జ్ఞాపకాల పందిరి-141

30
8

వాళ్లిద్దరూ అటూ – మిగతా ముగ్గురూ ఇటు..!!

[dropcap]ప్ర[/dropcap]యాణాలు అంటే కొందరికి మహా సరదా! కొందరికి తప్పనిసరి అయితే మరి కొందరు సరదా కోసం, ఆనందం కోసం ప్రయాణం ఒక విలాస క్రీడగా ఎంచుకుంటారు. కొందరు వ్యాపార నిమిత్తం తక్కువ రోజులు స్వదేశంలో ఉంటే, ఎక్కువ రోజులు విదేశాల్లో పర్యటిస్తుంటారు. మరికొందరు చదువు నిమిత్తం విదేశాలు, స్వదేశంలో ఇతర రాష్ట్రాలకు వస్తూ పోతుంటారు. అంటే ఎక్కువగా వ్యాపార నిమిత్తం, చదువుల నిమిత్తం, బంధుమిత్రులను కలుసుకునే నిమిత్తం, విహారయాత్రల కోసం ప్రయాణాలు చేస్తుంటారు. అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, విమాన యానం కావచ్చు, నౌకాయానం కావచ్చు, రైలు ప్రయాణం కావచ్చు, బస్సు ప్రయాణం అయినా కావచ్చు. ఎక్కడ చూసినా జన సందోహమే!

కారణం ఏదైనా తరచుగా ప్రయాణం చేసేవారు అప్పుడప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు, ఎన్నో అనుభవాలను మూట కట్టుకొంటుంటారు. అవి బయటకు తెలిస్తే తప్ప ఇతరులు అలాంటి సమస్యలను దైర్యంగా ఎదుర్కొనే అవకాశం కలగదు. కొందరు తమ అనుభవాలను తమ మనసులోనే దాచుకుని బయటకు చెప్పరు. దీనివల్ల ఇతరులు మళ్ళీ.. మళ్ళీ అదే సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి.

తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ విమానాశ్రయంలో డా. శంకర్ లాల్, డా. పాలేశ్వరన్, రచయిత, డా.అరుణ.అన్నే.

ప్రయివేటు వైమానిక సంస్థలు, బస్సు ఏజెన్సీలు చేసే మోసాలు ఇప్పటికీ చాలా మందికి తెలియవు. అందువల్ల తమ వంతు వచ్చినప్పుడు ఆయా సమస్యలు చికాకు కలిగిస్తాయి. మానసిక ఆందోళనకు గురి చేస్తాయి.

విమానయానాలు చేయడంలో నేను వెనకబడేవున్నానని చెప్పక తప్పదు. పదే.. పదే.. విమానయానం చేసే స్థాయి కూడా కాదు నాది. ఒకవేళ ఆ స్థాయి వున్నా అనవసరంగా దుర్వినియోగం చేసే మనస్తత్వం కూడా కాదు నాది. క్రింది స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగిన వాడిని, కనుక ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి విలువ కడుతుంటాను. ప్రాధాన్యతనాలను బట్టి ఖర్చు చేస్తుంటాను. అలా రెండు సార్లు అమెరికా నా కుమారుడి దగ్గరకు వెళ్ళినప్పుడు, దానికి అయినా ఖర్చు అంతా అబ్బాయే చూసుకున్నాడు. ఎలాంటి సమస్యలు రాకుండా అవసరమైన తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. కనుక విమానయానంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు కూడా నా దృష్టికి రాలేదు.

రచయితతో పాటు విమానం మిస్ చేసుకున్న డా.మంజుల, డా.అరుణ.

