జ్ఞాపకాల పందిరి-194

22
10

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

పిల్లలు – పాఠ్యపుస్తకాలు

[dropcap]పూ[/dropcap]ర్వం గురువుల దగ్గర శిష్యరికం చేసి, విద్యను లేదా జ్ఞానాన్ని పొందేవారు. అప్పుడు గురుకులాలు (ఆశ్రమాలు) ఉండేవి. గురువు నివసించే ప్రదేశాల్లోనే అవి ఉండేవి. గురువు దగ్గర ఆశ్రయం దొరకడం అంత సులభమైన పనేమీ కాదు. గురువు దగ్గర క్రమశిక్షణ ప్రధానం. గురుసేవతో పాటు చదువు కూడా నడిచేది. చదువు ప్రధానంగా జీవితం గురించి. జీవితంలో తెలుసుకోవలసిన మంచి – చెడ్డలు, భక్తి, సేవాగుణం, దానగుణం మొదలైన అంశాలకు ప్రాధాన్యత ఉండేది. ఆ చదువు – గురువు చెబితే వినడం తప్ప పుస్తకాలలో పాఠాలు చదివి అప్పగించడాలు, పరీక్షల కోసం బట్టీ పట్టడాలు వుండేవి కాదు. ఆధునికత పేరుతోనూ, మొత్తం ప్రపంచాన్ని అవగాహన చేసుకోవాలనే దృష్టితోనూ, పాఠ్యపుస్తకాల శకం ప్రారంభమైంది. విద్యను పలు రకాలుగా విభజించారు. విజ్ఞానశాస్త్రము, సాంఘిక శాస్త్రము, గణిత శాస్త్రము, భాషా శాస్త్రము – తెలుగు/హిందీ/సంస్కృతము/ఆంగ్లము వగైరా. పిల్లల వయసును బట్టి, వారి అవగాహనా శక్తిని బట్టి, తరగతి వారీగా పిల్లలకు అవసరమైన పాఠ్యాంశాలు (సిలబస్) నిర్ణయించబడేవి. ఆయా శాస్త్ర నిపుణుల పూర్తి సలహాల మీదనే, పాఠ్యపుస్తకాలు తయారయ్యేవి. సమాజంలోనికి ప్రయివేట్ విద్యాసంస్థల ప్రవేశం కానంత వరకూ, ఈ పద్ధతులు సజావుగానే సాగాయి. ఎప్పుడైతే ప్రయివేట్ విద్యాసంస్థల ప్రాధాన్యత పెరిగిందో, వారికి అనువైన పాఠ్య గ్రంథాలను, సిలబస్‌ను సమకూర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఎవరి ఇష్టం వారిదయింది. ప్రభుత్వ నిబంధనలకు చెల్లు చీటీ పలికారు. తర్వాత ప్రభుత్వపరంగా కొన్ని క్లాసులకు విద్యాశాఖ ముద్రించిన పాఠ్య పుస్తకాలు మాత్రమే తప్పనిసరి చేశారు. అలా అని ప్రైవేట్ విద్యా సంస్థలు ఎన్నుకునే పాఠ్యగ్రంథాలను తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. కొన్ని నిబంధనలు పాటించకపోవడం మూలాన, అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇటువంటి విషయాలను అధిగమించడానికి ప్రభుత్వాలు సైతం, విద్యారంగంలో అనుభవం వున్న పెద్దలతో కమిటీలను వేసి సిలబస్ విషయంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, పాలక ప్రభుత్వంలోని పార్టీల ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు రాక తప్పడంలేదు. ఆయా పార్టీలకు అనుకూలమైన పాఠ్యాంశాలు సిలబస్‌లో చేర్చడం, వాళ్లకు ఇష్టంలేని పాఠాలు, మంచివైనా సిలబస్ నుండి తీసివేయడం వంటి విషయాలు కొత్తగా తలెత్తుతున్న చిక్కు విషయాలు. ఇక్కడ ‘ఎక్స్‌పర్ట్ కమిటీలు’ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రభుత్వం ఎలా చేయమంటే అలా చేయవలసి వస్తున్నది. దీనికి తోడు ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యుల్లో కూడా భేదాభిప్రాయాలు వచ్చి, కులాల వారీగా, మతాల వారీగా విడిపోవడం వంటి చేష్టల వల్ల పిల్లల్లో తికమక పరిస్థితులు ఏర్పడడానికి తావిస్తున్నాయి.

ఇది చాలా బాధాకరమైన విషయం. ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య పిల్లలు నలిగిపోతున్నారు.

పాఠ్యపుస్తకాలలో మహాత్మా గాంధీ గురించి ఉంటే కొందరు తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. అంబేడ్కర్ అంటే మరికొందరు తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. బుద్ధుడు అంటే కొందరికి, జీసస్ అంటే మరికొంతమందికి ఇష్టం ఉండదు. ఆయా వ్యక్తుల గొప్పతనం గురించి చూడాలి గాని, ఆయా మహానుభావుల కులాలను, మతాలను పిల్లలకు భూతద్దంలో చూపించి, పిల్లల బుర్ర చెడగొట్టకూడదు. ముఖ్యంగా వాటిని పాఠాలు గానే చూడాలి గాని తల్లిదండ్రలు తమ స్వంత అభిప్రాయాలను పిల్లలపై రుద్దకూడదు. ఇలాంటి భిన్నమైన అభిప్రాయాలను వారు జీర్ణించుకోలేరు. లేదా తల్లిదండ్రులు చెప్పిన మాటలకే ప్రాధాన్యత నిచ్చి జీవితాంతం అవే గుర్తుంచుకుంటారు.

