జ్ఞాపకాల పందిరి-165

22
11

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

పెళ్లి పిలిచింది.. విశాఖ పరుగెత్తించింది..!!

[dropcap]లె[/dropcap]క్కలేనన్ని ప్రాణాలను తీయడమే కాదు, ప్రజలను అన్ని రకాలుగా అదుపు చేసింది నాటి ‘కరోనా’ మహమ్మారి. అంతేకాదు, జీవితంలో కొన్ని తెలుసుకోవలసిన విషయాలను తెలియజెప్పింది. అంత మాత్రమే కాదు, సామాన్యుడి నుండి, అసామాన్యుల వరకూ, వారి జీవన శైలిని మార్చిపారేసింది. ప్రతి మనిషికీ, జీవితంలో తగిన గుణపాఠం నేర్పింది.

దీనికి తోడు కొన్ని నిత్య కార్యక్రమాలకు అంతులేని ఆటంకం కలిగించి సాధారణ జీవన శైలిని అతలాకుతలం చేసింది. అంటే మనిషిని ఇంచుమించు ఒంటరిని చేసింది. ప్రధానంగా, ప్రయాణాలకు అంతులేని అవరోధాలు కలుగజేసి, ప్రయాణాలు చేయకూడని పరిస్థితిని కలిగించింది. అసలే తక్కువ ప్రయాణాలు చేసే నా బోటి వ్యక్తులకు, ఆ మాత్రం కూడా లేకుండా చేసింది. ఒకరికొకరు, దగ్గరగా వున్నా, దూరంగా వున్నా చూసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. శుభాలకు, అశుభాలకు, దగ్గరి బంధువులైనా, దూరపు బంధువులైనా, స్నేహితులైనా, శ్రేయోభిలాషులైనా పలకరించుకోలేని పరిస్థితి. కనీసం సంతోషాన్నయినా, సానుభూతినైనా వ్యక్తపరచలేని పరిస్థితి. యావత్ ప్రపంచాన్ని శాసించి గడగడలాడించిన, దురదృష్టకరమైన, దుఃఖమయ కాలం, దుర్భర జీవితాన్ని అనుభవింప జేసిన అతి కష్ట కాలం అది. కరోనా కాలం నాటికే, వివిధ కారణాల వల్ల నా ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. ఇక కరోనా దాడితో, మూడు సంవత్సరాలు ఇంటిపట్టునే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అలా ఆ కరోనా కాలం, వైద్య చరిత్రలో మరచిపోలేని దురదృష్టకర ఘట్టంగా మిగిలిపోయింది.

కరోనా తగ్గుముఖం పట్టాక మళ్ళీ మెల్లగా, శుభకార్యాలు, ఆత్మీయ సమ్మేళనాలూ ఊపందుకున్నాయి. తద్వారా వివిధ రూపాల్లో ప్రయాణాలూ ఊపందుకున్నాయి. నేను కూడా తక్కువ దూరం వున్న ప్రయాణాలు మెల్లగా మొదలుపెట్టాను. అంటే హన్మకొండ నుండి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి ప్రదేశాలు అన్నమాట! దూరప్రాంతాలకు, పైగా ఒంటరిగా ప్రయాణం చేసే సాహసాలు చేయలేదు. అయితే ఈ మధ్య, అంటే మూడు నెలల క్రితం మాకు దూరపు బంధువు (నా శ్రీమతి అమ్మమ్మ వూరు) వాళ్ళ అబ్బాయి పెళ్ళికి తప్పక రావాలని చాలా అడ్వాన్సుగా ఆహ్వానించాడు. పెళ్లి విశాఖపట్నంలో. అక్కడ మా చిన్నన్నయ్య డా. మధుసూదన్‌తో పాటు చాలా మంది బంధువులు వున్నారు. పెళ్ళికి వెళితే వీరందరినీ చూడొచ్చని ఆశ కలిగింది. నేను నా శ్రీమతీ వెళ్లాలని నిర్ణయించుకున్నాము. అయితే మా అమ్మాయి అల్లుడూ, పిల్లలతో వెళదామని ఆలోచించి, పెళ్లి ప్రయాణానికి కొనసాగింపుగా, అరకువేలీ-బొర్రా కేవ్స్ చూడాలనీ, ఒక రాత్రి అరకువేలీలో బస చేయాలని నిర్ణయించి, ప్రయాణానికి చేయవలసిన పని అంతా పూర్తి చేసేసారు. విశాఖపట్నం వెళ్లడం సంతోషమే గానీ పిల్లలతో ఎలా ఉంటుందో పరిస్థితి అని నాకు భయంగానే వుంది. అయినా సాహసం చేసాము.

