జ్ఞాపకాల పందిరి-163

18
9

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

పాఠ్య గ్రంథాలే కాదు – ప్రముఖ గ్రంథాల పఠనమూ అవసరమే..!!

[dropcap]ఒ[/dropcap]క సాధారణ వ్యక్తి నుండి, ఉన్నతస్థాయి వ్యక్తి వరకూ, కారణం ఏదైనా ‘చదువు’ ముఖ్య అవసరం. చదువుకునే వాళ్లంతా ఉద్యోగం కోసమే చదవరు. కొందరు భుక్తి కోసం, మరి కొందరు హోదా కోసం, ఇంకొందరు విజ్ఞానం కోసం. నిజం చెప్పాలంటే, చదువుకునే వాళ్ళల్లో ఎక్కువశాతం ఉద్యోగం దృష్టిని పెట్టుకునే చదువుతారు. సమాజంలో మానసిక వికాసం కోసం ప్రతి ఒక్కరూ చదువుకోవాలిసిందే. చదువు కోసం ఎలిమెంటరీ స్థాయి నుండి ఆ పై ఏ స్థాయి వరకైనా, అనుభవజ్ఞులైన విద్యావేత్తలు నిర్దేశించిన పాట్యాంశాలు (సిలబస్) మాత్రమే బోధిస్తారు. అవి జీవితానికి అవసరమైన భాషా జ్ఞానం కావచ్చు, జంతు, వృక్ష, ఖగోళ, వైద్య, ఖనిజ శాస్త్రాలు కావచ్చు, చారిత్రిక అంశాలు కావచ్చు, భౌగోళిక విజ్ఞానం కావచ్చు, స్థాయిని బట్టి, అంచెలంచెలుగా ఈ విషయాన్ని బోధిస్తారు. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు మొక్కుబడిగా పెట్టే పరీక్షలకు ఈ విజ్ఞానము సరిపోవచ్చు. కానీ,సమాజంలో ఓకే ఆదర్శ వక్తిగా బ్రతగగలిగే జీవన శైలికి అవసరమయ్యే అంశాలకు, మనం చదువుకున్న సిలబస్ సరిపోదు. ఇతర అంశాలు కూడా మన ఆదర్శ జీవన శైలికి అవసరం అవుతాయి. ఇవి పాఠ్య గ్రంథాలకు అతీతంగా వుండే ఇతర గొప్ప గ్రంథాలలో దొరకవచ్చు. అందుకే ఇతర గొప్ప గ్రంథాలను కూడా చదవాలి. వాటిలోని జీవన సారాన్ని గ్రహించ గలగాలి. అవి మహాత్ముల జీవిత చరిత్రలు కావచ్చు, స్వాతంత్ర్య సమరయోధుల వీరగాథలు కావచ్చు, రైతుల జీవన వ్యథలు కావచ్చు, బ్రతుకు కథలు కావచ్చు, నవలలు కావచ్చు, సాహసగాథలు కావచ్చు. నీతి కథలు కావచ్చు, రాజకీయ చరిత్రలు కావచ్చు. ఏ ఇతర పుస్తకాలైనా, అవి భవిష్యత్ ఉత్తమ జీవితం కోసం తప్పక చదవ వలసిన అవసరం వుంది. ఈ పుస్తక పఠనం, ప్రాథమిక విద్య దశ నుండి ఆయా స్థాయిల్లో ప్రారంభం కావాలి. మరి అది ఎలా సాధ్యం కావాలి? ఈ రోజుల్లో ఇది నిజంగా ఒక చిక్కు ప్రశ్నే!

ఆదర్శ ఉపాధ్యాయ మిత్రుడు శ్రీ జి.ఎస్.చలం (విజయనగరం)

