జ్ఞాపకాల పందిరి-29

77
11

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అమ్మమనస్సు.. మేడం ఝాన్సీ గారిది!!

బాసిజం.. అనేది ఆంగ్లేయులు మన సమాజానికి అంటించిపోయిన మరకనో, లేక మన సంస్కృతితో అనాదిగా కలసి పయనిస్తున్న జీవనవిధానమో తెలీదుగానీ, ఇప్పటికీ అది మనల్ని విడిచిపెట్టినట్టు లేదు. అవి ఓ పట్టాన వదిలేవి కావు. ఎందుకంటే వందల సంవత్సరాలపాటు మన నరనరానా.. జీర్ణించుకుపోయి, తాతముత్తాతల నుండి మన జీవన విధానంలో, లేదా పరిపాలనా సంస్కృతిలో ఒక ముఖ్యభాగం అయిపోయింది. ఇంచు మించు అన్ని విభాగాల్లోనూ ఇది వుంది. ఇప్పుడిప్పుడే ఇందులో మార్పులు వస్తున్నాయి.

ఆప్యాయంగా ‘ఏరా!’ అని పిలవడం వేరు, అధికారికంగా ‘ఏరా..’ అని పిలవడం వేరు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంటుంది. ప్రేమగా బూతుపదంతో పలకరించడం వేరు, ఒక బాస్‌గా బూతు విశేషణంతో పిలవడం వేరు. సామాజిక చైతన్యం బలంగా ోవేళ్లూనుతుండడంతో, ఈ బాసిజంలో వాళ్ళ పలకరింపుల్లో ఇప్పుడు చాలామటుకు తేడా వచ్చినప్పటికీ, కొన్ని ముఖ్య కార్యాలయాల్లో ఈ జబ్బు ఇంకా పూర్తిగా నయం కాలేదు. కారణాలు అనేకం, అవన్నీ ఇక్కడ విశ్లేషించుకునే అవకాశం లేదు. ఇక్కడ మాత్రం నా బాసులతో, నా అనుభవాన్ని పాఠకులతో పంచుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశం. మరో విషయం ఏమంటే, ఎందరితో ఎన్ని అనుభవాలు వున్నా, కొందరు మాత్రమే జీవితంలో చిరస్థాయిగా గుర్తుండి పోతారు. ఈ నేపథ్యంలో, గొప్ప ప్రేమ, అభిమానం, వాత్సల్యం కలబోసి ఒక ఉన్నత వ్యక్తిత్వాన్ని తన స్వంతం చేసుకున్న, మా ‘డిస్ట్రిక్ – కోఆర్డినేటర్ – వైద్య విధాన పరిషత్ (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం) డా. శ్రీమతి ఝాన్సీ మణి గారి గురించి నేను చెప్పాలి. కారణం ఏమిటంటే నాకు తెల్సి ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ అలాంటి అధికారి ఉండడం బహు అరుదు. అలాంటి అధికారిణి నేతృత్వంలో్ పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆ కాలాన్ని, మా పరిధికి సంబంధించి, స్వర్ణ యుగంగా భావించవచ్చు. మా అధికారిణి డా. ఝాన్సీ మణి గారి గురించి చెప్పేముందు, మా వైద్య విభాగం గురించి కొంత వివరించవలసిన అవసరం వుంది. అది చెప్పకుంటే, అప్పటి వరంగల్ జిల్లా, మహాబూబాబాద్‌లో పని చేస్తున్న నాకు, కరీంనగర్ లో వున్న మా అధికారిణితో గల సంబంధం/అవసరం పాఠకులకు అర్థం కాదు!

