జ్ఞాపకాల పందిరి-158

21
13

మన పరిశుభ్రత – ఇంకొకరికి అపరిశుభ్రత కలిగించవచ్చా..!!

[dropcap]మ[/dropcap]నిషి ఆరోగ్యంగా వుండి, బ్రతికి బట్టకట్టాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటే, తప్ప సాధ్యం కాదు. అది అవగాహన లేనివాళ్లు ఏదో రూపంలో అనారోగ్యానికి బలి అవుతూనే వుంటారు. తెలిసి కొందరు, తెలిసీ తెలియక కొందరు ఇబ్బందుల పాలవుతూనే వుంటారు. తెలియని వారికి ఏదైనా మంచి చెప్పడం చాలా తేలిక. తెలిసి కూడా పాటించని వారితో సమస్య లేదు. ఎందుకంటే వీరి నిర్లక్ష్యం, బద్ధకానికి కొలబద్దలు వుండవు. వీరి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ‘నాకు తెలుసులే..!’ అని చెప్పి ఊరుకునే పెద్దలు వీళ్ళు. సమస్య అంతా తెలిసీ తెలియని వాళ్ళతోనే! వీళ్లకు తెలుసు, అని చెప్పడానికి ఉండదు, అలాగే తెలియదు.. అని చెప్పడానికి ఉండదు. వీళ్ల పట్ల ఎక్కువ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం అవసరమే!

ఇక అసలు విషయానికి వస్తే, ‘పరిశుభ్రత’ అనేది మనిషి ఆరోగ్యానికి అవసరమైన అంశాలలో అతి ముఖ్యమైనది. ఈ పరిశుభ్రతలో స్వీయ-పరిశుభ్రత, ఇంటి పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత వంటివి ప్రధానంగా చెప్పుకోవలసినవి.

పరిశుభ్రత గురించి తెలియకపోతే ఫరవాలేదు కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, అసలు ఆసక్తి చూపకపోతే అది నేరం అవుతుంది. అలాగే పరిశుభ్రత అంటే ఏమిటో పూర్తిగా అవగాహన వున్నా, దాని పట్ల అశ్రద్ధ వహిస్తే అది కూడా నేరమే! మనం అన్నిరకాలుగా పరిశుభ్రంగా వుండి, మన ఇంట్లోని వస్తువులు, ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే, అంతకు మించిన తృప్తి, ఆనందం మరోటి ఉండదు. ఇది మనిషిలోని నిత్య చైతన్యానికి పునాది వేస్తుంది. అలాగే వస్తువులు నిత్యం పరిశుభ్రంగా వుండి, ఎక్కువకాలం మన్నుతాయి కూడా! కొందరు పరిశుభ్రత పేరుతో వింత వింత పోకడలు పోతుంటారు. మరికొందరు మనమూ, మన ఇల్లు, మన వాహనాలు, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే చాలు అని ఆలోచిస్తారు గాని, మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందేమోనని కొంచెం కూడా ఆలోచించరు. కేవలం వారి స్వార్థానికే కట్టుబడి వుంటారు. ఇది మాత్రం దుర్మార్గం, దురదృష్టకరం కూడాను.

ఇల్లు కడుతున్న చోట రోడ్డు పరిస్థితి, సీతారామా కాలనీ, సఫిల్‍గూడ, సికిందరాబాద్

పట్టణాల్లో, వీధి మార్గాలు ఉంటాయి. రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు ఉంటాయి. ఆ రోడ్డుమీద జనసంచారమూ, వాహనాల రాకపోకలతో రోడ్డు రద్దీగానే ఉంటుంది. ఎవరో మధ్యలో వున్న ఖాళీస్థలంలో ఇల్లు కట్టడమో, ఇల్లు రిపేరు చేయించడమో చేస్తుంటారు. ఆ పనికి అవసరమైన సామాగ్రితో రోడ్డు మూడొంతులు ఆక్రమించేస్తారు. దీనికి తోడు నిర్ధాక్షిణ్యంగా రోడ్డు మీద వస్తువులు కడగడాలు, సిమెంటు కలపడాలు, ఇలా ‘మా ఇంటి ముందు రోడ్డు మాదే’  అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఆ ఇరుకు రోడ్డు మీద బురద తొక్కుకుంటూ నడిచిపోవాలి, అప్పుడప్పుడూ ద్విచక్ర వాహనాలు జారి పడి ప్రమాదాలను కొని తెచ్చుకున్న సంఘటనలు కూడా కోకొల్లలు.

ఇలాంటి సమస్యలను తెలుసుకుని కూడా తగిన జాగ్రత్తలు ఆ గృహనిర్మాణం చేసే పెద్దలు తీసుకోరు.

బలరామ్ నగర్ కాలనీ, సఫిల్ గూడలో నిత్యం రోడ్ల పరిస్థితి ఇదే!

