జ్ఞాపకాల పందిరి-125

31
7

(అ)మర్యాద రామన్నలు..!!

[dropcap]మ[/dropcap]ర్యాద మనిషి వ్యక్తిత్వాన్ని బయటపెట్టే అంశాల్లో ప్రధానమైనది. ఇది అంతర్జాతీయంగా అందరి నోళ్ళల్లో నానే మాట, భాష ఒకటే మార్పు. మర్యాద కనబడని మనిషితో రెండోసారి మాట్లాడాలనే కోరిక పుట్టదు. ప్రవర్తనలో అమర్యాద అని తెలియక కొందరు, తెలిసి కొందరు ప్రవర్తిస్తుంటారు. ఈ మర్యాద అనే అంశం, కుటుంబం, పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితులమీద కూడా ఆధార పడివుంటుంది.

ఇంట్లో తండ్రిగాని, తల్లిగాని, తమ పిల్లలే కదా, తమ ఇల్లే కదా అనే ఆలోచనతో పిల్లలను ఇష్టం వచ్చినట్టు తిట్టడం, పైగా బూతులు తిట్టడం వంటివి చేస్తారు. కానీ ఎదుగుతున్న పిల్లలు అటువంటి మాటలను యిట్టే పట్టేసుకుంటారు, అవి వాళ్ళ మెదడులో ముద్ర పడిపోతాయి. బయటకు వెళ్లి వాటిని ఎక్కడైనా వాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది వాళ్ళు తెలిసి చేసే పని కాదు, తప్పని అసలు తెలీదు, తల్లిదండ్రులు వాడారు కాబట్టి, వాళ్ళూ అలా మాట్లాడే ప్రయత్నం చేస్తారు.

నాకు తెలిసిన ఒక మాస్టారు ఉండేవారు, ఆయనకు ఇద్దరు మగపిల్లలు. భార్య మీద కోపం వచ్చినప్పుడల్లా తిట్లదండకం. అంతా బూతు పురాణమే. పెద్దకొడుకును ఒక క్రిస్టియన్ కాన్వెంట్లో చేర్చారు, అందులో టీచర్స్ అంతా ‘నన్ – సిస్టర్స్’. ఒకరోజు మాస్టారి అబ్బాయి హోమ్ వర్క్ చేయకుండా బడికి వెళ్ళాడు. వాళ్ళ టీచర్ అడిగితే కారణం చెప్పకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు.

నన్-సిస్టర్‌కు కోపం వచ్చి ఆ అబ్బాయి వీపు మీద ఒకటిచ్చుకుంది. ఆ దెబ్బకు వాడిలో పెద్ద చలనం లేదు కానీ, వెంటనే నోటికి పని చెప్పాడు. ఆ టీచర్ ను ‘లం..’ అని తిట్టేసాడు. వాడి దృష్టిలో అది పలకకూడని మాట కాదు. కానీ, వాడు చేసిన పనికి కూడా వాడు కారణం కాదు. ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లల ముందు మాట్లాడే మాటల ప్రభావం ఇది, అందుచేత పిల్లల ముందు, తల్లిదండ్రుల కొట్లాటలు దుర్భాషలు పనికి రావు.

కొంత మంది ఇళ్లకు వెళితే, వాళ్ళ పిల్లలు ఎదురు వచ్చి ‘నమస్తే సర్’ అంటారు, లేదా ‘గుడ్ మార్నింగ్ అంకుల్’ అంటారు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తారు. అలాంటి పిల్లల్ని చూసినప్పుడు ఎంతో ముచ్చట వేస్తుంది, వాళ్ళల్లో, వాళ్ళ తల్లిదండ్రుల సంస్కారం ప్రతిబింబిస్తుంది. ఈ అలవాటు జీవితాంతం వారిలో అలా నిలిచిపోతుంది.

ఇంకొక కొత్త సన్నివేశం రైల్వే స్టేషన్లలో, రహదారులలో, పార్కులలో, మనం చూస్తుంటాం. ఎవరో మనకు తెలియనివాడూ, మనమెప్పుడూ చూడని వ్యక్తి పోతూ.. పోతూ.. “టైం యెంత?” అంటాడు. అతని ప్రశ్నకు ముందూ-వెనుకలు ఏమీ వుండవు. ఇలా అడగడం నాతో సహా చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ చెప్పేవరకూ వాళ్ళు అక్కడినుండి కదలరుకదా, మన ముఖంలోకి చూస్తూ వుంటారు. అప్పుడు వాళ్ళని వదిలించుకోవడానికైనా మనం చెప్పక తప్పదు. అలాగే రైల్వే స్టేషన్లో కూర్చుని, రైలు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎవరో వచ్చి “ఫలానా రైలు వెళ్లిపోయిందా?” అని అడుగుతారు. రైలు వెళ్లిపోయిందా? అని అడగడానికి, “సార్.. రైలు వెళ్లిపోయిందా?” అనడానికి, యెంత తేడా ఉంటుంది!

