జ్ఞాపకాల పందిరి-121

28
10

అందరికీ అది అవసరమే..!!

[dropcap]“త[/dropcap]ప్పులెన్నువారు.. తమ తప్పులెరుగరు..’’

“కాకిపిల్ల కాకికి ముద్దు..’’

ఇలాంటివి సామెతలుగా మాత్రమే సరిపెట్టుకోవడానికి లేదు. ఎన్ని తరాలు మారినా గుర్తుంచుకోవలసిన జీవిత సత్యాలు ఇవి. అసలు ఈ సామెతలు మన మధ్యకు ఎందుకు వచ్చినట్టు? ఆ నోటా.. ఈ నోటా.. ఎందుకు ఈ సామెతలు ప్రచారంలో ఉన్నట్టు? అని ఆలోచిస్తే వెంటనే స్ఫురించే సమాధానం ఏమిటంటే, అవి జీవిత సత్యాలు గనుక. ప్రతివారి జీవితానికీ ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రూపంలో ఇవి అన్వయించబడతాయి గనుక. అందుకే ప్రతివారి జీవిత ప్రథమ ఘట్టంలో విద్యాపరంగా నీతి శతకాలు చదివించేవారు. చిన్నతనం లోనే నీతి సూత్రాలు వల్లే వేయించేవారు. బ్రతికినంత కాలం ఈ నీతి సూత్రాలు, మనిషికి మార్గదర్శనం చేసేవి. దురదృష్టావశాత్తు, ప్రస్తుత పిల్లల పాఠ్య అంశాలలో, నీతికథల ఆవశ్యకత తగ్గిపోయింది, వాటి ఎంపికలో సైతం రాజకీయం మొదలయింది.

తప్పులు ఎవరు చేసినా అది తప్పే! తాము చేసింది తప్పు అయినా, ఎదుటివానిలో తప్పు వెతకడం కూడా తప్పే! ప్రతివారిలోనూ తప్పులు వెదకడానికి ప్రయత్నం చేయడం పరమ తప్పు. అది తప్పని తెలియకపోవడం అతని తప్పు కాదు. తన పెంపకంలో కనీస నీతినియమాలను బోధించక పోవడం తల్లిదండ్రుల తప్పు. అందుకేనేమో సమాజంలో కొడుకు గాని, కూతురుగాని తప్పు చేస్తే, అది నలుగురి నోళ్ళలోకి జారితే, వారినుండి వచ్చే మొదటి కామెంట్ ఏమిటంటే “తల్లిదండ్రుల పెంపకం అలావుంది మరి!’’ అని.

అలాగే, కాకిపిల్ల కాకికి ముద్దు.. అంటే, ఎవరి పిల్లలు అంటే వారికి ముద్దు అని. అంటే తమ పిల్లవాడు ఏమిచేసినా అది వారికి ఆనందంగానే ఉంటుంది. అలా అని మన పిల్లవాడి అల్లరి ఇతరులకు సంతోషం కలిగించాలనే నియమము ఏమీ లేదు. విసుక్కుని చిరాకుపడే పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. చిన్నతనంలో చేసే చిలిపి పనులు తల్లిదండ్రులకు, ఇంట్లోవారికి ఆనందాన్ని కలిగించవచ్చు గానీ, ఏమి చేయవచ్చునో, ఏమి చేయకూడదో ఎదుగుతున్న సమయంలో చెప్పకుంటే, చేయకూడని పనులను అడ్డుకోకుంటే, ఇవి పెద్దయిన తర్వాత ఇబ్బంది కలిగిస్తాయి. అప్పుడు చెప్పినా వినిపించుకునే పరిస్థితి వారికుండదు. ఇది తెలియని తల్లిదండ్రులు పిల్లలు పెద్దైనాక ఏమీ చెప్పలేని పరిస్థితిలో అయోమయానికి గురి అవుతారు. ఒక్కోసారి వాళ్ళు చేసే పనులకు నలుగురిలోనూ తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

