జ్ఞాపకాల పందిరి-138

23
9

అమ్మో.. షాపింగా..!!

[dropcap]షా[/dropcap]పింగులు పలు రకాలు. మామూలుగా షాపింగ్ అంటే ఏమి కొనుక్కోవడానికి వెళ్లినా అది షాపింగే! కానీ ప్రత్యేకమైన వస్తువులను కొనడానికి ప్రత్యేకమైన షాపింగులు ఉంటాయి, అది కూడా ముఖ్యంగా స్త్రీమూర్తులకు. పురుషుల షాపింగ్, ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఉండదు, దానికి పెద్ద ప్రాముఖ్యత కూడా ఉండదు. ఎందుకంటే, అది అంతే! అలా స్త్రీమూర్తులు చేసే షాపింగుల్లో బట్టల షాపింగ్, బంగారం షాపింగ్ చెప్పుకోదగ్గవి. కొద్దీ శాతం పురుష పుంగవులకు కూడా ఈ షాపింగ్ మీద మోజు బాగానే ఉంటుంది. కొన్నిసందర్భాలలో, స్త్రీ-పురుషులు (ఉదాహరణకు, భార్యాభర్తలు) కలిసి షాపింగ్‌కు వెళ్లినా, మగాడి హవానే ఎక్కువగా ఉంటుంది. భార్యకు నచ్చకపోయినా, భర్తకు నచ్చినదే నచ్చినట్టు ఒప్పుకు తీరాలి. లేదంటే అతి తక్కువ శాతం ఇలాంటి వాళ్ళు వుంటారు. ఎక్కువ శాతం ఆడవాళ్లే ఆ పని పెట్టుకుంటారు. దానికి ఎక్కువ ఓపిక కావాలి కనుక మగవాళ్ళు తప్పించుకుంటారు. అలా ఊరుకోక ఆడవాళ్ళ మీద జోకులు వేస్తారు. అయితే షాపింగ్ అనేది మామూలు విషయం కాదు, అది ఒక యజ్ఞమే! షాపింగ్‌లో బట్టల షాపింగ్ ప్రత్యేకం! పండుగలప్పుడు చూడాలి షాపింగుల మజా ఏమిటో.

గ్రామాలలో బట్టలు సైకిళ్ళ మీద అమ్మకాలు. (కర్టెసీ గూగుల్)

నాది పల్లెటూరు గ్రామ నేపథ్యం కాబట్టి, మా గ్రామంలో బట్టల షాపులు ఉండేవి కాదు. ఎక్కడో దూరంగా తాలూకా కేంద్రంలో కొద్దీ షాపులు ఉండేవి. సామాన్య ప్రజానీకానికి అన్నిరకాలుగా అవి అందుబాటు లోనికి వచ్చేవి కాదు. చిన్నచిన్న బట్టల వ్యాపారస్థులు అన్ని రకాల బట్టలూ పెద్ద మూటలో కట్టుకుని సైకిళ్ళ మీద, గ్రామాల్లో తిరిగేవారు. వాళ్ళ దగ్గర ఎక్కువ రకాలు ఉండేవి కనుక, బట్టను ఎన్నుకోవడం త్వరగానే తెమిలిపోయేది, రేటు దగ్గర మాత్రం అటు వ్యాపారి ఇటు కొనుగోలుదారుకి మధ్య చాలా సేపు తర్జనభర్జనలు జరిగేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

గ్రామాలలో బట్టలు సైకిళ్ళ మీద అమ్మకాలు. (కర్టెసీ గూగుల్)
గ్రామాలలో బట్టలు సైకిళ్ళ మీద అమ్మకాలు. (కర్టెసీ గూగుల్)

రవాణా సౌకర్యాలు పెరిగిన తర్వాత (ప్రభుత్వ పరంగానూ, స్వయంగాను) గ్రామాలు, తాలూకాలకూ, జిల్లాలకు, నగరాలకు చేరువైనాయి. ప్రజల డిమాండును బట్టి, ఆయా ప్రదేశాల్లో బట్టల షాపులూ పెరిగాయి. అక్కడక్కడా చేనేత వస్త్రాల దుకాణాలు రకరకాల పేర్లతో వెలిశాయి. ఈ నేపథ్యంలో కుటుంబాలలో పండగల సందర్భంగా, పెళ్లిళ్ల సందర్భంగా, షాపింగులు చేయడాలు మొదలై షాపులు ఎప్పుడూ నిత్యకళ్యాణం పచ్చతోరణంలా కళకళలాడుతూ జనాల్ని ఆకర్షిస్తుంటాయి.

