జ్ఞాపకాల పందిరి-182

19
10

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

విపణి వీధిలో..!!

[dropcap]ని[/dropcap]త్యావసరాల కోసం దుకాణాలను దర్శించ వలసిందే! కొందరు నెలకొకసారి కావలసిన సరుకులు కొని తెచ్చి పెట్టుకుంటే, మరి కొందరు వారానికి ఒకసారి, ఇంకొందరు ఏరోజుకారోజు అవసరాలు కొని తెచ్చుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడంటే, ప్రతి చిన్న వూళ్ళోను సూపర్ బజార్లు, మాల్స్ వెలిసాయిగాని, ఒకప్పుడు, గ్రామంలో చిల్లర దుకాణాలు ఉంటే, ఆ దుకాణుదారులు, ఇంకాస్త పెద్ద దుకాణాలు గల తాలూకా స్థాయిలోనూ, తర్వాత జిల్లా స్థాయిలోనూ, జిల్లా వాళ్ళు రాష్ట్ర స్థాయి పెద్ద దుకాణాల మీద ఆధారపడి ఉండేవారు. అప్పట్లో రవాణా సౌకర్యాలు అంతగా లేకపోవడం కూడా ప్రధాన కారణం కావచ్చు. అలా ఎవరి స్థాయిలో వాళ్ళు కొనుగోరుదారులను దోచుకునేవారు. రాష్ట్ర స్థాయిలో కొన్న సరకు గ్రామస్థాయి వచ్చేసరికి రేటుకు రెక్కలు వచ్చేవి.

ఇక కూరగాయల విషయానికి వస్తే, గ్రామాలలో ఎవరి ఇంటి పరిసరాలలో వారు, అవసరమయిన కాయగూరలు, ముఖ్యంగా పొట్లకాయలు, సొరకాయలు (ఆనపకాయలు)కాకరకాయలు, బీరకాయలు, బెండకాయలు, వంకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, మునగ కాయలు, మిరప, టమాటా వగైరా పండించి, తమ అవసరాలకు సరిపడా ఉంచుకుని, మిగతావి తెలిసిన వాళ్లకి పంచుకునేవారు. అలాగే, గోంగూర, తోటకూర, పాలకూర, పొన్నగంటి కూర వంటి ఆకుకూరలు కూడా పండించుకునేవారు.

ఫుట్‌పాత్ మీద తాజా ఆకుకూరలు (మినీ ట్యాంక్ బండ్)

ప్రత్యేకంగా కూరగాయలు కొనవలసిన అవసరం ఉండేది కాదు. అలాగే గ్రామాలలో చిన్నకారు, పెద్ద రైతులు, తమ మెట్టభూముల్లో, లంకల్లో వాణిజ్యపరంగా పెద్దమొత్తంలో కూరగాయలు, ఆకుకూరలు పండించి మధ్య దళారులకు అమ్మేసేవారు. అవి, తాలూకాలు, జిల్లాలకు, రాష్ట్ర రాజధానికి సరఫరా అయ్యేవి. అలాగే, కొన్ని గ్రామాలకు అనువుగా ఒక ప్రధాన కేంద్రంలో ఎక్కడో ఒకచోట వారానికి ఒకసారి ‘సంత’ ఏర్పాటు చేసేవారు. అక్కడ అన్నివర్గాల ప్రజలకు అవసరమైన సరకులు, కూరగాయలూ అందుబాటులో ఉండేవి. నేను పుట్టిపెరిగిన మా దిండి (తూ. గో. జిల్లా) గ్రామానికి దగ్గరలో మల్కీపురంలో ప్రతి ఆదివారం సంత జరిగేది. గ్రామంలో సంతకు వెళ్లి రావడం గొప్పగా చెప్పుకునేవారు. ఇంతవరకూ నేను ఆ సంతను చూడలేక పోవడం నా దురదృష్టమని చెప్పాలి. మాంసాహారులకు సైతం వారి అవసరాలు ఆదివారమే తీరేవి.