అప్పుడు బాధపడినా ఉపయోగం ఉండదు. తమని తాము నిందించుకున్నా ప్రయోజనం ఉండదు. ఇది తెలుసుకోలేని, ఊహించని తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం విషయంలో తప్పటడుగులు వేస్తారు. ఇది నిరక్షరాస్యుల్లో కంటే అక్షరాస్యుల్లోనూ, పేదవారికంటే, ధనికుల్లోనూ అధికంగా కనిపిస్తుంది. దీనికి కారణం వారికి మెండైన ఆర్థిక వనరులున్నాయన్న గర్వం కావచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద అంశాలను లెక్కలోకి తీసుకోనవసరం లేదు. ఉదాహరణకు చిన్న చిన్న విషయాలు చాలు. అవసరం లేకున్నా లైట్లు వేయడం, అవసరం లేకున్నా ఫ్యాన్ వేసి వుంచడం, తీసిన వస్తువు మళ్ళీ అక్కడ పెట్టకపోవడం, చదివిన దినపత్రిక ఉంచవలసిన చోట ఉంచకపోవడం, ఉదయం లేవగానే కప్పుకున్న దుప్పటి మడత పెట్టక పోవడం, పడుకునే మంచం మీద వివిధ వస్తువులు, బట్టలు చిందరవందరగా పారేయడం, త్రాగిన కాఫీ కప్పులు, గ్లాసులు ఎక్కడబడితే అక్కడ వదిలేయడం ఇలా చెప్పుకుంటూ పొతే చాలావుంటై. వాటిని మామూలు విషయాలుగా కొట్టి పారేసి, ఎదిగిన పిల్లలు చేయవలసిన పనులు కూడా పెద్దలు చేస్తే, ఏమి చేసినా పిల్లలను ముద్దు చేస్తే, వారి క్రమశిక్షణ గల భవిష్యత్తును పెద్దలు చేతులారా పాడు చేసినట్టు అవుతుంది. చదవడానికి (వినడానికి) ఇవి మామూలు విషయాలు గానే కనిపిస్తాయి గాని, భవిష్యత్తులో అనేక సమస్యలు సృష్టిస్తాయి. చిన్న చిన్న అభిరుచుల దగ్గర, అలవాట్ల దగ్గర, అభిప్రాయభేదాలు వచ్చి, తమదే కరెక్టు అనే భావనతో, పంతాలు పట్టింపులకు పోయి, సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్న యువ జంటలు ఎన్నెన్నో, విడాకుల వరకు చేరుకుంటున్న యువ కుటుంబాలు ఎన్నెన్నో. ఈ పరిస్థితికి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ముద్దాయిలను చేయక తప్పదు. అందుకే పిల్లల పెంపకం మామూలు విషయం కాదు, కత్తి మీద సాములాంటిదే! తేలిగ్గా తీసుకునే విషయం కానే కాదు.

చిన్న చిన్న విషయాలు అవగాహన లేకపోతే ఎంత దుమారం లేపుతాయో ఒక స్వీయ అనుభవం ఇక్కడ వివరిస్తాను. ఈమధ్య మాకు అతి సమీప బంధువుల కుమారుడికి, మా పక్క వూరిలో ఉద్యోగ రీత్యా డ్యూటీ పడింది. ఆ అబ్బాయి, కొద్ది రోజులు హోటల్‌లో వుండి అక్కడ బోర్ కొట్టిందేమో, అతని సరంజామాతో ఒకరోజు సాయంత్రం మా ఇంటికి వచ్చాడు. ఆతను చిన్న పిల్లవాడు కాదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఓ మాదిరి ఉద్యోగంలో చేరినవాడు. వచ్చినప్పటి నుండి అతని ప్రవర్తన నాకు చాలా చికాకు అనిపించింది. ఎంత దగ్గరివారైనా, చేయవలసినట్టు చేయకపోతే, వుండవలసినట్టు ఉండకపోతే నేను అసలు సహించలేను. అతనిలో నాకు నచ్చని విషయాలు – ఉదయం త్వరగా లేవకపోవడం, లేచి దుప్పటి మడత పెట్టకుండా వదిలేయడం, అతని కోసం మళ్ళీ ప్రత్యేకంగా కాఫీ పెట్టి ఇచ్చే పని మా ఇంటావిడికి పడడం, వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చి లైట్ ఆర్పకపోవడం, అతనికి ఇష్టం వచ్చినప్పుడు ఏ.సి. ఆన్ చేసి, అది అలా వదిలేసి బయట తిరగడం, విడిచిన బట్టలు, మా ఆవిడ ఉతికితే (ఇది సమస్య కాదు) నేను మడతపెట్టి ఇచ్చినా వాటిని సరిగా సర్దుకోక పోవడం, ఇలా ఒకటి కాదు. ఇవన్నీ చూసిన నాకు చాలా ఇబ్బంది అనిపించింది. నేను ఏమీ చెప్పలేని (అనలేని) పరిస్థితి, అనలేదు కూడా! అలాగే భరించాను.