ఈ సంవత్సరం మే నెల 9వ తేదీన, రాత్రి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం విశాఖ చేరుకున్నాము. స్టేషన్‌లో, ఉదయం 7 గంటలకే, విశాఖ వేసవి ప్రతాపం తెలిసిపోయింది. వెళ్ళబోయేది చిన్నన్నయ్య ఇంటికి. ఆయన అతి సాధారణ జీవితాన్ని అలవాటు చేసుకున్నవాడు. అక్కడ రిఫ్రిజిరేటర్లు, కూలర్, ఎయిర్ కండిషనర్ వంటి సదుపాయాలు ఆశించే అవకాశం లేదు. ఎలా వుండాలా? అన్న ఆలోచనలో పడ్డాను.

మొత్తానికి కేబ్ మాట్లాడుకుని చిన వాల్తేరులో ఉంటున్న అన్నయ్య ఇంటికి (రెండవ అంతస్తు) చేరుకున్నాము. అక్కడ అనుకున్నంత ఇబ్బంది అనిపించకపోయినా, సుఖం మరిగిన మా ప్రాణాలు చల్లదనం కోసం తహతహలాడాయి.

రచయిత చిన్నన్నయ్యతో మనవడు నివిన్ నల్లి

పెళ్లి 10 గంటలకు కాబట్టి, అందరం త్వరగా తయారై, అల్లుడి మిత్రుడు సమకూర్చిన కారులో, పెళ్లి జరిగే ప్రదేశానికి చేరుకున్నాము. చర్చి మొదటి అంతస్తులో పెళ్లి. హాలు విశాలంగా వున్నా, పైన పంకాలు తిరుగుతున్నా గాలి వస్తున్నట్టు లేదు, చమటకు లోటు లేదు. చాలా చికాకుతో గడపాల్సి వచ్చింది. సరే, పెళ్లి అయింది అనిపించుకున్నాక, లంచ్ సెల్లార్లో. అక్కడే రిసెప్షన్. బహుశః అది కార్ పార్కింగ్ అనుకుంటా. అక్కడ ఎంత రుచికరమైన భోజనాలు వున్నా, అక్కడి వేడికి వింత చెమటలకు, ముద్ద దిగేట్లు లేదు. అక్కడ భోజనం పెట్టి శిక్ష విధించినట్టుగానే అనిపించింది. బహుశా అక్కడి ప్రజలు ఆ వాతావరణానికి అలవాటు పడిపోయారేమో!

విశాఖపట్నం చర్చిలో రచయిత పెద్దబామరిది రాజబాబుతో.. రచయిత మనవడు నివిన్

గమ్మత్తు ఏమిటంటే, నేను పుట్టి పెరిగింది కోనసీమలో, ఇలాంటి వాతావరణంలోనే అయినప్పటికీ, ఇప్పుడు, నేను కూడా వెళ్లి అక్కడ కొన్ని రోజులు గడపడం కష్టమే!

శరీరం పూర్తిగా వరంగల్/హైదరాబాద్ వాతావరణానికి లొంగిపోయి అలవాటు పడిపోయింది.

మరునాడు విశాఖనుండి అరకు రైలులో ఏసీ కోచ్ బుక్ చేసుకుని వెళ్ళాము. షుమారు 44 సొరంగాల గుండా రైలు ప్రయాణం చేసింది. సమయం ఎక్కువ తీసుకున్నా ఈ ప్రయాణం ఆనందంగా గడిచింది.

విశాఖపట్నం నుండి అరకు రైలు ప్రయాణ దృశ్యం
సౌకర్యవంతమైన ఏ.సి.కోచ్ (రైలు ప్రయాణము) విశాఖపట్టణం-అరకు

అరకులో కూడా వేసవి వేడిమికి కొదవలేదు. ఏపి టూరిజం వారి హోటల్ సౌకర్యంగానే వుంది. అక్కడ లంచ్ చేసి కాస్సేపు సేదదీర్చుకుని దగ్గరలో వున్న చిన్న చిన్న ప్రదేశాలు చూసి వచ్చాము.