అలాగే పది సంవత్సరాల క్రితం మనదేశంలోని త్రిపుర రాజధాని అగర్తలకు అక్కడున్న సహాధ్యాయులను కలవడానికి, కొంతమంది మిత్రులతో కలసి వెళ్లడం జరిగింది, అప్పుడు కూడా ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఆ తీపి గుర్తులు ఇంకా మనస్సులో మెదులుతూనే వున్నాయి. ఆ ప్రయాణానికి మా సహాధ్యాయిని, పెరియోడాంటిస్ట్, డా. జె. క్రాంతి (ప్రపంచ నాస్తికోద్యమ నాయకులు శ్రీ గోరా గారి మనవరాలు, మైత్రి గారి అమ్మాయి) సారథ్యం వహించారు. అది ఒక చక్కని విహార యాత్రలా సాగింది. మేము అప్పుడు అగర్తలా పట్టణానికి వెళ్ళడానికి ప్రధాన కారణం అక్కడ మా సహాధ్యాయులు ముగ్గురు ఉండడమే. వారు డా. పార్ధ రే చౌదరి, డా. మౌజం అలీ (ఈయన ఆంగ్ల కవి కూడా), డా ప్రాణోబ్ కుమార్ (ఈయన మేము వెళ్ళినప్పుడు అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకుని వున్నాడు). వాళ్ళ ఆహ్వానం మేరకు, డా. క్రాంతి వాళ్ళ అబ్బాయి హాసిల్, డా. జయంతి, డా. ఝాన్సీ, డా. బి. ఎం. ఎస్. శంకర్ లాల్, ఆయన కూతురు డా. శృతి, నేను వెళ్ళాము.

జల విహారం

అయితే, అనుకోని రీతిలో మరోసారి డా. పార్ధరే చౌదరి ఆహ్వానం మీద వాళ్ళ అబ్బాయి పెళ్లి రిసెప్షన్‍కు మరోసారి కొంతమంది మిత్రులం (డా క్రాంతి, డా. మంజుల, డా. అరుణ, డా పాలేశ్వరన్, డా శంకర్ లాల్, నేను) అనుకుని డిశంబర్ 13న అగర్తలా వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకోవడమే కాదు ఎయిర్ టికెట్లు రిజర్వ్ కూడా చేసుకున్నాం. దీనికోసం మిత్రుడు డా. పాలేశ్వరన్, మాతో కలిసి రావడానికి గానూ, తన మాతృభూమి మలేషియా నుండి హైదరాబాద్‍కు వచ్చాడు, డా. శంకర్ లాల్ ఇంట్లో (చందా నగర్) బస చేసాడు. అనుకోని రీతిలో కొన్ని గృహ సంబంధమైన అవసరాల వల్ల తప్పని పరిస్థితిలో డా. క్రాంతి అగర్తలా టికెట్ రద్దు చేసుకుని ముందుగానే అమెరికా వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల మేము అయిదుగురు అయినాము.

రచయిత బృందాన్ని ఆహ్వానించిన సహృదయ మిత్రుడు Dr. Pardha ray chowdary.

విమానం కదిలే సమయం 6. 30 కనుక అంత ఉదయ సమయంలో నేను వుండే చోటునుండి శంషాబాద్ ఎయిర్‍పోర్ట్‌కి వెళ్లడం ఇబ్బంది కనుక 12 వ తేదీ రాత్రికి నేను కూడా చందానగర్ వెళ్ళిపోయాను.