ఒకప్పుడు ప్రాథమిక విద్యా స్థాయి నుండి ప్రతి పాఠశాలలో చదువుతో పాటు, డ్రిల్లు పిరియడ్, లైబ్రరీ పిరియడ్, క్రాఫ్ట్ పిరియడ్,తోటపని పిరియడ్ ఉండేవి. ప్రతి రోజూ కాకుండా, ఈ తరగతులు వారం మొత్తంలో సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఈ తరగతులు మొత్తంగా లేవని కాదు గానీ, వేళ్ళమీద లెక్కపెట్టదగ్గ స్థాయిలోనే ఉన్నాయని చెప్పక తప్పదు. కారణం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తల్లిదండ్రులకు తద్వారా వారి పిల్లలకు కేవలం చదువు, మార్కులు, గ్రేడులు, ఉన్నత స్థాయి ఉద్యోగాల ధ్యాస తప్ప, అసలు జీవితానికి సంబంధించిన జ్ఞానం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీని ప్రభావం పెళ్ళైన తర్వాత అసలు సంసారిక జీవితంపై పడుతున్నది. ఇంత ప్రమాదకరమైన సమస్యలు ఉత్పన్నమౌవుతున్నా మనం పట్టించుకోలేని పరిస్థితిలో ఈనాడు విద్యారంగం వుంది. అంతమాత్రమే కాదు, ఉపాధ్యాయులపై అనవసర ఒత్తిడి కలిగించడం, ఇతర పనులు వారి చేత చేయించడం, రాజకీయ ఒత్తిళ్లు వెరసి విద్యారంగం భ్రష్టు పట్టిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరికొంతమంది ఉపాధ్యాయులు మొక్కుబడి ఉద్యోగ బాధ్యతలు, నెల జీతం గురించిన ఆలోచనలు తప్ప, పుష్టికరమైన విద్యాబోధన వాటి విలువలు గురించి ఆలోచించేవారు తక్కువైపోయినారు. దీని ప్రభావం మన మాతృభాష మీద కూడా పడుతుండడం గమనించదగ్గ విషయం. దీనికి కేవలం ఉపాధ్యాయ వర్గాన్ని మాత్రమే నిందించ వలసిన పనిలేదు. ఐదేళ్లకో మారు మారే ప్రభుత్వాలు, వారు చేసే మార్పులు చేర్పులు, విద్యారంగాన్ని రాజకీయం చేయడం ఇవన్నీ కలిసి, విద్యారంగంపై విషప్రభావం చూపిస్తున్నాయి.

అలా అని, ఉపాధ్యాయులందరూ, మొక్కుబడి ఉపాధ్యాయులని చెప్పడం కూడా సబబు కాదు. అక్కడక్కడా, మంచి ఉపాధ్యాయులు కూడా వుంటారు. వృత్తిపరంగా యెంత ఒత్తిడి వున్నా, పిల్లల విద్యాబోధనలో ప్రత్యేక శ్రద్ధ (ప్రభుత్వ విద్యా సంస్థలను దృష్టిలో ఉంచుకుని) తీసుకోవడం, అదనపు పని గంటలు ఉపయోగించడం, అవసరమైతే పిల్లల విద్యా బోధనావాసరాల కోసం, పరికరాల కోసం,ఇతర అవసరాల కోసం తమ స్వంత డబ్బు ఖర్చు చేసి, ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులు/ఉపాధ్యాయినులు లేక పోలేదు. నాకు తెలిసిన పరిచయం వున్న, సోదర సమానుడైన సహృదయ ఉపాధ్యాయుడు విజయనగరానికి చెందిన తెలుగు పండితుడు శ్రీ జి. ఎస్. చలం.

శ్రీ చలం పనిచేస్తున్న పాఠశాల, ధర్మవరం

ఈయన ప్రతిభావంతుడైన, అత్యుత్తమ మార్గదర్శకుడైన ఉపాధ్యాయుడు. స్వయంగా రచయిత, నవలాకారుడు, వ్యాసకర్త. పరిశోధకుడు కూడాను. అనేక ముఖ్యమైన అంశాల గ్రంథకర్త, ఇంటి వాతావరణం పూర్తిగా సాహిత్యమయం. చాలా ఏళ్ళ క్రితం ఒక తెలుగు దిన పత్రిక నిర్వహించిన నవలల పోటీలో శ్రీ చలం నవల ‘రేవు’కు బహుమతి లభించింది. ఈ నవలను చిన్నన్నయ్య డా కె. మధుసూదన్ (ఆకాశవాణి, విశాఖపట్నం) కు అంకితం చేయడం, వారిద్దరి మధ్య వున్న స్నేహభావానికి, సోదరఠత్వానికి, సహృదయతకు నిదర్శనం.

