జ్ఞాపకాల పందిరి-119

35
11

పుట్టుకతోనే బంపర్ బహుమతి..!!

[dropcap]ప్ర[/dropcap]తి ఇంట్లోనూ పిల్లవాడికైనా, కూతురుకైనా పెళ్లి చేసిన తర్వాత పెద్దవాళ్ళు కోరుకునేది వెంటనే వాళ్లకు పిల్లలు పుట్టాలని. అందులో మళ్ళీ కొడుకు విషయంలో ప్రత్యేక శ్రద్ధ. ఎందుకంటే వంశోద్ధారకుడి కోసం ఆరాటం అన్నమాట! ఎవరైనా ముందు మగ పిల్లవాడే పుట్టాలని కోరుకోవడానికి ఇదే కారణం అనుకుంటాను. దీనికి తోడు మతాల పరంగా కులాల పరంగా ప్రాంతాల పరంగా చిరకాలంనుండి అల్లుకుపోయిన ఆచార వ్యవహారాలూ, సంప్రదాయాలూ కూడా కావచ్చు.

రచయిత మనవరాలు ఆన్షి.నల్లి (సికింద్రాబాద్)

ఆడపిల్ల వద్దనుకోవడానికి ప్రధాన కారణం అందరికీ తెలిసిందే, అదే వరకట్న పిశాచం. ఇది తరతరాలుగా వస్తున్నదే. కన్యాశుల్కం ఒకరకంగా ఇబ్బంది పెడితే వరకట్నం మరో రూపంలో ఇప్పటికీ ఆడపిల్లలను ఇబ్బంది పెడుతూనే వుంది. వీటికి తోడు ఈనాడు ఆడపిల్లను ఇంటాబయటా కూడా సంరక్షించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని చాలామంది – ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆడపిల్ల పుట్టకూడదని వేయి దేవుళ్ళకు మొక్కుకుంటారు. ఒకప్పుడు అందుబాటులోనికి వచ్చిన ఆధునిక యంత్రం ‘స్కానర్’ ద్వారా, పుట్టబోయేది ఆడా? మగా? అన్న విషయం తెలుసుకుని, ఆడపిల్ల అయితే ఆది లోనే అంటే పిండ స్థాయిలోనే అంతమొందించేవారు. అలా ఒకప్పుడు ఆడపిల్లల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఎక్కువ శాతం మగ పిల్లలు బ్రహ్మచారులుగా మిగిలిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే, కులాంతర, మతాంతర, ప్రాంతీయేతర వివాహాలు చేసుకోవలసి వచ్చేది. అందుకే భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం తీసుకు రావలసి వచ్చింది. ఎవరైనా చట్టం అతిక్రమిస్తే కఠిన శిక్షలు వేసే చట్టం కూడా రావడం వల్ల భ్రూణహత్యలు చాలా మట్టుకు తగ్గాయనే చెప్పాలి.

తాత.. అమ్మమ్మ లతో బేబి ఆన్షి.నల్లి.

అయితే, ఇప్పటికీ ఆడపిల్ల పుడితే అది కేవలం తల్లి లోపమనీ అంటూ, మగపిల్లవాడు పుట్టడానికి, తల్లితో పాటు తండ్రి పాత్ర కూడా ఉంటుందని తెలియని మూర్ఖ జనావళి ఇంకా మనలో ఉండడం దురదృష్టకరమే! ఈ విషయంలో కోడళ్లను అత్తలు సూటిపోటి మాటలతో మానసికంగా హింసించడం గమనించ దగ్గ విషయం. అందుకేనేమో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ‘ఆడవాళ్ళకు ఆడవాళ్లే శతృవులు’ అని చెబుతుంటారు.

మగపిల్లవాడు పుట్టకపోతే, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని బ్లాక్‌మెయిల్ చేసే పురుష పుంగవులు కూడా ఇలాంటివారే. శాస్త్రీయమైన, సాంకేతికపరమైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాళ్ళు కూడా ఇలాంటి ఆలోచనలే చేయడం దురదృష్టకరం.

అమ్మ..అమ్మమ్మ తో బేబి ఆన్షి. నల్లి.