మరునాడు కారులో తిరుగు ప్రయాణం. అరకు నుండి విశాఖ మార్గం ఎత్తుపల్లాలతో లోయగుండా చెట్ల పచ్చదనం గుండా ప్రయాణిస్తుంటే ఒకవైపు ఆనందము, మరోవైపు భయము కూడా కలుగుతాయి. అదొక గొప్ప అనుభవము. ఒకవైపు రైలు ప్రయాణం మరోవైపు కారు ప్రయాణం రెండూ ప్రత్యేకతను కలిగి వున్నాయి. మధ్యలో ప్రత్యేకంగా చూడవలసిన ప్రదేశాలు (1) జలపాతం (2) బొర్రాగుహలు (3) కాఫీ తోటలు.

అరకు.. బొటానికల్ గార్డెన్

మార్గమధ్యంలో తగిలిన కటిక జపాతం పోవడానికి అసలు మార్గంనుండి లోపల ఎతైన కొండవైపుకు మళ్ళాలి. అది మార్గమే తప్ప సరైన రోడ్డు లేదు. అజాగ్రత్తగా ఉంటే వాహనం బోల్తా పడే అవకాశాలు ఎక్కువ.

చాపరాయి జలపాత జలప్రవాహం

పర్యాటక రంగంలో ప్రభుత్వ వైఫల్యానికి ఇదొక మచ్చు తునక. ఈ కటిక జలపాతం ను దర్శించే చోట సందర్శకులకు కనీస సౌకర్యాలు లేవు. వందల సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్న సందర్శకులకు నిరాశే ఎదురవుతుంది. అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి కనీస ఫీజు వాసులు చేసినా ఎవరూ బాధపడరు. కనీసం త్రాగడానికి నీటి వసతి కూడా లేకపోవడం దురదృష్టకరం!

తరువాత మార్గమధ్యంలో కాఫీతోటలు తగిలాయి. అవి ఎత్తుగా కొండ మీద వరకూ వ్యాపించి వున్నాయి. కాబట్టి అంత ఎత్తుకు ఎక్కాలంటే కనీసం దానికోసం ఒక పూట సమయం వెచ్చించాలి. అక్కడ లభించే కాఫీ పొడితో తయారు చేసే కాఫీ బాగుంటుందని ఎవరో చెబితే తలొక కప్పు కాఫీ తాగాము, ఆ కాఫీలో ప్రత్యేకత అటుంచి అసలు బాగోలేదు. ఇది సందర్శకులను మోసం చేసినట్టే కదా!

కాఫీ తోటలో.. రచయిత కూతురు-అల్లుడు-పిల్లలు

ముప్పై సంవత్సరాల క్రితం వైద్య మిత్రులతో కలసి బొర్రాగుహలు దర్శించే అవకాశం కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ సందర్శకులను ఆకట్టుకునే ప్రత్యేకతలు అక్కడ ఏమీ లేవు. ఇది కూడా పర్యాటకశాఖ వైఫల్యమే! ఎన్నో ఆశలు పెట్టుకుని ఆయా ప్రదేశాలను చూడటానికి వచ్చేవారికి శ్రమ, నిరుత్సాహమే మిగులుతున్నాయి. పర్యాటక రంగం మరింత అభివృద్ధి సాధిస్తే తప్ప పర్యాటకుల ఆశలు నెరవేరవు గాక నెరవేరవు.

పెళ్లి పేరుతో విశాఖపట్నంలో వున్న రెండు రోజుల్లోనూ కొందరు బంధువులను చాలా కాలం తర్వాత చూడగలిగామన్న తృప్తి తప్ప అక్కడి వాతావరణం అసలు తట్టుకోలేని విధంగా వుండి, ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతామా.. అనిపించింది. ఇలా చాలాకాలం తర్వాత కుటుంబంతో కలసి దూరప్రదేశానికి వెళ్లినట్టయింది.

ఏ ప్రదేశమైన అక్కడి వాతావరణం ఆయా ప్రజలకు అలవాటు పడి, తట్టుకునే శక్తిని కలిగి వుంటారు. విశాఖపట్నం దీనికి అతీతం కాదు మరి..!

అది వేసవికాలపు ప్రతాపమే..!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here