జ్ఞాపకాల పందిరి-128

35
10

బ్రతుకు మలుపు తిరిగిన చోట..!!

[dropcap]పు[/dropcap]ట్టి పెరిగిన చోటు ఎలానూ మరచి పోలేము. “మీది ఏవూరు?” అని ఎవరైనా అడిగితే, టక్కున వచ్చే సమాధానం, పుట్టి పెరిగిన వూరే! దాని ప్రత్యేకత అలాంటిది. కని పెంచిన తల్లిదండ్రులతో పాటు, బంధువులు, రక్త సంబంధీకులతో, చిన్ననాటి స్నేహితులతో ముడిపడి ఉంటుంది మన జన్మస్థల చిరునామా.

ప్రపంచంలో ఎక్కడ పనిచేస్తున్నా, ఎక్కడ స్థిరపడినా, పుట్టిన వూరు అనగానే ప్రాణం లేచివస్తుంది. ఆ పేరు వింటేనే మాటల్లో చెప్పలేని ఆనందం ఏదో మదిలో మెదులుతుంది. కొంచెం సున్నిత మనస్కులకు, బెంగ తిరుగుతుంది. చెప్పలేని ఆలోచనలతో మనసు వికలం అవుతుంది. కొద్దీ గంటలో కొన్ని రోజులో మనసు స్థిమితం లేకుండా పోతుంది.

నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర మిత్రులు శ్యామ్ కుమార్, డా.దుర్గా ప్రసాద్

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల హవా నడిచినప్పుడు, అక్షరాస్యత అవసరమైనంతగా లేనప్పుడు, అందరూ స్థానికతకు ప్రాధాన్యత నిచ్చేవారు. వ్యవసాయమో, కులవృత్తులో చేసుకుంటూ, పుట్టి పెరిగిన చోటే స్థిరపడి పోయేవారు. కానీ రోజులు మారాయి. ఉమ్మడి కుటుంబాలూ అంతరించి పోయాయి. అక్షరాస్యత రేటు గణనీయంగా పెరిగిపోయింది. చదువుల పేరుతో ఆర్థికంగా వెసులుబాటు వున్నవాళ్లు దూరప్రాంతాలైనా లెక్కచేయకుండా చదువుకోవడం మొదలు పెట్టిన తర్వాత స్థానభ్రంశం కాక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో చదువు కోసం, ఉద్యోగం కోసం, ఇతర ప్రాంతాలకే కాదు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా వలసపోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనం ఇలా ఎన్ని ప్రాంతాలు తిరిగినా, మన జీవితాన్ని అనుకోకుండా మలుపు తిప్పిన కొన్ని ప్రదేశాలు ఉంటాయి. వాటిని మాత్రం మన జీవిత కాలంలో అసలు మరచిపోలేము. నాలాంటి మనస్తత్వం గలవారు అసలు మరచిపోలేరు.

సమతా(తాడి)ప్రసాద్ తో డాక్టర్ దుర్గాప్రసాద్ (పైలాన్)

అలా నా జీవితంలో ఎన్నో మలుపులు తిరిగాయి. విద్యాపరంగా జీవితంలో రెండు ప్రదేశాలు నా జీవితాన్ని మలుపు తిప్పాయి. అందులో మొదటిది హైదరాబాద్, రెండవది నాగార్జున సాగర్. ఈ రెంటిలోనూ నన్ను అధికంగా ప్రభావితం చేసింది, నాగార్జున సాగర్. సాగర్‌లో అక్క ప్రేమ, నా భవిష్యత్ జీవితానికి చేసిన మార్గదర్శనం, తద్వారా అక్క దగ్గర వుండి ఇంటర్మీడియేట్ చదుకోవడం, నా జీవితానికి పెద్ద మలుపు!

