జ్ఞాపకాల పందిరి-151

35
7

మరో రజతోత్సవం..!!

[dropcap]మ[/dropcap]నిషి జీవితంలో అనేక విషయాలలో గుర్తుంచుకునే సమయాలు వస్తుంటాయి. రావడమే కాదు, ఆ.. ఆనందాన్నో, సంఘటననో పదుగురితో పంచుకోవాలనే ప్రేరణ కలుగుతుంది. ఆ పదిమందిలో బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు వుండాలని కోరుకుంటారు. దానిని ఒక ఆనంద సమయంగా భావించి, ఆ సంతోషాన్నో, సంబరాన్నో అందరితో కలిసి సంతోషంగా ఆస్వాదించాలని కోరుకుంటారు. జీవితంలో గుర్తుండిపోయేలా సంబరాలు చేసుకుంటారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు పదిమందీ కలుసుకోవడానికి కలిసి సంతోషించడానికీ ఏర్పాటు చేసుకోబడ్డాయి.

సహృదయ.. సంస్థకు నామకరణం చేసి లోగో ను సృష్టించి ఇచ్చిన సాహితీవేత్త, అవధాని, డా. రాళ్ళబండి కవితా ప్రసాద్

దానికోసం ఏదో ఒక సంఘటన, లేదా సమయాన్ని కల్పించుకుని అందరు కలుసుకోవడానికి, మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికి సమ్మేళనాలు ఏర్పరచుకుంటారు. ఇలాంటివే పాత స్నేహితుల సమ్మేళనాలు కూడాను. కొన్ని సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని, సందర్భ ప్రాముఖ్యతను బట్టీ, రజతోత్సవాలనీ, స్వర్ణోత్సవాలనీ, వజ్రోత్సవాలనీ జరుపుకుంటుంటారు.

కవితా ప్రసాద్ గారు సృష్టించిన ‘సహృదయ’ లోగో.

ఎక్కువగా సంస్థలకూ, భవనాలకూ, రజతోత్సవాల నుండి నూరు సంవత్సరాల సందడి చేసుకునే అవకాశం ఉంటుంది గానీ బ్రతికున్న మనిషి జీవితంలో అతికష్టం మీద స్వరోత్సవాలు జరుపుకునే అవకాశం ఉంటుంది, అది కూడా పెళ్లిరోజు వంటివి మాత్రమే! వంద సంవత్సరాల పుట్టినరోజు జరుపుకున్న వ్యక్తులు బహు అరుదు. గొప్ప గొప్ప వ్యక్తులకు వారి నూరవ పుట్టినరోజు, లేదా వర్ధంతి జరపడం అది వేరే విషయం అనుకోండి! ఎక్కువగా, ఏదో సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని తరచుగా వినబడే మాట ‘రజతోత్సవాలు’. నా జీవితంలో నాకు పిల్లలు ఘనంగా జరిపించింది నా ‘వివాహ రజతోత్సవం’.

ప్రతి సంవత్సరం అక్క మహానీయమ్మ జ్ఞాపకార్ధం నాటికలకు జ్ణాపికల… ప్రాయోజకుడిగా రచయిత

తర్వాత నాకై నేను దృష్టి పెట్టి, అయిదు రోజులు ఆనందంగా, ఉత్సాహంగా గడిపింది ఇటీవల హన్మకొండలో జరిగిన ‘సహృదయ’ సాహిత్య సాంస్కృతిక సంస్థ ‘రజతోత్సవాలు’. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లో వున్నా, ఈ రజతోత్సవాల కోసం ప్రత్యేకంగా నేను ఒంటరిగా హన్మకొండలో ఉండడం; నేను ఈ కార్యక్రమాలకు అంత ప్రాముఖ్యత నివ్వడానికి ప్రాధాన కారణం, ఈ సంస్థకు నేను వరుసగా పదమూడు సంవత్సరాలు అధ్యక్షుడిగా పని చేయడమే! అందుచేతనే నా జీవితంలో ఇది రెండవ రజతోత్సవంగా భావిస్తాను.

