జ్ఞాపకాల పందిరి-197

15
15

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

చలో.. రాజమహేంద్రవరం..!!

[dropcap]ప్ర[/dropcap]తి మనిషి రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఎక్కడో ఒకచోట స్థిరనివాసం ఏర్పరచుకుంటాడు. అతడి చుట్టూ ఎన్నో వింతలు విడ్డూరాలు కలిగించే ప్రదేశాలు కూడా చాలా ఉంటాయి. కానీ వాటిని మామూలు విషయాలుగానే పరిగణిస్తాడు. అంతగా వాటిపై శ్రద్ధ చూపించే కనీస ప్రయత్నం కూడా చేయడు. కానీ వేరే ప్రాంతంలో వున్నవాళ్లు అక్కడికి వచ్చి ఆ వింతలూ విడ్డూరాలూ చూసిపోతుంటారు. స్థానికుడు మాత్రం వాటిని విస్మరించి, దూరప్రదేశంలో వున్న వాటిని చూడడానికి తహతహలాడుతుంటాడు. ఇది అందరి విషయంలోనూ సర్వసాధారణం కాకపోయినా, చాలామంది విషయంలో మాత్రం అలానే ఉంటుంది. ‘దూరపుకొండలు నునుపు’ అన్నట్టు, ఎక్కడో ఉన్నవాటిని చూడడానికి ఎగబడతాం, ఎంత ఖర్చుకైనా వెనకాడం కానీ మన చుట్టూతా వున్నముఖ్యమైన ప్రదేశాలను చూడడంలో ఎలాంటి ఉత్సాహం చూపించం. అందరి విషయం ఇలా ఉండకపోవచ్చు. కొందరు ఏ మాత్రం చాన్సు దొరికినా ఏదో ఒకటి చూసే ప్రయత్నం చేస్తారు. ముందు తమకు దగ్గరలోవున్న ముఖ్యమైన ప్రదేశాలను దర్శించి, ఆ తర్వాతనే, దూర ప్రాంతాలలోని ముఖ్య ప్రదేశాలను చూడడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇలాంటి వారికోసం, ప్రభుత్వపరంగా ప్రయివేట్ రవాణా సంస్థల పరంగా పర్యాటకుల కోసం, ఎన్నోరకాల పేకేజిలతో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం, కుటుంబంతో సహా కోరుకున్న ప్రదేశాలు పర్యటించే విధంగా సెలవుతో కూడిన ఆర్థిక సహాయం కూడా చేసి ప్రోత్సహిస్తున్నారు. అయినా అందరూ ఈ సదుపాయాన్ని పూర్తిగా వినియోగించుకోవడం లేదనే చెప్పాలి. దానికి కారణాలు అనేకం. అవి పరిష్కారానికి అందని సమస్యలు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు. కొందరైతే గ్రూపులుగా ఏర్పడి పర్యాటక ప్రదేశాలకు వెళ్లివస్తుంటారు. అది స్వరాష్ట్రం కావచ్చు, స్వదేశం కావచ్చు

విదేశం కావచ్చు. కొన్ని ఔషధ తయారీ సంస్థలు, తమ మందులు అధికశాతంలో వినియోగించిన (రాసిన) వైద్యులను సంవత్సరానికొక మారు, విదేశీ పర్యాటక ప్రదేశాలకు తమ ఖర్చులతో తీసుకెళ్లడం అందరికీ తెలిసిన విషయమే! అయితే చార్మినార్ ప్రాంతంలో వుండి చార్మినార్ చూడని వాళ్ళు వున్నారు. వరంగల్‌లో వుండి రామప్పగుడిని, వేయిస్తంభాల గుడిని, పాకాల చెరువును చూడని వాళ్ళు వున్నారంటే, ఏమాత్రం ఆశ్చర్య పోనక్కరలేదు.

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో అంతర్వేది అనే ప్రదేశం వుంది. బంగాళాఖాతం అక్కడికి అతిదగ్గర. అక్కడే లైట్ హౌస్ ఉంటుంది. అక్కడ సంవత్సరానికొకమారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర తీర్థం (తిరునాళ్ల)జరుగుతుంది. అక్కడికి మా దిండి గ్రామం మరీ దగ్గర కాకపోయినా దూరం మాత్రం కాదు. చిన్నప్పుడు పిల్లలు చాలామంది ఆ ఉత్సవానికి వెళ్లివచ్చారు. ఆ పండుగకి పక్క ప్రాంతాలవారు, పక్క రాష్ట్రాల వారు కూడా వస్తుంటారు. ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే, ఇప్పుడు నా వయసు 70+. అయినా ఇంతవరకూ ఆ తీర్థం నేను చూడక పోవడం. గోదావరి బంగాళాఖాతం సముద్రంలో కలిసే చోటు కూడా అక్కడే! అలా ఉంటుంది వ్యవహారం.

