జ్ఞాపకాల పందిరి-191

25
10

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

సాహిత్య సభల కోసం..!!

[dropcap]సా[/dropcap]హిత్యాభిలాష గల వాళ్ళు, సాహిత్యకారులు, సాహిత్య పోషకులు, సాహిత్యమే తమ నిత్యకృత్యం అనుకునేవాళ్లూ, తమ ఆలోచనలనెప్పుడూ, సాహిత్య రచనల వైపు, సాహిత్య సమావేశాల వైపు, సాహిత్య పోషణ వైపు మళ్లిస్తుంటారు. అందుచేతనే సాహిత్యం నిలబడగలుగుతున్నది. సాహిత్య ప్రియుల చేతుల్లో కావలసిన సాహిత్యం కనిపిస్తున్నది. సాహిత్యరచన, దాని ముద్రణ ఒక ఎత్తైతే, దానిని పదిమందిలోకి తీసుకెళ్లే అంశం మరో ఎత్తు! దీనికోసం అనేక ఎత్తులు. అందులో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఒక భాగం. పుస్తకం రాయడానికి, ఖర్చు అయ్యే శ్రమను లెక్కగట్టలేము గాని, పుస్తకం అచ్చువేయడానికి, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేసే కార్యక్రమాల కోసం, ఏదో విధంగా కష్టపడి ఖర్చు చేయగలిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమాలకు జనాన్ని సమీకరించడం చాలా కష్టమైన అంశంగా మారింది.

రచయితకు అందిన పుస్తకావిష్కరణ ఆహ్వానం

తాలూకా, జిల్లా కేంద్రాలలో కొంతవరకూ ఫరవాలేదేమోగానీ, హైద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలలో, ఇలాంటి సభలు నడపడం కత్తి మీద సాము లాంటిదే! ఇలాంటి సభలకు జనం అంతగా రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అలా ఒక్కొక్కరికీ ఒక్కో విషయం కారణం కావచ్చు. అందులో ప్రధాన కారణం నగరాల్లో దూరభారాల సమస్య. సభాస్థలం కొందరికి దగ్గరైతే, మరికొందరికి దూరం కావచ్చు. దగ్గరగా ఉన్నవాళ్ళంతా కార్యక్రమానికి వస్తారనే నమ్మకం లేదు. దూరంగా వున్నవాళ్లు, ముఖ్యంగా ఖర్చు గురించి ఆలోచించే సాహిత్యకారులు, సాహిత్యాభిలాషులు సైతం, సభలకు వెళ్ళడానికి ఆలోచనలో పడిపోవటం, ఇలాంటి అంశాలతో కూడిన సమస్యలతో, నగరాల్లో అనేక సాహిత్య సభలు, జనం లేక వెలవెల బోతుండడం మనం గమనిస్తూనే వున్నాం. దీనికి తోడు, ఆదివారం పూట కొంచెం కూడా విశ్రాంతి లేకపోతే ఎలా అనుకునే వాళ్ళు కొందరైతే, వర్కింగ్-డే న ఈ సమావేశాలు ఏమిటని భావించే ఉద్యోగస్థులు మరికొందరు. ఇష్టం వున్నా, ఏదో ముఖ్యమైన పని తగిలి, బద్ధకించేవాళ్ళు మరికొందరు. తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకు, అన్యాయము జరిగిపోతుందని మొత్తుకునే పెద్ద మనుష్యులు సైతం సాహిత్యసభలకు హాజరు కాకపోవడం బాధాకరమైన విషయం. ఒక సాహిత్యకారుడు ఎన్నో కష్టనష్టాలకోర్చి ఒక గ్రంధాన్ని ప్రచురించిన దానికి కనీస ప్రోత్సాహం లేకుంటే, ఆ రచయిత మళ్ళీ సాహిత్యం జోలికి పోయే ముచ్చట ఉండదు. మరి తెలుగు భాషాభివృద్ధి ఎలా జరుగుతుంది? తెలుగు భాషను ఎలా రక్షించుకోగలుగుతాం?

