జ్ఞాపకాల పందిరి-161

24
9

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

కథానాయకుడి కథ

[dropcap]పి[/dropcap]ల్లలు పుట్టగానే, తల్లిదండ్రులు కోరుకునేది, వాళ్ళపిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, అత్యుత్తమ స్థాయిలో ఎదగాలని. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, ఏదైనా పారిశ్రామికవేత్త, చైర్మన్, డైరెక్టర్ వంటి ఉన్నత స్థానాల్లో వెలుగొందాలని కోరుకుంటారు.

కటిక పేదవాడు కూడా తన ముద్దుల సంతానం గురించి ఇలాంటి కలలే కంటాడు. కలలు కనడంలో తప్పులేదు కానీ, ఎంతమంది కలలు నిజమౌతాయన్నది, అవి జరిగేవరకూ, ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో చెప్పలేము. మనం కోరికలు కోరుకోవడమే కాదు, దానికి కావలసిన ఆర్థిక పరిస్థితి, వాతావరణం, పిల్లల్ని పెంచిన విధానం, పిల్లల అకుంఠిత దీక్ష, కృషి, పట్టుదల, కలిసిరావడం – ఇలాంటివన్నింటిపై ఆధారపడి ఉంటుంది. కలిసిరావడం.. అనేది ఊతపదంలా, సెంటిమెంటులా అనిపించ వచ్చుగానీ, అనుభావాలు చెప్పే కథలు అలాగే ఉంటాయి. అలా అనుకోక తప్పదు. పెద్దగా కోరికలు లేని పేద వుద్యోగి ఇంట్లో ఏదైనా అద్భుతం జరిగితే తెలిసిన నలుగురూ అనుకునే మాట అది వాళ్లకి ‘కలిసొచ్చిన అదృష్టం’ అని. అలా ఉన్నవాళ్లకే కాదు, పేదవాళ్లకు అప్పుడప్పుడు అదృష్టం కలిసొస్తుంది. అయితే అది గాలిలో విభూది సృష్టించినంత సులభం కాదు సుమండీ. దాని వెనుక ఎంతో కఠిన శ్రమ, పట్టుదల, అంకిత భావం, ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహం ఉండాలి. అలాంటి చురుకుదనం ఉన్న పిల్లలను విజయం తప్పక వరిస్తుంది. అదుగో అలాంటి నాకు తెలిసిన విజయుడు, ఈనాటి నా కథనానికి కథానాయకుడు, నా బాల్య స్నేహితుడు, మిత్రరత్నం టి. వరప్రసాద్. ఆయన తల్లిదండ్రులకు ఆయన భగవంతుడు ప్రసాదించిన వరప్రసాదమే!

ఇంటర్మీడియెట్ లో రచయిత సహాధ్యాయి టి. వరప్రసాద్ (దక్షిణ విజయపురి, నాగార్జున సాగర్)

నాగార్జున సాగర్‌లో మా అక్క దక్షిణ విజయపురి హై స్కూల్‌లో, సైన్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కాలంలో, నేను అప్పుడప్పుడు అక్క దగ్గరికి సాగర్ వెళుతుండేవాడిని. అప్పుడు అక్కతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయ పెద్దలతో పరిచయం ఏర్పడింది. అక్క శిష్యులు కొంతమందితో స్నేహం ఏర్పడింది. అలా స్నేహం ఏర్పడి, ఇప్పటి వరకు ఆ స్నేహాన్ని పదిలంగా కాపాడుతున్న మిత్రుడు శ్రీ వరప్రసాద్. ఆయన నాకు పరిచయం అయ్యే నాటికి పదవ తరగతి చదువుతున్నాడు. అనుకోకుండా ఇద్దరం, హిల్ కాలనీ (విజయపురి నార్త్) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఇంటర్‍లో సహాధ్యాయులమైనాము.

