జ్ఞాపకాల పందిరి-149

32
7

పుస్తకాలు ఫుల్లు..! చదవడం నిల్లు..!!

[dropcap]ఈ[/dropcap] రోజున ‘పుస్తకాలు చదివేవాళ్ళు తక్కువైనారు’ అన్న పదం జనంలో వైరల్ అవుతున్నది. ‘టివి, మొబైల్ ప్రభావమే దీనికి కారణం’ అనేవాళ్లూ లేకపోలేదు. అలా అని వీటిని తీసి పక్కన పెట్టలేము. వీటికి తోడు ఆధునిక విద్యా విధానంలో విద్యార్థీ విద్యార్థినిలు పాఠ్య గ్రంథాలకు మాత్రమే పరిమితమై, మామూలు పుస్తకాల జోలికి పోడం లేదన్నది కూడా ఆలోచించ వలసినదే!

తల్లిదండ్రులు కూడా ఈ రకమైన పిల్లల ఆలోచనలను ప్రోత్సహించడం కూడా కాదనలేము. ఏది ఏమైనా ఎక్కువ శాతం పిల్లలు పాఠ్యగ్రంథాలు తప్ప, కథలు, నవలలు, మహాత్ముల జీవిత చరిత్రలు, కవిత్వం అసలు చదవడం లేదన్నది అర్థమవుతున్నది. పాఠశాలల్లో, కళాశాలల్లో ఒకప్పుడు తప్పనిసరిగా వారంలో ఒక రోజు ‘లైబ్రరీ పిరియడ్’ ఉండేది. అక్కడ ఇష్టమైన పుస్తకం చదువుకునే వెసులుబాటు ఉండేది. అలా ‘చదవడం’ అనే అలవాటు జీవితంలో స్థిరపడిపోయేది. ఇప్పుడు ఎన్ని పాఠశాలలు, కళాశాలలు గ్రంథాలయాలు నడిపిస్తున్నది, ‘లైబ్రరీ పిరియడ్’ అమలు చేస్తున్నదీ చెప్పేట్లుగా లేదు. ఆ అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోక పోవడం బాధాకరం. అప్పట్లో ఏదైనా పోటీలలో గెలిచిన వారికి,  ఇచ్చే బహుమతులు పుస్తకాల రూపంలో ఉండేవి, అవి నీతి బోధకాలు, జీవిత చరిత్రలు, సైంటిస్టులు, మహాపురుషుల అనుభవాలు, నవలలు, కథలు, నదులు-పర్వతాలు, ఇలా ఆయా వయసు వారు అర్థం చేసుకునే పుస్తకాలు అయివుండేవి. అలాగే కొన్ని పుస్తకాలను దృష్టిలో పెట్టుకుని వ్యాసరచన పోటీలు నిర్వహించేవారు.

ఆ విధంగా కూడా విద్యార్థులు పాఠ్య గ్రంథేతర పుస్తకాలు కూడా చదివి అర్థం చేసుకునే పరిస్థితులు ఉండేవి. ఆదివారాల్లోనూ, ఇతర సెలవుల్లోనూ, పిల్లలు గ్రంథాలయాలకు వెళ్లి పిల్లల పుస్తకాలు – చందమామ, బాలమిత్ర, బాలరంజని, బాలజ్యోతి వంటి పుస్తకాలు చదువుకునేవారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చందాలు కట్టి పత్రికలు తెప్పించుకునేవారు. అలా చదవడం అనే అలవాటు తప్పనిసరిగా పిల్లలకు అబ్బేది. ఇవన్నీ టి.వి, మొబైల్ వంటి సాధనాలు జనం మధ్యలోకి రాని రోజుల సంగతి.

ఆదివారం, ‘సెకండ్ హ్యాండ్’ పుస్తకాలతో హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్, అబిడ్స్ ఫుట్‌పాత్‌లు పుస్తకాలలో నిండి ఉండేవి. అక్కడ అరుదైన, విలువైన కొన్ని పుస్తకాలు చాలా తక్కువ ధరకు దొరికేవి. పుస్తక ప్రేమికులు, నిత్య పుస్తక చదువరులు, రచయితలతో ఆ పుస్తకాల షాపులు కిటకిటలాడేవి.

