జ్ఞాపకాల పందిరి-181

15
14

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

కమనీయ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం

ఈ మధ్యకాలంలో అనేక కారణాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. మొబైల్ వంటి ఆధునిక మాధ్యమాల ఆవిష్కరణల దృష్ట్యా కనీసం ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, పరస్పరం కలుసుకుని కొన్ని గంటలో లేక కొన్నిరోజులో గడిపే అవకాశాలు సన్నగిల్లిపోయాయి.

కారణాలు చెప్పుకోవలసి వస్తే చాలా ఉంటాయి గాని, ఆలోచిస్తే ప్రధానంగా రెండు ముఖ్య కారణాలు కనిపిస్తాయి. చదువుల రీత్యా పిల్లలు వివిధ ప్రాంతాలకు వెళ్లడం, లేదా ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిరపడిపోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యం అయిపొయింది. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎక్కడ వున్నా ఒంటరితనమే (ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో). చాలామందిని ఒంటరితనం వెంటాడుతున్నది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోవడం మూలాన కలుసుకునే సందర్భాలు తక్కువై, తప్పని శుభకార్యాలు అయితే తప్ప సాధ్యం కావడం లేదు. చాలా మంది విద్యావంతుల కుటుంబాలలో తమ పిల్లలు రెక్కలు వచ్చిన పక్షుల్లా వివిధ ప్రాంతాలకో, లేదా విదేశాలకో వలసపోవడం వల్ల, చివరకు మిగిలేది ఆ ఇద్దరు వృద్ధ తల్లిదండ్రులే! ప్రస్తుతం ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ జరుగుతున్న తతంగం ఇదే! ఈ పరిస్థితిని ఒక పట్టాన కొట్టి పారేయలేము, మరోపక్క స్వాగతించలేము కూడా.

తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు ఒకేచోట లేదా ఒకే ప్రాంతంలో వున్నవాళ్లు చాలా అదృష్టవంతులే అనుకోవాలి. అలాంటి అదృష్టవంతులు మన సమాజంలో అతికొద్ది మంది మాత్రమే వుంటున్నారు ఈ ఆధునిక కాలంలో.

రచయిత అత్తగారు, రచయిత దంపతులు(నిల్చున్నవారు), రచయిత మరదలు హేమ కుటుంబం

ఈ నేపథ్యంలో వృద్ధాశ్రమాలకు సైతం బాగా గిరాకీ పెరిగింది. పిల్లలు వున్నా చాలామంది కుటుంబాలలో, పిల్లలులేని వాతావరణమే కనిపిస్తున్నది. రాఖీ వంటి శుభకార్యాలలో తప్పనిసరిగా, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కలుసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి తప్ప క్రమక్రమంగా ఆ సంప్రదాయాలు కూడా కనుమరుగయ్యే భవిష్యత్తు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. క్రమంగా మానవ సంబంధాలు అదృశ్యమయిపోతాయా? అన్న అనుమానం కూడా సత్యదూరం కాదనుకుంటాను.

ఈ మధ్య తరచుగా స్నేహితులతో, శ్రేయోభిలాషులతో ఆత్మీయ సమ్మేళనాలాలో కలుసుకుంటున్నప్పటికీ, కుటుంబపరంగా ఆత్మీయ సమ్మేళనాలు కరువైనాయనే చెప్పాలి. ఏ శుభ కార్యం అయినా ఇంటిలో వాళ్ళతోనే సరిపెట్టుకోవడం జరిగిపోతున్నది గానీ బంధువులతో కలుసుకుని, కొద్దికాలం లేదా కొద్దీ రోజులు గడిపే అవకాశాలు అసలు రావడం లేదు. వారి వారి పనుల్లో అందరూ బిజీనే మరి!

కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న రచయిత పెద్ద బావమరిది రాజబాబు పాండ్రాక (విజయవాడ)

ఈ నేపథ్యంలో ఒక మంచి అవకాశం అనుకోని రీతిలో ఎదురు వచ్చింది. హైద్రాబాద్ లోనే, మణికొండలో నూతన గృహంలో ఉంటున్న మా మరదలు శ్రీమతి ఎం. రేచెల్ హేమలత (నా శ్రీమతి అరుణకు స్వయానా చెల్లెలు) వాళ్ళింటికి మమ్మల్ని ఆహ్వానించింది. మమ్మల్నే మాత్రమే కాదు, విజయవాడలో ఉంటున్న మా అత్తగారు, ఇద్దరు తమ్ముళ్లు, వారి పిల్లలను కూడా ఆహ్వానించింది. ఈ సెప్టెంబర్ నెలలో వినాయక చవితి పండుగ ఆధారంగా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో మేము మా అమ్మాయి, అల్లుడు, మనవలతో కలిసి మణికొండకు వెళ్ళాము.

ఈ మధ్యనే మా మరదలు వాళ్ళు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. గృహ ప్రవేశం రోజున ఆ హడావిడిలో వాళ్ళతో పెద్దగా గడపలేక పోయాము. ఈ మధ్యనే మా మరదలు హేమ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరుగా పదవీ విరమణ సందర్భంలో మేము కలవగలిగాము గానీ వివిధ కారణాల వల్ల అందరు కుటుంబ సభ్యులు హాజరు కాలేకపోయారు. అందువల్ల ఈ రెండు అంశాలనూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది.

కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో శ్రీమతి అరుణ గుర్తు చేసుకుంటున్న జ్ఞాపకాలు

అందరం ఒకే చోట నాలుగు రోజుల పాటు కలిసి వుండడం, కబుర్లు చెప్పుకోవడం, ఆనందంగా గడపగలగడం నిజంగా అదృష్టమని చెప్పాలి. అందరం కుటుంబ సభ్యులం వున్నాం కనుక మళ్ళీ ఓ సారి మరదలి పదవీ విరమణ సందర్భంగా ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుని, అందరం కలసి గతాన్ని గుర్తుచేసుకోవడం, పాటలు పాడుకోవడం ఇలా చాలా సరదాగా గడిచిపోయింది.

తమ నూతన గృహానికి ఆహ్వానించిన రచయిత మరదలు..హేమలత, తోడల్లుడు.. జాన్ గాబ్రియెల్.

నా శ్రీమతి తల్లితో, చెల్లితో, తమ్ముళ్ళతో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపడం నాకూ సంతోషం అనిపించింది. పెళ్లిళ్ల పేరుతోనో, మరో విధంగానో, ఎక్కడెక్కడో స్థిరపడ్డ వాళ్ళు, ఒక్క చోట చేరితే వాళ్ళ ఆనందానికీ, మానసిక తృప్తికి కొలబద్దలు ఏముంటాయి? మా విషయంలో కూడా అదే జరిగింది.

కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో రచయిత తోడల్లుడు.. జ్ణాపకాలు.

ఇక్కడ గుర్తు చేసుకోవలసిందీ, అదృష్టం ఏమిటంటే, నేను మా మరదలు బాల్యం చూచాను, చదువు సంధ్యలు చూచాను, ఉద్యోగస్థురాలిగా చూచాను. పెళ్లి చేసుకుని సంసారం చేయడం, ఒక కొడుకుకు జన్మ నీయడం, ఆమె పదవీ విరమణ చేయడం, ఇవన్నీ చూసే అవకాశం నాకూ, నా శ్రీమతికి కలగడం ఎంత అదృష్టం? ఎంత తృప్తి?

కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో రచయిత మేనకోడలు చెర్రీ (మేఘన) పాట

85 ఏళ్ళ అత్త/అక్క,తో కొద్దిరోజులు గడపగలగడం నిజంగా అది అమూల్యమైన సమయంగా నేను భావిస్తాను.

తల్లి పద్మావతితో కూతుళ్లు-కొడుకులు

నా కూతురు సైతం, అమ్మమ్మతో, మేనమామలతో గడపడం రోజూ అనుభవించే యాంత్రిక జీవితానికి చక్కని బ్రేక్ అని నాకు అనిపించింది. బంధువుల మధ్య ఇలాంటి ఆత్మీయ కలయికలు తరచుగా జరుగుతుండాలి. వయసుతో సంబంధం లేకుండా ఇది అందరికీ అవసరమే!

పాటపాడి శుభాకాంక్షలు తెలియజేస్తున్న రచయిత

ఒంటరితనం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది. దాని నుండి బయటపడాలంటే అప్పుడప్పుడూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎంతైనా అవసరం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here