జ్ఞాపకాల పందిరి-164

12
7

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

బలిపీఠంపై.. బంధుత్వాలు..!!

[dropcap]ఉ[/dropcap]మ్మడి కుటుంబాలు, రక్తసంబంధాలు, బంధుత్వాలూ, ఆత్మీయతలూ అనుబంధాలూ – ఒకప్పుడు మన సమాజంలో ప్రత్యేక గుర్తింపునూ గౌరవాన్నీ పొందిన అంశాలు. వీటితో అప్పట్లో జీవితానికి చైతన్యం ఆనందం, ఉత్సాహం, ఒక భరోసా వున్నట్టుగా అనిపించేది. అందుకే అవి కలకాలం కొనసాగి కుటుంబ వ్యవస్థకు వెన్నెముకలా నిలిచాయి. అయితే అనవసర స్వేచ్ఛకు,  ఇవన్నీ ప్రతిబంధకాలుగా భావించబడ్డాయి. ‘నేను/నాది’ అనే మనస్తత్వం మనిషి మెదడులో ఒక విషపు పురుగులా వ్యాపించి తత్ఫలితంగా కుటుంబ వ్యవస్థ బీటలు వారి చిన్నాభిన్నమైపోయింది.

‘మనం/మనది’ అనే మాట ఇంచుమించు అదృశ్యమై పోయింది. ప్రేమబంధాలు తెగిపోయి, బంధాలూ, అనుబంధాలూ, ఆర్థిక లావాదేవీల చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టాయి. స్వార్థం.. శిఖరాగ్రానికి చేరుకొని రక్త సంబంధాలు వెర్రి చూపులు చూడడం మొదలు పెట్టాయి.

ఈ నేపథ్యంలో ఆత్మీయతలు అనుబంధాలు కోరుకునేవారు, రక్త సంబంధాలకు, ప్రాధాన్యత నిచ్చేవారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందం అయింది. ఇది ఇలాగే పయనిస్తే, భవిష్యత్ సమాజం ఎటువైపు తన మార్గం మార్చుకుంటుందో చెప్పలేని పరిస్థితి. జనాభా పెరిగేకొద్దీ మన జీవన విధానంలో పెనుమార్పులు సంభవించే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి దీనిని అదుపు చేసే విధానం ఎలా? ప్రభుత్వ శాసనాలతో, ఇవి మెరుగు పడతాయా? లేదా ఏదైనా అదృశ్య శక్తి అవతరించి మంచి మార్పును తీసుకు వస్తుందా? లేదా, ఎవరో వచ్చి ఏదో చేసే అవకాశం ఉందా? అంటే, ఇవేమీ జరిగే పనులు కాదని, ఎలాంటి వారికైనా తెలుస్తుంది. ముఖ్యంగా మనుష్యుల్లో మార్పు రావాలి. మనుష్యుల మనసులు మారాలి, మనుష్యుల స్వార్థ పూరిత ఆలోచనల్లో మార్పు రావాలి. దానికోసం ఎవరైనా సరే కృషి చేయడానికి ముందుకు రావాలి.

బంధుత్వాల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోడానికి, నా జీవితంలో నుండే ఇక్కడ ఒక ఉదాహరణను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.

దానిని బట్టి ప్రస్తుతం, బంధువులు – బంధుత్వ పరిస్థితి ఎలా ఉందో కొంత వరకైనా అవగతమవుతుందని నా నమ్మకం.

మా అమ్మకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు. అందులో మొదటి చెల్లెలు మానసిక వికలాంగురాలు. ఆవిడ చిన్న వయసులోనే చనిపోయారు.

