జ్ఞాపకాల పందిరి-196

19
13

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

స్వంత గూటికి..!!

[dropcap]మ[/dropcap]నుష్యులైనా, పశుపక్ష్యాదులయినా, స్వంతగూటికి ఇచ్చే ప్రాధాన్యత ఎలా వుంటుందో అందరికీ అనుభవమే! కొంతమంది, పుట్టి పెరిగి, అక్కడే ఉద్యోగం చేసి, అక్కడే పదవీ విరమణ చేసిన వ్యక్తులు, మరో ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఎన్ని వసతులు వున్నా, ఎన్ని వసతులు కల్పించినా, సాధ్యమైనంత త్వరగా స్వంత గూటికి చేరుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తారు. పశుపక్ష్యాదులు దీనికి అతీతం కాదు. స్వంత గూటికి వున్న విలువ అలాంటిది! స్వంత గూటితో వుండే అనుబంధం అలాంటిది.

అలాగే, ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో, పుట్టిన వూరు వదలి, మరో ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకుంటే, ఆ ప్రాంతానికి, వాతావరణానికి అలవాటు పడిపోయి, అక్కడి స్నేహాలు పెరిగిపోయి, ఆ వూరు వదలి రావడానికి ఎవరూ ఇష్టపడరు. చదువు రీత్యానో, ఉద్యోగ రీత్యానో, వూరు విడచి, తాలూకా కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు, రాష్ట్ర కేంద్రాలకు, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లి స్థిరపడిపోయిన వారికి ఇది అనుభవమే!

ఇలా స్వంతగూటికి పోవాలని తహతహ లాడేవారు కొందరైతే, అలవాటు పడ్డ స్వంత గూటికే పరిమితం అయ్యేవాళ్ళు మరికొంతమంది. ఇలాంటి వాళ్లకు పెద్ద సమస్య ఉండదు. వలస వెళ్లిన వాళ్ళకే మనసు స్వంత గూటివైపు లాగుతుంటుంది.

అయితే కొందరికి అప్పుడప్పుడూ స్వంత గూటిని దర్శించే అవకాశం ఉంటుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరి కొందరికి ఆ వకాశం ఉండదు/రాదు.

పుట్టిన స్థలాన్ని, స్వంత గూటిని మరచిపొయ్యేవాళ్ళు బహు కొద్దిమంది, మరచిపోలేక అదే ధ్యాసలో ఉండేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ స్వంతగూటి చుట్టూనే తిరుగుతుంటాయి. వాళ్ళ జీవితాలు స్వంత ఊరితో, స్వంతగూటితో పెనవేసుకునిపోయి ఉంటాయి. పుట్టిన వూరికి, స్వంత ఇంటికి వున్న విలువ అలాంటిది. సున్నితమైన మనసున్నవారికి ఇది దారుణమైన సమస్య. ఇలాంటి వారు ఏదో కోల్పోయిన భావనతో సతమతమవుతుంటారు.

నేను 1968లో అనుకుంటాను, అనారోగ్య రీత్యా, స్వంత వూరు, స్వంత ఇల్లు వదలి హైద్రాబాద్‌కు అన్నయ్య మీనన్ దగ్గరకు రావడం జరిగింది. 1971-72లో మెట్రిక్యులేషన్, 1972-74లో అక్క దగ్గర వుండి ఇంటర్మీడియెట్ పూర్తిచేయడమూ జరిగింది. అలాగే, 1975-80లో బి.డి.ఎస్. పూర్తి చేయడమూ తర్వాత ఉద్యోగం 1994లో ఉద్యోగరీత్యా హన్మకొండలో స్థిరపడడం జరిగింది. పదవీ విరమణ తర్వాత ప్రస్తుతం, కూతురు, మనవలతో సికింద్రాబాద్‌లో నేనూ, నా భార్యా ఉంటున్నాం.

ఇవన్నీ చెప్పడం వెనుక విషయం ఏమిటంటే, ఇప్పుడు తరచుగా, నేను పుట్టి పెరిగిన మా దిండి గ్రామం గానీ, పాక్షికంగా చదువుకున్న నాగార్జున సాగర్ గానీ, స్థిరపడిన హన్మకొండకు గానీ తరచుగా వెళ్లలేని పరిస్థితి.

హన్మకొండ కొంతలో కొంత నయం, కనీసం అప్పుడప్పుడూ అందరం (అబ్బాయి ఎట్లాగూ అమెరికాలో ఉంటున్నాడు) అక్కడికి వెళ్లి కనీసం రెండు రోజులైనా అక్కడ గడిపే వెసులుబాటు వున్నది. ఈ విషయంలో ఒక్కోసారి, తెల్లవారుఝామున మెలుకువ వచ్చి, రకరకాల ఆలోచనలు మనసును చుట్టుముడుతుంటాయి. ఆయా ప్రాంతాలతో క్రమంగా అనుబంధం తెగిపోతుందేమోనన్న బెంగ వేధించడం మొదలు పెడుతుంది. ఇలాంటి జబ్బు నాకేనా.. ఇంకెవరికైనా ఉంటుందా? అన్న అనుమానం కూడా అప్పుడప్పుడూ నన్ను తికమక పెడుతుంటుంది. చెప్పలేని ఆవేదనతో మనసు మూలుగు తుంటుంది.

