జ్ఞాపకాల పందిరి-173

23
12

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

సాహితీ క్షేత్రంలో.. మరో మైలురాయి

[dropcap]సా[/dropcap]ధారణంగా మనం కానీ, చరిత్రకారులు కానీ, క్రీస్తు పూర్వం లేదా క్రీస్తు శకము అని చెప్పుకుంటుంటాం. చరిత్రలు రాసుకుంటాం. ఇప్పుడు మనం ‘కరోనా’కు పూర్వం, ‘కరోనా’కు తర్వాత, అన్న పదాలను, జరిగిన/జరుగుతున్న సంఘటనలను గురించి చెప్పుకునేటప్పుడు వాడవలసిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతున్నది. దానికి కారణం, కరోనా యావత్ ప్రపంచాన్నీ ఎలా గడగడలాడించిందో అందరికి తెలిసిందే. నిత్య సాధారణ జీవితం ఎలా స్తంభించిపోయిందో అందరికీ ఎరుకనే. ఈ విషయంలో సాహిత్యరంగం కూడా అతీతం కాదు. సభలు సమావేశాలు నిలిచిపోయాయి. పుస్తక ప్రచురణ నిలిచిపోయింది. రచయితలూ, కవుల రచనా వ్యాసంగానికి అంతరాయం కలిగింది, కారణం వాటిని ప్రచురించే పత్రికలు చాలా మటుకు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో ఎటూ తోచని పరిస్థితి ఏర్పడింది. అందరూ కేవలం ఇళ్లకే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడింది. సాహిత్య సభలు సమావేశాలు లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితిలో వినోదానికి సినిమాలు గాని, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు అనేవి ఆలోచించడానికి వీలులేకుండా పోయాయి. అదొక నిశ్శబ్ద కాలం. ప్రజలకు బహు గడ్డుకాలం. అప్పుడు కొన్ని ఆన్‌లైన్ కార్యక్రమాలు, ఎవరి ఇంట్లో వుండి వారు నిర్వహించుకున్నా, అది కృత్రిమంగానే అనిపించేది. ‘జూమ్ మీటింగ్’ అనే కొత్త పదం (నాలాంటి వారికి) వెలుగు లోనికి వచ్చింది. కొందరికి ఆ పద్దతి సౌకర్యంగా ఉండడం మూలాన, ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డా జూమ్ పద్దతిని వినియోగిస్తున్నాయి, కొన్ని సాహిత్య సంస్థలు.

కరోనాకు ముందు, వరంగల్/హన్మకొండలో, ఎక్కడ సాహిత్య కార్యక్రమం జరిగినా తప్పకుండా అక్కడ నా హాజరు ఉండేది. ముఖ్యంగా, నేను అత్యధిక కాలం అధ్యక్షుడిగా పని చేసిన ‘సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ’ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తప్పక హాజరయ్యేవాడిని. రచనా వ్యాసంగము, సాహిత్య కార్యక్రమాలతో సమయం నాకు చక్కగా అడిచిపోయేది. కరోనా కాలం వీటన్నింటికి దూరం కావలసి వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుకోవడం తప్ప బంధువులను, స్నేహితులను కలుసుకోలేని పరిస్థితి. తర్వాత కరోనా తోక ముడిచింది, పరిస్థితులు చక్కబడ్డాయి. బహిరంగ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి.

సభా వేదిక రవీంద్ర భారతి,హైదరాబాద్

అనుకోకుండా మా అమ్మాయి వరంగల్ నుండి హైద్రాబాద్ ఆకాశవాణి కేంద్రానికి బదిలీ కావడంతో, నా మకాం సికింద్రాబాద్ మార్చక (పూర్తిగా కాదు) తప్పలేదు. ఇక్కడ నా రచనా వ్యాసంగాన్ని కొనసాగించగలిగినా, సాహిత్య కార్యక్రమాలకు ఆనకట్ట పడింది. కారణం దూరాభారాలే ఈ మహానగరంలో. నా పరిస్థితి గమనించిన మా అమ్మాయి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తుండంతో హైదరాబాద్‍లో కూడా సాహిత్య కార్యక్రమాలకు హాజరయ్యే వెసులుబాటు కలిగింది.

ఓల్గా.. గారి ప్రారంభోపన్యాసం.