మిత్రుడు కృష్ణ చంద్‌కు రచయిత పుస్తకాలు బహుకరిస్తూ

అసలు విషయానికొస్తే, పుట్టి పెరిగింది నాటి తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం, అంబేద్కర్ కోనసీమ జిల్లా) రాజోలు తాలూకా (ప్రస్తుతం మల్కీపురం మండలం) దిండి గ్రామం అయితే, ప్రాథమిక విద్య మా గ్రామంలోనే జరిగింది. హై స్కూల్ విద్య రాజోలులో (1967-68 ప్రాంతం) మధ్యలోనే, అంటే, ఎనిమిదవ తరగతిలోనే ఆగి పోవడం కూడా నా జీవితానికి పెద్ద మలుపే అని చెప్పాలి. అప్పటి అనారోగ్యం కారణం వల్లనే రాజోలు – దిండి వదలి హైదరాబాద్‌లో వున్న పెద్దన్నయ్య కె. కె. మీనన్ దగ్గరకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వైద్యం ఇప్పించి, ఆరోగ్య వంతుడిని (1970) చేసి నాకు పునర్జన్మ నిచ్చిన పుణ్యమూర్తి మా పెద్దన్నయ్యే. ఆలా దాని తర్వాత 1971-72 విద్యా సంవత్సరంలో, ఉస్మానియా విశ్వ విద్యాలయంలో, మెట్రిక్యూలేషన్ మంచి మార్కులతో పాసై, నాగార్జున సాగర్‌లో వున్న(దక్షిణ విజయపురి) అక్క దగ్గరకు వెళ్ళిపోయి అక్కడ 1972-74లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన సందర్భం నా జీవితానికి గొప్ప మలుపు, నేను దంత వైద్యుడిగా, రచయితగా మారడానికి పునాది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే –

తమ అక్క ఇంటి ప్రాంగణంలో డాక్టర్ దుర్గాప్రసాద్ తో రచయిత

ఇంటర్మీడియెట్ పూర్తి అయిన తర్వాత మా క్లాస్‌మేట్స్ (ముఖ్యంగా సైన్స్ విద్యార్థులం) ఉన్నత విద్యాభ్యాసం కోసం తలోదారి చూసుకోవడంతో, ఎవరు ఎక్కడ వున్నదీ తెలియదు. ఒకలిద్దరు ఎప్పుడైనా కలిసినా మిగతా వారి విషయాలు అసలు తెలిసేవి కాదు. ఈలోగా నేను ఉద్యోగం చేయడమూ, రిటైర్ కావడమూ కూడా (2011) జరిగిపోయింది. అనుకోకుండా మూడు సంవత్సరాల క్రితం ఒక మిత్రుడి మొబైల్ నంబర్ సంపాదించగలిగాను. అతనే టి. వరప్రసాద్. మేము ఎవరమూ ఊహించని స్థాయిలో గొప్ప పారిశ్రామిక వేత్తగా ఎదిగిన వ్యక్తి ఇతను. ఆ తర్వాత మరికొద్దిమంది మిత్రుల ఉనికిని తెలుసుకునే అవకాశం కలిగింది. అలా రెండుసార్లు వరప్రసాద్ ఫామ్ హౌస్‌లో కొందరం ఇంటర్ మిత్రులం అందుబాటులో వున్న ఇద్దరు గురువులతో (డా. నాగులు గారు, డా. రమేష్ కుమారుగారు) ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్న చాలా రోజుల తర్వాత మిత్రుడు శ్యామకుమార్ చాగల్ (నిజామాబాద్ నివాసి, గాయకుడు, చిత్రకారుడు, కథా రచయిత) ఒక ప్రతిపాదన చేసాడు. అదేమిటంటే, అందరం కలిసి నాగార్జున సాగర్ వెళ్లాలనీ, చదువుకున్న జూనియర్ కళాశాల దర్శించాలనీ, నివసించిన ప్రదేశాలూ, ఉప్పొంగుతున్న కృష్ణానదిని తనివితీరా చూడాలనీను. ఈ ప్రతిపాదన వాయిదా పడుతూ వచ్చింది. వాయిదాకు ప్రధాన కారకులలో నేనే ముఖ్యుడినని మిత్రుడు శ్యామ్ నన్ను ఆటపట్టిస్తుంటాడు. అతను అన్న దానిలో నిజం లేకపోలేదు.

దక్షిణ విజయపురిలో(అక్క ఇల్లు) సమతా ప్రసాద్ తో రచయిత

అది అలా వుండగా మరో మిత్రుడు డా. ఎన్. దుర్గాప్రసాద రావు (గైనకాలజిస్ట్, హైదరాబాద్) ఫోన్ చేసి, సాగర్ వెళదాం అన్నాడు. కాసేపు ఆలోచించాను. అక్క (మహానీయమ్మ) నివసించిన ప్రదేశం, అక్క ఉద్యోగం చేసిన ప్రదేశం, అక్క నన్ను ఇంటర్మీడియెట్ చదివించిన ప్రదేశం, నా జీవితాన్ని మలుపు తిప్పిన ప్రదేశం, నేను చాలా ఇష్టంగా గడిపిన ప్రదేశం, అక్క తనువు చాలించిన ప్రదేశం, ఇన్ని ప్రత్యేకతలున్న నాగార్జున సాగర్‍ని దర్శించే అవకాశం కలగడం లేదు. అందుచేత ఒక నిర్ణయానికి వచ్చి, “తప్పకుండ నేనూ వస్తాను” అని చెప్పేసాను. అలా సెప్టెంబరు రెండు, సాగర్ వెళ్ళడానికి నిర్ణయం ఖాయం అయిపొయింది.