తర్వాత, తమ క్రింది ఉద్యోగులను, పాలేర్లను, పనిమనుష్యులను “అరేయ్.. ఒరేయ్..” అని పిలవడం చాలా మందికి అలవాటు. ఇది కూడా ఈ ఆధునిక ప్రపంచంలో సరియైనది కాదు. కూలీలకు లేదా క్రింది స్థాయి పని వారికీ మనసులో ఇష్టంలేకపోయినా, వారి అవసరాన్ని బట్టి ఆనందంగానే భరిస్తుంటారు. బానిసతనం వేళ్లూనిన దేశంలో అది పోవడం అంత సులువు కాదు. ఆఫీసులలో సైతం చాలామట్టుకు మార్పు వచ్చినా, ఇంకా పూర్తిగా పోలేదనే చెప్పాలి. స్త్రీలను – అదీ, ఇదీ అనడం, ఒసేవ్, ఏమేవ్, అని సంబోధించడం; ఎదురుగా కనబడితే, అసుంట.. అసుంట.. అనడం, ఇంకా అక్కడక్కడా వినిపిస్తూనే వుంది.

పేద ప్రజానీకం గల్ఫ్ దేశాలకు వెళ్లి వివిధ స్థాయి ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఏర్పడిన తర్వాత, సమాజంలో, ముఖ్యంగా గ్రామీణ జీవితంలో పెనుమార్పులు సంభవించాయి. అందులో ముఖ్యమయినవి, ఆర్థికంగా ఎదుగుదల, మంచి -మర్యాద. ఒకప్పుడు ఒరేయ్.. ఒసేయ్.. అని, పిలిచిన వాళ్ళే, ఈ రోజున.. ఏమండీ.. ఏమమ్మా.. అనే స్థాయిలో మార్పు వచ్చింది.

గౌరవం, మర్యాద, ఇచ్చిపుచ్చుకోవడంలో ఇంకా చాలా మార్పులు రావలసి వుంది. ఒకప్పుడు తెలంగాణా ప్రాంతపు సాధారణ వ్యక్తులు, తాము ఏమి మాట్లాడినా, చివర “… నీ బాంచను” (నీ బానిసను) అనే పదం తప్పక వాడేవారు. ఇప్పుడు క్రమంగా అది తగ్గుతూ వస్తున్నది. ఇది కూడా మంచి శుభ పరిణామమే!

కొన్ని మతగ్రంథాలలో స్త్రీని ఉద్దేశించి ‘అది, దానికి, దాని’ వంటి పదాలు ఇప్పటికీ కొనసాగుతుండడం బాధాకరం.

నా ఉద్యోగ పర్వంలో ఎప్పుడూ నా క్రింది స్థాయి ఉద్యోగులను అమర్యాదగా పిలిచిన, వ్యవహరించిన ఘటనలు లేవు. అందుకేనేమో వారు నన్ను అమితంగా ప్రేమించేవారు. అయితే, కొన్ని ప్రాంతాలలో ఒకే పదానికి వేరు వేరు స్పందనలు ఉంటాయి. ఉదాహరణకు ‘నువ్వు’ అనే పదం. ఇది కొన్ని ప్రాంతాలలో, ఇంటా-బయట, కొత్త-పాత తేడా లేకుండా, మంచికీ, మర్యాదకూ చాలా లిబరల్‌గా వాడే పదం. అదే ‘నువ్వు’ అనే పదం, ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో వాడితే, తక్కువ చేసి మాట్లాడినట్టు, అమర్యాదగా ప్రవర్తించినట్లు ఫీల్ అవుతారు. ఇటువంటి వాటిని అర్థం చేసుకోవాలి తప్ప అపార్థం చేసుకోకూడదు. ఇవి చాలామంది విషయంలో సమస్యలు సృష్టించిన సందర్భాలున్నాయి. ఇప్పటివరకూ చెప్పినవన్నీ మాట్లాడడంలోని అమర్యాదకర విషయాలను చెప్పాను. చేతలతో అమర్యాదగా ప్రవర్తించే ఘటనలెన్నో.

అవన్నీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తావించదలచుకోలేదు. కానీ మా నీటి సరఫరా అధికారి (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్)తో, నా అనుభవం ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తాను. ఇలాంటి అనుభవాన్ని చాలామంది ఎదుర్కొని ఉంటారని నా నమ్మకం.

కొన్ని ప్రభుత్వ విభాగ అధిపతులు వినియోగదారుడంటే అతని దగ్గర పనిచేసే పనివాడో, లేక కూలిగానో భావిస్తారు. అవసరం వినియోగదారుడిది కనుక, వాళ్ళు అతడిని/ఆమెను, తక్కువ చూపు చూస్తారు. మంచి మర్యాద లేకుండా ప్రవర్తిస్తారు. ఆ డిపార్టుమెంటు, వాళ్ళ స్వంతమైనట్టు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనకు పని చేసి పెడుతున్నట్లుగా భావిస్తారు. అలాంటి అనుభవం ఒకటి మీ కోసం.

