జ్ఞాపకాల పందిరి-134

21
12

నీళ్ళో.. నీళ్లు..!!

[dropcap]నీ[/dropcap]ళ్లు.. నీళ్లు..!

నీళ్లు లేనిదే జీవితం లేదు, నాగరికత లేదు, అభివృద్ధి అంతకంటే లేదు! ఒక ప్రదేశం లేదా ఒక ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, లేదా పాడీపంట మెరుగుపడాలంటే, ఆ ప్రాంతంలో పుష్కలంగా నీటి సదుపాయం వున్నప్పుడే అది సాధ్యపడుతుంది. దేశ అభివృద్ధికి, లేదా ఒక ప్రాంత అభివృధ్ధి కోసం, రవాణా సౌకర్యం ఎంత అవసరమో, నీరు.. అంతకంటే ఎక్కువ అవసరం. అందుకే సముద్రాల్లో కలిసిపోయే నీటిని అదుపుచేసి కాల్వల ద్వారా నీరు పంటపొలాలకు అందించడం ద్వారా రైతు మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఆలోచనతోనే నిర్మించబడింది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల అటు ఆంధ్రా ప్రాంతము, కుడికాల్వ ద్వారానూ, తెలంగాణా ప్రాంతము ఎడమకాల్వ ద్వారాను లబ్ధి పొందుతున్నాయి. పంటపొలాల సాగుకు ఉపయోగపడి, ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్నాయి. అలాగే అవసరమైన ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. అలాగే నీటి ద్వారా జల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఉంది. ఉభయ రాష్ట్రాలలోనూ అనేక ప్రాజెక్టులు ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలకు ఉపయోగపడుతున్న, నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. అంతమాత్రమే కాకుండా, ఈ వ్యాస రచయిత, 1972-74 ప్రాంతంలో, నాగార్జున సాగర్‌లో, ఇంటర్మీడియెట్ చదవడం కూడా ఒక కారణం. అప్పటికి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రమే ఉంది, రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోలేదు.

రచయిత ఇంట్లో బోరు బావి

ఒక విషాదం ఏమిటంటే, మనం ఎంతో అభివృద్ధి చెందామని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో, ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు తగినంత సాగునీరు త్రాగునీరు పొందలేక పోవడం బాధాకరం. కేవలం వర్షాధార ప్రాంతాలలో వర్షం నీటి మీద, త్రాగునీరు, సాగునీరు ఉపయోగించుకోవలసిన ప్రాంతాలలో, వర్షపు నీటిని నిల్వ చేసుకునే సదుపాయాలూ కూడా అంతంత మాత్రమే ఉండడం ఇంకా సమస్య గానే మిగిలి పోయింది. ఇప్పటికీ కొన్ని ప్రాంత ప్రజలు త్రాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి రావడం మనం వింటూనే విన్నాం.

అయితే, భవిష్యత్తులో నీటి కొరత మరింత జనావళికి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఊహించవచ్చు. కారణం దట్టమైన అడవులు అదృశ్యమైపోవడం, ఋతువుల్లో తేడాలు వచ్చి వర్షపాతంలో మార్పులు రావడం. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ఆకాశహర్మ్యాలు అని చెప్పదగ్గ భవన నిర్మాణాలు, వాటికోసం లోతైన బోరుబావుల త్రవ్వకం, వర్షపు నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితులూ, ఇవన్నీ నీటి ఎద్దడికి కారణాలే! నీటి కోసం, నీటి యుద్దాలను కూడా ఊహించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, కొన్ని ప్రాజెక్టులు రాజకీయ రంగులు పులుముకుని, వారి వారి స్వార్థం కోసం రాజకీయ నాయకులు, రాబోయే తరాలకు అన్యాయం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రస్తుతం అధికారంలో వున్న రాజకీయ పార్టీలు, తమ పార్టీల/పదవుల మనుగడ కోసం, ఉచితాల పేరుతో సామాన్య ప్రజలను మభ్య పెట్టి, దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే పథకాలకు గుండుసున్నా చుడుతున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు మృగ్యం అవుతున్నారు. ఎన్నికల చుట్టూ కరెన్సీ నోట్లు ప్రదక్షిణం చేస్తున్నాయి. ఇలా ఎన్నికైన నాయకులు, తమ అభివృద్ధి వైపే దృష్టి సారిస్తున్నారు గానీ దేశ అభివృధ్ధి కోసం, దేశ భవిష్యత్తు కోసం ఎవరూ ఆలోచించకపోవడం దురదృష్టకరం.

మున్సిపాలిటీ మంచి నీరు సంపు

ఈ నేపథ్యంలో జల సమస్యకు పరిష్కారం ఎప్పుడు, ఎక్కడ దొరుకుతుంది? ఆలోచించేవాడికి గుండె ఝల్లుమంటుంది. అందుచేత నీటిని దుర్వినియోగం చేయకుండా, పొదుపుగా వాడడం వంటి విషయాలు ప్రజలలో అవగాహన రావాలి. వర్షపు నీరు వృథా కాకుండా, చెరువులలో నిల్వచేసుకునే పరిస్థితులు సమకూర్చుకోవాలి. బోరు బావులున్నట్లైతే, వాటికి సమీపంలో, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ నిర్మాణంలో ‘ఇంకుడు గుంత’ ఒక ప్రధాన అంశంగా గుర్తించి, మునిసిపాలిటీలు, అలా ప్లాను వున్నవాటికే అనుమతులు ఇవ్వాలి. బహుళ అంతస్తులకు అనుమతి ఇచ్చేటప్పుడు, నీటి విషయం కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

చాలా మందికి మున్సిపాలిటీ నీటి సదుపాయంతో పాటు, బోరుబావులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి వారు, మొక్కల కోసం ఇతర ప్రాధాన్యతలు లేని పనుల కోసం, మంచినీటినే వినియోగిస్తారు. ఇలాంటి వారు కనీసం తాగడానికి నీళ్లు లేనివారి గురించి ఆలోచించాలి. అవసరానికి మించి మంచినీరు సరఫరా అయినప్పుడు, ఆ నీటిని భద్రపరచుకోకుండా, వృథాగా రోడ్లమీదికో, ఖాళీ ప్రదేశాలలోకో వదలకూడదు. నీటి యొక్క విలువను గుర్తించాలి. స్నానాలకు గాని ఇతరపనులకు గాని నీటిని పొదుపుగా వాడాలి.