రచయిత చిరు గ్రంథాలయం

రచయితల దగ్గర, పుస్తక ఆవిష్కరణ సభల్లో, ఉచితంగా తీసుకుని, మర్నాడే అమ్మేసిన పుస్తకాలు కూడా ఫుట్‌పాత్ పుస్తకాల షాపుల్లో దర్శనమిచ్చేవి. చాలా మందికి పుస్తకాలు కొనుక్కుని చదివే అలవాటు ఉండేది. ఈ అలవాటు ఎంతో మంది రచయితలు తమ స్వంత పుస్తకాలను ముద్రించుకోవడానికి ప్రోత్సాహకరంగా ఉండేది. ఏటేటా నిర్వహించే బుక్ ఎగ్జిబిషన్ లలో విపరీతంగా పుస్తకాలు కొనుక్కుని చదివి ఇంట్లోనే మినీ గ్రంథాలయాన్ని తయారు చేసుకునేవారు.

నేటి పరిస్థితుల్లో పుసకాలు చదవకపోవడానికీ, పుస్తకాలు స్వయంగా కొనకపోవడానికి మరోకారణం, ముద్రణా వ్యయం పెరగడం, తద్వారా పుస్తకాల రేటు పెరగడం కూడా! ఈ నేపథ్యంలో రచయిత తన పుస్తకాన్ని ముద్రించు కోవడానికి సందేహించవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. పుస్తకం వేసుకోవాలని ఆశపడేవారు, వేల రూపాయలు ఖర్చుపెట్టి పుస్తకాలు ముద్రించుకుని, దాని ఆవిష్కరణ మహోత్సవానికి మరింత వదిలించుకుని, చివరకు పుస్తకాలు ఉచితంగా పంచుకోవడం, మిగిలినవి ఇంట్లో స్టాకు పెట్టుకోవడం తప్ప వాటిని అమ్ముకునే అవకాశాలు రావడం లేదు.

రచయిత చిరు గ్రంథాలయం

ఇక, మరో వైపు మరోరకం పరిస్థితి. కొందరు పుస్తక సేకరణే ధ్యేయంగా పెట్టుకుంటారు. ఇంట్లో వాటికోసం ప్రత్యేకమైన షెల్ఫ్‌లు తయారు చేసుకుంటారు. చదవాలనే ఆరాటంతో, చదువుతున్నారని నలుగురి చేత అనిపించుకోవడం కోసం ప్రతి సాహిత్య కార్యక్రమానికి (పుస్తకావిష్కరణల్లో) హాజరు అవుతుంటారు. ఎట్లాగూ అక్కడ పుస్తకాల పంచడం అనే కార్యక్రమం ఉంటుంది కనుక, అక్కడ ఉచితమే కాబట్టి ఒకటికి రెండు పుస్తకాలు తీసుకుని, ఇంటిలోని పుస్తకాల షెల్ఫ్‌లో భద్రపరుస్తారు. పేజీ తిప్పి చూసిన దాఖలాలు అసలు వుండవు. మరికొంతమంది భాష మీద వున్న మక్కువతో, తాము చదవక పోయినా, పిల్లల కోసం లేదా తమ తరవాతి తరం కోసం విపరీతంగా పుస్తకాలు సేకరిస్తారు.

కొత్త పుస్తకాలు శీర్షికన వివిధ పత్రికలలో ప్రకటించే ప్రతి పుస్తకం ఉచితంగానే, డబ్బులు కట్టో తెప్పించుకుని దాచిపెడతారు. పొరపాటున కూడా అందులో ఒక్క పుస్తకమూ చదివి వుండరు. ఇక పిల్లలు మాత్రం ఏమి చదువుతారు? ఇంటికి వచ్చిన వారి పొగడ్తలకు, అందంగా అలంకరిస్తారు తప్ప పుస్తకాలు చదివే ప్రయత్నం అసలు చేయరు. కొందరు మిత్రులతో పుస్తక ప్రదర్శనలకు వెళతారు. మొహమాటానికో, ఇతరుల ఒత్తిడితోనో, పుస్తక ప్రియుడినని చెప్పుకోవడం కోసమో, ఖర్చు పెట్టి చాలా పుస్తకాలు కొనేసి, షెల్ఫ్‌లో దాచుకుని వాటిని చూస్తూ ఆనందిస్తారు, చదవడం మాత్రం అసలు జరగదు. దీని వల్లనే మన మాతృభాషను మన పిల్లలు పెద్దగా పట్టించుకోవడం లేదేమో అనిపిస్తుంది. మనం చదవాలి, పిల్లలు చదివే అనుకూల పరిస్థితులు కల్పించాలి. అప్పుడే పిల్లల్లో ఈ అలవాటు క్రమేపి వృద్ధి చెంది జీవితాంతం కొనసాగుతుంది. టివి, రేడియో, సినిమా సాకులు చెప్పకుండా, దేని సమయం దానికి కేటాయించాలి.