ఫుట్‌పాత్ మీద తాజా ఆకుకూరలు (మినీ ట్యాంక్ బండ్)

నా బాల్యం ఎక్కువశాతం హైదరాబాద్‌లో అన్నయ్య దగ్గర గడిచింది. అందుచేత కూరగాయలు కొనుక్కొచ్చే పని నా మీద పడేది. అన్నయ్య కుబ్ధిగూడాలో వున్నప్పుడు, అక్కడికి దగ్గరలోని చాపెల్ బజారుకు అన్నయ్య వెంట (అప్పుడప్పుడూ సుల్తాన్ బజార్) కూరగాయలు తేవడానికి వెళ్ళేవాడిని. ఆ అనుభవంతో, అన్నయ్య మాసాబ్ ట్యాంక్ దగ్గర కాపురం వుంటున్నప్పుడు, చింతల బస్తీకి వెళ్లి నేనే కూరగాయలు కొని తెచ్చేవాడిని. కొద్దిగా హిందీ మాట్లాడడం (ఉర్దూ, హిందీ, తెలుగు మిశ్రమం) ఈ కూరగాయల మార్కెట్ లోనే నేర్చుకున్నాను. 1967లో నేను హైదరాబాద్‌లో విన్న/కొన్న టమాటా కిలో ధర పది పైసలు మాత్రమే! ఇది నాకు బాగా గుర్తుంది.

తర్వాత నేను కూరగాయలు కొనవలసిన అవసరం 1983లో, ఉద్యోగపరంగా మహబూబాబాద్ (అప్పుడు తాలూకా, ఇప్పుడు జిల్లా)లో ఏర్పడింది. అక్కడ వైద్యులకు సంబంధించి నేను ఒక్కడినే కూరగాయల మార్కెట్‌లో కనిపించేవాడిని. డాక్టర్లు ఎవరూ కూరగాయల మార్కెట్‌కు వచ్చేవారు కాదు. తర్వాత నేను హన్మకొండలో స్థిరపడడం మూలాన ఈ కూరగాయల వ్యవహారం నేనే చూసుకునేవాడిని. ప్రతి ఆదివారం అలా కూరగాయల మార్కెట్‌కు‌ వెళ్లడం సంతోషం అనిపించేది. అలా వారానికి ఒకసారి కావలసిన కూరగాయలు తెచ్చుకోవడం అలవాటు అయింది.

ఫుట్‌పాత్ మీద తాజా కూరగాయలు (మినీ ట్యాంక్ బండ్ పక్కన,సఫిల్ గూడ)

ఈ ఫోర్టుఫోలియో ఇప్పటికీ నాతోనే కలసి నడుస్తున్నది. అది నాకు నామోషీగా అనిపించదు.

జీవితంలో మలిదశ ప్రాప్తించింది, ఇద్దరం పదవీ విరమణ చేసాం. కొడుకు ఉద్యోగ రీత్యా అమెరికా (బోస్టన్) వెళ్ళిపోయాడు, కూతురు కూడా ఉద్యోగ రీత్యా సికింద్రాబాద్ చేరుకుంది. మా అవసరాలు, వాళ్ళ అవసరాలను బట్టి మేమిద్దరం సికింద్రాబాద్ (సఫిల్ గూడ) రాక తప్పలేదు. జంటనగరాలలో ఈ రోజున అన్నీ పెద్ద పెద్ద మార్కెట్లు, సూపర్ బజార్లు, మాల్స్ ఉన్నాయి. రుతువులలో పనిలేకుండా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు దొరుకుతాయి. డబ్బు ఉండాలే గానీ దేనికీ కొదవలేదు. తర్వాత స్వంత ఇల్లు వున్నవారు, ఇంటి చుట్టూరా నేల లేకపోయినా మిద్దెమీద (టెర్రస్ గార్డెన్) కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని హాయిగా తృప్తిగా తింటున్నారు. ప్రకృతి సిద్ధమైన ఎరువులతో ఆరోగ్యకరమైన కూరగాయలు పండించుకోగలుగుతున్నారు.