ప్రజా సంబంధాలతో ఎక్కువగా ముడివడి వున్న ప్రధాన విభాగాలలో, అతి ముఖ్యమైన విభాగం వైద్య విభాగం! ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. దీనికి సంబందించిన సంచాలకుని (డైరెక్టర్) కార్యాలయం, హైద్రాబాద్ (సుల్తాన్ బాజార్)లో ఉండేది. మొత్తం రాష్ట్రానికి సంబంధించి, వైద్య రంగం అంతా ఆయన పర్యవేక్షణలో ఉండేది. జనాభా పెరుగుదల, తద్వారా ఏర్పడిన కుటుంబ సంక్షేమ శాఖ, క్షయ, కుష్టు, ఎయిడ్స్, వంటి పెక్కు సమస్యలు తెరమీదికి రావడంతో, ప్రధాన వైద్య సంచాలకునికి పర్యవేక్షణ భారం పెరగడంతో, ఇద్దరు సంచాలకులను సృష్టించవలసి వచ్చింది. అందులో మొదటిది – డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. రాష్ట్రంలోని వైద్య విద్య, బోధనా ఆసుపత్రులు, వీరి పర్యవేక్షణ క్రిందికి వస్తాయి. రెండవది, డైరెకర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్. జిల్లా ఆసుపత్రులు, తాలూకా ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వీరి పర్యవేక్షణలో ఉండేవి. కుటుంబ సంక్షేమం క్షయ నిర్మూలన, కుష్టు నివారణ, ఎయిడ్స్ నివారణ వంటి ఉప -విభాగాలు, ప్రాథమిక దశలో వీరి పర్యవేక్షణ లోనే ఉండేవి. ప్రతి జిల్లాకు ఒక జిల్లా-వైదాధికారి, కొన్ని జిల్లాలకు కలిపి, ఒక రీజినల్ డైరెక్టర్ వుండి, వీరిపై పర్యవేక్షణ అధికారం, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌కు ఉండేది. ఇలా అవసరాన్నిబట్టి, తర్వాత అనేక ఉపవిభాగాలు, కమీషనరేట్లు ఏర్పడ్డాయి.

నాటి ఆంధ్రప్రదేశ్‌లో, మొదటి సారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడినప్పుడు, తెలుగుదేశంపార్టీ ఘన విజయం సాధించి శ్రీ ఎన్.టి.రామారావు ప్రభుత్వం ఏర్పడినప్పుడు, రాష్ట్ర వైద్య విభాగంలో పెను మార్పులు జరిగాయి. అందులో ప్రధానమైనది ‘వైద్య విధాన పరిషత్’. దీనికి అధిపతి కమీషనర్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిధులు కావాలంటే, వారి నిబంధనల ప్రకారం ఈ వైద్య విధాన పరిషత్ పురుడు పోసుకుంది. జిల్లా-ప్రధాన ఆసుపత్రులు, తాలూకా ఆసుపత్రులు ఈ కమిషనరేట్ పరిధిలోనికి వెళ్లాయి. జిల్లా వైద్య ఆరోగ్యాదికారికి, జిల్లా/తాలూకా ఆసుపత్రుల మీద ఎలాంటి అజమాయిషీ లేకుండా, కొన్నిజిల్లాలకు కలిపి ఒక కోఆర్డినేటర్‍ను నియమించారు. జిల్లా వైద్య అధికారులు గతంలో నిర్వహించిన అన్నికార్యక్రమాలూ కో-ఆర్డినేటర్ చేతిలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో నేను పనిచేస్తున్న వరంగల్ జిల్లా, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ పరిధి లోనికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో పని చేస్తున్న నేను, నా సర్వీసుకు సంబందించిన అన్నిపనులకు కరీంనగర్‌కు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. నేను ముఖ్యంగా వార్షిక ఇంక్రిమెంట్ కోసం వెళ్ళేవాడిని. అప్పుడు కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆ ఆఫీసు కూడా జిల్లా ఆసుపత్రిలోనే ఉండేది. అప్పుడు జిల్లా కో-ఆర్డినేటర్ గా డా.ఝాన్సీ మణి గారు(గైనకాలజిస్ట్) ఉండేవారు. నా 29 ఏళ్ళ సర్వీసులో, అలాంటి సహృదయ అధికారిని నేను చూడలేదు. అధికారం అడ్డు పెట్టుకుని క్రింది స్థాయి ఉద్యోగులను చిన్నచూపు చూసే అధికారులే ఎక్కువ శాతంలో వుంటారు. కానీ డా. ఝాన్సీ మణి మేడం వ్యక్తిత్వం దీనికి పూర్తిగా భిన్నం. చిన్న-పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ స్వంత మనుష్యుల్లా అభిమానించడం మేడం ప్రత్యేకత! ఆంద్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఏర్పడిన తర్వాత, మొదటి సారి నా వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు నిమిత్తం కరీంనగర్ వెళ్లాను. మహబూబాబాద్ నుండి వరంగల్ వరకూ రైలులో ప్రయాణం చేసి, వరంగల్‌లో బస్సు ఎక్కి కరీంనగర్‌లో దిగాను. అప్పటికి లంచ్ సమయం కావడం వల్ల, బస్‌స్టాండుకు దగ్గరలోవున్న హోటల్‌లో భోజనం చేసి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో, సూపరింటెండెంట్/కో -ఆర్డినేటర్ ఆఫీసుకు వెళ్లాను. నా అదృష్టవశాత్తు, మేడం అప్పటికి ఇంకా లంచ్ కోసం ఇంటికి వెళ్ళలేదు. బ్రతుకు జీవుడా అనుకుని, మేడం ఛాంబర్లోకి అడుగుపెట్టి మేడంగారికి నమస్కరించి వెళ్లిన పని గురించి వివరించాను. వెంటనే ఆవిడ కూర్చోమన్నారు. కాలింగ్ బెల్ కొట్టి, సంబంధిత సీనియర్ అసిస్టెంటును పిలిపించి “ఈ డాక్టరు గారు మహబూబాబాద్ నుండి వచ్చారు. ఆయన ఇంక్రిమెంట్ మంజూరు లెటర్ టైపు చేసి,నేను లంచ్‌కు వెళ్ళేలోపు సంతకం తీసుకో..” అన్నారు. తర్వాత నావైపు తిరిగి

