జ్ఞాపకాల పందిరి-137

33
9

ఆత్మీయ సమ్మేళనాలు – కాకూడదు అపహాస్యపు భజనలు..!!

[dropcap]గ[/dropcap]తంలో, దూరాభారాలను దృష్టిలో వుంచుకుని, బంధువులు గాని, స్నేహితులు గానీ, శ్రేయోభిలాషులు గానీ ఒకచోట కలవడం కష్టమయ్యేది. ఎవరెక్కడున్నారో తెలిసేది కాదు. మొబైల్ లాంటి ఆధునిక సమాచార పరికరాలు అప్పట్లో అందుబాటులో లేవు. ల్యాండ్‌లైన్ ఫోన్లు, టెలిగ్రామ్ వ్యవస్థ ఉండేది కానీ ఈ సదుపాయం అందరికీ సాధ్యమయ్యే స్థాయిలో ఉండేది కాదు. కార్డు వంటి ఉత్తర ప్రత్యుత్తరాలతోనే క్షేమ సమాచారాలు తెలుసుకునే వీలు ఉండేది. ప్రత్యేకమైన శుభకార్యాలు, మంచి – చెడుకు మాత్రమే జనం ఒక చోట కలిసే అవకాశం ఏర్పడేది. అందుచేత ఎవరికివారే, యమునాతీరే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. దానికి తగ్గట్టుగా తగిన ప్రయాణ సదుపాయాలు కూడా అందరికీ అందుబాటులో వుండేవి కాదు. అందుచేత ఎంతటి బంధువైనా, స్నేహితులైనా ఎప్పుడంటే అప్పుడు ఒకరినొకరు చూసుకునే అవకాశం ఉండేది కాదు.

కంప్యూటర్, మొబైల్ వంటి ఆధునిక సాధనాలు సమాజంలో రంగప్రవేశం చేయడంతో, మొత్తం ప్రపంచం మన గుప్పిట్లోకి వచ్చినట్టు అయిపొయింది. ముఖ్యంగా మొబైల్ ఆవిర్భావంతో, అనేక సదుపాయాలతో పాటు, సమాచారం ఒకరికొకరు అందిపుచ్చుకునే అవకాశం ఏర్పడింది. ఉచితంగా ప్రపంచంలో ఎక్కడికైనా అప్పటికప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకునే వెసులుబాటు ఏర్పడింది. వీడియో కాల్ చేసి ముఖాముఖీ చూసుకుంటూ మాట్లాడుకునే వీలు చిక్కింది. వివిధ ప్రాంతాలనుండి లేదా వివిధ దేశాలనుండి ఒకేసారి ఎంతమందైనా మాట్లాడుకునే అవకాశం దక్కింది.

కరోనా సమయంలో వివిధ విద్యాసంస్థలు ఈ పద్ధతినే విరివిగా ఉపయోగించుకుని విద్యాసంవత్సరం వృథా కాకుండా కాపాడుకున్నాయి. ఇలాగే రకరకాల సాహిత్య కార్యక్రమాలు ఆన్‌లైన్ పద్ధతిలో జరిగాయి. ఇలా మొబైల్ ఆవిర్భావంతో ఫేస్‌బుక్ మాధ్యమం ద్వారా అనేక గ్రూపులు ఏర్పడ్డాయి. ఇలాంటి గ్రూపుల్లో ప్రపంచవ్యాప్తంగా వున్న స్నేహితులు, బంధువులు, ఒకే గొడుగు క్రిందికి వచ్చే ఏర్పాటు సులువైంది. ఇలా కుల గ్రూపులు, పాత స్నేహితుల గ్రూపులు, కుటుంబ గ్రూపులు, బంధువుల గ్రూపులు, సాహిత్యంలో – నవల, పద్యం, కథ, కవిత్వం, ఇలా అనేక రకాల గ్రూపులు ఏర్పరచుకోవడానికి వీలు కలిగింది. ఈ మధ్య కాలంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా ఫేస్‌బుక్‌లో గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాయి.