తమ అక్క ఇంటి ప్రాంగణంలో మిత్రులతో కలిసి రచయిత

విదేశాల్లో వున్నపారిశ్రామికవేత్త మిత్రుడైన వరప్రసాద్, ఆ రోజుకి తప్పక వస్తానని చెప్పి, కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాలేక పోయాడు. ఇంటర్ చదువుకునేటప్పుడు, వరప్రసాద్, నేను కాలేజీ బస్సులో దక్షిణ విజయపురి నుండి హిల్ కాలనీకి వెళ్ళేవాళ్ళం.

విజయవిహార్ ప్రాంగణంలో శ్రీమతి దుర్గాప్రసాద్, శ్రీమతి లీల & శ్రీమతి వరలక్ష్మి

రెండవ తారీకు రెండు కార్లలో బయలుదేరాము. అంతకుముందే, హిల్ కాలనీ లోని ‘విజయవిహార్ గెస్ట్ హౌస్‌లో ఐదు ఏ.సి. గదులు, మిత్రుడు శ్యామకుమార్ (స్పాన్సరర్) రిజర్వ్ చేసాడు. ఒక కారులో, శ్యామ్ (డ్రైవింగ్ శ్రీమతి లీల, లీల చెల్లెలు వరలక్ష్మి, నేను బయలుదేరాం. రెండవకారులో కృష్ణ చంద్ (అమెరికా నివాసి), డా. దుర్గా ప్రసాద్, ఆయన శ్రీమతి అమృత రాణి బయలు దేరారు. నల్లగొండ లోని నకిరేకల్ నుండి మరో మిత్రుడు, చంద్రశేఖర్ రెడ్డి (ఆర్ట్స్ గ్రూప్ -అడ్వొకేట్) మరో కారులో బయలుదేరి అందరం విజయవిహార్‌కు చేరుకున్నాం.

విజయ విహార్ గెస్ట్ హౌస్, హిల్ కాలని,నాగార్జున సాగర్

నేను ముందుగానే మా సాగర్ ప్రయాణం గురించి, సాగర్ (పైలాన్ కాలనీ) లో నివసిస్తున్న దూరపు చుట్టం, శ్రీ తాడి (సమతా)ప్రసాద్‌కు ఫోన్ చేసినందున, మేము విజయవిహార్‌కు వెళ్లే సమయానికి ప్రసాద్ అక్కడ మా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరి గదులలో వారు ప్రవేశించి ఫ్రెష్ అప్ అయిన తర్వత సరాసరి మేము చదువుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్ళాము. కళాశాల రూపురేఖలే పూర్తిగా మారిపోయినట్లు అనిపించింది. కళాశాల అంతా తిరిగి చూసాము. ఆ నాటి గ్రంథాలయం పూర్తిగా మూత పడిందని తెలిసి చాలా బాధ పడ్డాము.

రచయిత చదువుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, హిల్ కాలని(నాగార్జున సాగర్)

తర్వాత ఆ కళాశాల ప్రస్తుత ప్రిన్సిపాల్ గారి అధ్యక్షతన కళాశాల విద్యార్థి విద్యార్థునులను సమావేశ పరచి మా అందరిచేత సందేశాలను ఇప్పించారు. ఈ ఉపన్యాసాలన్నింటిని ‘నందికొండ వార్తా స్రవంతి’ అధిపతి, శ్రీ సమతా  ప్రసాద్ రికార్డు చేసారు. పిల్లలు కూడా మేము చెప్పిన విషయాలన్నీ శ్రద్దగా విన్నారు. సీతారాంరెడ్డి గారు ఇంగ్లిష్ బోధించిన, గోలి వెంకట్రమయ్యగారు, తెలుగు బోధించిన హాలు, జువాలజీ లెక్చరర్ నాగులు సర్ వగైరాలు బోధించిన సైన్స్ హాలు (ఇది ఇప్పుడు వాడకంలో లేనట్లుగా వుంది) తనివి తీరా చూసుకొని, ప్రిన్సిపాల్ గారు ఏర్పాటుచేసిన తేనీరు సేవించి విజయవిహార్‌కు చేరుకున్నాము. సాయంత్రం నాగార్జున సాగర్-డ్యామ్ మీదుగా దక్షిణ విజయపురికి వెళ్ళాము. డ్యామ్ మీదినుండి వెళ్లాలంటే ఇప్పుడు అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆ పని సమతా ప్రసాద్ చేసిపెట్టాడు. హిల్ కాలనీకి, పైలాన్‌కు మధ్యలో అక్క సమాధిని కూడా దర్శించుకోవడం జరిగింది.

