జ్ఞాపకాల పందిరి-199

11
9

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

గొప్ప కట్టడం ఆ గుడి..!!

[dropcap]మ[/dropcap]న దేశంలో గుడులు – గోపురాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు వందలు వేల సంఖ్యల్లో ఉంటాయి. అలా ఒక్కొక్క చోట ఒక కట్టడం దాని ప్రత్యేకతను ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది. ఆయా కట్టడాలు కొన్ని వంద సంవత్సరాల క్రితమే నిర్మింపబడినవి ఉంటాయి. ముఖ్యంగా చర్చిల విషయానికి వస్తే, బ్రిటీషువారు, ఫ్రెంచివారు నిర్మించిన కట్టడాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సముద్రతీరాన వున్న పట్టణాలలో విదేశీయులు వంద సంవత్సరాలకు పూర్వమే గొప్ప కట్టడాలు (చర్చిలు) నిర్మించారు. అవి ఇప్పటికీ చెక్కుచెదరకుండా, సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తూ వున్నాయి. దానికి కారణం, కట్టడాల నిర్మాణ నైపుణ్యం. సాంకేతికంగా ఇప్పుడున్న వసతులు అప్పుడు లేనప్పటికీ, ఆనాటి నిర్మాణాలు ఇప్పటికీ గట్టిగా బలంగా వున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో వున్న ‘మెదక్ చర్చి’ కట్టి, వందసంవత్సరాలు పైమాటే! ప్రపంచంలోనే రెండవ పెద్ద చర్చిగా ‘మెదక్ చర్చి’ని చెబుతారు. దీనిని 1924లోనే, బ్రిటీషువారు నిర్మించినట్లుగా చెబుతారు. మన దేశంలో పర్యటించే ప్రతి బ్రిటీష్ పౌరుడు మెదక్ లోని చర్చిని తప్పక దర్శిస్తారని చెబుతారు. అంతమాత్రమే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి, మన సరిహద్దు రాష్ట్రాల నుండి భక్తులు, సందర్శకులు అనేక మంది ఈ చర్చిని దర్శించడానికి మెదక్‍కు వస్తుంటారు.

ఇకపోతే కేరళ, గోవా, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలలో విదేశీయులు అప్పట్లో నిర్మించిన చర్చిలు, మహా కట్టడాలుగా ఇప్పటికీ నిలిచి వున్నాయి. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్/సికింద్రాబాద్, వరంగల్ ప్రాంతాలలో సైతం వంద సంవత్సరాలు పైబడిన చర్చిలు అనేకం వున్నాయి. దీనికి ముఖ్య ఉదాహరణలు సెయింట్ జాన్స్ చర్చి – సికిందరాబాద్, సెంటినరీ బాప్టిస్ట్ చర్చి – హన్మకొండ. అయితే ఈ కట్టడాల పూర్వ చరిత్రలు చాలా మందికి తెలియవు.

అసలు ఈ పురాతన చర్చిలను, వాటి పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకోవలసిన అవసరం ఏముంది? ఇది మనకెందుకు? అంటే, జనంలో వున్న కొన్ని అపోహలు పోగొట్టుకోవడానికి చరిత్ర తెలుసుకోక తప్పదు. చర్చిలు మన దేశానికి ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి? తెలుసుకోవాలి.

మనం వందల సంవత్సరాలు బ్రిటీషువారి చేత పరిపాలించబడ్డాం. ఇది అందరికీ తెలిసిన విషయమే! వాళ్ళు క్రైస్తవం పాటించేవారు. అందుచేత వారికోసం చర్చిలు కట్టుకున్నారు. సమాజం ఒకప్రక్క నెట్టివేయబడ్డ దీన జనావళిని చేరదీశారు. ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. వారిని క్రైస్తవులుగా మార్చివేశారు (ఇక్కడ మత మార్పిడిని ప్రోత్సహించడం ఈ రచయిత ఉద్దేశం కాదు). ఇది వారి స్వార్థపూరిత చర్య కావచ్చు. కానీ ఇలాంటి వారి కోసం, విద్య, వైద్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుని, ఉన్నత స్థాయి పాఠశాలలు/కళాశాలలు, వైద్యశాలలు నిర్మించి అవసరం అయిన విద్య, వైద్యం ప్రజలకు అందించారు. అలా బడుగు బలహీన వర్గాలను ఈ చర్చిలు విశేషంగా ఆకర్షించాయి. అతి పేదలు సైతం చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కలిగాయి. అలా మన దేశంలో చర్చిల సంఖ్య పెరిగింది. అందుకే ఈ రోజున కూడా చర్చిల గురించి మాట్లాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే చర్చిలు అన్నీ ఈనాటికీ కూడా నిస్వార్థమైన సేవలు అందిస్తున్నాయా? అంటే పూర్తిగా అవునని చెప్పలేము.

ఒకప్పుడు విదేశీ క్రైస్తవ మిషనరీల ప్రభావం తగ్గడం, వారినుండి ఇంతకు ముందులా ఆర్థిక సహాయం అందకపోవడం ప్రధాన కారణం కావచ్చు. దీనికి భిన్నంగా స్వయంకృషితో, భక్తులు అందించే చందాలతో, పాఠశాలలు, వైద్యశాలలు, అనాథ శరణాలయాలు, వృద్దాశ్రమాలు విజయవంతంగా నడుపుతున్న చర్చిలు కూడా లేకపోలేదు. వ్యాపార దృష్టితో ఆలోచిస్తూ చెడ్డ పేరు తెచ్చుకున్న సంస్థలు కూడా లేకపోలేదు, అది వేరే విషయం. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం చెప్పడం ఎందుకంటే, తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ (అర్బన్) జిల్లాకు, మణికిరీటం వంటి గొప్ప కట్టడం (చర్చి) గురించి చెప్పడం కోసం. ఆ చర్చి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది? అనే సందేహం చాలా మందికి రావచ్చు. ప్రత్యేకతలు ఉన్నందుకే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.