ప్రతి సంవత్సరం అక్క మహానీయమ్మ జ్ఞాపకార్ధం నాటికలకు జ్ణాపికల… ప్రాయోజకుడిగా రచయిత

1997లో, కొందరు రసహృదయుల ఆలోచనతో మొగ్గతొడిగిన సంస్థ ‘సహృదయ సాహిత్య,సాంస్కృతిక సంస్థ’. వారు శ్రీ గిరిజామనోహరబాబు (ప్రస్తుత అధ్యక్షులు), శ్రీ వనం లక్ష్మీ కాంతారావు (ప్రస్తుత సాంస్కృతిక కార్యదర్శి), డా. ఏ. వి. నరసింహ రావు (సంస్థకు ప్రస్తుత సలహాదారులలో ఒకరు), శ్రీ డి. వి. శేషాచార్య తదితరులు. సంస్థకు పేరు పెట్టింది,లోగోను సృష్టించింది, సహృదయకు మేనమామగా చెప్పబడే సాహితీవేత్త, అవధాని డా. రాళ్లబండి కవితా ప్రసాద్ (వీరు అప్పుడు వరంగల్‌లో సాంఘిక సంక్షేమ శాఖలో, డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు). గణిత శాస్త్రం చదువుకుని తెలుగు సాహిత్యంలో అపారమైన పాండిత్యాన్ని ఒడిసిపట్టుకున్న మహామేధావి ఆయన.

రజతోత్సవాలలో ప్రముఖ నవల/కథా రచయిత,డా.అంపశయ్య నవీన్ గారు,సాహితీవేత్త శ్రీ నాగిళ్ళ రామశాస్త్రి గార్లతో.. రచయిత

ఈ సహృదయ సాహిత్య సంస్థలో, సాహిత్యానికి పెద్ద పీట వేసినా, సాంస్కృతిక కార్యక్రమాలకూ అంతే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా నాటకాలకు అధిక ప్రాధాన్యత వున్నది. ప్రతి సంవత్సరం మూడు (నాలుగు) రోజుల పాటు ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించి స్థానిక ప్రజలకు మంచి నాటికలు చూపించాలన్నదే సంస్థ ముఖ్యోద్దేశం. ఇది ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ, అనేకమంది సహృదయ పారితోషిక దాతల ఆర్ధిక సహకారము, ప్రభుత్వ పక్షాన చిరు ఆర్ధిక సహాయము ఈ కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నాయి. నేను కూడా మా అక్కగారు స్వర్గీయ కుమారి కానేటి మహానీయమ్మ గారి స్మృతిలో, నాటక జ్ఞాపికలు కోసం ప్రతి సంవత్సరం పదివేలు ఆర్ధిక సహాయం, గత పదిహేను సంవత్సరాలుగా చేస్తూ ఆవిడ ఋణం కొంతలో కొంత తీర్చుకుంటున్నానన్న తృప్తితో బతుకుతున్నాను.

పూర్వ డిప్యూటీ డిరెక్టర్ జనరల్(ప్రసారభారతి) శ్రీ అనంత పద్మనాభరావు(మధ్యలో) నవల,నాటకం,కథా రచయిత శ్రీ రామాచంద్ర మౌళి (వరంగల్)గార్లతో రచయిత

నాకు ఈ అవకాశం కల్పించిన ‘సహృదయ’కు ధన్యవాదాలు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ఒక సాహిత్య ప్రక్రియ (కథ, వచన కవిత, పద్య కవిత, నవల, విమర్శ మొదలైనవి)కు అవార్డు ఇస్తుంది. అలా అనేకమంది రచయితలూ, కవులూ, విమర్శకులూ, ఈ సంస్థ నుండి పురస్కారాలు అందుకున్నారు. ఈ పురస్కారం ఇనుగుర్తికి చెందిన ‘ఒద్దిరాజు సోదరుల’ స్మృతిలో వారి కుటుంబ సహాయులైన వద్దిరాజు వేణుగోపాలరావు గారు (ఇప్పుడు లేరు) అందిస్తున్నారు. ఇంకా అనేక సాహిత్య ఉపన్యాసాలు, సాహిత్యపరమైన ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఈ సంస్థ అందిస్తుంది.