ఇదంతా రాయడానికి ముఖ్య కారణం నాకు ఎదురైన రెండు సంఘటనలు. అవి తెలిస్తే ఎలాంటి వారికైనా బాధను కలిగిస్తాయి. మొదటిది మా ఇంట్లోని సంఘటననే విన్నవిస్తాను. సంగతి పక్కన పెడితే, మా కుటుంబంలో క్రైస్తవం పాటిస్తారు. ఇది నిన్నమొన్నటి విషయం కాదు, తాత ముత్తాతల నాటి విషయం. సర్వజనులకు ఏసుక్రీస్తు దేవుడు అని భావిస్తారు. పిల్లలకు కూడా చర్చిలకు అనుబంధంగా వుండే ‘సండే స్కూల్’ లో, ఇదే విషయం బోధిస్తారు. అందుచేత లేత హృదయాల్లో ఇదే గట్టిగా నాటుకుపోయి ఉంటుంది. అందుచేత ఇతరులు ఏమి చెప్పినా వారు నమ్మే పరిస్థితిలో వుండరు. ఆ వయసు అలాంటిది మరి. మనం చెప్పే ప్రతి విషయం, జాగ్రత్తగా చెప్పాలి, అప్రమత్తంగా ఉండాలి.

పాఠ్యపుస్తకాల్లో నిర్దేశించిన పాఠాలే ఉపాధ్యాయులు బోధించాలి. అలా కాదు అనే హక్కు తల్లిదండ్రులకు ఉండదు. గ్రంథకర్తలను ప్రశ్నించే హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది కానీ, విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రశ్నించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో, ఒక రోజు బయటికి వెళ్లి, ఇంట్లో ప్రవేశిస్తున్న సమయంలో, మా అమ్మాయి, కూతురి చేత హోంవర్క్ చేయించి, పాఠం చదవమంటుంటే, “నేను చదవను” అని మారాం చేస్తున్నది. సాధారణంగా నా మనవరాలు అలా చేయదు! సంగతి ఏమిటంటే, రెండవ తరగతి, ఇంగ్లీష్ మీడియం తెలుగు పాఠ్యపుస్తకంలో ‘వినాయకుడు’ గురించిన పాఠం అది. వినాయకుడు దేవుడని, ఏ పని ప్రారంభించినా వినాయకుడిని ప్రార్థిస్తారని, అలాంటి విశేషాలు వున్నాయి.

తల్లి మూర్ఖంగా కూతురుని ఆ పాఠం చదవొద్దని చెప్పింది. అదే విషయం కూతురు క్లాసులో వాళ్ళ తెలుగు టీచర్‌కు చెప్పింది. అప్పుడు ఆ టీచర్ నవ్వి “ఇది పుస్తకంలోని ఒక పాఠం, చదవకపొతే మార్కులు రావు” అని చెప్పిందట. ఇదీ తల్లికీ టీచర్‌కీ మధ్య నలిగిపోయిన నా మనవరాలి పరిస్థితి. ఇది విన్న తర్వాత బాధ కలగడమే కాదు, నా కూతురు మీద కోపం వచ్చింది కూడా. పాఠం, పాఠం గానే చదవనివ్వాలని, పిచ్చి పిచ్చి విషయాలు పిల్లల మెదళ్లలోకి చొప్పించకూడదని మా అమ్మాయిని మందలించాను. ఇది చాలా సున్నితమైన విషయం. చిన్న పిల్లల విషయంలో అతిజాగ్రత్తగా ఉండవలసిన విషయం. ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండవలసిన అంశం.

నాకు తెలిసిన వాళ్ళింట్లో, ఇదే పద్ధతిలో దీనికి భిన్నమైన సంఘటన జరిగింది. అది కూడా నా దృష్టికి వచ్చింది. కానీ, వారికి నేనేమీ చెప్పలేని పరిస్థితి. అది హైందవ కుటుంభం.

పాఠ్యాంశం ‘క్రీస్తు జననం’. పిల్లలు అడిగే ప్రశ్నలకు, సరైన సమాధానం ఇంట్లో తల్లిదండ్రులు ఇవ్వలేకపోవడం గొప్ప నేరం. బడిలో ఒకటి, ఇంట్లో మరొకటి చెబుతుంటే పిల్లలకు ఎక్కడలేని తికమక! ఇది ఎట్టి పరిస్థితిలోను జరగకూడదు. పాఠ్య పుస్తక గ్రంథకర్తలు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో పిల్లల కోసం ఎంచుకునే పాఠ్య గ్రంథాల విషయంలో తీసుకొనవలసిన జాగ్రత్తల అవసరం ఎంతైనా వుంది.

  1. పాఠ్య పుస్తకాల కోసం నిర్ణయించే పాఠాలను ఎన్నుకునే విషయంలో, అతి సున్నితమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవలసిన బాధ్యత, నిపుణుల కమిటీదే అన్న విషయం అందరూ గ్రహించాలి.
  2. పాఠ్య గ్రంథాలలోని అంశాలపై తల్లిదండ్రులు పిల్లలతో బాధ్యతతో చర్చించాలి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here