జ్ఞాపకాల పందిరి-159

21
10

పసందైన పండ్లకు చిరునామా వేసవికాలం!!

[dropcap]ఋ[/dropcap]తు చక్రంలో గ్రీష్మ ఋతువు ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. మండే ఎండలతో, ఎండిపోయే బావులతో, త్రాగునీరుకు ఇబ్బంది కలగడం వంటి సమస్యలతో పాటు, ఈ కాలంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉండడం, పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ఉండడంతో పపిల్లలకు వేసవికాలం ఒక ఆటవిడుపు. పెద్దలకు పుణ్యక్షేత్రాలకు, ఇతర యాత్రా స్థలాలకు ప్రయాణాలు పెట్టుకోవడానికి అనువైన సమయం. పెద్దల వ్యవహారం అంతా పిల్లలతో ముడిపడి ఉంటుంది కనుక, పిల్లల వేసవి సెలవుల కోసం పెద్దలు ఎదురు చూస్తుంటారు. బడి, చదువులతో విసిగిపోయిన పిల్లలు కాస్త మార్పు కోసం, అమ్మమ్మల ఇంటికి, నానమ్మల ఇంటికి వెళ్ళడానికి ఉబలాటపడేది ఈ వేసవి సెలవుల్లోనే! అందుచేతనే, వేసవికాలానికి అంత ప్రత్యేకత. వేసవికాలంలో విమానాలు, రైళ్లు, బస్సులు, క్యాబ్‌లు రద్దీగా ఉండడానికి కారణం కూడా ఇదే!

ఇకపోతే వేసవికాలం మరో రకంగా కూడా ప్రత్యేకతను కలిగివుంది. వేసవికాలం కోసం ఎదురు చూసేటంతటి ప్రత్యేకత. అప్పట్లో, ఋతువులను బట్టి ఆయా వాతావరణాలకు తగ్గట్టుగా కొన్ని రకాల పండ్లు మనకు లభించేవి. అంటే, సీజన్‌ను బట్టి ఎలాంటి పండ్లు దొరుకుతాయో తెలిసిపోయేది. ఇప్పుడు వృక్ష శాస్త్రజ్ఞుల విశేష కృషి ఫలితంగా ఇంచుమించు ప్రతి పండు, ప్రతి ఋతువులోను లభ్యమయ్యే పరిస్థితులు మనకున్నాయి. అయినప్పటికీ వేసవిలో మల్లెపూలు అధికంగా లభ్యం అయినట్టే, వేసవికాలం అనగానే కొన్ని రకాల పండ్లు మనకు గుర్తుకు వస్తాయి. కారణం ఆ పండ్లు వేసవికాలములోనే అధికంగా లభ్యం కావడం. అలా చెప్పుకోవలసిన పండ్లలో ముఖ్యంగా మొదట చెప్పుకోదగ్గది ‘మామిడి పండు’. మన సమాజంలో మామిడి పండ్లు ఇష్టపడని వాళ్లంటూ ఎవరూ వుండరు. తినడం ఇష్టం వున్నా తినగలిగిన ఆర్థిక పరిస్థితి వున్నా తినలేని సందర్భాలు ఉంటే అది వేరే విషయం. మామిడి పండ్ల విషయానికి వస్తే, వీటిలో కొన్నివందల రకాలు మనకు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. అయితే సాధారణ వినియోగదారుడికి తెలిసినవి కొద్ది రకాలు మాత్రమే!

మామిడి పంట

మామిడి పళ్లల్లో ముఖ్యంగా రెండు రకాల పళ్ళుంటాయి. అవి – కోసుకు తినే పళ్ళు, రసం పీల్చుకునే పళ్ళు. కోసుకు తినే పళ్లల్లో బంగినపల్లి, హిమాయత్ అనేవి చాలామందికి తెలిసిన మామిడి పళ్ళ రకాలు. ఇకపోతే రసాలు అని పీల్చుకుని చీకే పళ్లల్లో మళ్ళీ బోలెడు రకాలు వున్నాయి. ఇక్కడ వాటి పేర్లు చెప్పే ప్రయత్నం చేయబోవడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోను వీటి వాడకం వేరు వేరుగా ఉంటుంది. ఆంద్రప్రాంతములో కోసుకు తినే పళ్లకు, రసాలకు సమాన ప్రాధాన్యత నిస్తారు. అయినా రసాలవైపు ఎక్కువ మొగ్గుచూపుతారు. దీనికి భిన్నంగా తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా, బంగినపల్లి, హిమాయత్ రకాలకు ప్రాధాన్యత నిస్తారు. కారణం తెలియదు. అలా అని ‘రసాలు’ అసలు వాడరని కాదు, కొంతమంది అల్పాహారంలో రసాల గుజ్జును వాడతారు. ఎక్కువగా ముస్లిం సోదరులు, చపాతీలలో పచ్చడికి బదులు, రసాల గుజ్జును వాడతారు. ఇది ఇంచుమించు సీజన్ అంతా కొనసాగుతుంది.

విఫణిలో బండ్ల మీద మామిడిపండ్లు చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తప్పకుండా కొనేలా చేస్తాయి. మామిడి పళ్ళ సీజన్ ప్రారంభమైనప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, సీజన్ అయిపోతుంటే అంతే బాధ కలుగుతుంది.