అయితే కరోనా.. కాలం నుండి సాధారణ ప్రయాణాలు కూడా బాగా తగ్గిపోయిన నేపథ్యంలోను, వయసు పెరిగిపోతున్న సందర్భంలోనూ, కొన్ని ప్రదేశాలు చూడాలని, కొందరు బంధువులను కలవాలనే ఆశ రోజురోజుకి పెరిగిపోవడంతో ఈ నెల మూడవ తేదీ రాత్రి గరీబ్ రథ్‌లో, నేనూ మా వియ్యంకుడు విజయకుమార్ గారు రాజమండ్రికి బయలుదేరాం. నాలుగవ తేది ఉదయం రాజమండ్రికి (ఆనం అప్పారావు రోడ్) చేరుకున్నాం. అక్కడ మా వియ్యంకుడి మేనల్లుడి ఇంట్లో దిగాం.

వియ్యంకుడు శ్రీ విజయకుమార్. నల్లి తో రచయిత

వారి హాస్పిటాలిటీ మరువలేనిది. నిజానికి నేను ఎప్పుడు రాజమండ్రికి వెళ్లినా బంధువుల ఇల్లు, రైల్వే స్టేషన్ తప్ప ఇంకేమీ చూసిన సందర్భాలు లేవు. అయితే ఈసారి ట్రిప్‌లో, ప్రతి నిముషము సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అలా.. మొదటి రోజు డ్రైవర్‌ను పెట్టుకుని రాజమండ్రి అంతా చుట్టేసాము. అందులో పుష్కర ఘాట్, కోటగుమ్మం, ఆర్ట్స్ కళాశాల, బి.ఇ.డి. కళాశాల (ఇవి చరిత్ర కలిగిన పురాతన విద్యాసంస్థలు), గోదావరి నదిమీద వున్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి, శ్రీ దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ (దీనికీ గొప్ప చరిత్ర వుంది. ఈ మధ్యనే, శ్రీ శీలా వీర్రాజుగారి పెయింటింగ్స్ కూడా డొనేట్ చేయబడ్డాయి. బాధాకరం ఏమిటంటే ప్రభుత్వ పరంగా దాని నిర్వాహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. అక్కడ వున్న ఇద్దరు సంరక్షకులకు చాలాకాలంగా జీతాలు లేని దౌర్భాగ్య స్థితి అక్కడ నెలకొని వున్నది. అమూల్యమైన ఆ.. చిత్రాలు భావితరాలు చూడగలుగుతారా? అన్న బాధ ప్రతివారిలోనూ వ్యక్తమవుతున్నది), సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట (ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన శ్రీ కాటన్ కలల పంట అది. దురదృష్టావశాత్తు అక్కడ కూడా, కాటన్ మ్యూజియం వగైరా సరైన శుభ్రత, నిర్వాహణకు నోచుకోవడం లేదు), తర్వాత కడియపు లంక లోని నర్సరీ చూశాము. బహుశః ఇంత పెద్ద నర్సరీ ఎక్కడా ఉండదేమో! వందల ఎకరాలలో విస్తరించి వున్న ఈ నర్సరీ, వందల మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తున్నది. ఇక్కడినుండి దేశంలోని పలు చోట్లకు ఇక్కడి పూల మొక్కలు, పండ్ల మొక్కలు, సౌందర్య మొక్కలు ఎగుమతి అవుతుంటాయి. రకరకాల పూమొక్కలు ఇక్కడ చూడవలసిందే. అందులో అడుగుపెట్టిన వారు తప్పకుండా ఒక పూలమొక్కనైనా కొనకుండా ఉండలేరు. అక్కడ మొక్కలు కొనడానికి మాత్రమే కాదు, అనేకమంది సందర్శకులు కూడా అక్కడికి వస్తుంటారు.

రాజమండ్రి వద్ద గోదావరి నది మీద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి
పురాతన రాజమండ్రి కళాశాల
కడియం లంక నర్సరీలో

రెండవ రోజు, నాకు చాలా ముఖ్యమైన రోజు. జీవితంలో అది నేను సందర్శించగలనా? అనుకున్న రోజులు వున్నాయి. అలా అసాధ్యం అనుకున్నది, సుసాధ్యం చేశారు మా వియ్యంకుడు విజయకుమార్ గారు. అది ఏమిటంటే, రాజమండ్రి – సెంట్రల్ జైలు చూడగలగడం. అది చూడాలన్నది నా చిరకాల వాంఛ. కారణం, మా నాయన, స్వర్గీయ కానేటి తాతయ్య గారు, కమ్యూనిస్టు నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, కొంత కాలం ఆ జైలులో గడిపారు. అంతమాత్రమే కాకుండా మా అన్నయ్య (కజిన్) మొట్టమొదటి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు స్వర్గీయ కానేటి మోహనరావు గారు, కమ్యూనిస్టు నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా కొన్ని సంవత్సరాలు ఆ జైలులో గడిపారు. ఆ కాలంలో జైలులోనే వైద్యం కూడా ఆయన నేర్చుకున్నారు.

