జ్ఞాపకాల పందిరి-172

28
12

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

అయోమయంలో.. సామాన్యుడు..!!

[dropcap]“క[/dropcap]నీసం ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడైన ఉండాలా..” అన్నాడొక పెద్దాయన. గుడ్డ, నీడ, సంగతి ఎలా వున్నా మనిషి బ్రతికి బట్టకట్టడానికి కూడు తప్పని సరి. ఆ కూడు లేదా తిండి విషయంలో సామాన్యుడి పరిస్థితి అయోమయంలో పడింది. తమ సంపాదనకు, బయటి వస్తువుల ధరలకూ పొంతన లేకుండా పోయింది. కష్టజీవికి కడుపు నిండా కూడు తినే రోజులు పోయాయి. ‘ఆకాశం అందుకునే ధరలొకవైపు..’ అని మహాకవి శ్రీశ్రీ ఎప్పుడో ఊహించి చెప్పాడు. అది అప్పటికీ, ఇప్పటికీ, మరి ఎప్పటికీ చెప్పుకోవలసిన మాటే!

మరి ఈ పరిస్థితిని అదుపు చేసేది ఎవరు? వస్తువుల ధరలను నియంత్రించలేని అధికారులు, ప్రభుత్వం ఎవరి కోసం, ఎందుకు పని చేస్తున్నట్టు? ఎవరి సంక్షేమం కోసం వారు పాటుపడుతున్నట్టు?

ఉద్యోగస్థులకు జీతం భరోసా ఉంటుంది, ఇబ్బంది లేదు. వ్యాపారస్థులకు అసలు ఇబ్బంది లేదు. ఉద్యోగస్థుల జీతాలు పెరిగినప్పుడల్లా స్వేచ్ఛగా వీరు రేట్లు పెంచేస్తారు. అందుచేత బయటి వస్తువుల రేటు ఎంత పెరిగినా, వీరు దాని గురించి పట్టించుకోరు, పెద్ద ఇబ్బంది కూడా పడరు. ఎటొచ్చీ, కూలీనాలీ చేసుకునే సామాన్య, పేద ప్రజానీకానికి అసలు సమస్య. వారి దినసరి కూలీరేట్లు పెరగవు, కనీస అవసర వస్తువుల ధరలు తగ్గవు. మరి ఈ ప్రజలు బ్రతికి బట్టకట్టేదెలా? వాళ్ళు తిండి లేక పస్తులు పడుకోవలసిందేనా? ఇంత సమస్యాత్మక విషయాన్ని ప్రజా ప్రతినిధులు కానీ, ప్రభుత్వాలు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాయి? రైతును అందరూ కలసి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.

నిత్యావసరాల్లో అవసరమైన కూరగాయల పరిస్థితి ఇప్పుడు ఎలా వుందో అందరికీ తెలిసిన విషయమే! ఈ రోజున అన్ని రూపాల్లోనూ చర్చకు వస్తున్నది ‘టమాటో’ అన్న విషయం అందరికీ తెలిసిందే! అయితే అన్ని రేట్లు పెరుగుతున్నప్పుడు టమాటో రేట్ల ప్రస్తావన ఎందుకు? అని కొందరు మహానుభావులకు అనిపించవచ్చు. అయితే, కోటీశ్వరులనుండి అతి సామాన్యుల వరకూ వాడేది ‘టమాటో’. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఊహించని రీతిలో ధరలు పెరిగినప్పుడు, కనీసం టమాటో లాంటి కూరగాయ కూడా ఆకాశాన్ని అంటే ధరకు చేరుకున్నప్పుడు సామాన్యుడు బ్రతికేదేలా?

మొన్నటి వరకు ఉల్లిపాయ ధర ఒక ఊపు ఊపింది. కొద్ది శాతం మంది ఉల్లిపాయ తమ వంటకాల్లో ఉపయోగించనప్పటికీ, ఎక్కువ శాతం ప్రజానీకం ఇష్టంగా ఉల్లిపాయ తింటారు. ఉల్లి ధర అంచనాలకు మించి దేశవ్యాప్తంగా పెరిగిపోయినప్పుడు, దాని ప్రభావం ప్రజల మీద, ప్రజా జీవితం మీదా ఎంత పడి ఉంటుందో ఊహించవచ్చు.