13వ తేదీ ఉదయం ఎయిర్‍పోర్ట్‌కి ముగ్గురము చేరుకున్నాము. కొద్దీ నిముషాల తర్వాత డా. మంజుల, డా. అరుణ వచ్చారు. ఇప్పుడు బోర్డింగ్ పాస్ ఆన్‍లైన్‍లో తీసుకునే అవకాశం వుంది కనుక చెక్ ఇన్, సెక్యూరిటీ స్క్రీనింగ్ పూర్తి చేసుకుని మేము ఎంటర్ కావలసిన గేట్ దగ్గర కూర్చున్నాము. గతంలో పది సంవత్సరాల క్రితం మేము ఇలాగే అగర్తలా వెళ్ళాము. అప్పుడు హైదరాబాద్ నుండి అగర్తలాకు డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది. కరోనా తర్వాత ఇక్కడ కూడా పెను మార్పులు వచ్చాయి. అంచెలంచెల ప్రయాణం చేయవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో మేము హైదరాబాద్ – బెంగుళూరు – కోలకత్తా – అగర్తలా ఇలా మూడు విమానాలలో ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అలా హైదరాబాద్ నుండి బెంగుళూరు చేరుకున్నాము. అక్కడ రెండు గంటల సమయం వుంది కోలకతా వెళ్ళడానికి. చేయవలసిన తతంగం పూర్తి చేసుకుని, బ్రేక్‍ఫాస్ట్ కోసం వెతికాము. హనుమంతుడి తోకలా పెద్ద క్యూ ఉందక్కడ. శంకర్ లాల్‍తో పాటు నేను కూడా క్యూ లో నిలడ్డాను, నన్ను చూసి “నువ్వెళ్ళి కూర్చో నేను తెస్తాను” అన్నాడు. నేను బుద్దిగా వెళ్లి ఖాళీ సీట్లో కూర్చున్నాను. చాలా సేపటికి బ్రేక్‍ఫాస్ట్ వచ్చింది. అందులో ఒకటి తక్కువగా ఉండడంతో, మళ్ళీ నేను క్యూలో నిలబడి నాకు అవసరమైన టిఫిన్ తెచ్చుకుని తింటున్నాను. పాలేశ్వరన్, శంకర్ లాల్ అప్పటికే తినేయడంతో, వాళ్ళని గేటుదగ్గరికి నడుస్తుండమని చెప్పాము. నాకు జతగా ఇద్దరు మిగిలిపోయారు. త్వరగా టీ.. త్రాగి మెల్లగా బయలుదేరాము. ఎవ్వరమూ సమయం ఎంతైందో చూసుకోవడం లేదు. ఈ లోగా నన్ను చూసి అక్కడే హైదరాబాద్ వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తున్న ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు, బహుభాషాకోవిదుడు మంచి ఉపన్యాసకుడు, కరీంనగర్ వాసి,డా. నలిమెల భాస్కర్ వచ్చి విష్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో, అప్పటికే విమానంలో కూర్చున్న మిత్రుడు శంకర్ లాల్ ఫోన్ చేసి గేట్ మూసేస్తున్నట్టు ప్రకటించారని, త్వరగా రమ్మని చెప్పాడు. మేము త్వరగా గేట్ దగ్గరకు వెళ్ళగానే, సమయం మించిపోయిందని, ఆ విమానంలో ప్రయాణం చేసే అవకాశం లేదని చెప్పేసారు. కొద్ది నిముషాల ఆలస్యం, అయిదుగురు కలిసి ప్రయాణం చేస్తున్న విషయం వారికి అవగాహన వుంది, చివరిసారిగా మా పేర్లు మైక్ ద్వారా ప్రకటించడం కూడా జరగలేదు. అప్పటి మా పరిస్థితి ఎలావుంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. నాలో నీరసం ప్రవేశించింది.

రిసెప్షన్ ప్రాంగణంలో డా.మౌజం అలి (ఎడమ)తో  రచయిత బృందం

నాతో వున్న ఇద్దరు మిత్రమణులు మాత్రం చాలా ధైర్యంగా వున్నారు. అక్కడి నుండి అగర్తలా వెళ్లాలంటే 52 వేలు అవుతుందని చెప్పారు. నేను తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నాను. అగర్తలా వెళ్లే ఆశలు నాలో పూర్తిగా అడుగంటిపోయాయి. హైదరాబాడ్ నుండి, అమెరికా నుండి సానుభూతి కాల్స్ మొదలయ్యాయి. ఉదయం 9.30కి మేము వెళ్ళవలసిన విమానం వెళ్ళిపోయింది. మిత్రురాలు డా. మంజుల నాకు ధైర్యం చెబుతూనే, తాను అక్కడి అధికారులతో వాగ్వివాదానికి దిగింది.

రిసెప్షన్ ప్రాంగణంలో డా.అలి, రచయిత, డా.శంకర్ లాల్.

