జ్ఞాపకాల పందిరి-198

14
14

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

అలా.. జరిగింది..!!

[dropcap]జీ[/dropcap]వితంలో అనుకున్నవి కొన్ని జరగవు. అనుకోకుండా కొన్ని జరిగి పోతుంటాయి. దానికి ఫలానా కారణం అని అసలు చెప్పలేము. జీవితంలో ఎన్నో జరగాలని, ఎన్నో పనులు కావాలని మనసులో కోరుకుంటాము. కానీ అనుకున్నది జరగడానికి, అనుకూలమైన పరిస్థితులు ఉండాలి, లేదా కలిసిరావాలి. అది అంత సులభమైన పని కాకపోవచ్చు. కాలం కలిసివస్తే, అదృష్టం బాగుంటే, అనుకున్నవి మామూలుగానే జరిగిపోవచ్చు. ఇలా ప్రతివారి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో కొన్ని అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా జీవితంలో మనం, మనకు తెలియకుండానే కొన్ని అనుకోని అనుభవాలను చవిచూస్తాం. ఎప్పుడూ ఊహించని ఒక మంచి పని జరిగిందంటే ఎవరికైనా అది ఆనందదాయకమే! అలాంటి అనుభవానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ అనుభవాన్ని ఓ పట్టాన మరచిపోలేము. ఆ అనుభవం యొక్క ప్రాధాన్యతను బట్టి, చిరకాలం అది గుర్తుండిపోయేలా అయిపోతుంది.

దీనికి భిన్నంగా జీవితంలో కొన్ని సాధించాలనుకున్నవి సాధించలేకపోతాం. ఎంత శ్రమించినా కొన్ని ఎట్టి పరిస్థితిలోనూ జరగవు. దానిని మన దురదృష్టం అనుకోవాలో రాసిపెట్టి లేదు అనుకోవాలో, లేదా ఆ పని భగవంతుడికి ఇష్టం లేదనో తృప్తి పడాలి తప్ప, ఇంకేమి చేయలేము. నిరాశ మాత్రం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. తప్పదు, ప్రతివారి జీవితంలోనూ ఇలాంటి అనుభవాలు తప్పవు. మంచి జరిగినంత వరకూ ఫరవాలేదుగాని, బాధించే అనుభవాలు ఎదురైతే, తొందరపాటు ఆలోచనలు చేయకుండా, సర్దుకుపోవడం అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకుని, భవిష్యత్ జీవితాన్ని ఆనందమయం చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను చెప్పబోయే అనుభవాలు ఇలాంటివి కాదుగాని, ఆనందాన్ని కలిగించేవే, జీవితాంతం గుర్తు పెట్టుకునేవీను!

నేను ఈమధ్య రాజమండ్రికి (4-7జనవరి 2024) వెళ్లడం జరిగింది. అక్కడ ఉండగా మిత్రులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారినుండి ఫోన్ వచ్చింది (వీరు సాగర్‌లో చదువుకున్నారు. ఉపాధ్యాయినిగా మా అక్క మహానీయమ్మ వీరికి పరిచయం). ఫోన్ సారాంశం ఏమిటంటే, తాను 12వ తేదీన నిజామాబాద్ వెళుతున్నానని, నాకు కుదిరితే నన్ను కూడా తీసుకువెళదామని (ఆయన మొదటి పోస్టింగ్ నిజామాబాద్ కావడం మూలాన అక్కడ ఆయనకు చాలా మంది ఆత్మీయ స్నేహితులు వున్నారు. నా విషయానికొస్తే నాకు ఆత్మీయ మిత్రులు, ఇంటర్మీడియట్‌లో సహాధ్యాయులు శ్రీమతి లీల, శ్యామ్ కుమార్‌లు నిజామాబాద్ లోనే ఉండడం, అంతమాత్రమే కాదు శ్రీమతి లీల, రాజేంద్ర ప్రసాద్ గారి కొలీగ్ కావడం నన్ను ఆహ్వానించడానికి ప్రధాన కారణం). నేను తప్పక వస్తానని శ్రీ రాజేంద్ర ప్రసాద్‌కి మాట ఇచ్చాను. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం, ఈ నెల 12 వ తేదీన నేను,శ్రీ రాజేంద్రప్రసాద్, ఆయన శ్రీమతి సాయి కుమారి గారు, వాళ్ళ చర్చికి చెందిన అబ్బాయి, ప్రేమరాజ్, కలసి రాజేంద్రప్రసాద్ గారి కారులో నిజామాబాద్‌కు బయలుదేరాము. రెండున్నర గంటల ప్రయాణం తర్వాత హాయిగా నిజామాబాద్ చేరుకున్నాం. బి.ఎస్.ఎన్.ఎల్. కాలనీలోని శ్యామ్ గృహంలో నన్ను వదలి వాళ్ళు వేరే కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం మరోచోటికి వెళ్లిపోయారు.

