జ్ఞాపకాల పందిరి-12

141
6

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

పేరులో ఏముంది?

[dropcap]పే[/dropcap]రులో ఏముంది? అని ప్రశ్నించుకుంటే, పేరులోనే అంతా వుంది! అని సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. పేరులోనే వున్నది పెన్నిధి.. అన్న నానుడి కూడా వింటుంటాం. ఒకప్పుడు పిల్లలకు పేరుపెట్టడానికి ఇప్పుడు జరుగుతున్నంత రభస,తతంగం వుండేవి కాదు. పూర్వీకుల పేర్లో, బ్రతికి వున్న పెద్దల పేర్లో, వారిమీద వుండే గౌరవానికీ, ప్రేమకు గుర్తుగా పెట్టుకునేవారు.

కొందరు వారికి ఇష్టమైన దేవుళ్ళ పేర్లో, దేవతల పేర్లో పెట్టుకునేవారు. అందుకే మన సమాజంలో రామారావులు, వెంకటేశ్వరరావులు, యాదగిరి వంటి పేరున్న పెద్దలు తారసపడుతుంటారు. శివరావులు, శంకర్ రావు, యేసయ్యలు కూడా ఇలా వాడుకలోనికి వచ్చినవే.

సీత, శారద, సరస్వతి, పార్వతి, యంకమ్మ, ఎల్లమ్మ, మరియమ్మ, గ్రేసమ్మ వంటి పేర్లు కూడా ఇలా పుట్టుకొచ్చినవే! కొన్నిచోట్ల నదుల పేర్లను తమ పిల్లలకు పెట్టుకునే ఆచారం కూడా వుంది. ఆధునిక యుగంలో ఆధునికంగా వుండాలని ఆకర్షణీయమైన పొట్టి పేర్లు పెట్టుకున్నప్పటికీ, ఇష్టదైవాల పేర్లు పెట్టుకునే ఆచారం పూర్తిగా సమసిపోలేదు. నదుల పేర్లకు సంబంధించి క్రిష్ణయ్య, కృష్ణారావు, కృష్ణకుమారి, కృష్ణవేణి, గోదావరమ్మ, నర్మద, కావేరి, గంగ, గంగయ్య, గంగాధర్ వంటి పేర్లు కూడా బాగా వాడుకలోనే ఉండేవి.

ఇకపోతే రాజకీయ నాయకుల పేర్ల గురించి చెప్పనక్కరలేదు. దేవుళ్ళు దేవతలకు ఇంచుమించు సమానంగా ఈ పేర్లు ఉంటాయి. గాంధీ, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, రాధాకృష్ణ, రాజగోపాల్, ఇందిర, సరోజిని, ఝాన్సీ, నెహ్రు, సుభాష్ చంద్రబోస్, నానాజీ, మీనన్ ఇలా ఎన్నో, మరెన్నో పేర్లు ఎక్కడ చూసినా దర్శనం ఇస్తాయ్.

ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో, గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టుకోవడంలో తప్పు లేదు గానీ, అరేయ్, ఒరేయ్ వంటి పదాలు తగిలించి పిలుస్తుంటే ఆ యా వ్యక్తులను అవమానపరచినట్టు అవుతుంది. అలా వింటున్నప్పుడు, ఎంతో బాధ కూడా కలుగుతుంది. కొంచెం మోతాదు ఎక్కువైనవాళ్లు పేర్లకు బూతులు తగిలించి మరీ పిలుస్తారు. ఇది ప్రేమ, కోపం పరాకాష్టకు చేరుకున్నప్పుడు ఊపందుకుంటుంది.

కొంతమంది షాపులకు మహాత్ముల పేర్లు పెడతారు. తప్పులేదు. కానీ వ్యక్తిని బట్టి ఆయా షాపులకు ఆ పేర్లు పెట్టొచ్చా లేదా అన్నది ఆలోచించుకోవాలి. ఉదాహరణకు ఒక మద్యం షాపుకు గాంధీ గారి పేరు పెడితే ఎలా ఉంటుంది? అది యెంత అవమానకరం? ఎంత దుర్మార్గం? అందుకే దేనికైనా పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. మనుష్యులకే కాదు కథలకు, కవితలకు పేర్లు పెట్టడము కూడా కత్తిమీద సాము లాంటిదే మరి. పేరు చూడగానే చదవాలనిపించాలి. తరువాతి స్థానమే రచయితది.

మతపరంగా కొందరు పెట్టే పేర్లు అతిక్లిష్టంగా కొరకరాని కొయ్యలుగా, పలకడానికీ, రాయడానికి, ఉచ్చరించడానికి వీలుకానంత కష్టమైన పేర్లు పెడతారు. మతపరంగానో, మతగ్రంథం పరంగానో, అర్థం పరంగానో ఆ యా పేర్లకు ప్రాముఖ్యం వుండొచ్చుగానీ, అన్ని విధాలా సులభతరంగా, సరళంగా కూడా ఉండాలి.