అప్పట్లో ఉన్న కొద్దీ ఇంటిస్థలంలోనూ కొంత భూమిలో కూరగాయలు పండించుకునేవారు. సరిహద్దు దడుల మీద, సొర, బీర, గుమ్మడి, పొట్ల, కాకర వంటి పాదులు పెంచి కూరగాయలు పండించుకునేవారు. తమ అవసరాలకు సరిపడా ఉంచుకుని, మిగతావి ఇతరులకు పంచేవారు. ఆకుకూరలు పుష్కలంగా పండించేవారు. ఇప్పుడు పల్లెల్లో సైతం ఈ సంస్కృతికి చెల్లుచీటీ పలికేసారు. అందరూ రైతులమీద ఆధారపడుతున్నారు. దురదృష్టవశాత్తు పెట్టుబడులు పెట్టలేక చాలా మంది రైతులు పండించడం మానుకుంటున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పక్క ప్రాంతాలు కూడా పంటలకు స్వస్తి పలికి, రొయ్యల కయ్యలతో లాభాల ఆర్జనలో పడి, ధాన్యం కూరగాయలు పండించడం మానేయడం వల్ల ప్రకృతి సిద్ధమైన భూమి బలం తగ్గిపోవడమే కాకుండా కాలుష్యానికి తెర లేపుతున్నారు. భవిష్యత్తులో మనం ధాన్యమే కాదు, కూరగాయలు సైతం దిగుమతి చేసుకోవలసిన దురదృష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ రోజున, పచ్చిమిరపకాయలు, టొమాటోలు కిలో 150/- రూపాయలకి కొనుక్కునే పరిస్థితి ఏర్పడడం దానికే సంకేతంలా కనిపిస్తున్నది. రూపాయి విలువను గురించి కూడా ఆలోచించవలసి వస్తున్నది.

1965లో అనారోగ్య రీత్యా నేను మా స్వగ్రామం దిండి నుండి హైద్రాబాద్‌లో ఉంటున్న పెద్దన్నయ్య శ్రీ కె. కె. మీనన్ దగ్గరకి వచ్చ్హాను. అప్పుడు అన్నయ్య కుబ్దిగూడా (చాపెల్ బజార్ – కాచిగూడ దగ్గర) ఉండేవాడు. అప్పుడు కూరగాయల మార్కెట్‌కు నన్ను కూడా తీసుకువెళ్ళేవాడు. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, కిలో టొమాటోలు కేవలం పది పైసలు!

కూరగాయల అమ్మీ ఇంకో కిలో తీసుకోమని బ్రతిమాలేది. అప్పటి పది పైసల విలువ అంతటిది. అప్పటి నుండి ఇప్పటి వరకూ మా ఇంట్లోకి కావలసిన కూరగాయలు నేనే తెస్తాను. ఇతరులమీద అసలు ఆధారపడను. అందుచేత వాటి పెరుగుతున్న విలువ నాకు బాగా తెలుసును. ఒక ప్రక్క రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదనే బాధ, మరో వైపు, సామాన్యుడికి కూరగాయలు అందుబాటులో ఉండడం లేదన్న వ్యథ ఎవరినైనా ఆలోచింపజేస్తుంది. అందుచేత, ఇంటి ప్రాంగణంలో వున్న కొద్ది నేలలో పూలమొక్కలకు బదులు, కూరగాయల మొక్కలు, ఆకుకూరలు పండించాలి, స్వంతంగా ఉపయోగించుకోవాలి. నేల పరిస్థితిని బట్టి, అరటి చెట్లు, జామపండ్లు, మామిడికాయల చెట్లు పెంచుకోవాలి. దీనివల్ల ఎవరికైనా కొంతలో కొంత ప్రయోజనం ఉంటుంది.

నా మట్టుకు నేను హన్మకొండలోని నా ఇంటి ప్రాంగణంలో, అరటి చెట్లు, జామచెట్టు, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, కరివేపాకు చెట్టు పెంచుకుంటున్నాను. మనం పండించుకున్నవి మనం తినడం ఎంతో తృప్తిని కలిగిస్తుంది కదా!

రచయిత ఇంట్లో అరటి చెట్టుకు మెగా అరటి గెల(హన్మకొండ)
రచయిత ఇంటి ప్రాంగణంలో, అరటి చెట్టుకు మామూలు అరటి గెల

ప్రముఖ ప్రపంచ నాస్తికవాది స్వర్గీయ శ్రీ గోరా (గోపరాజు రామచంద్రరావు, నాస్తిక కేంద్రం, విజయవాడ) పూలమొక్కలకు బదులు కూరగాయలు పండించమని ప్రోత్సహించేవారు. వారి ఇంటి పెళ్లిళ్లకు పూలదండలకు బదులు, కూరగాయ దండలు వాడేవారు.

నిత్యావసర వస్తువులు నిలకడ ధరలుగా కొనసాగడానికి, ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవలసిందే! జనాలను ఉచితాల వైపు ప్రలోభపెట్టకుండా, ధరల విషయంలో శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టాలి. ఎలెక్షన్లలో వట్టి హామీలను కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడే పథకాలు చేపట్టాలి.

ప్రజలను పక్కదారి పట్టించే పథకాలు ఎక్కువకాలం మనలేవు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here