పుస్తకావిష్కరణ మహోత్సవంలో సాహితీ ఉద్దండులు

ఆధునిక ప్రసార/ప్రచార మాధ్యమాలలో ప్రకటనలు ఇచ్చినా, స్వయంగా ఫోన్లో మాట్లాడినా సాహిత్య సభలకు హాజరు అంతంత మాత్రంగానే వుంటున్నది. ఈమధ్య కాలంలో ఖర్చులో ఖర్చుగా సమావేశ సమయంలో,కొందరు చిరుతిండ్లు, తేనీరు సరఫరా చేస్తుంటే; మరికొందరు మధ్యాహ్న వేళ భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. కారణం, ఈ సాహిత్య సభలకు హాజరయ్యేవారు ఎక్కువ శాతం 60 ఏళ్ళు పైబడినవారే ఉండడం. అయినా హాజరు శాతం తక్కువగానే వుంటున్నది. సాహిత్య సభలు అంటే భయపడేవారు వున్నారు.

దీనికి ప్రధాన కారణాలు, చెప్పిన సమయానికి సమావేశాలు ప్రారంభం కాకపోవడం (దీనికీ కారణాలు అనేకం అనుకోండి). రెండవదిగా, అతిథులు, ముఖ్య అతిథులు, ప్రత్యేక అతిథులు, ఎదుటివారి పరిస్థితిని గమనించకుండా అదే పనిగా చెప్పిందే చెప్పడం, అధ్యక్ష స్థానంలో వున్నవారు పక్కనున్న వారి సంగతి మరచిపోయి, సమీక్షకుడు అయిపోవడం; కొందరైతే పేజీలకొద్దీ రాసుకొచ్చి, రాసింది ఒకసారి కూడా ఇంటిదగ్గర చదవకుండా, సభలో చదువుతూ తత్తరపాటు పడడం వంటి ఇబ్బందులను భరించలేక, సాహిత్య సభలకు దూరంగా ఉండడం జరుగుతున్నది. అలాగే, సాహిత్య సభలలో అసలు యువతీ యువకుల పాత్ర లేకపోవడం అత్యంత బాధాకరం.

కవులు: విల్సన్ రావు,రాజకుమార్ గార్లతో రచయిత

మా పెద్దన్నయ్య శ్రీ కె.కె. మీనన్ రచయిత కావడం, మా వదిన శ్రీమతి శిరోరత్నమ్మ ఉద్యోగినిగా, ఆఫీసు నుండి అనేక వార/పక్ష/మాసపత్రికలు తేవడం, నవలలు తేవడం – నా బాల్యం ఎక్కువ వారి దగ్గరే గడవడం వల్ల, పుస్తకాలు చదవడం, నా చుట్టూ సాహిత్య వాతావరణం ఉండడంతో, సాహిత్యం నా జీవన శైలిలో ఒక ముఖ్య భాగం అయిపోయింది.

మహాహబూబాబాద్‌లో, ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమై, అక్కడ అప్పటికే జీర్ణావస్థలో వున్న ‘సారస్వత మేఖల’ అనే సాహిత్య సంస్థను పునరుజ్జీవింపజేసి, ఆ సంస్థకు అధ్యక్షుడిగా వుండి, అనేక సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు, లేత.. లేత.. రచయితలను ప్రోత్సహిస్తూ ఉండేవాడిని. నిజానికి నా కథా రచనకు ఆరంగేట్రం అక్కడే జరిగింది. తర్వాత హన్మకొండలో స్థిరపడ్డాక, అక్కడి ‘సహృదయ, సాహిత్య, సాంస్కృతిక సంస్థ’ కు వరుసగా 13 సంవత్సరాలు, అధ్యక్షుడిగా ఉండడం మూలాన, అనేక సాహిత్య సభలను ఏర్పాటు చేయడం, ఇతర సాహిత్య కార్యక్రమాలకు హాజరు కావడం అలవాటు అయింది.

సభలో మొదటి సారి కలుసుకున్న కవి మిత్రులు శ్రీ విల్సన్ రావు గారు (హైదరాబాద్)

కొన్ని సాంకేతిక కారణాలవల్ల హైద్రాబాద్‌కు మా బస మార్చడం వల్ల సాహిత్య కార్యక్రమాలకు హాజరు కావడం తగ్గిపోయింది. కారణం, ఇక్కడి సాహిత్య సంస్థలతో ఎక్కువ సంబంధాలు లేకపోవడం, రెండవదిగా, నేను నివాసం ఉంటున్న చోటు (సఫిల్ గూడ) నుండి, సాధారణంగా సాహిత్య సమావేశాలు జరిగే, రవీంద్ర భారతి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, త్యాగరాయ గానసభ వంటి ప్రదేశాలు దూరంగా ఉండడం. అయినా ఉండలేక అప్పుడప్పుడూ సాహిత్య సమావేశాలకు హాజరు అవుతూనే వున్నాను.