ఈ మధ్య నా మిత్రుడొకాయన ఫోన్ చేసి, ఒక వూర్లో నా బంధువొకాయన ఒక శుభకార్యంలో కలిసినట్టు చెప్పారు. ఏమి పేరని అడిగాను. ‘పేరు నాకు పలకడానికి రావడం లేదు’ అని స్పెల్లింగ్ చదివి వినిపించారు. అలాంటి పరిస్థితి రాకూడదు. నా పేరు, నా ఇష్టం అంటే, ఇలానే ఉంటుంది. పెద్దల పేర్లు కలసి రావాలని, అందులో ఇష్టమైన దేవతల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు కూడా కలసి వచ్చేట్టుగా వుండాలని కోరుకునేవాళ్ళు కూడా లేకపోలేదు! పేరు పెట్టేవాళ్ళకి సమస్య లేదు గానీ, పేరు గల వాళ్ళు పెద్దయ్యాక చాల సాంకేతిక ఇబ్బందులకు గురి అవుతారు. అలాంటి వారి పేర్ల జాబితాలో నా పేరు కూడా వుంది!

నా పేరు లక్ష్మీ వర ప్రసాద్. నిజానికి ప్రసాద్ అంటే సరిపోయేది. కానీ నా పేరులో మా కజిన్ సిస్టర్ పేరు (మా పెదనాన్న గారి అమ్మాయి) కలిసేలా, మా పెద్దన్నయ్య (పెదనాన్నగారి అబ్బాయి) పెట్టారట! దీనితో నాకు పెద్ద ఇబ్బంది లేదు కానీ, ఎవ్వరూ నన్ను నా పూర్తి పేరుతో పిలవరు. పైగా ఏదైనా అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు వాళ్ళు కల్పించిన గడి సరిపోదు! ఇలాకొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. ఇంతే కాదు, ఆచరించే మతానికీ, వాళ్ళు పెట్టుకున్న పేర్లకీ లింకు కుదరదు.

నిజానికి, మా అమ్మ క్రైస్తవ కుటుంబ నేపథ్యం నుండి వచ్చింది, కానీ అమ్మ పేరు వెంకమ్మ. అలాగే, నా శ్రీమతి పూర్వీకులు అందరు క్రైస్తవాన్ని పాటిస్తూ వస్తున్న వాళ్ళే! కానీ, మా ఆవిడ పేరు అరుణ. ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

నాకు మొదటి నుండీ చిన్నపేర్లు అంటే ఇష్టం. అర్ధవంతమైన చిన్నపేర్లకు నేను ఫిదా అయిపోతాను.

పెద్దన్నయ్య కె.కె. మీనన్‌తో రాహుల్

నాకు మొదటి సంతానం అబ్బాయి. అబ్బాయి పుట్టగానే మా వాళ్లకి, ముఖ్యంగా మా అత్తగారి పక్షం వారికి ముందే చెప్పేసాను. పిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎవరి జోక్యం ఉండకూడదని. దానికి అందరూ సహృదయంతో అంగీకరించారు. మత పరమైన పేర్లు సూచిస్తారని నా భయం!

అమెరికా వెడుతూ, బేగంపేట్ ఎయిర్‍పోర్టులో రాహుల్

ఆ స్వేచ్ఛతో, శ్రీమతి అంగీకారంతో, నా పుత్రరత్నానికి ‘రాహుల్’ అని నామకరణం చేసాను. అందరికీ ఈ మూడక్షరాల పేరు బాగా నచ్చింది. అయితే, అందరూ అనుకున్నది, రాహుల్ అంటే ఇందిరమ్మ కుటుంబానికి చెందిన పేరు అనుకున్నారు. కానీ, అది కాదు, గొప్ప సాహితీవేత్త, సంస్కృత పండితుడు, మహా మేధావి అయిన రాహుల్ సాంకృత్యాయన్ నుండి ‘రాహుల్’ తీసుకున్నాను. ఆయన చరిత్ర చదివినవాడిని నేను, అందుకే నచ్చిన ఆ పేరు పెట్టుకున్నాను. అలా మామూలు పేరు, ముద్దు పేరు రాహుల్ గానే కొనసాగుతున్నది. ముప్పై ఏళ్ళు దాటిన రాహుల్ ఇప్పుడు, అమెరికాలో (బోస్టన్) క్వాలిటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.