తన తంగేడు ఫార్మ్ హౌస్ లో వరప్రసాద్

అది 1972-74 ప్రాంతం మాట. ఇద్దరం దక్షిణ విజయపురి నుండి, కాలేజీ బస్సులో, హిల్ కాలనీ వెళ్లి తిరిగి సాయంత్రం అదే బస్సులో ఇంటికి చేరుకునేవాళ్ళం. బస్సు ఫెయిల్ అయితే, కాలేజీకి నడిచి వెళ్ళేవాళ్ళం. వరప్రసాద్ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా వున్నా, ఉన్నదానితో గౌరవ ప్రదంగా, అతిసాధారణంగా ఉండేవాడు. చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. అతని ఆలోచనలు ఎప్పుడూ పరిశోధనలవైపు మళ్లుతుండేవి. అతని మదిలో కొత్త కొత్త ఆలోచనలు సుడులు ఇరుగుతుండేవి. స్నేహితులు ఎలాంటి వారు వున్నా, చదువు విషయంలో బాధ్యతాయుతంగా ఉండేవాడు. వరప్రసాద్‌లో,అ ప్పుడే జీవితానికి అవసరమైన క్రమశిక్షణ, సమయపాలన, అనుకున్నది సాధించడంలో అతని పట్టుదల అకుంఠిత దీక్ష, నేను గమనించాను. కానీ ఎలా, ఎందులో, ఎక్కడ స్థిరపడతాడన్నది నేను ఊహించలేదు, ఊహించలేని వయస్సు కూడా అది. రెండు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియదు. ఇంటర్మీడియెట్ అయిపోయింది. తర్వాత భవిష్యత్తును వెతుక్కుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. అందులో నేనూ వరప్రసాద్ కూడా వున్నాం.

సంప్రదాయ వేషధారణలో వరప్రసాద్

ఎవరు ఎక్కడ ఏమి చదువుకున్నారో, ఎలాంటి ఉద్యోగాల్లో/వ్యాపారాల్లో/వ్యవసాయంలో స్థిరపడ్డారో, ఎందరు విదేశాలకు వలసపోయారో తెలియదు. అప్పటికి మొబైల్ యుగం ఇంకా శైశవ దశలోనే వుంది. అందుచేత ఇప్పుడు సమాచారం విషయంలో వున్న వెసులుబాటు అప్పుడు లేదు.

నేను దంతవైద్యుడిగా వివిధ ప్రాంతాలలో పనిచేసిన తర్వాత, హన్మకొండలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాను. అప్పట్లో నాగార్జునసాగర్ విద్యార్థి, మా అక్క శిష్యుడు, వరప్రసాద్‌కు తెలిసినవాడు, బోస్.. అనే అబ్బాయి ఖాజీపేట రైల్వే పాఠశాలలో పనిచేస్తుండేవాడు. ఆయన నాకు కూడా పరిచయమే. అప్పుడప్పుడు నా క్లినిక్‌కు వచ్చి కూర్చునేవాడు.

రచయిత క్లినిక్ (హన్మకొండ)లో

అప్పుడు అతని దగ్గర వరప్రసాద్ ప్రస్తావన తెచ్చాను. ఎలాగైనా అతనిని కలుసుకోవాలని, దానికి సహకరించాలని అతనిని కోరాను. అతను, ఎలాగైనా వరప్రసాద్ మొబైల్ నంబర్ సంపాదించిపెడతానని హామీ ఇచ్చాడు, అలాగే కొన్ని నెలల తర్వాత తన హామీని బోస్ నిలబెట్టుకున్నాడు. అలా వరప్రసాద్‌ను పట్టుకోగలిగాను.

గురువు గారు డా. వి.నాగులు గారితో కథానాయకుడు వరప్రసాద్

1974, తర్వాత విడిపోయిన వాళ్ళం షుమారుగా 2020లో అనుకుంటాను తిరిగి కలిసాం. మధ్యలో ఆర్. చంద్ర శేఖర్ రెడ్డి, శ్రీ సూర్యప్రకాశ్ రెడ్డి, డా. దుర్గా ప్రసాద్, అక్కినేని కృష్ణచంద్, సూర్యభగవాన్లు (అడ్వొకేట్–తణుకు) కలిసినా, సత్సంబంధాలు కొనసాగలేదు. కానీ, వరప్రసాద్ ఆచూకీ తెలిసిన తర్వాత, మిత్రులం కొంతమంది దగ్గర కాగలిగాం. అలాగే మాకు ఇంటర్‍లో, జంతుశాస్త్రం బోధించిన డా. వి నాగులు గారు (హైదరాబాద్), రసాయనశాస్త్రం బోధించిన డా. రమేష్ కుమార్ గార్ల చిరునామాలు కూడా కనుక్కోగలిగాం. అలా, వరప్రసాద్ అడ్మిన్‌గా, మా ఇంటర్ గ్రూప్ (బైపిసి) ఏర్పాటు చేసాడు. దానితో, అప్పుడప్పుడు మిత్రులం ఎక్కడో ఒకచోట కలుస్తూనే వున్నాం.