ఆత్మీయ సమ్మేళనంలో అతిథిగా రచయిత

వీటిని దృష్టిలో ఉంచుకుని, ఆత్మీయ సమ్మేళనాలు జోరందుకున్నాయి. కులాలు, మతాలూ, బంధువులు, పూర్వ-విద్యార్థి పరమైన ఆత్మీయ సమ్మేళనాలు ఎలాగైనా వారిష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ, సాహిత్య, సాంస్కృతికపరమైన కార్యక్రమాలు ఇష్టం వచ్చిన రీతిలో చేసుకునేట్టు వుండవు. ఒక పద్ధతిలో జరిపించగలిగితేనే అవి సఫలం అవుతాయి. లేకుంటే అనుకున్నవన్నీ పద్ధతిగా, క్రమశిక్షణగా వుండవు. ఇక్కడ వేదిక ఏ ఒక్కరి అదుపులోనో ఉండాలి. లేకుంటే అంతా రసాభాసా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి కార్యక్రమానికి ఒక ఎజెండా ఉండాలి. దానిని అనుసరిస్తూ కార్యక్రమాలు జరుపుకోవాలి. ఈ మధ్య కాలంలో కుటుంబాల పరంగాను, పూర్వ విద్యార్థుల పరంగానూ ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఊపందుకున్నాయి. తమ వారితో కలసి ఆనందంగా గడపడం, ఒకరినొకరు సన్మానించుకోవడం, పెద్దలలను సన్మానించుకోవడం వంటివి తరచుగా జరుగుతున్నాయి. అలాగే వనభోజనాలూ వగైరా. ఇది ఆహ్వానించదగ్గ శుభ పరిణామమే, ఎవరూ కాదనరు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు లేదా కొన్ని గ్రూపులు ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఒక పద్ధతి లేకుండా కేవలం కాసేపు ఏదో కాలక్షేపం కోసం గంతులు, పిచ్చి జోకులు వేసుకుని సుష్టుగా మధ్యాహ్నం భోజనం ముగించి ఇక సన్మానాల పర్వం మొదలు పెడతారు. సమయం అయిపోయిందని త్వర త్వరగా ముగించేస్తారు. ఆత్మీయ సమ్మేళనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారన్న విషయం మరచిపోతారు.

ఎడమ-రచయితను ఆత్మీయంగా సమ్మేళనంకు ఆహ్వానించిన సహృదయ మిత్రులు కె.సుధాకర్ రెడ్డిగారు (హన్మకొండ), కుడి- రచయిత ప్రియ మిత్రుడు, రచయితకు ప్రయాణ సౌఖర్యం కలిగించి తోడు వచ్చిన కథా రచయిత శ్రీ శ్యామ్ కుమార్.చాగల్(నిజామాబాద్)

ఈ మధ్య ఫేస్‌బుక్‌లో ఒక గ్రూప్ పక్షాన అందులోని సభ్యుడు నాకు మిత్రుడు అయినందున, ఆయన విజయవాడలో జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. వారి అభిమాన ఆహ్వానాన్ని కాదనలేక వస్తానని చెప్పాను. నా మిత్రుడు శ్యామ్ కుమార్‌కి (కథా రచయిత) చెప్పగానే ఆయన తన కారులో ప్రయాణం సిద్ధం చేశాడు. ఆయనతో పాటు నేను, కవయిత్రి అయిన ఒక మిత్రమణి, విజయవాడలో కలిసిన మరొక మిత్రమణి, మొత్తం నలుగురం కలిసి మంగళగిరి రోడ్డులో వున్న కార్యక్రమ స్థలానికి వెళ్ళాము.