కాలనుగుణంగా సమాజంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా కొన్ని శాసనాలు కట్టుదిట్టం చేయడంతో భ్రూణహత్యలు తగ్గాయి, ఆడపిల్లల నిష్పత్తి శాతం కూడా పెరుగుతున్నది. ఆడపిల్లలను కోరుకునే తల్లిదండ్రులు ఎక్కువైనారు. ఆడపిల్లలు దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉన్నత పదవులలో సమర్థవంతంగా రాణించ గలుగుతున్నారు. శ్రీమతి గోల్డామెర్ (ఇజ్రాయేల్), మార్గరెట్ థాచర్ (యు.కె.), సిరిమావో బండారునాయకె (శ్రీలంక), శ్రీమతి ఇందిరాగాంధీ (ఇండియా) వంటి మహిళామణులు ప్రధానమంత్రులుగా తమ ప్రతిభ చూపించిన వారే! అయినా ఆడపిల్లల పై వివక్ష పూర్తిగా తొలగి పోలేదు. సందర్భం వచ్చింది కనుక నాకు దగ్గరి బంధువుల ఆలోచనా విధానం గురించి చెప్పడం సమంజసంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.

తమ్ముడు నివిన్.నల్లి తో ఆన్షి. నల్లి

వాళ్ళు యువ జంట. హైదరాబాద్‌లో నివాసం. భర్త ఉద్యోగి, భార్య నూరుపైసల శాతం గృహిణి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం మగ పిల్లాడు. రెండవ సంతానం ఆడపిల్ల. ఇద్దరినీ ప్రేమగా (వాళ్ళ దృష్టిలో) చూస్తారు. కానీ వాళ్ళ చదువు విషయం వచ్చేసరికి, తల్లిదండ్రుల ఆలోచన భిన్నంగా మారిపోయింది. కొడుకుని ఒక మంచి ప్రైవేట్ స్కూల్ చూసి అందులో జాయిన్ చేసారు. కూతురు విషయం వచ్చేసరికి ఒక మామూలు బడిలో చేర్చారు. దానికి తల్లి వ్యాఖ్యానం ఏమిటంటే “ఎంత చదువుకున్నా అమ్మాయి ఎప్పటికైనా నాకులా వంటింటికి పరిమితం కావలసిందే కదా!” అని.

ఇలాంటి మాటలు వింటే ఎవరికైనా ఆశ్చర్యమూ దుఃఖమూ కలగక మానవు. దీనికి భిన్నమైన మరో ఉదాహరణ మీకు వివరిస్తాను.

అక్క-తమ్ముడు (ఆన్షి -నివిన్)

మహబూబాబాద్‌లో నేను పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన మంచి విద్యావంతుడు. విద్యాశాఖలో ఉద్యోగి. చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఎందరో పేద విద్యార్థులకు చేయూతనిచ్చి, వారు ఉన్నతస్థాయికి చేరడానికి మార్గదర్శనం చేసిన వ్యక్తి. ఈయన కొడుకు కోసం అయిదుగురు ఆడపిల్లల్ని కన్నాడు. మగపిల్లాడిని కనలేకపోయామని ఆ దంపతులు ఎప్పుడూ బాధ పడలేదు. ఆ ఆడపిల్లలందరినీ ఆణిముత్యాల్లా తయారు చేశారు. అందరూ వివాహాలు చేసుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు. ఆయనకు ఇప్పుడు వయసు 90+. కొన్ని కుటుంబాలలో పరిస్థితి ఇలా కూడా ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే, స్వయంగా నాకు ఆడపిల్లలంటే ఇష్టం! అలా అని మగ పిల్లలంటే ఇష్టం ఉండదని కాదు. ఏదో ప్రత్యేకత సహజంగా ఉంటూ వాళ్ళ వైపు మొగ్గు చూపుతుంది. అలా.. నా కూతురంటే నాకు చాలా ఇష్టం. బహుశః సృష్టిలో ప్రతి తండ్రి – కూతురు అనుబంధం ఇలానే ఉంటుందేమో!

తల్లితో తనయుడు (నిహార & నివిన్)

చాలా మంది విషయంలో ఇలానే ఉంటుందని నేను విన్నాను కూడా. అలా 2017 జనవరి 24, న నాకు మనవరాలు పుట్టింది. నా కూతురుకి, అల్లుడికి, మాకూ మహా సంతోషం అయింది. నా కూతురికైతే మొదటి సంతానం ఆడపిల్లే కావాలని కోరుకుంది. అలాగే జరిగింది. ఇంట్లో పండుగ వాతారణం ఏర్పడింది. మనవరాలికి ‘ఆన్షి’ అని పేరుపెట్టాం. మా అమ్మాయి ఉద్యోగం వరంగల్ లోనే (ఇప్పుడు హైదరాబాద్) కావడం వల్ల మనవరాలికి అయిదు సంవత్సరాల వయస్సు వచ్చేవరకూ వరంగల్‌లో నా దగ్గరే వుండే అవకాశం ఏర్పడింది. ఆ సమయం నా జీవితానికి మహదానంద సమయం. తర్వాత మా అమ్మాయికి హైదరాబాద్‌కు బదిలీ కావడం, అక్కడికి షిఫ్ట్ అయిపోవడం రెండో సంతానానికి అంకురార్పణ ఏర్పడడమూ జరిగిపోయాయి. ఇప్పుడు అసలు చర్చ మొదలైంది. ఈ సారి బాబు పుడతాడా? పాప పుడుతుందా? అని. కొందరు మగ, అని మరికొందరు ఆడపిల్ల అనీ ఊహాగానాలు మొదలు పెట్టారు. డాక్టర్లకు తెలిసినా చెప్పరు కనుక, మా అమ్మాయి అల్లుడూ “ఎవరైనా మాకు ఇష్టమే” అనడం మొదలు పెట్టారు. కొందరు ఖచ్చితంగా మగ పిల్లాడే.. అనడం మొదలు పెట్టారు.