రచయిత ప్రస్తుతం కొని చదువుతున్న పుస్తకం

పుస్తకాలు సేకరిస్తున్నవారంతా చదవడం లేదని నేను అనను. చాలామంది తమ చేతిలోకి ఏ కొత్త పుస్తకం వచ్చినా, అది చదివిన తర్వాతనే షెల్ఫ్‌లో సర్దుకుంటారు. నిజానికి ఇది చాలా మంచి అలవాటు. తర్వాత చదువుదాం అనుకుంటే అది అలానే పెండింగ్ పడిపోతుంది, పుస్తకాలు మాత్రం పేరుకు పోతుంటాయి.

మా పెద్దన్నయ్య స్వర్గీయ కె. కె. మీనన్ దగ్గర నా బాల్యం గడిచినందువల్ల, ఆయన స్వయంగా రచయిత కావడంవల్ల, ఇంటినిండా పుస్తకాలు, పత్రికలూ మొత్తం సాహిత్య వాతావరణం నా చుట్టూ ఉండడం వల్ల చిన్నతనంలోనే నాకు పుస్తకాల విషయంలో ఎక్కువ మక్కువ ఏర్పడింది. పుస్తకాలు సేకరించాలనే అభిలాష కూడా ఎక్కువైంది. ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత మంచి పుస్తకాలు అనుకున్నవి కొంటుండేవాడిని, ముఖ్యంగా రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు వేసే పుస్తకాలు కొనేవాడిని. తర్వాత రచయితగా నిలదొక్కుకున్న తర్వాత ఇతర సాహితీ మిత్రులు వేసుకున్న పుస్తకాలు నాకూ అందేవి, అలా పుస్తకాలు బాగానే సేకరించగలిగాను, కానీ దురదృష్టావశాత్తు అన్ని పుస్తకాలూ చదవలేక పోయాను, ఇప్పుడు చదవాలన్న నా జీవితకాలం సరిపోయేట్టు లేదు. ఏదైనా వడి.. వడిగా చదివే అలవాటు నాకు లేకపోవడం కూడా నా దురదృష్టం.

రచయిత ఇప్పుడు చదువుతున్న మరో పుస్తకం

ఇప్పుడైతే కొత్తగా వచ్చిన పుస్తకాలు వెంటనే చదివే ప్రయత్నం చేస్తున్నాను, అయినా నా చదువు అంత తృప్తిగా లేదు. మా పెద్దన్నయ్య పుస్తకాలు, పుస్తకాల పట్ల ఆయన సంతానానికి పెద్దగా అభిరుచి లేనందువల్ల ఆయన మరణానంతరం హైదరాబాద్ లోని ‘సుందరయ్య విజ్ఞాన కేంద్రం’కు విరాళం ఇచ్చేసారు.

ఇక నా పుస్తకాల విషయంలో, నా ముద్దుల మనవరాలి (ఇప్పుడు ఆరేళ్ళు నిండాయి) మీద గట్టి నమ్మకం కుదిరింది. ఈ వయసులోనే నా మనవరాలు ఆన్షి, మాతృభాష మీద బాగా మక్కువ చూపిస్తున్నది. తాత మీద, తాత రచనల మీద ఆమెకు ఇప్పటినుండే ఆమెకు అభిమానం మెండుగా వుంది. అందుకే ఆ చిన్నారి మీద అపారమైన నమ్మకం నాకు.

రచయిత పుస్తకాలకు తదుపరి యజమాని మనవరాలు చి.ఆన్షి.నల్లి.

చివరిగా చెప్పొచ్చేదేమిటంటే, చేతికందిన పుస్తకం వెంటనే చదవండి. చదవకుండా పుస్తకాలను కేవలం అందంగా ఇంట్లో అలంకరించుకోవడానికి మాత్రమే వాడకండి. పుస్తకాలు చదివే అలవాటు మనకుంటే, తప్పకుండా మన పిల్లలకూ అలవాటు అవుతుంది. పుస్తకాలు చదవడం కేవలం జ్ఞాన సంపదకు మాత్రమే కాదు, మెదడులో చురుకుదనం కోసం పుస్తకపఠనం చాలా అవసరం అన్నది గ్రహించాలి. జీవితం గురించిన అవగాహన కలగాలంటే పుస్తక పఠనం తప్పనిసరి!

‘చిరిగిన చొక్కా అయినా వేసుకో.. కానీ

ఓ.. మంచి పుస్తకం కొనుక్కో..!’

-కందుకూరి వీరేశలింగం పంతులు

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here