“లంచ్ చేసారా?” అన్నారు.

“చేసాను.. మేడం.. ” అన్నాను.

“ఎక్కడ చేసావ్..?” అన్నారు మళ్ళీ.

“ఇక్కడే, హోటల్‌లో చేసాను మేడం..” అన్నాను.

“హోటల్‌లో ఎందుకు తిన్నావు?” అన్నారు, నా వైపు సీరియస్‌గా చూస్తూ. నాకు అర్థం కాలేదు, కాసేపు టెన్షన్‌కు గురి అయ్యాను. నా పరిస్థితిని గమనించిన మేడం “ఇంకెప్పుడు బయట తినకు, మా ఇంట్లో తినవచ్చు.. ఇబ్బంది లేదు!” అన్నారు. మేడం మాటలు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఎక్కడా ఇలాంటి పరిస్థితి ఉండదు. మేడం వాత్సల్యం నన్ను అబ్బుర పరచింది.

ఈలోగా నా ఇంక్రిమెంట్ శాంక్షన్ లెటర్ మేడం టేబుల్ మీదికి వచ్చింది. సంతకం చేసి అది నా చేతిలో పెట్టారు. మేడంకు కృతజ్ఞతలు చెప్పి తిరిగి ఆనందంగా ఇంటికి బయలుదేరాను.

వార్షిక ఇంక్రిమెంటు గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలి. నిబంధనల ప్రకారం, ఉద్యోగికి ఏ నెలలో ఎవరికీ ఇంక్రిమెంట్ ఉందో చూసి, ఉద్యోగి అడగకుండానే, మంజూరు చేసి, ఉద్యోగి దృష్టికి తీసుకురావాలి. మామూలుగా, ఆ నెల నుంచి జీతంలో కలపాలి. కానీ చాలా మంది క్లర్కులు కావాలని ఆలస్యం చేసేవారు. మరికొందరు, డబ్బులకోసం (లంచం) ఆలస్యం చేసేవారు, ఇంకొందరు రకరకాల కారణాల వల్ల వారి పగ తీర్చుకోవడానికి తాత్సారం చేసేవారు. కొందరు అధికారులు క్లర్కుల చేతిలో కీలుబొమ్మలుగా ఉండడం చేత, అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఉపయోగం ఉండేది కాదు. పైగా ఈ పని ఎంత ఆలస్యం అయితే,అంత ఎక్కువ లంచం డిమాండు చేసేవారు. ఇలాంటి పరిస్థితులు రుచి చూసిన నాకు, మేడం దివినుండి భువికి దిగివచ్చిన ఒక దేవతలా కనిపించారు!