సహృదయ ప్రధాన కార్యదర్శి డా.ఎన్.వి.ఎన్ చారి గారితో

ఈ నేపథ్యంలో నిరాటంకంగా కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ, అన్ని రంగాలు మాదిరిగానే ఈ రంగాన్ని కూడా ‘కరోనా మహమ్మారి’ అతలాకుతలం చేసింది. ఎట్టకేలకు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి ఈ సంవత్సరం యథావిధిగా కార్యక్రమాలు పునరుద్ధరించడం, యాదృచ్ఛికంగా ఈ సంవత్సరం సహృదయకు రజతోత్సవ సంవత్సరం కావడం, ఐదురోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఉదయం సాహిత్య కార్యక్రమాలు, రాత్రి నాటకాలు ప్రారంభమై విజయవంతంగా ముగిశాయి.

జ్ఞాపికల ప్రాయోజకునిగా సన్మానం పొందుతూ

సహృదయ సంస్థ నాకొక కొత్త లోకాన్ని చూపించింది. ఎందరో మహానుభావుల పరిచయాలు, వారితో వేదిక పంచుకునే అవకాశాలు మరచిపోలేని మధుర జ్ఞాపకాలు. నా జీవితానికి ఇది ఊహించని విషయం. నేను హన్మకొండలో స్థిరపడతాననిగానీ, సహృదయ సంస్థతో ఇలాంటి అనుబంధం ఏర్పడుతుందని గానీ అసలు అనుకోలేదు. ముఖ్యంగా స్థానికంగా మహామహులైన శ్రీ నేరెళ్ల వేణుమాధవ్, శ్రీ అంపశయ్య నవీన్,శ్రీ గుమ్మడి జనార్దన్, డా. లక్ష్మణ మూర్తి, ప్రొఫెసర్ లక్ష్మణ మూర్తి, శ్రీ గన్నంరాజు గిరిజామనోహర్ బాబు, దర్భశయనం శేషాచార్య వంటివారితో పరిచయాలు ఏర్పడతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా సహృదయ పుణ్యమే!

ముగింపు సమావేశంలో మాట్లాడుతూ

అలా నన్ను సహృదయకు పరిచయం చేసిన మిత్రులు డి. వి. శేషాచార్యను, ఆయన్ను పరిచయం చేసిన ప్రియమిత్రుడు శ్రీ మడిపెల్లి దక్షిణామూర్తిల ఋణం తీర్చుకోలేనిది.

ముఖ్య అతిధులను సన్మానిస్తూ….
ముఖ్య అతిధులను సన్మానిస్తూ….

నేను అంతకాలం అధ్యక్షుడిగా ఉండడానికి ముఖ్య కారణం అనేక సహృదయులతో పాటు, మిత్రులు, గురుతుల్యులు శ్రీ గిరిజా మనోహర్ బాబు, శ్రీ శేషచర్య. వారి ప్రేమ ఇగిరిపోని గంధం వంటిదే. అలాగే నాకు సహకరించిన పెద్దలు శ్రీ వనం లక్ష్మీకాంతారావు, డా. ఏ వి నరసింహారావు, ఎన్ వి ఎన్ చారి, కె.కృష్ణమూర్తి, శ్రీ రాధాకృష్ణమూర్తి, శ్రీ భాస్కరరావు గారు, డా. లక్ష్మణ రావు గార్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

సభలో మాట్లాడుతూ

సహృదయ రజతోత్సవాలను ఈ రకంగా జరుపుకుని ఆనందంగా గడిపే అవకాశం రావడం నా అదృష్టమే! ఈ సంస్థ స్వర్ణోత్సవాలు చూడాలనుకోవడం నాకు, దురాశే అవుతుందేమో..!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here