జ్ఞాపకాల పందిరి-147

33
9

పాదచారుల పని అంతే..!!

[dropcap]సు[/dropcap]ఖం కోరుకునే మనిషి ‘నడక’ అంటే ఏమిటో మరచిపోతున్నాడు. డబ్బుంటే ఎలాంటి వాహనం అయినా కొనుక్కుని సుఖ ప్రయాణానికి అలవాటు పడుతున్నాడు. అయితే మనిషి నడక మరిచిపోతున్నా నడిచేవాళ్ల గురించి మరిచిపోకూడదు కదా! అప్పట్లో రోడ్లు సన్నగా ఉండేవి. వాహనాలు కూడా వాటికి తగ్గట్టుగానే ఉండేవి. కార్లు, బైక్‍లు బహు కొద్దిమందికి మాత్రమే ఉండేవి. రోడ్డుకు తగ్గట్టు పాదచారులకు ఫుట్‌పాత్‌లు ఉండేవి ఒకరి వల్ల మరొకరికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. రోడ్డు దాటడానికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కారణం బహుశః ఇన్ని రకాల వాహనాల హడావిడి అప్పుడు ఉండక పోవడమే కావచ్చు.

నా బాల్యంలో సైకిలు కొద్దిమంది దగ్గరే ఉండేది. అప్పుడు సైకిల్ ఉండడమే గొప్ప! సైకిలు గలవారిని గొప్పగా చూసేది. చిన్నప్పుడు నాకు సైకిలు లేకున్నా సైకిలు తొక్కడం నేర్చుకున్నా. మా నాయన కొబ్బరి తోటల మధ్య బీరకాయలు పండించేవారు, అవి కొనుక్కోవడానికి ఒక వ్యాపారి ఎక్కడినుంచో సైకిలు మీద వచ్చేవారు. ఆయనను ‘బీరకాయల కాపు’ అనేవాళ్ళం. సైకిలు స్టాండు వేసి ఆతను బీరకాయ పని చేసుకుంటుంటే, ఆ సైకిలుతో మొదట సైకిలు తొక్కడం నేర్చుకున్నాను. తర్వాత మా నాయన అవసరానికి కొనుక్కున్న సైకిలు అప్పుడప్పుడూ తొక్కేవాడిని కానీ, నాకంటూ ఒక సైకిలు కొనుక్కునే అవకాశం రాలేదు. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి ఇలానే ఉండేది. ముఖ్య అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత నివ్వడం జరిగేది. తర్వాత మోపెడ్ల హవాతో ప్రయాణాలు సుఖవంతం కావడం మొదలుపెట్టాయి.

ఆ తర్వాత స్కూటర్లూ, బైకులు, కార్లు రంగప్రవేశం చేశాయి కదా! జనాల అవసరాల కోసం వాహనాలు, వాహనాల ప్రయాణానికి అవసరమైన రోడ్లు అవసరం అయ్యాయి. రోడ్లకు ప్రక్కన పాదచారులకు కాలిబాట (ఫుట్‌పాత్) కూడా రివాజు. ప్రధాన రహదారి వాహనాలకు కేటాయిస్తే, కాలిబాట, పాదచాచారుల కోసం నిర్దేశింపబడింది. క్రమంగా రోడ్లు వెడల్పు అయినాయి. దానికి అనుగుణంగా ఫుట్‌పాత్‍లు తయారైనాయి. దురదృష్టవశాత్తు ఈ ఫుట్‌పాత్‌లు చాలా చోట్ల పాదచారులకు దక్కకుండా పోతున్నాయి. కబ్జాదారుల చేతిలోకి వెళ్లి చిన్న చిన్న దుకాణాలతో, కాలిబాటలు పూర్తిగా దుకాణాలతో నిండి పోతున్నాయి. మరి ఎవరి కోసం అవి ఉద్దేశింపబడ్డాయో, వారి ఉపయోగానికి రాక ఇలా ఆక్రమణలు జరుగుతుంటే, ప్రభుత్వ యంత్రాంగం కిమ్మనకుండా చర్యలు తీసుకోకపోవడం అంటే అధికారికంగా వారికి అనుమతిని ఇచ్చినట్టా? లేదా రాజకీయ జోక్యమా? అర్థం కాదు.

పాదచారుల దారి ఆక్రమించుకోవడం వల్ల, దుకాణాల దగ్గర కొనుగోలుదారులు పార్కింగ్ చేసే వాహనాలు మరింత ఇబ్బందిని కలిగిస్తున్నాయి. రోడ్డు వెడల్పుగా ఉండడం వల్ల, వాహనదారులు వారి వాహనాలను అతివేగంగా నడపడం వల్ల పాదచారుల పరిస్థితి, ప్రమాద స్థితికి చేరుకుంటున్నది. ఈ విషయంలో, ప్రభుత్వాలు గానీ, మున్సిపాలిటీలు గానీ, పంచాయితీలు గానీ ఎలాంటి చర్యలూ తీసుకొనక పోవడం విడ్డూరం అనిపిస్తుంది. హైదరాబాద్, వరంగల్ వంటి పట్టణాలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

