జ్ఞాపకాల పందిరి-28

94
6

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నేనూ – రేడియో..!!

[dropcap]జీ[/dropcap]వితంలో అనుకోకుండా, పరిస్థితులను బట్టి కొన్ని సంఘటనలు ఎదురై అవి జీవితాంతం మనతో కలసి ప్రయాణించే పరిస్థితులు ఏర్పడతాయి. అవి మంచివి అయినప్పుడు, మన జీవితానికీ, ఆనందమయ జీవన యానానికి, మనకి ఉపయోగపడేవిగా వున్నప్పుడు, అవి మనల్ని గానీ మన జీవితాల నుండి గానీ వేరయ్య ప్రసక్తి ఉండదు. అంటే దానికి అంత శక్తి ఉంటుందన్నమాట! మన సంతోషానికి, చైతన్యానికీ అవి అంత శక్తివంతంగా పనిచేస్తాయన్న మాట!

ఇంతకీ, నేను చెప్పబోతున్నది రేడియో గురించి, నా జీవితంపై రేడియో ప్రభావం గురించి. నా జీవితాన్ని రేడియో అంత ప్రభావితం చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి అవకాశాలను నేను వూహించలేను కూడా! కారణం నా కుటుంబం ఆర్థిక నేపధ్యం. పుట్టినప్పటి నుండి (1953) ఎనిమిదవ తరగతి వరకూ నా జన్మస్థలం లోనే (దిండి – రాజోలు) వున్నాను. అప్పడు రేడియో అనేది నాకు అందని ద్రాక్షపండే! నా మనసులో అది బడాబాబుల విలాస వస్తువు. అందుచేత ఆ వయస్సులో రేడియోని చూడ్డం గానీ, దాని గురించిన ఆలోచన గానీ జరగలేదు. దానికి మించిన ప్రాధాన్యతలు వేరేవి అనేకం ఉండేవి! అందుచేత రేడియో గురించి ప్రత్యేకంగా ఎప్పుడూ ఆలోచించలేదు.

అనారోగ్యం కారణంగా నేను 1964 ప్రాంతంలో నేను అన్నయ్య దగ్గరకు హైదరాబాద్ వెళ్లాను. అన్నయ్య రెండుగడుల ఇంటిలో, చాపల్ బాజార్ దగ్గర కూబ్దీగూడలో ఉండేవాడు. పది పన్నెండు పోర్షన్ల గృహ సముదాయం అది. అంతా ఒకే కుటుంబం మనుష్యుల్లా కలసిమెలసి ఉండేవారు. ఆ ఇంటి యజమానులు కృష్ణయ్య – యాదయ్య అన్నదమ్ములు. వాళ్ళు కూడా స్వంత మనుష్యుల్లా ప్రవర్తించేవారు. ఆ రెండు గదుల పోర్షన్‌కు 40/- అద్దె ఉండేది. ఈ వాతావరణంలో అన్నయ్య మీనన్, ఫిలిప్స్ రేడియో కొని తెచ్చాడు. కరెంట్‌తో పనిచేసేది. అక్కడ నాకు రేడియోతో పరిచయం ఏర్పడింది. రేడియో అంటే ఏమిటో తెలిసింది.

శ్రీ అమీన్ సహానీ

ఉదయం సిలోన్ (రేడియో శ్రీలంక)లో పాత హిందీ పాటలు వినేవాడిని. ప్రతి బుధవారం శ్రీ అమీన్ సహానీ నిర్వహించే ‘బినాకా గీత్‌మాల’ ‘అసలు మిస్ అయ్యేవాడిని కాదు. అలా రేడియోతో విడరాని బంధం ఏర్పడడంతో, తెలుగు కార్యక్రమాల పట్ల కూడా మక్కువ ఎక్కువైంది. సమయం అంతా ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి ఉండడం వల్ల, ఉదయం భక్తి రంజనితో మొదలై, రాత్రి 9 గంటల ఆంగ్ల వార్తల వరకూ ఇంచుమించు రేడియో పని చేస్తూనే ఉండేది. ఈ విషయంలో మా అన్నయ్య గానీ, వదిన గానీ, నన్ను ఎప్పుడూ నిరుత్సాహ పరచలేదు.

ఢిల్లీ నుండి వెలువడే జాతీయ తెలుగు వార్తలు (ఇప్పుడు హైదరాబాద్ నుండి), హైదరాబాద్ – విజయవాడ నుండి వెలువడే ప్రాంతీయ వార్తలు తప్పక వినేవాడిని. శ్రీ పన్యాల రంగనాథ రావు, శ్రీ తిరుమలశెట్టి శ్రీరాములు, ద్రోణంరాజు వెంకట్రామయ్య, శ్రీమతి జోలిపాళెం మంగమ్మ, మాడపాటి సత్యవతి, ప్రయాగ రామకృష్ణ, కందుకూరి సూర్యనారాయణ, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్, శ్రీ సురమౌళి, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, శ్రీ రాఘవులు, డి. వెంకట్రామయ్య, ఇలా నేను మరచిపోయిన ఇంకా చాలామంది వార్తలు చదివేవారు. ఆ వార్తలు వినసొంపుగా ఉండేవి. ఉర్దూ వార్తలు చదివిన శ్రీ వసీం అఖ్తర్ వార్తలు చదివే విధానం, తక్షణం ఉర్దూ నేర్చుకోవాలని అనిపించేలా ఉండేది. అంత గొప్పగా చదివేవారు. పద ఉచ్చారణ చాలా స్పష్టంగా, సరళంగా ఉండేది.