ఇకపోతే, నా రెండవ సంతానం అమ్మాయి. అమ్మాయి పేరుకు కాస్త ప్రత్యక్ష చరిత్ర వుంది. నాకు పెళ్లి కాకముందే ఈ పేరును డైరీలో రాసుకుని దాచుకోవడం ఇక్కడ ప్రత్యేకత! ఒకవేళ నాకు ఆడపిల్ల పుడితే గనుక ఈ పేరే పెట్టుకోవాలని అప్పుడే అనుకున్నాను.

ప్రొ. పి. రామచంద్రారెడ్డి

నేను 1980లో హైదరాబాద్ లోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో బి.డి.ఎస్. ఉత్తీర్ణత పొంది, హౌస్ సర్జన్‌గా పని చేస్తున్న రోజుల్లో, నా గురువు, నా శ్రేయోభిలాషి, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ప్రొఫెసర్, డా. పి. రామచంద్రారెడ్డి గారు పిలిచి, పంజాగుట్టలో (ఇప్పుడు జూబిలీ హిల్స్) ఉన్న తన క్లినిక్‍లో పనిచేయమని, తద్వారా మంచి అనుభవం వస్తుందని ఒక ఆఫర్ ఇచ్చారు. అంత మాత్రమే కాదు నెలకు 750/-ఇచ్చేవారు. అక్కడకు అంతా ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్ళు చికిత్స కోసం వచ్చేవారు

పెద్దన్నయ్య కె.కె. మీనన్‌తో నిహార

ఆ క్లినిక్‌కి ఒక రోజు అందమైన ఒక అమ్మాయి, ఆర్థోడాంటిక్ చికిత్స కోసం వచ్చింది. నేను గురువు గారికి అసిస్ట్ చేస్తున్నాను. అంత అందమైన అమ్మాయిని, అప్పటివరకూ చూసి ఎరుగను. అప్పుడే అనుకున్నాను – పెళ్ళైన తర్వాత నాకు ఆడపిల్ల పుడితే, ఈ అమ్మాయి పేరే పెట్టుకోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆ అమ్మాయి పేరు ‘నిహార’. అదే పేరు నా కూతురికి ఖాయం అయింది. అమ్మాయి పేరు కూడా మూడు అక్షరాల పేరు కావడం యాదృచ్ఛికమే!

అమ్మాయి ‘నిహార కానేటి’గా ప్రసిద్ధురాలు. చదువుకున్నది ఎం.ఎస్.సి (జెనిటిక్స్) అయినప్పటికీ, ఆకాశవాణి (ప్రసార భారతి)లో, ప్రోగ్రాం ఆఫీసర్‍గా పని చేస్తున్నది. ఆ రకంగా నా ఇద్దరు పిల్లల పేర్లు విషయంలో నేను అనుకున్నట్లుగానే చేయగలిగాను. ఆ తృప్తి నాకు మిగిలింది. ఇదండీ పేర్ల పురాణం!

***

ఇక ఆ మహా పండితుడు రాహుల్ సాంకృత్యాయన్ గురించి:

మరుగున పడ్డ మహా పండితుడు!!

అయన పుట్టింది
ఆఖరి శ్వాస విడిచింది
ఏప్రిల్ మాసం లోనే…!
1893, ఏప్రిల్ 9న పుట్టి,
1963 ఏప్రిల్ 14న స్వర్గస్తులైనారు.
ముప్పై భాషలు తెలిసిన,
బహుభాషా కోవిదుడు,
అందులో అరడజను భాషలు,
చడవడం,రాయడం,మాట్లాడడం,
తెలిసిన మహా జ్ఞాని!,
మన దేశం మొత్తమే కాదు,
ఇంచుమించు
యావత్ ప్రపంచాన్ని
చుట్టి వచ్చిన,
మహా యాత్రికుడాయన!
చదువుకున్నది,
మిడిల్ స్కూలు,
ఆర్జించిన జ్ఞానం
అపారం…!!
70 ఏళ్ళ వయసులో
అయన మృతిచెందిన
సమయానికి,
140 పుస్తకాలు రాసిన,
గొప్ప రచయిత అయన!
ఎన్ని భాషలు
అయన గుప్పిట్లో ఉన్నా,
రచనలు చేసింది అన్నీ….
హిందీ లోనే!!
‘మద్య ఆసియా కా ఇతిహాస్’
గ్రంధానికి 1958 లో,
సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన
ఈ ఉద్దండ పండిత పిండం,
ఉత్తరప్రదేశ్ ఆణిముత్యం!
అసలు పేరు కేదార్ పాండే…
ప్రసిద్ధ నామం….
రాహుల్ సాంకృత్యాయన్!!
(‘ది హిందూ’ దిన పత్రిక సౌజన్యంతో)

***

మా అబ్బాయి ‘రాహుల్ కానేటి’కి పేరు పెట్టడంలో స్ఫూర్తిదాత ఈయనే!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here