ఈ రోజున రకరకాల బట్టలు, రెడీమేడ్ దుస్తులు అందుబాటు లోనికి వచ్చాయి. ఎక్కువ రకాలు ఉంటే సెలెక్షన్ కూడా కష్టమేమో! కస్టమర్లు ఆ షాపు వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తుంటారు. అవసరం అయి చేస్తారో, కావాలని చేస్తారో కానీ కొందరు స్త్రీమూర్తులు అక్కడ వున్న చీరలు అన్నీ చూపించమంటారు. అన్నీ వారి ముందు క్షణాల్లో ప్రత్యక్షం అవుతాయి, కానీ వాటిల్లో ఒకటీ నచ్చదు. ఏమీ చెప్పకుండానే లేచి వేరే షాపుకు వెళ్ళిపోతారు. నచ్చిన దుస్తులు తీసుకోవలసిందే, దానిని ఎవరూ కాదనలేరు. కానీ మొత్తం షాపులో ఏమీ నచ్చకపోవడం వింతగానే ఉంటుంది. బహుశః అక్కడి బట్టలు నచ్చక కాకపోవచ్చు, మరో షాపులో ఇంకా మంచివి దొరుకుతాయని ఆశ కావచ్చు.

బట్టల దుకాణంలో

ఇక ఆ షాపు వాడి ముఖం చూడాలి. అవన్నీ నిరుత్సాహంగా మడత పెట్టడం మొదలు పెడతాడు. ఈ పని అక్కడ పని చేసే వ్యక్తులు చేయవచ్చు గాక అది వేరే విషయం అనుకోండి! అయినా వాళ్ళ అమ్మకాలకు లోటు లేదు. కొత్త షాపులు వస్తూనే వున్నాయ్, జనంతో కిటకిట లాడుతూనే వున్నాయ్.

‘పెట్టుడు బట్టల’కు కూడా ఎప్పుడూ డిమాండు ఉంటూనే వుంది. ఒకప్పుడు, టైలర్ షాపులకు బాగా డిమాండు ఉండేది. ఇప్పుడు సూట్ నుండి చుడీదార్ వరకూ రెడీమేడ్ దొరుకుతుండడంతో, కొంతవరకూ టైలర్లకు కాస్త డిమాండు తగ్గినట్టే. ఇప్పుడు ‘మగ్గం వర్క్స్’ కు డిమాండు పెరిగింది.

మహిళల చోళీలు సైతం వేలరూపాయల్లో ఉండడం, నేడు నడుస్తున్న చరిత్ర. ఏది ఏమైనా బట్టల షాపింగ్ చేయడంలో వనితలకున్నంత ఓపిక, శ్రద్ధ, అభిరుచి పురుషులకుండవన్నది జగమెరిగిన సత్యమే!

చాలా కుటుంబాలలో, ఇంట్లో అందరి బట్టలు, ఇంటావిడ కొనడమే రివాజు. సాధారణంగా పిల్లల బట్టలు, తల్లులే కొంటుంటారు. ఆ కోవకు చెందిన వాళ్ళల్లో నేనూ ఒకడిని.

చిన్నప్పుడు మా అమ్మ సంవత్సరానికొకసారి మాత్రం, అది కూడా సంక్రాంతికి (నా అసలు పుట్టిన తేదీ జనవరి 13) బట్టలు కొనేది. ఖద్దరు చొక్కా, కాకి నిక్కరు. సైకిలు మీద తెచ్చి అమ్మే బట్టల వ్యాపారి దగ్గర కొనేది. అతను అరువు కూడా పెట్టేవాడు. ఆ బట్టలు టైలరుకు ఇవ్వడం, అతను కుట్టి ఇచ్చిన బట్టలు అదో రకమైన సువాసన వచ్చేవి. అవి తొడుక్కున్నప్పుడు పొందిన ఆనందం ఇప్పుడు కావాలన్నా దొరకదు. నేను కాస్త పెద్దయిన తర్వాత పెద్దన్నయ్య, అక్కలు (మహానీయమ్మ, భారతి) కొనేవారు. నా పెద్దక్క స్వర్గీయ మహానీయమ్మ నాకు పెళ్ళై, పిల్లలు పుట్టినా నా పుట్టిన రోజుకు బట్టలు కొనేది.