ప్రతి రోజు ఉదయం కనిపించే చిరువ్యాపారస్థుల కూరగాయల షాపులు (సఫిల్ గూడ)

అది అలా ఉంచితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత పెద్దనగరంలో కూడా ‘సంత’ సంస్కృతీ కొనసాగడం. హైదరాబాద్ – సికింద్రాబాద్ నగరాలలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఈ సంతలు కనిపిస్తున్నాయి. చక్కని తాజా కూరగాయలు – ఆకుకూరలు, పండ్లు లభ్యం అవుతున్నాయి. అదృష్టావశాత్తు, మేము వుండే సఫిల్ గూడ ప్రాంతంలో, ప్రతి ఆదివారం ‘సంత’ వుంటున్నది. అలా ఈ సంత నాకు చాలా అనుకూలంగా వుంది. ఇక్కడ కూడా కూరగాయల వ్యవహారం నాదే. చక్కగా వారానికి సరిపడా నచ్చిన కూరగాయలు తెస్తుంటాను. అలా తాజా కూరగాయలు తిన్నామన్న తృప్తి, సరాసరి రైతునుండి కొనుగోలు చేస్తున్నామన్న మానసిక ఆనందం వెలకట్టలేనిది. ఆదివారం సంతతో పాటు ప్రతిరోజూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గ్రామాలనుండి తీసుకు వచ్చి ఫుట్‌పాత్‌ల మీద పెట్టి అమ్ముతుంటారు. ఇవి కూడా తాజా కూరగాయలే! వీరి దగ్గర బేరమాడాలని అనిపించదు. కానీ ఎక్కువ శాతం జనం బేరమాడే అలవాటును కలిగి ఉండడం వల్ల అమ్మే వాళ్ళు కూడా ముందు ఎక్కువ రేట్లు చెప్పడం మొదలు పెట్టడంతో నాలాంటి వాళ్లకి ఇబ్బంది కలుగుతున్నది.

కార్పొరేట్ సూపర్ బజార్లలో, ఎంత రేటు రాసివున్నా మాట్లాడకుండా కొనుగోలు చేస్తాముగానీ, ఇలా కస్టపడి దూరాభారాలు లెక్క చేయకుండా మనకు అందుబాటులో వుండే చిన్న దుకాణాలలో మాత్రం బేరాలాడి వాళ్ళని విసిగిస్తాం. జనంలో ఈ పద్ధతి పోవాలి. సాధ్యమయినంత వరకూ ఇంటి చుట్టూరా ఏ కొంచం నేల వున్నా, పూలమొక్కల ప్రాధాన్యత తగ్గించి, కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలి. శక్తి సామర్థ్యాలు వున్నవాళ్లు, మిద్దెతోట ఏర్పాటుకు సిద్ధపడాలి. దీనివల్ల రసాయనాల బారినుండి తప్పించుకుని స్వచ్ఛమైన తాజా కాయగూరలు పండించుకుని, తినే అవకాశం కలుగుతుంది.

ప్రతి రోజు ఉదయం కనిపించే చిరువ్యాపారస్థుల కూరగాయల షాపులు (సఫిల్ గూడ)

ఇప్పుడు నా జీవితం, ఉదయకాలంలో, కూరగాయల – ఆకుకూరల కొనుగోలు, నా నిత్య నడకతో అనుసంధానమై వుంది. గంటసేపు నడక కొనసాగించి, తిరుగు ప్రయాణంలో కనిపించిన తాజా కూరగాయలో, ఆకుకూరలో కొని తేవడం నిత్యకృత్యం అయిపొయింది. అప్పుడప్పుడూ ఇళ్ల వద్దకు కూడా రావడం వల్ల, హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా చాలా ప్రాంతాల్లో తాజా కాయగూరలు సరసమైన ధరలలో కొనుక్కునే అవకాశం కలుగుతున్నది. అందుచేత నా ఓటు ఎప్పుడూ చిన్న చిన్న దుకాణాలకే! కొన్ని అవసరాలకు కార్పొరేట్ సూపర్ మార్కెట్‌లు దర్శించక తప్పదు మరి!! చిన్న చిన్న వ్యాపారస్థులను కూడా వారి జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రోత్సహించక తప్పదు. అలాగే రోడ్డు ప్రక్కన చిన్నదుకాణదారులు వద్ద లభ్యమవుతున్న కూరగాయలు కొనడం, తక్కువగా అంచనా వేయకూడదు. నామోషీగా ఫీల్ కాకూడదు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here