కొద్ది స్థలంలోనే పచ్చదనం

ముఖ్యంగా వేసవి కాలంలో నీటి విలువ బాగా తెలుస్తుంది. మంచి నీటి వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రామాలలోని, సహజ బావులు ఎండిపోతాయి. చెరువులు అడుగంటిపోతాయి. భూగర్భ జలాలు కనీస స్థాయి దిగజారిపోతాయి. ఇలాంటప్పుడు నీరు ఎంత విలువైనదో తెలుస్తుంది. ప్రభుత్వాలు సమకూర్చే రక్షిత మంచినీటి పథకాలు సైతం వేసవికాలంలో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుచేత నీటిని చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలి.

నీటికి సంభందించి నా అనుభవాలు కొన్ని చెబుతాను. ఉదయం నేను ‘నడక’ కోసం బయటకు వెళ్లే అలవాటు వుంది. ఒక్కోసారి మా కాలనీకి ఉదయమే మంచినీటి సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో, మా కాలనీలో, అనేక లీకేజీల వల్ల నీరు వృథాగా రోడ్డుమీద వరదలా ప్రవహిస్తుండేది. ఈ పరిస్థితిని అనేక మార్లు గమనించిన నేను ఒకసారి నీటి సరఫరా లైన్‌మాన్‍కు ఫోన్ చేసి విషయం అతని దృష్టికి తెస్తే, అతని సమాధానం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అతను ఏమన్నాడంటే

“సార్.. ఇది నా పై అధికారులకు చెబితే నన్ను బాగు చేయించమంటారు, నా జేబులోంచి అంత సొమ్ము పెట్టే స్తొమత నాకు లేదు” అని. అలా మా కాలనీలోనే నాలుగైదు చోట్ల మంచి నీళ్లు నెలల కొద్దీ వృథా అయిపోవడం నేను ప్రత్యక్షంగా చూసాను.

నిమ్మ,అరటి చెట్లు

అలాగే, కొత్తగా ఎన్నికైన మేయర్లు తమ హయాంలో రెండుపూటలా మంచినీళ్లు ఇప్పించాం అని చెప్పుకోవడానికి, లేదా ప్రజావసరాలు తీర్చడానికి ,రెండు పూటలా మంచి నీరు సరఫరా చేస్తే, అవి నిల్వ వుంచుకోవడానికి వీలు కానివాళ్ళు, పైపు ఆపకుండా, నీటి ప్రవాహాన్ని రోడ్డుమీదికి వదిలేస్తుంటారు. ఇలా ఎన్నో చోట్ల, ఎన్నో కాలనీల్లో, విలువైన మంచినీరు వృథా చేయడం జరుగుతుంది. త్రాగవలసిన నీరు ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగించవలసిన మంచి నీరు, మొక్కలకు, జంతువులను, ఇళ్లను, వాహనాలను కడగడానికి ఉపయోగించేవాళ్ళు చాలా మంది వున్నారు. ఇది ఒకరు చెబితే వచ్చేది కాదు, సమాజ అవసరాలను అవగాహన చేసుకుని ప్రతివారు సహకరించవలసిన అంశం.

ఉండేకొద్దీ నీటి కొరత మరింత పెరిగే అవకాశం వుంది. ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం, వరదనీటిని, వర్షపు నీటిని తయూరీతిలో భద్రపరుచుకోవడం వంటి విషయాలు, ప్రజలలో అవగాహన తీసుకురావాలి. దీనికి ప్రజల సహకారంతో పాటు ప్రభుత్వ సంస్థలు,స్వచ్ఛంద సంస్థలు,కలిసి పనిచేస్తేనే ఇది కొంతలో కొంత ఫలితాలవైపు దారితీసే అవకాశం వుంది.

మామిడి చెట్లు
ఇంటి బయట పచ్చదనం

నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇంచుమించు ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇంటి చుట్టూరా వున్న అతి కొద్దీ ప్రదేశంలో, జామ, మామిడి, నిమ్మ, కరివేపాకు, అరటి చెట్లు కొన్ని పూలమొక్కలు పెంచుతున్నాను. వీటికి నీళ్ళ సరఫరా, బోర్ నుండి వచ్చే నీరు మాత్రమే. పరిసరాలు కడగడానికి, వాహనాలు కడగడానికి మంచినీరు ఎప్పుడూ ఉపయోగించను. బోర్ నీళ్లు అయినా, మున్సిపాలిటీ నీళ్లు అయినా, ఒక్క చుక్కకూడా వృథా కాకుండా జాగ్రత్త పడుతుంటాను. నేనే కాదు, మా కుటుంబ సభ్యులను కూడా వృథా చేయనివ్వను.

ఇంకుడు గుంత
ఇంటిలోపలి పచ్చదనం

భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నేటి ప్రకృతి పరమైన మార్పులను దృష్టిలో ఉంచుకుని, నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వాడవలసిన అవసరం వుంది. భవిష్యత్తులో జలసమస్యలు/సంఘర్షణలు రాకుండా చూసుకోవలసిన గురుతర బాధ్యత మన మీదే ఉంది. కాదంటారా?

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here