శ్రీ చలం రచనల్లో కొన్ని

శ్రీ జి. ఎస్. చలం, 2017వ సంవత్సరంలో విజయనగరం జిల్లా, శృంగవరేపు కోట మండలం, ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అనూహ్యంగా విద్యాప్రమాణాల స్థాయి ఊహించని రీతిలో పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగా తోటి ఉపాధ్యాయ సోదరుల హృదయాలలో ‘అసూయ’ స్థాయి కూడా పెరిగి పోయింది. వీటిని సీరియస్‍గా తీసుకోకుండా, పాఠశాల అభివృద్ధికి, అందులో చదువుకుంటున్న విద్యార్థీ విద్యార్థినుల విద్యా ప్రమాణాలు పెంచడానికి, తనదైన శైలిలో, స్థానిక పెద్దల, అధికారుల సహాయ సహకారాలతో పనిచేసుకుంటూ, తృప్తిగా, దైర్యంగా, ముందుకు సాగిపోతున్నాడు.

పాఠశాల ఆధునిక గ్రంథాలయంలో విద్యార్థీ, విద్యార్థినులు

ఇప్పుడు శ్రీ చలం పనిచేస్తున్న ధర్మవరం పాఠశాల ఆంధ్రప్రదేశ్‍కు మోడల్ స్కూల్‌గా చెప్పుకునేలా తయారయింది. అక్కడ నెలకొల్పిన గ్రంథాలయం (ఎయిర్ కండిషన్డ్) బహుశః ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ వుండి ఉండదని నా నమ్మకం. ఈ గ్రంథాలయం రూపుదిద్దుకోవడానికి, గ్రంథాలయ రూపకర్త శ్రీ జి.ఎస్.చలం అయితే దానికోసం ఆర్థిక సహాయం అందించి, గ్రంథాలయ రూపకల్పనలో పూర్తి స్వేచ్ఛను అందించిన మహానుభావుడు, ఇదే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి, ప్రస్తుత పల్నాడు కలెక్టర్ శ్రీ లోతేటి శివశంకర్ గారు.

గ్రంథాలయానికి ఆర్థిక సహకారం అందించిన ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుత పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ గారితో గ్రంథాలయంలో శ్రీ చలం.

వారు అందించిన ఆర్ధిక సహాయం అక్షరాలా ఎనిమిది లక్షలు. ఇక ఆ గ్రంథాలయాన్ని చూసి తీరాల్సిందే తప్ప ఎంత చెప్పినా తరగదు.

పాఠశాల పిల్లలు వేసిన కొన్ని బొమ్మలు

 

దీని వెనుక శ్రీ చలం పూర్తి కష్టం, రేపటి గురించిన చక్కని ఆలోచన వ్యూహం వున్నాయి. ఇప్పుడు అక్కడ చదువుకుంటున్న పిల్లలు కవిత్వం రాస్తున్నారు, కథలు రాస్తున్నారు, పుస్తక సమీక్షలు చేస్తున్నారు, నాటికలు వేస్తున్నారు. చదువులో సైతం అగ్రగాములుగా వుంటున్నారు.

పాఠశాలలో పచ్చదనం కోసం పసి హృదయాలతో.. శ్రీ చలం

తోటపని చేసి పిల్లలు తమ పాఠశాల ప్రాంగణాన్ని పూలచెట్లు, ఇతర మొక్కలు పెంచి పర్యావరణ ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నారు. శ్రీ రమేష్ అనే ఫిజిక్స్ ఉపాధ్యాయుడు తన శక్తి వంచన లేకుండా, పసిపిల్లల హృదయాల్లో విజ్ఞాన పిపాసను కలుగజేస్తున్నారు.

స్కూల్ ఎదుట పిల్లలతో శ్రీ చలం.

ఇవన్నీ శ్రీ చలం నాకు మిత్రుడని, సోదర సమానుడని జ్ఞాపకం చేసుకోవడం లేదు. తలచుకుంటే ఏదైనా చేయగలం.. అని చెప్పడానికి, ఈ పాఠశాలను ఒక ఉదాహరణగా చెప్పడమే నా ఉద్దేశం.

ఈ మధ్య విశాఖపట్నంలో చలం గారితో రచయిత

మన సమాజంలో మరింత మంది ఉపాధ్యాయ మిత్రులు చలంను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించడానికి, తల్లిదండ్రుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించగలగాలి. పిల్లలు పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు, ఇతర మంచి పుస్తకాలు చదవడంలో ఉపాధ్యాయులతో పాటు, పిల్లల తల్లిదండ్రులు కూడా తగినంత ఉత్సాహం చూపించాలి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here