శ్రీ పన్యాల రంగనాథ రావు

మధ్యాహ్న కార్యక్రమాలలో ‘కార్మికుల కార్యక్రమం’ తప్పక వినేవాడిని. ప్రతి శుక్రవారం, కార్మికుల కార్యక్రమంలో ‘వినోదాల వీరయ్య’ అనే కార్యక్రమం వచ్చేది. ఇది చాలా వినోద భరితంగా ఉండేది. ప్రయాగ నరసింహ శాస్త్రి గారు అనుకుంటా, వీరయ్యగా బుర్రకథ, హరికథ, పద్ధతిలో కొనసాగేది. తప్పకుండా ఈ కార్యక్రమం కోసం ఎదురు చూసేవిధంగా ఉండేది. అప్పటికి టి.వి. చానళ్ల హడావిడి లేదు.

తరువాత, నేను ఎన్నటికీ మరువరానిది, ‘కాలకన్య’ సీరియల్ నాటకం. శ్రీ నండూరి విఠల్ ఈ నాటకం రాసి, సమర్పించారు. నండూరి విఠల్, శ్రీమతి శారదా శ్రీనివాసన్, హీరో హీరోయిన్లుగా నటించారు. అందులో శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి సంభాషణలు – ఆ స్వరం, ఇప్పటికీ మరచి పోలేను. అలాంటి స్వరం నేను మళ్ళీ ఇప్పటివరకూ వినలేదనే చెప్పాలి, అంత బాగా ఉండేది.

తరువాత ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒక పాత సినిమా వచ్చేది. ఇంచు మించు ఇంట్లో వాళ్ళు అందరు ఆ సమయానికి రేడియో దగ్గరికి చేరేవారు. వాడ్రేవు పురుషోత్తం, ఈ సంక్షిప్త శబ్ద చిత్రం వ్యవహారం చూసేవారు. తరువాత, వార్తావాహిని అనే కార్యక్రమం చాలామందిని ఆకట్టుకునేది. మంచి వ్యాఖ్యాతను ఎన్నుకునేవారు. నాకు గుర్తున్నవారు, పి.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి, రాఘవులు, మాడపాటి సత్యవతి, ప్రయాగ రామకృష్ణ, తిరుమలశెట్టి శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, సురమౌళి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. నాకు గుర్తులేనివారు ఇంకా వుండి వుంటారు.

శ్రీ తిరుమలశెట్టి శ్రీరాములు

తరువాత తప్పకుండా మరచిపోకుండా గుర్తుపెట్టుకోదగ్గ మరో కార్యక్రమం ‘ఈ మాసపు పాట’ ప్రసిద్ధకవుల లలితగీతాలను, మంచి గాయకుల చేత, సమర్థవంతులైన సంగీతకారుల దర్శకత్వంలో, చాలా మంచి లలితగీతాలను వినిపించేవారు. ఇది ప్రతి ఆదివారం, నాలుగు వారాలపాటు ఉండేది.

నాకు గుర్తున్న అలాంటి సంగీత దర్శకుల్లో శ్రీ పాలగుమ్మి విశ్వనాథం, శ్రీ చిత్తరంజన్ ముఖ్యులు. ఎక్కువగా కృష్ణ శాస్త్రి, బోయి భీమన్న, శ్రీశ్రీ, దాశరథి, సి.నా.రె. రాసిన పాటలు ఉండేవి. కార్మికుల కార్యక్రమం (హైదరాబాద్)లో, శ్రీమతి రతన్ ప్రసాద్, ఉషశ్రీ, జీడిగుంట రామచంద్ర మూర్తి, శ్రీ సత్యనారాయణల సంభాషణలు, చాలా వినోద భరితంగా, విజ్ఞాన దాయకంగా ఉండేవి. సాయంత్రాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇద్దరి ప్రముఖుల సంభాషణ (కబుర్లు) చాలా విజ్ఞాన దాయకంగా ఉండేది. ప్రారంభంలో “నమస్కారం పంతులు గారూ..” అంటే, ఇంకొకాయన – “రా.. ఎల్లయ్యా.. రా.. ” అన్న మాటలతో ఆ సంభాషణలు వినసొంపుగా, గ్రామీణ వ్యవసాయదారులకు అర్ధమయ్యే భాషలో/యాసలో ఇది కొనసాగేది!