ఇక అసలు విషయానికొస్తే, గత నెల 28వ తేదీన మనవరాలికి క్రిస్మస్ సెలవులు ఇవ్వడంతో, అందరం కారులో హన్మకొండకు బయలుదేరి వెళ్లాం. చూడండి నా ఆనందానికి అవధులు లేవు. స్వంత ఇల్లు కట్టుకుని గడిపిన ప్రదేశం. అనేకమంది సాహితీ బంధువులతో కలిసి నడిచిన ప్రదేశం. అనేకమంది స్నేహితులు, సాహితీ పెద్దలు పరిచయం వున్న ప్రదేశం హన్మకొండ/వరంగల్. చాలా రోజుల తర్వాత స్వంత ఇంటికి వెళుతుంటే, ఏదో చెప్పలేని ఉద్వేగం/ఆనందం నన్ను చుట్టుముట్టాయని చెప్పాలి. ఆ రోజు అనుకోకుండా ఒక ప్రత్యేకతను సంతరించుని వుంది. అదేమిటంటే, ఆ రోజు ధ్వన్యనుకరణ సామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారి 92వ జన్మదినోత్సవం. వేణుమాధవ్ గారి పుట్టినరోజు కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా జరుపుతారు.

పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారు

అది కూడా పబ్లిక్ గార్డెన్‌లో ఆయన పేరుమీద వున్న ‘శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణం’లో జరుగుతుంది. అంతమాత్రమే కాదు, వేణుమాధవ్ గారి పేరుమీద ప్రతియేటా సాహిత్యకారులకు, వివిధ కళారంగాలో కృషి చేసినవారికి అవార్డులు కూడా ఇస్తారు. వేణుమాధవ్ గారి శిష్యులు (మిమిక్రీలో) అనేకమంది వచ్చి ఆయన గౌరవార్థం ప్రదర్శనలు ఇస్తుంటారు. హన్మకొండలో ఉండగా ఆ.. ప్రేక్షక జనసందోహాన్ని తట్టుకోలేక నేను ఆ కార్యక్రమానికి హాజరయ్యేవాడిని కాదు. కానీ, ప్రస్తుత పరిస్థితిలో సాహిత్య/సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం వల్ల, ఈసారి అదే రోజు హన్మకొండలో ఉండడం మూలాన 28/12/2023 రాత్రి, కార్యక్రమానికి హాజరయ్యాను. తెలిసినవాళ్ళు ఎంతోమంది అక్కడ కనిపించి పలకరించడంతో, స్వంతగూటికి చేరుకున్న అనుభూతి కలిగింది. పైగా నాకు ఇష్టమైన నవలా రచయిత డా. అంపశయ్య నవీన్ గారిని అవార్డుతో సన్మానించడం, అది చూసే అవకాశం నాకు కలగడం నాకు ఆనందం అనిపించింది.

డా.అంపశయ్య నవీన్ గారికి సన్మానం

పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారి మిమిక్రీ ప్రదర్శన, నా విద్యార్థి దశలోనే, రవీంద్ర భారతిలో చూసాను. నవీన్ గారిని జనరల్ నాలెడ్జి పాయింట్‌గా చదివాను. నిజానికి వీరిద్దరినీ నా జీవితకాలంలో కలుస్తానని, చూస్తానని అనుకోలేదు. కానీ అదృష్టవశాత్తు వీరిద్దరూ నివశించే హన్మకొండ/వరంగల్‌లో నేను స్థిరపడతానని కానీ, వారితో స్నేహం ఏర్పడుతుందని గానీ, వారితో కలసి వివిధ సందర్భాలలో వేదిక పంచుకుంటానని గానీ ఎప్పుడూ అనుకోలేదు. కానీ అది సాధ్యమయింది. అందుకే వరంగల్ నాకు ఇష్టమైన ప్రదేశం అయింది.

పత్రికా ప్రకటన

వేణుమాధవ్ గారి 92వ జన్మదినోత్సవాలలో పాల్గొన్నందుకు, అంపశయ్య నవీన్ గారితో పాటు, మిత్రులు శ్రీ వనం లక్ష్మీ కాంతారావు, శ్రీ వరిగొండ కాంతారావు, శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ బాబు, శ్రీ మల్యాల మనోహరరావు, శ్రీ రామా చంద్రమౌళి, శ్రీ రాజమౌళి వంటి ప్రముఖులే కాకుండా, నేను మరచిపోయిన అనేకమంది స్థానికులు కలవడం ఎంతో సంతోషం అనిపించింది. శరీరంలో ఏదో కొత్త శక్తి ప్రవేశించిన అనుభూతి కలిగింది. ఇష్టమైన ప్రదేశంలో, ఇష్టమైన వారిని కలిస్తే ఎవరికైనా ఇలానే ఉంటుందేమో!

నవీన్ గారితో రచయిత.. వారి కుమార్తె నిహార కానేటి

వయస్సును అడ్డంపెట్టుకుని, భయంతో ఇంట్లోనే ముడిచి పట్టుకోవడం అంత మంచిది కాదేమో సుమా! ఓపిక చేసుకుని ఇష్టమైన ప్రదేశాలు దర్శించడం ఆరోగ్యకరం మాత్రమే కాదు, అదొక రకమైన మానసిక సంతృప్తి కూడా! పిల్లలూ.. మీ తల్లిదండ్రులను అర్థం చేసుకుంటారు కదూ!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here