జ్ఞాపకాల పందిరి-32

87
11

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఇలా.. కూడా జరుగుతుంది..!!

[dropcap]స[/dropcap]మాజంలో

మొబైల్ –

ఆవిష్కరణ జరిగి

సర్వం తానై..

చక్క బెట్టుకొస్తున్నది

మంచి – చెడులను

సమానంగా –

మూటకట్టుకుంటున్నది!!

ఇది నిజం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఊహించని రీతిలో శిఖరాగ్రాన్ని చేరుకొని, మొబైల్ లాంటి అత్యాధునిక పరికరాన్ని పదిలంగా మన చేతిలో పెట్టింది. ప్రారంభ దశలో ఇది సామాన్యుడికి అందుబాటులో లేనప్పటికీ ప్రస్తుతం, సామాన్యుడి నుంచి అతి సామాన్యుడి వరకూ, మొబైల్ అందుబాటులోనికి వచ్చేసింది. అదొక తప్పనిసరి వస్తువుగా ప్రతి వారికీ చేరువ అయింది. మామూలుగా జేబులో అగ్గిపెట్టె వేసికెళ్ళినట్టుగా, మొబైల్‌ను జేబులో వేసుకు పోతున్నారు. దానికి జతగా సంచిలోనో, బ్రీఫ్ కేసు లోనో చార్జరును కూడా తీసుకు పోతున్నారు. మరి, మొబైల్ ఎందుకు ఇంత అత్యవసర వస్తువుగా మారిపోయింది?

అవును, మొబైల్ నిత్యావసరంగా మారిపోయింది. ఫోటోలు తీయడానికి కెమెరా అవసరం లేకుండా చేసింది, చేతి వాచీతో సమయం చూసుకోవలసిన అవసరం లేకుండా చేసింది. ఉదయం లేవడానికి వీలుగా అప్రమత్తం చేయడానికి అలారంతో పనిలేకుండా చేసింది. ఇతరప్రాంతాలకు సమాచారం అందించడానికి, ట్రంకాల్, టెలిగ్రామ్‌తో అవసరం లేకుండా చేసింది. గ్రీటింగ్ కార్డుల అవసరం లేకుండా చేసింది. బ్యాంకుకు వెళ్ళక్కర లేకుండా ఇంట్లో కూర్చుని బ్యాంకు లావాదేవీలు చేసుకునే అవకాశం కలిగించింది. లెక్కలు చేసుకోవడానికి, కాలిక్యులేటర్ అవసరం లేకుండా చేసింది. అన్నింటికీ మించి ఎక్కడెక్కడో వున్నమిత్రులను, బంధువులను, శ్రేయోభిలాషులను దగ్గరకి చేర్చింది, ఒకరినొకరు చూసుకుంటూ ముచ్చటించుకునే అవకాశం కలిపించింది. చెప్పుకుంటూ పొతే ఇలాంటివి మరెన్నో మరి! ఇంతకీ మొబైల్ గురించి ఇంత ఉపోద్ఘాతం చెప్పడానికి వెనుక ఇప్పుడు చెప్పబోయే కథనం ముడిపడి వుంది, అందుకే ఇదంతా!

నాకు మొబైల్ అలవాటు అయినప్పటినుండీ దానిని బాగానే సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాను. ఉదయం లేచిన తరువాత బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు,ఇతర పెద్దలకు,’శుభోదయం’ పోస్ట్ చేయడం అలవాటు. ఇష్టమైనవారు స్పందిస్తుంటారు, ఎక్కువ శాతం మంది స్పందించరు. అయినా, నేను బాధపడను. అది నా నిత్యకృత్యంగా అలవాటు అయిపోయింది. తర్వాత, కామెంట్స్, మెసెంజర్, వాట్స్అప్ ఇలా కొంతసేపు గడుపుతాను. అలాంటప్పుడు, అప్పుడప్పుడు ఫ్రెండ్-రిక్వెస్ట్‌లు వస్తుంటాయి. అమ్మాయిలూ, అబ్బాయిలూ, పెద్ద-చిన్న,ఇలా. సాధారణంగా ఎలాంటి స్నేహితులకు ఓకే.. చెబుతామో అందరికీ తెలుసు. అదే.. నా.. విషయంలోనూ జరిగింది. ఒక అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ అది! ఆ అమ్మాయి రిక్వెస్ట్ పెట్టిందో, నేను పెట్టానో తెలీదు కానీ.. ఆ.. అమ్మాయి లేతగా అప్పుడే బి.డి.ఎస్. పాస్ అయిన అమ్మాయి కాబట్టి వెంటనే ఓకే చేసేసాను. ఎక్కడ చదివిందీ, ఎప్పుడు పాస్ అయిందీ లాంటి విషయాలు కనుక్కున్నాక,

“మరి,ఇప్పుడు ఏమి చేయదలచుకున్నావమ్మా?” అని అడిగాను.