తమ అక్క ఇంటి గుమ్మం ముందు మిత్రుడు డా. దుర్గాప్రసాద్ తో రచయిత

దక్షిణ విజయపురిలో అక్క నివాసం వున్న ఇల్లు (ఎ-55) పరిసరాలకు చేరుకోగానే దుఃఖం ఆగింది కాదు. ఆనాటి ఉసిరి చెట్టు అలానే వుంది. నారింజ చెట్టు, కొబ్బరి చెట్లు, కరివేపాకు చెట్లు, గోంగూరా, ప్రాంగణం అంతా పచ్చ పచ్చగా వుంది. ఆ ఇంటిలో వుండి నేను ఇంటర్మీడియెట్ చదివాను. ఆ ఇంట్లోనే అక్క ప్రేమను పొందాను. ఆ ఇంటినుండి అక్క నా జీవితానికి మార్గదర్శనం చేసింది. అందుకే ఆ ఇంటికి చేరుకోగానే దుఃఖం ఆగింది కాదు. మిత్రులతో అక్కడ కాసేపు గడిపి, హిల్ కాలనీ చేరుకున్నాము. నేను, శ్యామ్, సమతా ప్రసాద్, విజయవిహార్‌కు దగ్గరలోనే నివసిస్తున్న ‘దాసి’ సుదర్శన్ గారిని కలిశాము. ఆయన గొప్ప వ్యక్తి, చిన్నన్నయ్యకు మంచి మిత్రుడు. కళాసేవకే అంకితమైపోయిన విలక్షణ చిత్రకారుడు ‘దాసి’ సుదర్శన్ గారు. 1988లో వచ్చిన ‘దాసి’ సినిమా, శ్రీ పిట్టంపల్లి సుదర్శన్ (నాగార్జున సాగర్) గారిని, ‘దాసి’ సుదర్శన్‌గా మార్చేసింది. ఉపాధ్యాయుడిగా, ఆర్ట్ డైరెక్టర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా, పుస్తక రచయితగా, కార్టూనిస్టుగా, జర్నలిస్టుగా, ఫోటోగ్రాఫర్‌గా, ఉపన్యాసకుడిగా, చిత్రకారుడిగా, ఇలా అనేక ప్రత్యేకతలు కలిగి అతి సామాన్య జీవితం గడుపుతున్న ఆ గొప్ప వ్యక్తిని కలిసి కాసేపు ఆయనతో గడప గలగడం, నాకు తృప్తిని,గొప్ప సంతోషాన్ని కలిగించింది.

‘దాసి’ సుదర్శన్ గారితో మాటామంతి

రాత్రికి సంగీత విభావరిలో శ్యామ్, లీల పాటలు పాడారు. డా. దుర్గాప్రసాద్ శ్రీమతి కూడా, శ్రీమతి లీలతో కలసి పాడి అందరినీ ఆశ్చర్య పరిచారు. నా చేత కూడా శ్యామ్ పాట పాడించడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది.

సంగీత విభావరిలో కృష్ణ చంద్ (అమెరికా), డాక్టర్ దుర్గాప్రసాద్ (హైదరాబాద్), చంద్రశేఖర్ రెడ్డి (నకిరేకల్)
సంగీత విభావరిలో శ్యామ్ కుమార్, లీల దంపతులు

మరునాడు పైలాన్ లోని సమతా ప్రసాద్ స్టూడియోలో ఇంటర్వ్యూలు, ఆ తర్వాత డామ్ ఎడమవైపు పవర్ జనరేషన్, ఫోటోలు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాం. నాగార్జున సాగర్ పర్యటనలో, ఇంటర్ మిత్రులం కలసి కళాశాలలో విద్యార్థులతో గడపడం, మా అక్క సమాధిని, ఆవిడ నివసించిన గృహాన్ని దర్శించడం, ‘దాసి’ సుదర్శన్ గారిని కలసి ఆయనతో కొంత సమయం గడపడం ముఖ్య అంశాలు. నా బ్రతుకు మలుపు తిప్పిన ప్రదేశంలో కొంత సమయం గడపడానికి తమవంతు సహకారాన్ని అందించిన మిత్రులకు, ముఖ్యంగా మిత్రుడు శ్యామ్ కుమార్‌కు, స్థానిక మిత్ర బంధువు సమతా ప్రసాద్‌కు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here