జైలు ఆవరణలోకి అడుగు పెట్టగానే అది నాకు జైలు అనిపించ లేదు. పెక్కు ఇంద్రభవనాల కూడలి అనిపించింది. పరిసరాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు ఖైదీలు కూడా శుభ్రమైన ధవళ వస్త్రాలతో కనిపించారు. ఖైదీల కోసం స్టడీ సర్కిల్ వుంది. బట్టలు నేయడం, బుక్ బైండింగ్, బీరువాలు తయారీ, ఇలా ఒకటి కాదు ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు ఇష్టమైన చేతి పనులు చేసుకునే అవకాశం వుంది. ఇది ఎన్నటికీ మరచిపోలేని అనుభవం.

ఇదే రోజున, వృద్ధాప్యంలో ఉన్న మా మేన బావ (బొమ్మూరు) శ్రీ కాకర కామేశ్వర రావు (రిటైర్డ్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్) గారిని చూసి రావడం కూడా ఒక తృప్తి. చాలా సంవత్సరాల తర్వాత ఆయనను చూడగలిగాను.

మేన బావ కాకర కామేశ్వరరావు గారితో రచయిత

మూడవ రోజు, ‘పాపికొండలు’ సందర్శన. సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం పిల్లలతో కలసి, భద్రాచలం వైపునుండి (అప్పుడు భద్రాచలంలో మా పెద్ద బావమరిది శ్రీ రాజబాబు పాండ్రాక, అక్కడ ఎల్.ఐ.సి.లో పనిచేసేవాడు) పాపికొండలు చూడడం జరిగింది. ఇప్పుడు మా వియ్యంకుడు విజయకుమార్‌తో, రాజమండ్రి వైపునుండి పాపికొండలు చూసే అవకాశం కలిగింది.

పాపికొండలు లాంచీ ప్రయాణం

రాజమండ్రి వైపు నుండి వెళ్లడంలో ప్రత్యేకత వుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయంతో ముడిపడ్డ, నిర్మాణంలో వున్న ‘పోలవరం ప్రాజెక్ట్’ చూసే అవకాశం కలిగింది. ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటికే కొన్ని గ్రామాలు మునిగిపోయాయి. ప్రాజెక్టు పూర్తి అయితే చుట్టుపక్కల 240 గ్రామాలు ముంపుకు గురి కానున్నాయట. అల్పాహారంతో మొదలైన గోదావరి లాంచీ ప్రయాణం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో (యాత్రికులను కూడా పాల్గొనేలా చేయడం) ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపి లంచ్ పూర్తి చేసేసరికి, మూడున్నర గంటల్లో పాపికొండలు బోట్ పాయింట్ (పేరెంటాల పల్లి) వచ్చేసింది. అక్కడ ఒక అరగంట గడిపిన తర్వాత బోట్ తిరిగి రాజమండ్రి వైపు ప్రయాణం అయింది.

మళ్ళీ మరో మూడున్నర గంటలు వినోదం, స్నాక్స్, కాఫీ, కబుర్లతో యిట్టే అయిపోయినట్టు అనిపించింది. ఈ వయస్సులో ఇది కూడా మంచి అనుభవం. లేదంటే ,రాజమండ్రి నుండి బోట్ పాయింట్‌కు బస్సులో గంటసేపు ప్రయాణం చెయ్యాలి. గతుకుల రోడ్డు, డొక్కు బస్సు ప్రయాణం, ఒక సమయంలో, ఈ టూర్ ఎందుకు పెట్టుకున్నామా! అన్న భావన కూడా కలుగుతుంది. చివరి రోజు ఆదివారం మరికొంతమంది బంధువులను కలవడంతో, మా ఈ యాత్ర పూర్తి అయింది.

ప్రపంచ తెలుగు మహాసభలు (రాజమండ్రి) ఆఖరి రోజు, రచయిత్రి నాగజ్యోతి శేఖర్ తో..
ఆత్మీయ బంధువులు శ్రీమతి సుజాత.నల్లి(ఇంజనీర్) దంపతులతో రచయిత
అన్నయ్య(కజిన్) కూతురు శ్రీమతి లక్ష్మీ నందన (బుల్లి) కుటుంబంతో రచయిత

మళ్ళీ గరీబ్ రథ్‌లో తిరుగు ప్రయాణం చేసి ఉదయం 9.30 కి మంచి అనుభవాలను మూటగట్టుకుని గమ్యస్థానం చేరుకున్నాం.

వయసు పెరుగుతున్నది. కరోనా.. వంటి అనుభవాలు చవిచూచిన తర్వాత, కాలు కదిలే సమయంలోనే చూడాల్సిన ప్రదేశాలను చూడాలని, కలవాల్సిన బంధువులను త్వరగా కలవాలనే ఆలోచన, ఇటువంటి ప్రయాణాలకు కారణం అయింది. ఏది ఏమైనా ఇది ఎంతో సంతృప్తిని అందించిన మధుర జ్ఞాపకం. ఇంకా జీవితం ఉందని నిరూపించిన గొప్ప సన్నివేశం, మనిషి ఆశాజీవి కదా!

పర్యాటక స్థలాలు
దర్శిద్దాం..!
మానసిక ఉల్లాసానికి
తెరలేపుదాం..!
బంధుమిత్రులను
కలుద్దాం..!
బంధాలను –
అనుబంధాలను,
సజీవంగా నిలుపుకుందాం!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here