ఈలోగా మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే అతని తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఇవన్నీ చూస్తున్నా వాళ్ళకి ఏమీ అనిపించడం లేదు, ఎందుచేతనంటే వాళ్ళ ఇంట్లో, వాళ్లకి ఇవన్నీ అనుభవమే గనుక! నేను ఇక ఉండబట్టలేక, ఆ అబ్బాయి తండ్రితో అన్నాను “మీకు ఒక్క విషయం చెప్పాలి. చిన్న చిన్న విషయాలే పెద్దయిన తర్వాత సమస్యలు సృష్టిస్తాయి, ఏళ్ళైనా తర్వాత అవి మరీ ఇబ్బందులు సృష్టిస్తాయి’’ అన్నాను.

“నిజమే. కానీ, ఎవరి గురించి ఈ ఉపోద్ఘాతం?’’ అన్నాడు.

“ఎవరి గురించో కాదు, మీ పుత్ర రత్నం గురించే!’’ అన్నాను. వెంటనే అతని ముఖం మాడిపోయిన ఎలక్ట్రిక్ బల్బ్ అయింది. అయినా ముఖంలో రంగులు మారకుండా విశ్వ ప్రయత్నం చేస్తూ “నిజమే, ఎవరింటికి వస్తే, వాళ్ళ ప్రకారం మసలుకోవాలి’’ అన్నాడు. నేను చెప్పింది అతనికి నచ్చదని నాకు తెలుసు.

ఆతను విద్యావంతుడైనా, అర్థం చేసుకునే పరిస్థితిలో లేదని నాకు అర్థం అయింది. అందుకే మళ్ళీ అన్నాను. “మీ శ్రీమతికి చెబితే ఆమె అర్థం చేసుకోదు, అందుకే మీకు చెబుతున్నాను’’ అని కుర్రాడి విషయం అంతా చెప్పాను. అయిష్టంగానే నాతో ఏకీభవించినట్టుగా మాట్లాడాడు. కానీ ఆతను నేను అలా చెప్పినందుకు లోపల బాధ పడుతున్నట్టుగానే అనిపించాడు. నేను అలా అనుకున్నదే అక్షరాలా నిజమైంది.

వారం రోజుల తర్వాత కుర్రాడి తల్లి మా శ్రీమతికి ఫోన్ చేసి నానా మాటలూ అనేసింది. కనీసం వారం రోజులు తన కొడుకును సరిగా చూడలేక పోయామని నిందలు వేసింది. నేను ఫోన్ చేస్తే నా పైనా దాడి చేసింది. భర్త ఏమి చెప్పాడో తెలియదు. ఆమె మాత్రం ఫోనులో నిందలు, ఏడ్పులూనూ.

నాకు తెలుసు, వాళ్లకు విషయం అర్థం కాదని. అందుకే నేను ‘సారీ’ చెప్పక తప్పలేదు. విద్యావంతులైన చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి ఇదే. తమకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయన్న గర్వమే తప్ప డబ్బులు అన్నింటికీ అక్కరకు రావని వాళ్లకు తెలియక పోవడం దురదృష్టకరం. ఈనాడు యువతీ యువకుల పెళ్లిళ్లు అతి తక్కువ కాలంలోనే విడాకులకు దారితీయడానికి గల కారణాలలో ఇలాంటి కుర్రాళ్ళ జీవన శైలి కూడా ఒకటి. దీనికి పూర్తిగా తల్లిదండ్రులు బాధ్యత వహించవలసిందే! తర్వాత నెత్తి నోరు బాదుకున్నా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. నేటి యువతీ యువకులే రేపటి తల్లిదండ్రులు కూడా. అందుకే ఇది అందరికీ అవసరమే! ఒక్కటి మాత్రం నిజం, క్రమశిక్షణలో పెరిగిన తల్లిదండ్రులు, తమ పిల్లలను తప్పకుండా క్రమశిక్షణలోనే పెంచుతారు. మతం అయినా దేవుడైనా చివరికి చెప్పేది జీవితంలో అవసరమైన క్రమశిక్షణ గురించే, అదే ఇప్పుడు అందరి జీవితాలకు అవసరం అన్నది అక్షర సత్యం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here