ఇంకా సినీమా పాటలతో రూపకాలు, సాహిత్య కార్యక్రమాలు, కవి పరిచయాలు ఉండేవి. ఇటువంటి కార్యక్రమాలు శ్రీ రావూరి భరద్వాజ తదితరులు నిర్వహిస్తూ వుండేవారు. ఉగాదికి తప్పక కవి సమ్మేళనం ఉండేది. ఇందులో మహామహులంతా పాల్గొనేవారు. నేను మాత్రం శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె, బోయి భీమన్న, కుందుర్తి ఆంజనేయులు, కరుణశ్రీ, దాశరథి వంటి కవుల కోసం ఎదురుచూసేవాడిని. ఒక ఉగాదికి విశ్వనాథ వారు అధ్యక్షత వహించిన కవి సమ్మేళనం వినే అవకాశం నాకు కలిగింది.

ట్రాన్సిస్టర్ రేడియో నా చేతికి రావడానికి చాలా కాలమే పట్టింది.

ఇక అసలు విషయానికొస్తే -నా రేడియో కార్యక్రమాల ఆరంగేట్రం 1975లో జరిగింది. ఆ సంవత్సరం హైద్రాబాద్ చింతలబస్తీలో కొత్తగా పెట్టిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, బి.ఎస్.సి (బి.జెడ్.సి గ్రూపు) మొదటి సంవత్సరంలో చేరాను. మాసాబ్ ట్యాంక్ నుండి నడిచి వెళ్ళేవాడిని. అన్నయ్య మీనన్ అప్పుడు శ్రీ రామచందర్ రాజు గారి ఇంట్లో అద్దెకు ఉండేవాడు.

శ్రీ సత్యవోలు సుందరసాయి

అలా కళాశాలలో నాకు, శ్రీ సుందరసాయి, కృష్ణమోహన్, మురళి, తదితరులు మంచి స్నేహితులైనారు. అందులో శ్రీ సత్యవోలు సుందరసాయి, బహుశా నేనుకూడా తూర్పుగోదావరి జిల్లావాడినని కాబోలు నాతో కాస్త ఎక్కువగా స్నేహంగా ఉండేవారు. పైగా, ఆయన విజయనగర్ కాలనీలో ఉండడం వల్ల, ఇద్దరం చాలా సార్లు కాలేజీకి కలసివెళ్లడం, కలసి రావడం జరిగేది. నేను వాళ్ళ ఇంటికి వెళ్లడం, ఆయన మా ఇంటికి రావడం జరుగుతుండేది. అలా మా స్నేహం బాగా బలపడిందని చెప్పాలి. సుందరసాయి గారికి బావగారి వరస శ్రీ జీడిగుంట రామ చంద్రమూర్తి గారు. అప్పటికే ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రంలో మంచి రచయితగా, ముఖ్యమైన వ్యక్తిగా బాగా పేరు తెచ్చుకున్నారు. అలా సుందరసాయి ఆకాశవాణి యువవాణి కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అలా నన్ను కూడా సాయి రేడియోకి పరిచయం చేసాడు. ఆయనతో పాటు నేను కూడా యువవాణి కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడిని. మేము రేడియో నాటికల్లో (యువవాణి) తరచుగా పాల్గొనేవాళ్ళం. అప్పుడు యువవాణి కార్యక్రమాలను శ్రీమతి దుర్గాభాస్కర్ గారు చూసేవారు. ప్రయాగ వేదవతి గారు కూడా తర్వాత యువవాణిని నిర్వహించేవారు. ఈ నేపథ్యంలోనే నాకు శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి, పాలకుర్తి మధుసూదనరావు గారు, రాఘవులు గారు, భీమయ్యగారు, మంత్రవాది సుధాకర్ గారు పరిచయం అయ్యారు. ఇలా నా బి.డి.ఎస్. అయ్యేవరకూ ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రంతో అవినాభావ సంబంధం ఉండేది. తర్వాత ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఏర్పడడం, నేను వరంగల్‌లో స్థిరపడడం జరిగింది. ఈ నా రేడియో కార్యక్రమాలు నిరాటంకంగా 1975 నుండి 2013 వరకూ కొనసాగాయి.

అనేక కారణాలవల్ల, అవకాశాలవల్ల నాకు, ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కొత్తగూడెం, వరంగల్ కేంద్రాలలో నా కార్యక్రమాలు ప్రసారం అయ్యే అవకాశం కలిగింది. అలాగే కొంత మంది మిత్రులను ఆకాశవాణికి పరిచయంచేసే అవకాశం నాకు కలిగింది. హైద్రాబాద్‌లో దూరదర్శన్ వచ్చాక, నాకు మొదట టి.వి.లో కార్యక్రమం ఇప్పించిన ఘనత కూడా మిత్రులు సత్యవోలు సుందరసాయిదే!

ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, నా చిన్నన్నయ్య (డా. మధుసూదన్ కానేటి) ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో అనౌన్సర్‌గా పదవీవిరమణ చేయడం, నా కూతురు, నిహార కానేటి ఇప్పుడు ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తుండడం రేడియో పట్ల నాకున్న మక్కువకు పరాకాష్ట.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here