ఇక పండుగల పేరుతోనో, పూజల పేరుతోనో, ఇతర వేడుకల పేరుతోనో, పరిశుభ్రత కోసం ఇల్లు – ఇంటి చుట్టూరా నీళ్ల పైపుతో కడుగుతారు. మంచిదే, పరిశుభ్రతను అందరూ ఆహ్వానించ వలసిందే కాదనలేము. కానీ ఆ మురికి నీటిని, మొక్కలవైపు మళ్లించడమో, డ్రైనేజీ లోకి పంపడమో (ఈ సదుపాయం చాలామంది వుంచుకోరు అనుకోండి) చేయకుండా స్వేచ్ఛగా జనం కాలినడకన నడుస్తారన్న ఇంగిత జ్ఞానం లేకుండా రోడ్డు మీదికి వదిలేస్తారు. ఆ మురికి దిగువస్థాయిలో వున్న అందరి ఇళ్ల ముందు నుంచి పారుతుంది. ఆ ప్రవాహం పల్లమున్నంత వరకూ పారుతూనే ఉంటుంది. ఇది ఎంత వరకూ సమంజసం? ఆలోచించాలి.

బలరామ్ నగర్ కాలనీ, సఫిల్ గూడలో నిత్యం రోడ్ల పరిస్థితి ఇదే!

ఈమధ్య కాలంలో జనాలకి వాహనాల కొదవు లేదు. కొందరు డబ్బుండి కొనుక్కుంటే, మరికొందరు బ్యాంకు లోన్లు తీసుకుని కొనేస్తున్నారు. అలా చాలామంది ఇళ్లల్లో రెండేసి కార్లు, మూడేసి ద్విచక్ర వాహనాలు ఉంటున్నాయి. వాటిని పార్క్ చేయడానికి ఇంటి ప్రాంగణంలో చోటు ఉండదు. ఇక ఇళ్ల మధ్య వుండే రహదారులే దిక్కు. వీటి వల్ల రోడ్డ్డు ఇరుకుగా మారడమే కాదు, ఈ వాహనాలను రోడ్డుమీద అవసరానికి మించిన నీటితో కడుగుతుంటారు. ఇక చూడండి రోడ్డంతా నీటితో బురదమయం అవుతుంది. అంతమాతమే కాదు, అమూల్యమైన నీరు వృథా అవుతున్నది. నలుగురూ ఉపయోగించుకునే రోడ్లు బురదమయం అవుతున్నాయి. వాటిని తొక్కుకుంటూ ఇళ్ళలోనికి అడుగుపెట్టాలి ఆ రోడ్డున నడిచేవాళ్ళు.

మనం శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే. మన ఇల్లూ -పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం అభినందనీయమే! కానీ, మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడడం మాత్రం సమర్థనీయం కాదు.

బలరామ్ నగర్ కాలనీ, సఫిల్ గూడలో నిత్యం రోడ్ల పరిస్థితి ఇదే!

హన్మకొండలో మా ఇంటి పక్క స్థలం మొన్నటివరకూ ఖాళీగా ఉండేది. దాని యజమాని దుబాయ్‌లో వుండేవాడు. ఎక్కడ వాళ్ళ భూమి కబ్జాకు గురి అవుతుందోనని, అందులో ఓ మాదిరి ఇల్లు కట్టి, కూలిపని చేసుకునే వాళ్లకు అద్దెకు ఇచ్చాడు. వాళ్లకు ఆ ఇంట్లో వంటగది వుంది. కానీ అది వాడరు. ఇంటి ముందు ఖాళీస్థలంలో పొయ్యిపెట్టి వంట చేస్తారు. దానికి సంబందించిన పొగ మేఘాల్లా ప్రవేశించి, మంచం మీది దుప్పట్లు వేసుకునే డ్రస్సులు పొగ కంపు కొడుతుంటాయి. ఒక్కోసారి అలాంటి పొగవల్ల కళ్ళు మంటలు -దురదలూనూ! వాళ్లకు ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి? ఏమి చేయాలన్న తగువుకు సిద్ధపడాలి. అతి జాగ్రత్తలు, అతి శుభ్రతలు, ఇలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి.

బలరామ్ నగర్ కాలనీ, సఫిల్ గూడలో నిత్యం రోడ్ల పరిస్థితి ఇదే!

ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఉదయమే, వాకింగ్‍కి వెళుతుంటే ప్రతి సందులోను, రోడ్డుమీద, ఇలాంటి మురికి నీటి ప్రవాహాలను తొక్కుకుంటూ నడిచి పోవలసిందే. ఎవరినీ ఏమీ అనేటట్టు ఉండదు. పరిస్థితులకు లొంగి బ్రతకవలసిందే. జనంలో ఒక అవగాహన, చైతన్యం, ఆలోచించే శక్తి వచ్చే వరకూ పరిస్థితులు ఇలానే ఉండవచ్చు.

బలరామ్ నగర్ కాలనీ, సఫిల్ గూడలో నిత్యం రోడ్ల పరిస్థితి ఇదే!

ఏది ఏమైనా, ఒకరి పరిశుభ్రత, లాభం, మరొకరికి అపరిశుభ్రత, నష్టం కలిగించకూడదన్నది సుస్పష్టం. నా స్థాయిలో నేను ఇలాంటివి జరగకుండానే జాగ్రత్త పడుతుంటాను. కానీ ఇలాంటి పనులు ఒకరిద్దరితో అయ్యేవి కాదు కదా!

పరిశుభ్రత అన్నది
అందరికీ అవసరమే.. కానీ!
నీ వల్ల, నా వల్ల ఇతరులకు మాత్రం
ఇబ్బంది కలగడం మాత్రం నేరం!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here