అలా, ఒక మిత్రురాలి ఆహ్వానంతో ఈమధ్య సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో, ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. అది షోయబ్ హాల్‌లో ఏర్పాటు చేసారు. అది చిన్న హల్. పాతిక మందికి సరిపడా కుర్చీలు వున్నాయి. సమావేశం ఉదయం 10.30కి అని ఆహ్వాన పత్రికలో వుంది. నా అదృష్టం కొద్దీ ఆటోవాలా నన్ను పదిహేను నిముషాలు ముందే వేదిక దగ్గరకు చేర్చాడు. లోపల ఖాళీ కుర్చీలు నన్ను వెక్కిరించాయి. కార్యక్రమ నిర్వాహకులు కూడా అక్కడలేక పోవడం ఆశ్చర్యకరం. పదకొండు గంటలకు ఒక్కొక్కరు రావడం మొదలు పెట్టారు. నిజానికి అతిథులే సభకు ముందు వచ్చారు. వేదిక మీద ఉన్నవారితో సహా ఇరవై మంది మించి లేరు. ఆ పుస్తక రచయిత ఎంత నిరుత్సాహ పడివుంటాడో నేను గ్రహించగలను. ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల నాకు తెలియని కొందరు సాహిత్యకారుల ఉపన్యాసాలు వినే అవకాశం కలిగింది. మిత్రురాలు శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టిని కలిసే అవకాశం కలిగింది. ఫేస్‌బుక్ మిత్రులు, శ్రీ విల్సన్ రావు గారిని మొదటిసారి చూసే అవకాశం కలిగింది. ముప్పై ఏళ్ళనాడు నేను చూసిన, నా వైద్య మిత్రులు డా. ఒద్దిరాజు ప్రభాకర్ రావుగారి తమ్ముడు, సాహిత్యకారుడు అయిన ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్‌ను కలుసుకుని, ముచ్చటించే అవకాశం కలిగింది. అలాగే మిత్రులు గుడిపాటి (పాలపిట్ట -మాసపత్రిక సంపాదకులు) గారిని, చాలా కాలం తర్వాత చూసే అవకాశం కలిగింది.

కవి రాజకుమార్, నవ తెలంగాణా దినపత్రిక సంపాదకులు శ్రీ ఆనందాచారి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గార్లతొ.. రచయిత

అలాగే సాహితీ పెద్దలు శ్రీ ఆనందాచారి (నవ తెలంగాణా), శ్రీ నారాయణ శర్మ (రచయిత/తెలుగు – సంస్కృత పండితులు), డా. కాంచనపల్లి గోవర్ధన రాజు (తంగేడు మాసపత్రిక, సంపాదకులు), కవి శ్రీ కరిపి రాజ్‌కుమార్, ప్రభుతులను మొదటిసారి చూసే అవకాశం కలిగింది.

సభలో కలిసిన చిరకాల కవి మిత్రుడు శ్రీ ఒద్ది రాజు ప్రవీణ్ కుమార్.(హైదరాబాద్)

ఇలాంటి కార్యక్రామాలు సాహిత్యాభిమానులకు గొప్ప శక్తిని ఆరోగ్యాన్ని అందిస్తాయి. నాలాంటి వారికి మరింతగా రాయాలనే ఆసక్తి పుట్టుకొస్తుంది. తెలుగు సాహిత్యాన్ని నేటి యువతీ యువకులు ఆకట్టుకోవడానికి, సాహిత్యరంగంలో పరిశోధనలు జరగవలసి ఉంటుందేమో! అలాగే, సాహిత్య సభల నిర్వాహకులు కూడా సమయపాలన పాటించడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుగు భాష అంతరించి పోబోతుంది అని గగ్గోలు పెట్టే పెద్దలు, మన తెలుగు రాష్ట్రాల్లో అధికార భాషగా తెలుగు నూటికి నూరుపాళ్లు అమలు అయ్యేలా పాటుపడాలి. బోధనా భాషగా తెలుగును ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల్లో ఖచ్చితంగా అమలు అయ్యేలా పోరాడాలి. సాహిత్యకారులు ప్రోత్సహించే దిశలో, తెలుగు భాషాభిమానులంతా తప్పక సాహిత్య సమావేశాలకు కొంత సమయం కేటాయించాలి.

తెలుగు సాహిత్యాన్ని పోషిద్దాం,

తెలుగు రచయితలను ప్రోత్సహిద్దాం,

తెలుగుభాషకు పట్టం కడదాం,

తెలుగు సాహిత్య సభలను జయప్రదం చేద్దాం!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here