మా పెద్దమ్మ (రామరాజులంక), మా అమ్మ (దిండి) ఇంచుమించు స్వగ్రామాలలోనే పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడిపోయారు. ఇక మా అమ్మ చిన్న చెల్లెలు, నాకు పిన్ని అయిన స్వర్గీయ ఈద మార్తమ్మ నాటి పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం తాలూకా, ‘సరిపల్లి’ గ్రామంలో వివాహం చేసుకుని స్థిరపడింది. మా పిన్ని వివాహం నా తల్లిదండ్రులే దగ్గరుండి జరిపించారని చెబుతారు. మమ్ములను ప్రేమించినట్టే, నా తల్లిదండ్రులు, ఒక కూతురు మాదిరిగా మా పిన్నిని కూడా ప్రేమించేవారు. మాతో సమానంగా మా పిన్నికి కూడా పండగలకు పబ్బాలకు బట్టలు కొనేవారు. మా పిన్ని – చిన్నాన్న సత్యానందంగారు కూడా మమ్ములను ఎంతగానో ప్రేమించేవారు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. వాళ్ళు చదువులో పెద్దగా రాణించలేదు. ఆఖరి సంతానం అయిన కూతురు హైదరాబాద్‌లో వివాహం చేసుకుని స్థిరపడింది. జ్యేష్ఠ కుమారుడు ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ తండ్రికి సహాయ పడేవాడు. రెండవ సంతానం ఆశీర్వాదం నాకంటే కొన్ని నెలలు చిన్న. ఇతను నాగార్జున సాగర్‌లో మా అక్క దగ్గర వుండి, ఎస్.ఎస్.ఎల్.సి. పాస్ అయి చాలాకాలం నిరుద్యోగిగా బాధపడి, నిరుద్యోగిగానే ప్రేమ వివాహం చేసుకుని ఉద్యోగ నిమిత్తం దోహా – ఖతార్ వెళ్ళిపోయి, ఉద్యోగం సంపాదించుకుని, తర్వాత భార్యను కూడా దోహా తీసుకెళ్లాడు. ఇదంతా ఎందుకు చెబుతున్ననంటే, మేమంతా సొంత అన్నదమ్ముల్లా, అక్క చెల్లెళ్లుగా మసిలే వాళ్ళం.

అందులో తమ్ముడు ఆశీర్వాదం నేను, మరీ ప్రత్యేకం. మా ఆలోచనలు, పనులు ఒకే తీరుగా వుండేవి. పెద్దవాడిగా నన్ను అమితంగా గౌరవించే వాడు, ప్రేమించేవాడు, అభిమానించేవారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత కూడా అతనిలో ఎలాంటి మార్పు లేదు. మేము పెరిగి పెద్దయ్యాక, చదువు రీత్యా గానీ, ఉద్యోగ రీత్యా గానీ, హైదరాబాద్ నుండి మా గ్రామం వెళ్లినా, మా గ్రామం నుండి హైద్రాబాద్/నాగార్జునసాగర్ వెళ్ళవలసి వచ్చినా మధ్యలో నరసాపురంలో బ్రేక్ చేసి, మా పిన్ని నివసించే సరిపల్లి గ్రామంలో, కనీసం ఒక్కరోజైనా ఉండకపోతే, మా పిన్ని కోపగించేది, లేదా అలిగేది. అలా ఉండేవి వాళ్ళ ప్రేమలు. మా పిన్ని- చిన్నాన్న గతించిన తర్వాత వాళ్ళ పాత్ర తమ్ముడు తీసుకున్నాడు. అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. దూరాభారాలు లెక్క చేయకుండా, నేను ఎక్కడ వున్నా నన్ను తరచుగా కలుస్తుండేవాడు. తన ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా, నేను లేకుండా అది జరిగేది కాదు. మా పిన్ని ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు వాడిలో చూసుకునేవాడిని నేను. మొన్నమొన్నటి వరకూ అది అలానే కొనసాగింది. నేను ఎప్పుడైనా వాళ్ళింటికి వెళితే తన పనులన్నీ వాయిదా (అర్జంటు అయితే తప్ప) వేసుకుని నాతోనే గడిపేవాడు. అలాంటి నా తమ్ముడు, నా దురదృష్టం కొద్దీ, దురలవాట్లకు లోనై వ్యాధిగ్రస్థుడై కొద్దీ సంవత్సరాల క్రితం దివంగతుడైనాడు. కొద్దీ సంవత్సరాల తేడాతో, అతడి భార్య రత్నకుమారి, గుండెపోటుతో మరణించింది. అంతే అప్పటి నుండి, మా తమ్ముడు ఇద్దరి కొడుకులు బంధువులను పట్టించుకోవడం మానేశారు. మొక్కుబడి పలకరింపులు/ఆహ్వానాలు మొదలయ్యాయి. అలా కొద్దికాలంగా మా మధ్య ఎలాంటి సంబంధాలూ, పలకరింపూలూ లేవు.