మామిడి పళ్ళ తరువాత చెప్పుకోదగ్గది పుచ్చకాయ. ఇది కూడా అన్ని ఋతువుల్లోనూ ఇప్పుడు లభ్యమౌతున్నప్పటికీ, వీటి వినియోగం, వినియోగ అవసరం ఎక్కువ వేసవి కాలంలోనే ఉండడం వల్ల వేసవిలోనే ఇవి ఎక్కువగా లభ్యమవుతాయి. వేసవికాలంలో మనిషి శరీరంలోని అధిక శాతం నీరు చమట రూపంలో బయటికి వెళ్లిపోవడం వల్ల శరీరానికి నీటి కొరత (డీ హైడ్రేషన్) ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాలలో పుచ్చకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో అధిక నీటిశాతము, ఇతర పోషక విలువలు అధికంగా ఉండడం మూలాన చలువ చేసే లక్షణం ఉండడం మూలాన అందరూ దీని వాడకానికి ఇష్టపడతారు.

నోరూరించే పుచ్చకాయ

దీని తర్వాత చెప్పుకోదగ్గది ‘కర్బూజా’. ఇది ఒకప్పుడు తెలంగాణా ప్రాంతంలో మాత్రమే లభ్యం అయ్యేది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ లభ్యం అవుతున్నది. చూడడానికి చిన్న గుమ్మడి కాయ మాదిరిగా పసుపుగా ఉంటుంది. వీటి వాడకం కూడా వేసవిలోనే ఎక్కువ. తినడానికి చాలా రుచిగా వుండి, చల్లదనం కలిగిస్తుంది. కొంతమంది సరాసరి ముక్కలు కోసిన పండు తినేస్తారు. కొందరు ముక్కల్లో పంచదార కలుపుకుంటారు,ఇది చాలా రుచిగా ఉంటుంది. వీటి ఖరీదు కూడా సామాన్యుడికి అందుబాటులోనే ఉంటుంది.

కర్బూజ పండు

వీటి తర్వాత సపోటా, గులాబీ, జామ, దానిమ్మ, జామ, అరటి, సీమ చింత వంటివి అన్ని కాలాలతోపాటు వేసవికాలంలో కూడా లభ్యం అవుతాయి.

మామిడి–పనస—దానిమ్మ

బాల్యంలో, ఆశగా నేను తినవలసిన సమయంలో మామిడి పండ్లు కొనుక్కుని తినే పరిస్థితులు లేవు. ద్రాక్ష పండ్లు అప్పుడు నిజంగా అందని ద్రాక్షలే!

వేసవిలో ద్రాక్షలు

మా ఇంటిముందు భూస్వాముల మామిడి తోటల్లో రాలిన పండ్లు, చిలక కొట్టిన మామిడి పండ్లు, తెల్లవారకముందే ఏరుకుని చౌర్యం చేసి తీసుకు వచ్చి తిన్నామని చెప్పడానికి ఇప్పుడు నేను సిగ్గుపడను. అలాగే వేసవికాలంలో, ఏటిగట్టు ప్రక్కన వుండే ఈత చెట్లనుండి ఈత పళ్ళు ఏరుకోవడం, లేదా రాళ్లతో కొట్టి సేకరించి తినేవాళ్ళం. అదొక ఆనందం. వాటితోనే ఖర్జూరాలు తిన్నంత ఫీలింగ్, అలా నాటి జీవితంతో రాజీ పడిపోయి తెలియకుండానే తల్లిదండ్రులకు సహకరించాము.

జామ — సపోట

ఇప్పుడు కిలోల కొద్దీ మామిడి పండ్లు కొనుక్కు తినే స్థాయి నాకు వుంది. హన్మకొండ నా ఇంటి ప్రాంగణంలో, మూడు మామిడి చెట్లు వున్నాయి. అరటి చెట్లు వున్నాయి, జామ చెట్టు వుంది. అవన్నీ సమృద్ధిగా ఫలాల నిస్తున్నాయి. కానీ, ప్రయోజనం ఏముంది? నాకూ, నా శ్రీమతికి వాటిని తినే ప్రాప్తం లేదు, అదృష్టం లేదు, అవకాశమే లేదు. కారణం అందరికీ తెలిసిందే! ఇద్దరిలోనూ కొద్దీ సంవత్సరాలుగా ‘డయాబిటీస్’ కలిసి ప్రయాణం చేస్తున్నది, మా నోళ్లు శాశ్వతంగా కట్టిపడేసింది. జిహ్వ చాపల్యం ఆపుకోలేక చిన్న మామిడి పండు ముక్క తిని, అదే మహాభాగ్యంలా తృప్తి పడుతుంటాం. పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదని కోరుకుంటుంటాం.

రచయిత ఇంట్లో అరటి చెట్టు

ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుకు వస్తున్నది. ఒకసారి సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ (వరంగల్) ఏర్పాటు చేసిన నాటక పోటీలకు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, స్వర్గీయ డా. రావూరి భరద్వాజ హన్మకొండకు వచ్చారు. ఆయనతో నాకు కొద్దీ పరిచయం ఉండడం వల్ల, మా ఇంట్లో వసతి కల్పించాం. నా శ్రీమతి, కొసరి కొసరి ఆయనకు వడ్డిస్తుంటే, ఆయన “అమ్మా, ఆకలి అయినప్పుడు, తినడానికి అన్నం దొరకలేదు. ఇప్పుడు అన్నీ వున్నా, జీర్ణం చేసుకునే శక్తి లేదు” అని అన్నప్పుడు నాకూ, మా ఆవిడకి కన్నీళ్లు ఆగలేదు.

అలా ఇప్పుడు మామిడి పండు, అరటి పండు, పనస పండు వంటి పళ్ళు తినే అర్హత కోల్పోయాం మేమిద్దరం. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని నేను కోరుకుంటాను. ప్రతి ఋతువులో లభించే పళ్ళు అందరూ తినే అవకాశం కల్పించుకోవాలి. అది ఎక్కువ శాతం మన చేతిలోనే వుంది.

~

మనం జాగ్రత్తగా ఉంటే
‘మధుమేహం’ మనకు దూరం!
పసందైన పండ్లన్నీ
అప్పుడే తినగలిగే యోగం..!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here