మరోక్క సారి ఇదే పనిమీద కరీంనగర్ వెళ్లాను. మేడం ఛాంబర్లోకి వెళ్లి యధావిధిగా విష్ చేసాను. నన్ను చూసి నవ్వి ఎదురుగా కూర్చోమన్నారు. నేను వెళ్లిన పని వివరించగానే, క్లర్కుకు ఆ పని అప్పగించి, ఇంటికి ఫోన్ చేశారు. ఇంట్లో మేడం భర్త డా. రామమోహన్ రావు గారు (కంటి వైద్య నిపుణులు) క్లినిక్ నడుపుతారు. ఆయనకు ఫోన్ చేసి “మహబూబాబాద్ నుంచి ఒక డాక్టర్ వచ్చారు, కొంచెం బియ్యం ఎక్కువ వెయ్యమను వంటమనిషిని” అన్నారు. ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. నా ఆఫీసు పని పూర్తి చేయించి, ఆర్డర్ నా చేతిలో పెట్టి, నన్ను కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకుపోయారు. ఆవిడ మాకు లంచ్ వడ్డిస్తుంటే నాకు సిగ్గేసేది. ఆవిడ మొహమాట పడవద్దని వారించేవారు.

మేడం స్వయంగా ఆమ్లెట్ వేసి నాకు వడ్డించారు. ఆ సన్నివేశం ఎన్నటికీ మరువరానిది. ఇలా నాకే కాదు, దూరంనుంచి ఆఫీసు పనిమీద వచ్చిన వారు ఎవరైనా మేడం ఇంట్లో తిని పోవలసిందే! అంతటి మంచి మనిషి మేడం ఝాన్సీ మణి గారు. ఒక వేసవి కాలం రోజు మళ్ళీ ఇదే సన్నివేశం మళ్ళీ పునరావృతమైంది.

డా. ఝాన్సీ మణి

మేడం గారు, లంచి అయిన తర్వాత, బంగిన పల్లి మామిడి పండు కోసి మా ముందు పెట్టారు. అది తింటూనే –

“మేడం, మీరు రసాలు తినరా? మామిడి రసాలు మీకు ఇష్టం ఉండదా?” అన్నాను.

“ఎందుకు ఇష్టం ఉండదు? ఇక్కడ దొరికి చావవు! ఇక్కడి మనుష్యులు రసాలు ఇష్టపడరు” అన్నారు నవ్వుతూ.

నేను అది మనసులో పెట్టుకున్నాను. ఇంటికి వెళ్లిన తర్వాత, విజయవాడలో వున్న పెద్ద బావమరిదికి ఫోన్ చేసి, మంచి మామిడి రసాలు కొని (విజయవాడలో మంచి రకాలు దొరుకుతాయి మార్కెట్‌లో) ఒక బుట్ట తీసుకురమ్మని చెప్పాను. అలా మరునాడే మామిడి పళ్ళు వచ్చాయి. అవి తీసుకు వెళ్లి మేడం గారికి బహుకరించాను. అప్పటి మేడం సంతోషాన్ని వర్ణించడానికి మాటలు రావు, అక్షరాలు చాలవు!

డా. రామ్మోహనరావు

అలాంటి మంచి మనసున్న అధికారులు బహు అరుదుగా వుంటారు. అందులో మేడం ఝాన్సీ గారి లాంటి వాళ్ళు ముందు వరుసలో వుంటారు. వృత్తి మీద, మానవీయ సంబంధాల మీద ఆవిడకున్న అపారమైన గౌరవమే, సమాజంలో ఆవిడను మహోన్నత వ్యక్తిగా నిలబెట్టింది. అలాంటి గొప్ప వ్యక్తులను మరచిపోదాం అన్నా మరచిపోలేము. ఝాన్సీ మణి మేడం గారిది అమ్మ మనస్సు! ఆవిడ పేరు తలచుకోగానే, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహనీయురాలు స్వర్గీయ డొక్కా సీతమ్మ గుర్తుకు వస్తారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here