హన్మకొండలో.. రచయిత ఇంటిని శ్రీమతితో కలసి సందర్శించినపుడు

1974 తర్వాత వరప్రసాద్, ఏమి చదివాడో, ఏమి ఉద్యోగాలు చేసాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో తెలీదు కానీ, మళ్ళీ 2020లో కలిసే నాటికి, ఒక ఉన్నత స్థాయికి ఎదిగి వున్నాడు. ఒక పారిశ్రామికవేత్తగా మేము ఎవరం ఊహించని రీతిలో తన స్థాయిని పెంచుకున్నాడు. మేమందరం మా మిత్రుడి ఎదుగుదలకు సంబరపడిపోయాం, గర్వపడిపోయాం.

వరప్రసాద్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, తాను అనుకున్నది సాధించడానికి బ్రతుకుతెరువు అయిన ఉద్యోగాన్ని సైతం త్యజించిన సాహసి.

2003వ సంవత్సరంలో అనుకుంటాను ‘ఐ -క్లీన్’ అనే సంస్థను నెలకొల్పి తర్వాత మరికొంతమంది భాగస్వామ్యంతో, కంపెనీని మరింత మెరుగు పరచి, ఆ సంస్థకు చైర్మన్‌గా, డైరెక్టర్‌గా, అహర్నిశలు తన అమూల్య సమయాన్ని కంపెనీకి ధారబోస్తూ, అందరి సహకారంతో, కంపెనీని, ఏడువందల కోట్ల టర్నోవర్‌కు పెంచిన ఘనాపాటి మన హీరో వరప్రసాద్. ఇది ఇరవై ఏళ్ళ అందరి సమిష్టి కృషి.

మిత్రుడు ఆర్. చంద్ర శేఖర్ రెడ్డి దంపతులు సన్మానిస్తున్న దృశ్యం
మిత్రుడు శ్యాం కుమార్ దంపతుల సన్మానం

ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే, మిత్రుడు వరప్రసాద్, కాల పరిమితి దృష్ట్యా ఛైర్మెన్/డైరెక్టర్ పదవుల నుండి ప్రక్కకు తప్పుకున్నాడు అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన పదవీ విరమణ చేసాడు. ఆ సందర్భంగా, వారి కంపెనీ ప్రాంగణంలో (మేడ్చల్) మిత్రుడు వరప్రసాద్‌కు బ్రహ్మానందమైన సన్మాన (వీడ్కోలు) సభ ఏర్పాటు చేశారు. అలాంటి కన్నులు మిరుమిట్లు గొలిపే సభకు మా ఇంటర్ మిత్రులను ఆహ్వానించడం, ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది.

వరప్రసాద్ దంపతులను సన్మానిస్తున్న రచయిత, శ్రీమతి అరుణ

మాకు మిత్రుడిని సన్మానం చేసుకునే అవకాశాన్ని కలిగించడం, మిత్రుడు గురించి రెండు మాటలు మాట్లాడే అవకాశం కలిగించడం ఎన్నటికీ మరచిపోలేని మధుర ఘట్టం. వేలమందికి విందు ఏర్పాటు చేయడం, రుచికరమైన వడ్డింపులు ఏర్పాటు చేయడం గొప్ప విషయం. నేనైతే మొత్తం కుటుంబంతో హాజరై మిత్రుడి ఘనతను పలువురు పెద్దలు విశదీకరిస్తుంటే, ఆనందంలో మునిగిపోయాను. నాతో పాటు, శ్రీ ఆర్. చంద్రశేఖర్ రెడ్డి, ఆయన శ్రీమతి శోభ గారు, శ్రీ శ్యామ్ కుమార్ (నిజామాబాద్) ఆయన శ్రీమతి లీల, ఇతర సాగర్ మిత్రులు హాజరయ్యారు.

మిత్రుడు వరప్రసాద్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ..

ఇప్పటికీ వరప్రసాద్‍లో క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల చెక్కు చెదరలేదనడానికి ఈ సమావేశమే గొప్ప ఉదాహరణ. ఈ కథానాయకుడి కథ ఎంత చెప్పినా తరగనిదే! మా స్నేహ గంధం ఎన్నటికీ కరిగిపోనిదే!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here