కార్యక్రమాన్ని తిలకిస్తూ ఎడమ-టి.దేవి, కుడి-సరళ శ్రీ లిఖిత

మేము వెళ్లేసరికి జ్యోతి ప్రజ్వలన జరిగిపోయింది. అంతా పలకరించుకుంటూ సందడి చేసుకుంటున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. రిసెప్షన్ కౌంటర్ ఉంది కాని, సభ్యులను రిజిస్టర్ చేశారో లేదో తెలీదు. అక్కడ వాళ్ళ దగ్గర లిస్టు కనిపించ లేదు. సభ ప్రారంభమయింది, అడ్మిన్ గారి ప్రారంభ ఉపన్యాసం బాగానే సాగింది. వచ్చిన వారందరి పరిచయాలూ లేకుండా మొక్కుబడిగా కొందరి చేత మాత్రమే పరిచయ వాక్యాలు మాట్లాడించారు.

నలుగురు మిత్రులు.. ఎడమ:శ్రీమతి టి.దేవి (విజయవాడ) రచయిత ప్రక్కన మిత్రుడు-శ్యామ్ కుమార్(నిజామాబాద్); కుడి–కవయిత్రి శ్రీమతి. సరళ శ్రీలిఖిత(సికిందరాబాద్)

(అందులో నేనూ వున్నాననుకోండి.. అది వేరే విషయం) ఇక అడ్మిన్ గారి వాగ్ధోరణే అమితంగా కొనసాగింది. ఇక అది కూడా అయిందనిపించుకున్న తరువాత, ఇక అసలు సంగతి మొదలయింది. విపరీతమైన సౌండ్ పెంచి పిచ్చి డాన్సులు, అక్కడ ఎక్కువసేపు కూర్చుంటే ఎవరికైనా చెముడు వచ్చే పరిస్థితి వచ్చింది. అది భరించలేక మేము బయటికి వచ్చేసాము. కనీసం కొంచెం సమయమైనా సాహిత్యానికి కేటాయిస్తారేమో అనుకున్నాం. కానీ అలాంటి పని ఏమీ జరగలేదు. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికి తోడు, ఈ కార్య క్రమానికి ఒక ఏంకర్‌ను పెట్టుకున్నారు. ఏంకర్ మైకు వదలదు, అడ్మిన్ మైకు వదలదు. ఇద్దరూ ఒకేసారి మాట్లాడుతుంటే ఏమి మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. అడ్మిన్ మైక్ వదలనపుడు ఏంకర్ అవసరం ఏముంది పైగా ఆమె ద్వందార్థాలలో మాట్లాడడం ఇంకా వింతగా అనిపించింది. ఆ గ్రూప్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వారిలో, కవులు, కథకులు, వ్యాసకర్తలు (అడ్మిన్‌తో సహా) వున్నారు. అయినా సాహిత్యానికి చోటులేదు.

వేదిక ప్రాంగణంలో మిత్రుడు శ్యామ్‌తో.. రచయిత

మధ్యాహ్న భోజనాలు అయిన తర్వాత మళ్ళీ అదే డాన్సులు, ఆటలు పాటలు. ఏవో పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు, కొందరికి సన్మానాలు (నాకూ చేశారనుకోండి). అప్పటికే సాయంత్రం అయిదు అయిపొయింది. మేము నలుగురం బయలుదేరి వచ్చేసాము.

ఆత్మీయ సమ్మేళనం చివరలో రచయితకు సన్మానం

అంత డబ్బు ఖర్చు చేసిన ఈవెంట్ ఇలా ఉండడం అసలు బాగోలేదు. దూరాభారాలతో అక్కడికి వచ్చిన వారికి అంత తృప్తి అనిపించదు. వారికి ఆ కార్యక్రమం సక్సెస్.. అనిపించ వచ్చుగానీ, జనాన్ని అక్కడికి రప్పించడంలో మాత్రమే వారు సఫలీకృతం అయ్యారని నాకు అనిపించింది. ఆత్మీయ సమ్మేళనాలు ఖచ్చితంగా ఆహ్వానించ దగ్గవే, కానీ ఆ అమూల్య సమయాన్నీ సద్వినియోగం చేసుకుంటేనే దానికి అందం, ఖర్చుచేసిన డబ్బుకు విలువ, ప్రయోజనమూనూ.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here