసే అనేక వ్యాసాలకు ఫోటోలు సమకూర్చుకోగలగడానికి, నా ఆల్బంలు, ఫేస్‌బుక్ (మెమోరీస్) ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, మా ఫోటోలు, మా పిల్లల ఫోటోలు, నా మనుమలు, మనవరాళ్లు చూడగలిగినప్పుడు, వాళ్ళ ఆనందాన్ని అంచనా వేయలేము. వంశపారంగా భవిష్యత్ తరాలకు ఈ ఫోటోలు ఎన్నో మూగ సందేశాలను అందిస్తాయి.

పాతికేళ్ల క్రితం రచయిత, వారి శ్రీమతి.అరుణ.కానేటి మహబూబాబాద్

ఫోటో కోసం ఇప్పుడు ఫోటో స్టూడియో, ఫోటోగ్రాఫర్, కెమెరా, ఫిల్మ్ అవసరం లేదు. ఆధునిక ఆల్ ఇన్ వన్ సాధనంగా మొబైల్ మన ముందుకు వచ్చింది. ఇందులో కెమెరా కూడా వుంది. ఎలాంటి సన్నివేశాన్నైనా, ఎలాంటి సమయంలో నైనా నచ్చిన విధంగా కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా వీడియోలు సైతం రికార్డు చేసుకునే వెసులుబాటు మన చెంతకు వచ్చి చేరింది. ఆల్బంలతో సంబంధం లేకుండా మొబైల్ లోనే శాశ్వతంగా భద్రపరుచుకుని అవసరమైనప్పుడు క్షణాల్లో ఫోటోను వాడుకునే అవకాశం ఇప్పుడు మనకు అందుబాటులోనికి వచ్చింది. కొందరు ముందుచూపున్న తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలకు (మైల్ స్టోన్స్ – గీటురాళ్ళు) సంబందించిన ఫోటోలు వయసు వారీగా తీసుకుని భద్రపరుచుకుంటున్నారు. అలాగే వ్యయ ప్రయాసలు లెక్క చేయకుండా, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు సంబందించిన ఫోటోలు ఖరీదైన ఆల్బమ్ లలో భద్రపరచుకుంటున్నారు.

వందేళ్ల నాటి రచయిత పెదనాయన కానేటి సత్తయ్య గారి ఫోటో.

ఈ విధంగా ఫోటోలు గత జీవితాలకు సంబందించిన మంచి చెడ్డలను చక్కగా గుర్తు చేస్తాయి. నాటి చరిత్రకు ఆనవాళ్ళుగా మిగులుతాయి. అంచెలంచెలుగా మన శరీరంలో, రూపురేఖల్లో వచ్చే మార్పులకు ఫోటోలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి.

1975…. హన్మకొండ లో మిత్రుడు డా.ఎసెన్దర్ తో

నిజానికి ఫోటోల విలువలు తెలియకుండానే వాటిపై మోజు పడ్డాను నేను. కానీ ఇప్పుడు అవి అనేకరకాలుగా నాకు ఉపయోగ పడుతున్నాయి. ఇప్పడే కాదు, అవి ఎప్పటికీ ఏదో సందర్భంలో ఉపయోగ పడతాయి. అందుకే బంధువులుగాని, స్నేహితులుగాని, శ్రేయోభిలాషులుగాని, మనకు ఇష్టమైన ఇతరులుగాని కలిసినప్పుడు, ఇప్పటికీ తప్పకుండా ఫోటోలు తీయించుకునే అలవాటు నాకుంది.

నాలుగేళ్ల రాహుల్. కానేటి
కల్పన స్టుడియో… ఖైరతాబాద్. ఎడమ:లక్ష్మి నళిని, కుడి :చిన్నక్క భారతి 1972…

ఫోటోల ఆధారంగా నా మనవరాలిని (ఆన్షి నల్లి, అయిదున్నర సంవత్సరాల వయస్సు) దృష్టిలో పెట్టుకుని బాలగేయాలతో మూడు పుస్తకాలు ప్రచురించడం జీవితంలో నాకు ఎంతో తృప్తినిచ్చిన అంశం. గతం గతః అనుకోవడం అన్ని విషయాల్లోనూ సరికాదు. అంతే కాదు ఫోటో ఈ రోజున తప్పనిసరి గుర్తింపు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here