చాలా కాలం తర్వాత మిత్రులు శ్యామ్ – లీల, లను వారి స్వగృహంలో కలుసుకునే అవకాశం జరిగింది. మాటామంతి జరిగిన తర్వాత, లంచ్ పూర్తి చేసుకుని ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, సామాజిక సేవకురాలు శ్రీమతి అమృతలత గారిని కలవాలని అనుకున్నాము. ఆవిడ నాకు పరిచయమై చాలా కాలం అయినా, ముఖాముఖి మాత్రం ఇప్పుడే. ఆవిడ నిజామాబాద్‌కు కొద్ది దూరంలో ఆర్మూర్ రోడ్డులో పెద్ద స్కూల్ నడిపిస్తున్నారు. కారులో అక్కడికి చేరుకున్నాం. సంక్రాంతి సెలవులు మూలాన, స్కూల్ గేట్లు మూసి వున్నాయి. అయితే ఆ స్కూల్‌కు మరికొద్ది దూరంలో ఆ మేడం వెంకటేశ్వర స్వామి గుడి కట్టించినట్లు, అక్కడ వారు ఉన్నట్లు తెలిసి అక్కడికి వెళ్లాం. రాబోయే బ్రహ్మోత్సవాల సందర్భంగా గుడి దగ్గర ఏవో పనులు పురమాయిస్తూ బిజీగా వున్నారు. అయినా మమ్ములను ఆత్మీయంగా పలకరించి, మాతో గడపడానికి వారి అమూల్యమైన సమయం మా కోసం కొంత కేటాయించారు. అంత మాత్రమే కాదు మాకు తేనీటి విందు ఏర్పాటు చేశారు.

శ్రీమతి అమృతలత గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్, మిత్రుడు శ్యామ్ కుమార్

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, నలభై ఎకరాల స్థలంలో గుడితో పాటు పెద్ద ఆడిటోరియం, ఫంక్షన్ హాల్, చుట్టూరా అందమైన గార్డెన్‌ను తయారు చేశారు. అసలు అక్కడినుండి నాకు కదలిరాబుద్ధి కాలేదు. అదంతా కేవలం వారి ఒక్కరి కృషి ఫలితమే అని విన్నాను. గతంలో అమృతలత గారిని సంచిక కోసం ఇంటర్వ్యూ చేసే అదృష్టం నాకు దక్కింది. మేడం దగ్గర సెలవు తీసుకుని, తిరిగి శ్యామ్ ఇంటికి చేరుకున్నాం. మిత్రుడు శ్యామ్ బహుముఖ కళాకారుడు. అంటే, రచయిత, చిత్రకారుడు, గాయకుడు వగైరా. అందుచేత సాయంత్రం పూట శ్యామ్ ఇంట్లో గానకచేరి లాంటి కార్యక్రమం మరో నలుగురు గాయకులతో (ఒక గాయనీమణి కూడా వున్నారు) ప్రారంభమై ఒక గంట పాటు కొనసాగింది. విచిత్రం ఏమిటంటే నేను కూడా ఒక పాట పాడడం.

నా అదృష్టం కొద్దీ నా పాట విని ఎవరూ అక్కడినుండి పారిపోలేదు! ఇదో చక్కని అనుభవం నాకు. ఆలా.. ఆరోజు గడిచిపోయింది.

13వ తేదీ నా పుట్టినరోజు. త్వరగా బయలుదేరాలని అనుకున్నాం. ఆ ఒప్పందం తోనే నేను అక్కడ ‘నైట్ స్టే’ చేసాను. నేను ఉదయం ఆరుగంటలకే తయారైపోయాను. రాజేంద్ర ప్రసాద్ గారి కోసం ఎదురుచూస్తూ డ్రాయింగ్ రూంలో కూర్చున్నాను.