ఆ చర్చి పేరు క్రీస్తు జ్యోతి చర్చి. ఇది హైద్రాబాద్ నుండి వరంగల్ వెళ్లేప్పుడు పెద్ద పెండ్యాలకు, కాజీపేటకు మధ్య కరుణాపురం అనే ఆధ్యాత్మిక గ్రామంలో వుంది. ఆసియాలోనే పెద్ద చర్చిగా చెప్పబడుతున్న ఈ మందిరంలో ఒకేసారి సుమారుగా నలభై వేలమంది భక్తులు కూర్చుని భక్తి ప్రవచనాలు వినే సదుపాయం వుంది.

ఇది హైదరాబాద్‌కు (నార్త్ ఈస్ట్) 120 కిలోమీటర్ల దూరంలో వుంది. ఒకప్పుడు నాగాలాండ్ లోని ‘సుమీ బాప్టిస్ట్ చర్చి’ ఆసియాలో పెద్ద చర్చిగా చెప్పుకునేవారు. ఇందులో సుమారు 8,500 మంది భక్తులు ఒకేసారి ప్రార్థనలలో పాల్గొనే అవకాశం ఉండేది. ఇప్పుడు మన కరుణాపురం చర్చి, ఆ రికార్డు బద్దలుకొట్టి ఆసియాలోనే పెద్ద చర్చిగా రికార్డుల్లోకి ఎక్కింది. 20 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ చర్చికి ఇంకా కొంత సొమ్ము ఖర్చుపెట్టవలసిన అవసరం రావచ్చు. దీనికోసం దాతలనెవరినీ ఆశ్రయించక పోవడం, కేవలం భక్తులు ఇచ్చే కానుకలతోనే ఈ నిర్మాణం జరిగినట్టు చెబుతున్నారు. దీని వెనుక ఇద్దరు దైవభక్తుల ఆలోచన వుంది.

వారు, డా. సంగాల పాల్సన్ రాజ్, డా. జి జయప్రకాశ్. వీరిద్దరూ ఉన్నత విద్యాభ్యాసము చేసినవారే, అలాగే పేద కుటుంబము నుండి వచ్చిన వారే! వీరిద్దరి బ్రెయిన్ చైల్డ్ – ఈ క్రీస్తు జ్యోతి చర్చి. ఈ చర్చికి అనుబంధంగా విద్యాసంస్థలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు మొదలైన ప్రజోపయోగ సంస్థలు రానున్నాయి.

ప్రార్ధనా స్థలం

ప్రతి శనివారం ప్రార్థనలకు, వివిధ ప్రాంతాల నుండి కనీసం 100 బస్సుల్లో భక్తులు ఆ చర్చికి వస్తారని అక్కడి భక్తులు చెబుతున్నారు.

మేము హన్మకొండ నుండి హైద్రాబాద్‌కు, కరుణాపురం మీదుగా కొన్ని వందల సార్లు ప్రయాణించి ఉంటాము. కానీ ఈ పెద్ద గుడి గురించి వినలేదు. కారణం ఆ చర్చి గురించి ప్రాంతీయంగా పెద్ద ప్రచారం లేకపోవడమే!

చర్చి ముందు రచయిత కుటుంబము

ఈ గొప్ప కట్టడం గురించి తెలిసిన తర్వాత కూడా చాలా కాలం చూడకుండా అశ్రద్ధ చేసాము. కానీ గత సంవత్సరం డిసెంబర్ నెలలో సోదరుడు, నిట్ ప్రొఫెసర్ పి. రవి కుమార్ ద్వారా ఇది సాధ్యమయింది. ఆయనతో కలసి ఆ చర్చి కాంపౌండ్‌లో అడుగు పెట్టగానే నేను ఎక్కడో విదేశంలో వున్న భావన నాకు కలిగింది.

చుట్టూరా అందమైన గార్డెన్‍తో చూపరులను యిట్టే ఆకట్టుకునే విధంగా, రంగురంగుల విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతూ కనిపించింది ఆ మెగా చర్చి. అక్షరాల్లో ఆ ప్రాంతాన్ని ఎంతగా వర్ణించినా అది తక్కువే అనిపిస్తుంది. చూస్తే తప్ప దాని అందాలు ఓ పట్టాన అవగాహన కావు. ఈ అందమైన ప్రాంతాన్ని, మతానికతీతంగా అందరూ దర్శించాలి.

ఇంత అపురూపమైన కట్టడానికి రూపకల్పన చేసిన పెద్దలు నిజంగా అభినందనీయులు. ఇప్పటికైనా క్రీస్తు జ్యోతి చర్చి చూడగలిగినందుకు ఎంతగానో ఆనంద పడుతుంటాను. ఈ అవకాశం మాకు కల్పించిన సోదరుడు రవి కుమార్‌కి నిండు హృదయంతో కృతజ్ఞతలు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here