హైదరాబాద్ వంటి మహానగరాలలో, ప్రతిచోటా వారంలో ఒకరోజు (ఉదాహరణకు సఫిల్‌గూడ) కూరగాయల సంత ఉంటుంది. నిజానికి ఇవి ఆయా ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరమైనవే! తాజా కాయగూరలు ఆకుకూరలు, పండ్లు, కొంచెం తక్కువ ధరకు లభ్యం అవుతాయి. కానీ రోడ్డు ఇరువైపులా కూరగాయల వర్తకులతో నిండి వాహనాలు స్వేచ్ఛగా పోవడానికి అసలు వీలుండదు. కానీ వాహనాలు ఎట్టి పరిస్థితి లోనూ ఆగవు. జనాల్ని రాసుకుంటూ, పూసుకుంటూ పోతుంటాయి. అందుకే అలాంటి సంతలలో ఏవైనా కొనుక్కోవడానికి వెళ్లాలంటే, భయం భయంగా ఉంటుంటుంది. అలా వాహనాల వల్ల, ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా వున్నాయి. పోనీ ఈ కూరగాయల దుకాణాలు రోడ్డుకు ఒకప్రక్కనే పెట్టినా బాగుండును, లేదా ఆ ఒక్క రోజుకు వాహనాల మార్గం మార్చితే సరిపోతుంది. ఉదాహరణకు విశాఖపట్టణం నగరంలో బీచ్ రోడ్డు ఉదయం కొన్నిగంటలు అటు – ఇటు వాహనాల రాకపోకలు స్తంభింప బడతాయి, ఎందుకంటే ఆ సమయం ఆ రోడ్డు వాకర్స్ (నడిచేవారి కోసం) కోసం కేటాయించబడింది. ఏ మహానుభావుడికి (అధికారికి) ఆ ఆలోచన వచ్చిందో కానీ,ఆ పద్ధతి ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. పట్టణాలలో, ఈ సంతల విషయంలో విశాఖపట్టణం బీచ్ రోడ్ ఫార్ములా ప్రవేశ పెడితే కొంత ప్రయోజనం ఉంటుందేమో! ఈ నేపథ్యంలో పాదచారుల విషయంలో నిర్లక్ష్యం తగదన్నది స్పష్టం.

అభివృద్ధి చెందిన అమెరికా (నాకు రెండుసార్లు వెళ్లే అవకాశం కలిగింది) వంటి దేశాలలో, ట్రాఫిక్ నిబంధనలు, అవి నూటికి నూరుశాతం పాటించే ఆ ప్రజల చిత్తశుద్ధి ప్రతి ఒక్కరు కొనియాడ దగినవి. పాదచారుల కోసం నిర్దేశించిన ఫుట్‌పాత్‍లు, కేవలం పాదచారులు మాత్రమే వినియోగించుకునే విధంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, పాదచారులు ఒకవైపునుండి రోడ్డు మరో వైపుకు దాటాల్సి వచ్చినప్పుడు, వారికోసం నిర్దేశించిన జీబ్రా లైన్స్ దగ్గర కాలినడకన పోయేవారు రోడ్డుదాటే ప్రయత్నం చేస్తే, ఆటోమేటిక్ గా ఇరువైపులా వాహనాలు ఆగిపోయి, నడిచేవారు రోడ్డు పూర్తిగా దాటిన తర్వాత మాత్రమే ఇరువైపులా వాహనాలు కదులుతాయి. అయితే అధిక జనాభా గల మన దేశంలో అలాంటి సదుపాయాలూ ఆశించడం అత్యాశే అవుతుందేమో!

కానీ పాలకులు తలచుకుంటే జరగనిదంటూ ఏముంటుంది? కానీ,ఇక్కడ మనకు ప్రతి మంచి పనికీ రాజకీయం ఏదో రూపంలో అడ్డుపడుతూనే ఉంటుంది.

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి నగరాలలో, ప్రజలు నివసించే కాలనీల నుండి మెయిన్ రోడ్డుకు పోవాలంటే సన్నని వీధులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఫుట్‌పాత్‌లు వుండవు, కానీ అన్నిరకాల వాహనాల తాకిడి ఉంటుంది. అలాంటి మార్గాలలో పాదచారుల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. పక్కనుండి రాసుకుపోవడం, నడకలో ఉన్నవారి వెనకకు వచ్చి అప్పుడు అతి పెద్ద శబ్దంతో హారన్ వాయించి తికమక పెట్టడం, ప్రమాదాలకు దారితీసే పరిస్థితులకు కారణమౌతాయి.

ప్రసుతం సికింద్రాబాద్‌లో ఉంటున్న నేను ప్రతి ఉదయం వాకింగ్ కోసం వెళుతున్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలివే! ముఖ్యంగా వయసు పైబడిన వారి విషయంలో ఫుట్‌పాత్‌ల అవసరం, వినియోగం గురించి తప్పని సరిగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం వుంది.

చిరు వ్యాపారస్తులు, తమ వ్యాపారం కోసం కాలిబాటను ఆక్రమించుకోవడం తగదు. ఈ విషయంలో మున్సిపాలిటీలు తగిన శ్రద్ధ వహించాలి. పాదచారుల విషయం అశ్రద్ధ చేయవలసిన అంశం కాదు. పాదచారులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించ వలసిన అవసరం వుంది. పార్కింగ్‌కు అనుకూలంగా వున్న ప్రదేశాలలోనే, వ్యాపారస్థులకు చోటు కల్పించాలి. ఫుట్‍పాత్‌లు ఎట్టి పరిస్థితి లోనూ, పాదచారుల కోసం ఖాళీగా ఉంచవలసిందే!

~

ఎప్పుడైనా – ఎక్కడైనా

నువ్వు – నేను – ఎవరైనా

పాదచారులం కావచ్చు!

అందుకే మరి..

ఫుట్‍పాత్‌లు

మన కోసమే ఉండాలి..!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here