అలా ఈ మధ్య అంటే 22 జులైన రవీంద్ర భారతిలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమానికి వెళ్లాను. ఆ రోజు రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం అది. ఆ పుస్తకాల రచయిత్రి/కవయిత్రి, నాకు మంచి స్నేహితురాలు శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి (ఆస్ట్రేలియా). ఈ మధ్యకాలంలో నాకు అత్యంత తృప్తిని కలిగించిన కార్యక్రమం ఇది. ఝాన్సీగారి సాహిత్య చరిత్రకు ఇది మూడో మైలురాయి! కరెక్ట్‌గా చెప్పాలంటే మూడో అడుగు! ఇప్పటికే ఝాన్సీగారి పుస్తకావిష్కరణలు రెండు జరిగాయి. ఆ రెండింటికి కూడా హాజరయ్యే అవకాశం నాకు కలిగింది. ఈ మూడవ పుస్తకావిష్కరణల కార్యక్రమం రవీంద్రభారతిలో జరిగింది.

రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం లోని ఆ రెండు పుస్తకాలూ 1) ఎడారి చినుకు 2) చీకటి వెన్నెల.

‘ఎడారి చినుకు’ ఝాన్సీ గారు రాసిన మొదటి దీర్ఘ కవిత. రెండవది కథల పుస్తకం. వేదికపై అతిథులంతా రచయిత్రులు/కవయిత్రులు కావడం ఈ కార్యక్రమ ప్రత్యేకతగా అనిపించింది. అంతమాత్రమే కాదు, అతిథులను సన్మానించడంలో కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. శాలువాలకు, బొకేలకు బదులు ఖరీదైన చీరలతో సన్మానించడమే ఆ ప్రత్యేకత. ప్రత్యేకతలకు మారు పేరు శ్రీమతి కొప్పిశెట్టి అనిపించింది.

వర్షం వస్తున్నా హాలంతా నిండిపోవడం కూడా ఈ కవయిత్రి ప్రత్యేకత అనిపించక మానదు. స్త్రీవాద సాహిత్యంలో అగ్రగామి అయిన శ్రీమతి ఓల్గా గారు సభకు అధ్యక్షత వహించడం, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత, సినీ గీత రచయిత్రి శ్రీమతి చైతన్య పింగళి, ‘ఎడారి చినుకు’ దీర్ఘ కవిత పరిచయం చేసిన వారిలో ఒకరు కావడం ప్రత్యేక ఆకర్షణగా సభకు నిండుతనం కలిగినట్లైంది.

పుస్తకావిష్కరణలో సినీ గేయ రచయిత్రి శ్రీమతి చైతన్య పింగళి

కవయిత్రి /రచయిత్రి, తన స్పందన తెలియజేసే ముందు, వారికి సాహిత్య పరంగా అనేక రకాలుగా సహకరించిన కొద్దిమంది పెద్దలు గుడిపాటి, రజాహుస్సేన్ వంటి వారిని వేదిక మీదికి పిలిచి ప్రత్యేకంగా సన్మానించడం, అందులో నేనూ ఉండడం, ఝాన్సీ గారు నా గురించి నాలుగు మంచిమాటలు చెప్పడం నాకు ఎంతో సంతోషం అనిపించింది.

ఆ..ఆనంద క్షణాలు..

నా విషయంలో ఇది నాకు ఊహించని ఆశ్చర్యం కలిగించిన విషయమే మరి!

ఝాన్సీ కొప్పిశెట్టి, డా. కె. ఎల్. వి. ప్రసాద్, రజాహుస్సెన్, నాగసూరి తదితరులు

అప్పుడప్పుడు ఇలాంటి సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే అనేకమంది సాహితీ మిత్రులను కలుసుకోవడం ఈ వయస్సులో మనిషికి కొంత ఉత్తేజాన్ని, ఉత్సాహాన్నీ కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమావేశంలోనే ఫేస్‍బుక్‌లో కొత్తగా పరిచయం అయిన శ్రీమతి గౌరీ లక్ష్మి అల్లూరి గారినీ, శ్రీమతి సత్యగౌరి మోగంటి గారిని కలిసే అవకాశం రావడం సంతోషం అనిపించింది. మరో మిత్రురాలు ఆలస్యంగా సమావేశానికి హాజరైనా వారిని కలుసుకోలేక పోవడం నిజంగా దురదృష్టమే!వారు ఎవరో కాదు, శ్రీమతి ఉమా సురేష్. కోకా. గారు.

ఝాన్సీ కొప్పిశెట్టి, సినీ గీత రచయిత్రి శ్రీమతి చైతన్య పింగళి (రచయితకు కోడలు వరస) గార్లతో డా. కె. ఎల్. వి. ప్రసాద్
ద్వారపూడి (తూ.గో.జి.) నుండి వచ్చిన కవయిత్రి శ్రీమతి అఫ్సర వలీషా సన్మానిస్తున్న దృశ్యం

తన పుస్తకావిష్కరణ కార్యక్రమంతో మనసుకు గొప్ప అనుభూతిని, తృప్తిని, ఆనందాన్ని కలిగించిన స్నేహమయి శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ కొప్పిశెట్టికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here