రచయితకు అందిన గృహప్రవేశ ఆహ్వానం (ఈద సురేశ్. సరిపల్లి నుండి)

ఈ లోగా మా తమ్ముడి పెద్ద కొడుకు సర్పంచ్ అయినాడు. అనేక శుభకార్యాలు కూడా జరిగాయి. కానీ మాకు సమాచారం లేదు. నేను దీనిని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ఉన్నట్టుండి ఈ నెల మూడవ వారంలో మా తమ్ముడి పెద్దకొడుకు నుండి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను పిల్లలతో కలసి విశాఖ పట్నం నుండి అరకు వెళ్తున్నాం. తన నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి రమ్మని సమాచారం. ఆశ్చర్యమూ, సంతోషమూ రెండూ కలిగాయి. తర్జన భర్జన ఆలోచనల మధ్య, వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను.

రచయితను ఆహ్వానించిన తమ్ముడి కొడుకు – ఈద సురేశ్. సర్పంచ్–సరిపల్లి

సికింద్రాబాద్‌కు వచ్చి టికెట్లు రిజర్వ్ (తత్కాల్) చేసుకున్నాను. ప్రయాణం బాగానే జరిగింది. గమ్మత్తు ఏమిటంటే నన్ను ఆహ్వానించిన నా తమ్ముడి కొడుకు నుండి తర్వాత ఎలాంటి స్పందన లేదు. ఎలా వస్తునానన్న విషయం కూడా అడగలేదు. గత అనుభావాలను దృష్టిలో ఉంచుకుని, నరసాపూర్ స్టేషన్ నుండి నన్ను సరిపల్లికి తీసుకు వెళ్ళడానికి, మా అమ్మాయి వేరే ఏర్పాట్లు చేసింది.

తమ్ముడు,చెల్లెలు,తల్లిదండ్రులతో సురేశ్(కుడి చివర)

నా శ్రీమతి పెద్ద మేనమామ కూతురి ఇంట్లో సకల సౌకర్యాలతో బస ఏర్పాటు చేశారు. లేకుంటే ఆ వేసవి వేడిమికి నా ఆరోగ్యం ఏమయ్యేదో! అసలు వాడు మాత్రం ఒకసారి పలకరించి, తన పని అయిపొయింది అనుకున్నాడు. కష్టపడి అంత దూరం వెళ్లిన నేను చాలా నిరుత్సాహానికి గురి అయ్యాను. ఒకరోజు అక్కడ వుండి మిగతా బంధువులను కలిసి తృప్తి పొందాను.

సరిపల్లిలో… అన్న.. జాన్ సుందర్ సింగ్ తో
సురేశ్ కు మామగారు, రచయితకు మేనబావ చొప్పల రాజేశ్వరరావు (రామరాజులంక) తో… రచయిత.

80 ఏళ్ళ వయసు గల, మా పిన్ని పెద్ద కొడుకు భూషణం వివాహ స్వర్ణోత్సవం జరుపుకున్నందున, ఆ జంటను శాలువాతో సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించాను.

అన్నవదినలకు సన్మానం చేస్తూ..

నేను అక్కడవున్న రెండు రోజులు నన్ను ఎంతో జాగ్రత్తగా, ఆత్మీయంగా చూసి, జాగ్రత్తలు తీసుకున్న, అన్న (నా శ్రీమతి మేనమామ) జాన్-సుందర్ సింగ్‌కు, వదిన భారతీ సింగ్‌కు, కూతురు శ్రీమతి టీనాసింగ్‌కు ఆమె కుమారుడు ఆకాష్ (కిట్టూ)కు, ఎప్పటికీ రుణపడి వుంటాను.

పిన్ని ఈద మార్తమ్మతో.. రచయిత 40.. ఏళ్ల నాటి జ్ఞాపకం

బంధువులు – బంధుత్వాల విషయంలో వస్తున్న మార్పుల గురించి ఈ చిన్ని ఉదాహరణ మీ ముందుంచాను. ఇంతకు మించిన అనుభవాలు వున్నాయి. అవి చెప్పి మరింత ఇబ్బంది పెట్టే సాహసం చేయను. భవిష్యత్తులో బంధువులంతా తమ బంధుత్వాలను సజీవంగా నిలుపుకోవాలని, ఆత్మీయతలు పెంచుకోవాలని మాత్రమే కోరుకుంటాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here