కొన్ని సంవత్సరాల క్రితం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, మంచి నీటి సరఫరా విభాగం ఒక ప్రకటన చేసింది. ఇంటింటా తిరిగి మంచి నీటి నల్లాలను సర్వే చేస్తున్నామని, ఆ సర్వేలో ఎక్కడైనా అక్రమంగా నల్లా సదుపాయం పొందుతున్నా, వాటర్ టాక్స్ (నీటి పన్ను) కట్టకున్నా, తగిన రీతిలో జరిమానా విధిస్తామన్నది ఆ ప్రకటన సారాంశం.

అప్పటికి, నా ఇంటికి, నీటి పంపు కనెక్షన్ తీసుకుని చాలా సంవత్సరాలు అయినప్పటికీ, ఇంటిపన్ను బిల్లుతో పాటు, నీటి పన్ను బిల్లు రావడం లేదు అది డిపార్టుమెంట్ తప్పిదమేగాని, వినియోగదారుడిది కాదు. అందుచేత ఎందుకైనా మంచిదని, మునిసిపాలిటీ కమీషనర్‌కు లేఖ రాస్తూ, నా పరిస్థితి అందులో సవివరంగా విన్నవించాను. ఆ లేఖ ఇ-మెయిల్ ద్వారా కమీషనర్ గారికి పంపాను.

రెండు రోజుల తర్వాత ఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది (కమీషనర్, సంబందిత అధికారికి, నా లేఖ ఫార్వర్డ్ చేశారన్న మాట).

మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది.

“నువ్వేదో కంప్లైన్ట్ ఇచ్చినవంట”

“అది కంప్లైంట్ కాదు సార్, నా ట్యాప్ కనెక్షన్ గురించి సమాచారం అందించాను” అన్నాను.

“ఏదోటి.. నువ్వు కాయితాలు పట్టుకుని ఆఫీసుకు రా..” అన్నాడు.

అతడి మీద కోపం నాకు నషాళానికెక్కింది.

“అసలు, నువ్వెవరు?” అన్నాను

“అసిస్టెంట్ ఇంజనీర్‌ని” అన్నాడు

“నీకు మంచి – మర్యాద తెలీదా? వినియోగదారుడితో మాట్లాడే విధానం ఇదేనా? అసలు నీకు ఈ ఉద్యోగం ఇచ్చిన వాడెవడు, కనీస మర్యాద లేదు నీకు, నేను ‘సార్’ అంటుంటే, ‘నువ్వు’ అని సంభోదిస్తున్నావు. ఫిర్యాదుకి, సమాచారానికి, తేడా తెలీదు నీకు” అంటూ తిట్ల దండకం మొదలు పెట్టాను.

“అది కాదు సార్..” అంటూ ఏదో చెప్పబోయాడు.

“నాకు.. ఇక ఏమీ చెప్పక్కరలేదు” అని ఫోన్ పెట్టేసాను.

ఆ సాయంత్రానికల్లా, లైన్‌మాన్ నా దగ్గరికి వచ్చాడు (ఆ ఇంజనీర్ పంపించాడు).

“సార్, మా సార్ అన్న మాటలు మనసులో పెట్టుకోకండి సార్. మీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసి పెడతాను, విషయం మా సార్ చెప్పాడు సార్. వాళ్ళు ఆఫీసుల్లో వుండి అట్లనే మాట్లాడుతారు సార్, ఆయన తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి” అన్నాడు.

ఇక తర్వాత ఈ అంశాన్ని పెంచదలచుకోలేదు. నీటి బిల్లు వచ్చే ప్రత్యామ్నాయ విధానం సూచించి ఆ పని చేసిపెట్టాడు, ఉచితంగా మాత్రం కాదు.

‘ఈ ఒక్క డిపార్టుమెంటు మాత్రమే ఇలా ఉంటుందా?’ అని, అడగవచ్చు, తప్పులేదు. ఒక ఉదాహరణగా మాత్రమే నా ఈ అనుభవం చెప్పాను. కానీ ఎక్కడ చూచినా ఇలాంటి వారే ఎక్కువ కనిపిస్తారు. డిపార్టుమెంట్‌లో ఏ ఒక్కరు ఇలాంటి వారు వున్నా మొత్తం అందరికీ చెడ్డపేరు రావడం ఖాయం. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.

చిన్నప్పుడు మా నాయన నేర్పిన నీతి సూత్రం “అరేయ్.. అంటే ఒరేయ్.. అను, ఏరా.. అంటే, ఒరే.. అను” ఎప్పుడూ నా మనసులో మెదులుతూనే ఉంటుంది. ‘మర్యాద.. ఇచ్చిపుచ్చుకోవడం’ అంటే ఇదే కదా! ఇది అందరికీ, వర్తిస్తుంది, అన్ని స్థాయిలవారికీ అవసరం అవుతుంది.

మర్యాదగా బ్రతుకుతూ, మర్యాద ఇచ్చి పుచ్చుకునేవారికి శతకోటి వందనాలు!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here