రచయిత పెద్దక్క (మహానీయమ్మ .కానేటి,నాగార్జున సాగర్) అప్పట్లో కొనిచ్చిన చొక్కా.

అసలు సంగతి నాకు పెళ్ళైన తరవాత మొదలైంది. మా ఆవిడ నా పుట్టిన రోజుకి, పెళ్లి రోజుకి, క్రిస్మస్ పండుగకు బట్టలు కొనడానికి షాపుకు రమ్మని బ్రతిమాలేది. షాపులో గంటలకొద్దీ గడపడం నాకు ఇష్టం ఉండేది కాదు. అందుచేత బట్టల షాపుకి నేను అసలు వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు నా కూతురు ఒత్తిడి మొదలైంది. మొత్తం మీద షాపుకు తీసుకు వెళతారు (ఒకోసారి నా ప్రమేయం లేకుండానే కొని తెచ్చేస్తారు). అక్కడ సెలెక్ట్ చేసిన కొన్ని జతలు ఒక సంచిలో వేసి నన్ను వాటన్నింటిని ట్రయిల్ చూడమంటారు.

నేను మాత్రం ఎక్కువలో ఎక్కువ రెండు జతలు మాత్రం ట్రయిల్ చూసి ఒక జత సెలెక్ట్ చేసుకోవడం – నాకు, వాళ్ళకీ అలవాటు అయిపొయింది. నేను మా అబ్బాయి దగ్గరకు అమెరికా వెళ్ళినప్పుడల్లా నాకు బట్టలు కొంటాడు. అబ్బాయి ఇండియాకు వచ్చినప్పుడల్లా నా కోసం బట్టలు తెస్తాడు. అలా ఇప్పుడు ఎన్ని జతలు ఉన్నాయో నాకే తెలీదు. బాల్యానికి, ఇప్పటికీ ఎంత తేడా, ఎంత మార్పు? బాల్యం నుండి నేను ఎదుగుతూ, జీవితంతో పాటు జీవనశైలిలో కూడా గొప్ప మార్పును తెచ్చుకోగలిగాను. దీని వెనుక నా తల్లిదండ్రులు, అన్నలు – అక్కలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది వున్నారు. వీరందరికీ ఎంతో రుణపడి వున్నాను. వీరికి నా పాదాభివందనం. ఇప్పుడు అసలు నేను బట్టలు కొనుక్కోవాల్సిన పనిలేదు. అవసరానికి మించి వున్నాయి. అయినా, నా శ్రీమతి గానీ, నా కూతురు గాని నాకు తెలియకుండా కొని తీస్తుంటారు. నా బట్టల సైజులు నాకంటే వాళ్ళకే బాగా తెలుసును. కరోనా సమయంలో అయితే అసలు బట్టలు ధరించి బయటికి వెళ్లే అవసరమే రాలేదు. ఈ తరం వాళ్లకి అదొక పీడకల!

బట్టల షాపుల్లో మనవరాలు ఆన్షి తో రచయిత

సాహిత్య రంగంలో వున్నాను కనుక సన్మానాల పేరుతో శాలువాలు చాలా వచ్చేవి. వాటిని శీతాకాలంలో, పెద్దవాళ్ళకి, ముఖ్యంగా అడుక్కునేవాళ్ళకి ఇచ్చేస్తుంటాను. నేను వాడిన పాత దుస్తులు కూడా అవసరమైన వారికి ఇచ్చేస్తుంటాను.

బట్టల షాపుల్లో మనవరాలు ఆన్షి తో రచయిత

ఇప్పుడు మా ఇంట్లో మనుమల తరం ప్రారంభమయింది. వాళ్ళ బట్టల కోసం ఇప్పుడు షాపింగ్ టీమ్‌లో నేను ఉండక తప్పడం లేదు. సెలెక్షన్ కోసం కాదండోయ్, పిల్లల్ని ఎత్తుకోవడానికి. ఏది ఏమైనా బట్టల సెలెక్షన్ (ముఖ్యంగా మహిళల/ఆడపిల్లల బట్టలు) మామూలు విషయం కాదండోయ్.. అది కూడా ఒక కళ సుమా!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here