ఒక గంట ప్రయత్నం చేసి అప్పుడు వీలుకాకుంటే హైదరాబాద్ వెళ్ళిపోదామని డా. మంజుల నన్ను ఓదార్చినంత పని చేశారు. చెప్పినట్టుగానే తాను అనుకున్నది సాధించింది. తదుపరి మధ్యాహ్నం 12.10కి వున్న విమానంలో అవకాశం కలిగిస్తామని, లేదంటే ఒక్కొక్కరు 2,500/- చెల్లించ వలసి ఉంటుందని చెప్పారు. దానికి ఒప్పుకుని బ్రతుకు జీవుడా అని ప్రయాణం కొనసాగించాం. మా ఈ విచిత్ర సంఘటనకు బాధ పడుతున్న మిత్రులందరికీ మెసేజ్‍లు పంపాము. బెంగుళూరు నుండి కొలకత్తా అక్కడి నుండి అగర్తలా సుఖంగా ప్రయాణం చేసి 5.30కి విమానాశ్రయంలో దిగాం. మా కోసం డా. శంకర్ లాల్, డా. మౌజం అలీ (అగర్తలా) విమానాశ్రయంలో సిద్ధంగా వున్నారు. అందరం టాక్సీలో హోటల్ రాజధానికి చేరుకున్నాము.

రిసెప్షన్ ప్రాంగణం – ఆకర్షణ గల అలంకరణ

మా కోసం మిత్రుడు డా. పార్ధ రే చౌదరి మంచి హోటల్ బుక్ చేసాడు. చౌదరి కొడుకు పెళ్లి రిసెప్షన్ చాలా బాగా జరిగింది. మౌజం అలీ ఇద్దరు కూతుళ్లతో హాజరు అయ్యాడు. చౌదరి కూతురు అల్లుడు కలిశారు. చాలా బాగా వాళ్ళతో గడిపాము. మరునాడు 14వ తేదీ పెళ్లి బృందంతో పాటు మమ్ములను కొన్ని ప్రదేశాలకు తీసుకువెళ్లారు. హోటల్‍కి తిరిగి వచ్చేసరికి సాయంత్రం ఆరు అయింది. నేను బాగా అలసిపోయాను. అందుకే రూమ్‍లో విశ్రాంతిగా ఉండిపోయాను. మా కోరిక మేరకు మిత్రమణులు డా. మంజుల, డా.అరుణ షాపింగ్‍కు వెళ్లి చీరలు కొని తెచ్చారు. వారి సహృదయతకు ధన్యవాదాలు.

పెళ్లి కొడుకు–పెళ్లి కూతురుతో

15వ తేదీ 10.30 కి బయలుదేరి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే హైదరాబాద్ విమానాశ్రయంలో రాత్రి 8.30 కి దిగి ‘హమ్మయ్య’ అనుకున్నాము. బెంగుళూరు విమానాశ్రయంలో మా విమానం మిస్ అయినప్పుడు నాకు ఎంతో ధైర్యాన్ని నూరిపోసి, నన్ను కంటికి రెప్పలా కాపాడిన మిత్రమణులు డా. మంజులను, డా. అరుణను వారి సహృదయతను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ ప్రయాణం నాకే కాదు, నా లాంటి ఎందరికో గొప్ప హెచ్చరిక.

రాజధాని హోటల్ నుండి వీడ్కోలు

***

ఇలాగే..!!
~
స్నేహితుల కోసం
సమయం వెచ్చించే
వయసు కాకపోవచ్చు మనది!
పనుల ఒత్తిడి కూడా దానికి
తోడై ఉండవచ్చు..!
డబ్బు ఖర్చు,
ఇంటి ఉచ్చు
మనల్ని బయటికి
కదల నీయక పోవచ్చు!
కానీ..
అదృష్టం బాగుండి
ఎదురొచ్చిన అవకాశాలు
సద్వినియోగం చేసుకుంటే
ఆ ఆనందం ఏమిటో
అందులోని శక్తి ఏమిటో
అనుభవించిన వాళ్ళకే
అది అర్థం అవుతుంది!
అందుకే –
ఆ.. గుంపులోనే నాకు
ఎప్పుడూ..
వుండాలనిపిస్తుంది!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here