కాసేపటికి రాజేంద్ర ప్రసాద్ బృందం వచ్చింది. బయలుదేరుదాం ఓసారి లోపలికి రండి అని నన్ను హాల్లోకి పిలిచారు. నన్ను ఆశ్చర్యపరుస్తూ నాకు కేక్ కటింగ్ ఏర్పాటు చేసాడు మిత్రులు శ్యామ్ & లీల. ఈ సారి అలా నా పుట్టినరోజు నా మిత్రుడి ఇంటిలో కేక్ కటింగ్‌తో ప్రారంభమయింది. వారి అభిమానాన్ని, ప్రేమను, మిత్ర వాత్సల్యాన్నీ ఎన్నటికీ మరచిపోలేను.

యథావిధిగా, తిరుగు ప్రయాణం ఒక గంట ఆలస్యంగా ప్రారంభమై, మధ్యలో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకుని, ఇంటి వైపు బయలుదేరాము. అయితే మా ఇంటికంటే ముందు రాజేంద్ర ప్రసాద్ గారి ఇల్లు వస్తుంది. వారి ఇల్లు రాగానే, నేను కారులోనే ఉండిపోబోయాను. అయితే కొన్ని నిముషాలు మాతో గడిపి వెళ్ళమని వారు కోరిన మీదట కారు దిగి వారి ఇంటిలో ప్రవేశించానా, అక్కడ మరో ‘సర్‌ప్రైజ్’ నాకు దర్శన మిచ్చింది. ఒక బొకే, ఒక కేక్ నా వంక చూస్తున్నాయి. అలా వారు కూడా నాచేత కేక్ కట్ చేయించి, తేనీరు అందించి, అందమైన బొకే నా చేతిలో పెట్టారు. శ్రీమతి సాయికుమారి, రాజేంద్ర ప్రసాద్ గార్ల ఆతిథ్యం, ప్రేమ, అభిమానం మరువరానివి.

అలా ఇంటికి వచ్చేసరికి పన్నెండు గంటలు దాటింది. అమ్మాయి వచ్చి “డాడీ.. మనం లంచ్ కోసం బయటికి వెళుతున్నాం” అని ప్రకటించింది. ఏమీ అనలేని పరిస్థితి. ఆ హోటెల్ ‘ఆనిసెంట్ స్టోన్ ఫైర్’ (ASF) హోటల్. హైటెక్ సిటీలో వుంది. ఆలస్యం అయినా లంచ్ తృప్తిగానే పూర్తి చేసాం. అది పూర్తయ్యే సమయానికి హోటల్ వాళ్ళూ కేక్ ఆరెంజ్ చేసారు.

హోటల్ లో డా. కె. ఎల్. వి. పుట్టినరోజు వేడుక

నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మూడవసారి కేక్ కట్ చేసాను. చీకటి పడుతుండగా ఇల్లు చేరాము. రాత్రి ఏడు గంటలకు ఇంట్లో ప్రార్థన, కేక్ కటింగ్ కార్యక్రమం వుంది, రెడీ కమ్మని చెప్పి వెళ్ళింది. అలా కుటుంబీకుల మధ్య నాల్గవసారి కేక్ కట్ చేసి రికార్డు సృష్టించాను.

ఆ రోజు నేను అలసిపోయినా, మిత్రుల అభిమానం, కుటుంబీకుల ప్రేమ నన్ను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేసి గొప్ప కేటలిస్టులా పని చేశాయి. గొప్ప శక్తిని అందించాయి. నా (70) ఈ పుట్టినరోజు ఇలా ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది.

ఆత్మీయతలు, అనుబంధాలు, ప్రేమ, అభిమానం వెల కట్టలేనివి. వాటిని అందిపుచ్చుకునే అవకాశం అదృష్టవంతులకే దక్కుతుందేమో!

బంధుత్వాలు –
స్నేహాలు,
ప్రేమను – ఆత్మీయతను
పంచి ఇచ్చే,
శక్తివంతమైన
జీవ (చైతన్య) గుళికలు!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here