అమ్మ-నాన్న- అక్క తో నివిన్.నల్లి.

నా విషయం వచ్చేసరికి, నేను కూడా ‘మగపిల్లాడు పుడితే బావుణ్ణు!’ అని మనసులో అనుకున్నాన్నాను. తర్వాత ‘నల్లోడు’ (ఇంటి పేరు నల్లి) పుడతాడని నా శ్రీమతి దగ్గర బాహాటంగానే అన్నాను. ఇప్పటి వరకూ ఆడపిల్ల – గొప్పలు చెప్పి ఈయన మగపిల్లాడిని కోరుకుంటున్నా డేమిటి అని పాఠకులు అనుకోవచ్చు. ఆయన విషయం వచ్చేసరికి సమర్థించుకుంటున్నాడని కూడా అనుకోవచ్చు! ఇది సహజమే. కానీ, నేను అనుకున్నది, ఆడపిల్ల అంటే ఇష్టం లేక కాదు. మొదటి సంతానం ఎట్లాగూ ఆడపిల్ల వుంది కాబట్టి, ఈ సారి మగపిల్లాడు అయితే బాగుంటుందని, అందరిలానే నేనూ అలా ఆలోచించాను. అంత మాత్రమే కాదు, మనవడు పుడితే లక్ష రూపాయలు మనవడికి ఇస్తానని మనసులో అనుకున్నాను. ఈ విషయం నా శ్రీమతికి కూడా చెప్పలేదు. మా అమ్మాయి ప్రసవించే వరకూ అది గోప్యంగానే వుంచాను.

తల్లిదండ్రులతో…. బేబి ఆన్షి.నల్లి..

13 జూన్ 2022 ఉదయం 2 గంటలకు నేను ఊహించినట్టుగానే మనవడు పుట్టాడు. ఆనందం అనిపించింది. నాతోపాటు కుటంబ సభ్యులు అందరూ సంతోషించారు. అమ్మాయి ప్రసవించిన మొదటి రోజు ఆసుపత్రిలో అమ్మాయి దగ్గర మొదటిసారి మనవాడి బంపర్ బహుమతి గురించి ప్రకటించాను. సహజంగానే అమ్మాయి చాలా సంతోషించింది.

Baby boy Nivin..Nalli

మరి మనవరాలి సంగతి ఏమిటని కొందరికి సందేహం రావచ్చు. సహజం కూడా! కానీ మనవరాలికి పుట్టినప్పటినుండీ ఇంకా ఎక్కువ చేస్తున్నాను. అవి ఇక్కడ ప్రస్తావించడం అంత మంచిదికాదని నా ఉద్దేశం.

తాతలతో (ప్రసాద్. కానేటి & విజయకుమార్. నల్లి) మనవడు..నివిన్. నల్లి.

ఆడపిల్లలు వున్న ఇల్లు ప్రేమకు, అనురాగాలకూ పుట్టిల్లు. ఆడపిల్ల వున్న ఇల్లు ఆనందాల హరివిల్లు! ఎక్కడో ఒకచోట ఒక కలుపు మొక్క ఉంటుంది, అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. అలాగని అందరికీ అది అంట కట్టడం సమంజసం కాదు! ప్రకృతి సిద్ధంగా రేపటి సమాజ నిర్మాణానికి ఆడపిల్ల తప్పని సరి. కుటుంబ సంక్షేమ పరంగా ఇద్దరి పిల్లల వరకూ అనుమతి వుంది కనుక, ఆడ అయినా, మగ అయినా ఇద్దరు పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడంలో తప్పు లేదనుకుంటాను.

ఇంతకీ మా మనవడి పేరు చెప్పనేలేదు కదూ… పుట్టుకతోనే తాత నుండి బంపర్ బహుమతి కొట్టేసిన మనవడి పేరు ‘నివిన్ అయాంశ్ నల్లి’ (NIVIN AAYANSH.NALLI).

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here