“ఏమి చేయాలో తెలీడం లేదు సార్..అంతా,అయోమయంగా వుంది” అన్నది.

“మరి ఎవరి ప్రైవేట్ క్లినిక్లోనైనా పనిచేయవచ్చు కదా!” అన్నాను.

“అందరూ కొంతకాలం ఉచితంగా పనిచేయమంటున్నారు సార్..” అని,

నా మీద నమ్మకం కుదిరాక- “ఏమి చేయమంటారో.. పెద్దవారిగా మీరే సలహా ఇవ్వండి సార్..” అంది.

కాసేపు ఆలోచించాను, నిజానికి, ఆ అమ్మాయి సోషల్ వర్క్ హాబీగా ఎంచుకున్న అమ్మాయి.

“ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పని చేస్తావా? దీనివల్ల ఎప్పటికైనా ఉపయోగపడొచ్చు.” అన్నాను.

“తప్పకుండా చేస్తాను సార్, కానీ, అక్కడ నాకు ఎవరూ తెలియరు సార్” అంది.

“నువ్వు ఇష్టపడితే ఆ సంగతి నేను చూసుకుంటాను” అని ఆమెకు భరోసా ఇచ్చాను. ఎందుచేతనంటే, ఆ అమ్మాయి కరీంనగర్‌కు చెందిన అమ్మాయి. అక్కడ నేను ఏడు సంవత్సరాలు సివిల్ సర్జన్‌గా పనిచేశాను.

నా దగ్గర కాంటాక్ట్ పద్దతిలో పని చేసిన దంత వైద్యురాలు పర్మినెంట్ అయి అక్కడే పనిచేస్తున్నది. ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా నాకు తెలిసిన వారే! అందుకే ముందు ఆ డాక్టరమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పాను.

అందుకు ఆమె, తనకేమీ అభ్యంతరం లేదనీ..సూపరింటెండెంట్ అనుమతి తీసుకంటానని చెప్పింది. తక్షణమే చెప్పినట్టు చేసింది కూడా! అలాగే సూపరింటెండెంట్ గారు కూడా ఉచితంగా పని చేయడానికి అంగీకారం తెలిపినట్టు చెప్పింది.

ఆ అమ్మాయి సంతోషంగా మరుసటి రోజునుంచి హాస్పిటల్‌కి వెళ్లడం, శ్రద్ధగా పని చేయడం, పేషంట్ల మన్ననలు పొందడం జరిగింది. అలా మంచి పేరు తెచ్చుకుంది. నిజానికి ఇలాంటి వైద్యులే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయాలి. పెద్దమొత్తాల్లో జీతాలు తీసుకుంటూ రోగులతో ఆడుకునే వైద్యులు వుంటారు. అందరూ అలా ఉంటారని కాదు; ఏ కొందరివల్లో ప్రభుత్వ వైద్యులందరికి చెడ్డ పేరు వస్తుంది. నేను కూడా ప్రభుత్వ వైద్యుడిగా పని చేసిన అనుభవం తోనే ఇలా రాయవలసి వస్తున్నది.

ఆ అమ్మాయి అలా వరుసగా ఒక రోజు, ఒక నెల కాదు, ఏకంగా రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఆసుపత్రిలో తన ఉచిత సేవలు అందించింది, అందరి మన్ననలు పొందింది. అధికారుల, స్థానిక నాయకుల ప్రశంశలు పొందింది. తన అనుభవాన్ని, (ఆసుపత్రిలో – ఇతర సేవా కార్యక్రమాల్లో) వివరిస్తూ, అధికారులను, వైద్యరంగ ప్రముఖులను, స్థానిక నాయకులను అవకాశం వచ్చినప్పుడు, ఆసుపత్రిలో తనకు స్థానం కల్పించవలసిందిగా వినమ్రంగా వేడుకొంది. ఆ అమ్మాయి విన్నపం మన్నించిన పెద్దలు తాత్కాలిక దంతవైద్యురాలిగా ఆమెకు స్థానం కల్పించారు. ఆమె ఆనందంగా, బాధ్యత గల వైద్యురాలిగా తన సేవలు కొనసాగిస్తున్నది. ఇక్కడ నేను కేవలం ఆ అమ్మాయికి చిన్న మార్గం చూపించానంతే. మిగతా కష్టాలన్నీ ఆమెనే అధిగమించి ఈ స్థాయికి చేరుకుంది. కానీ నేనేదో పెద్ద సహాయం చేసినట్టుగా ఆ అమ్మాయి ఫీల్ అవుతుంటుంది. నా వల్ల ఇలాంటి పని జరగడం నాకూ ఆనందమే! కానీ, ఆమె కృషి, పట్టుదల, కార్యదీక్షత ప్రశంసించ దగ్గవి. ఇంతకీ కొసమెరుపు ఏమిటంటే, ఇప్పటి వరకూ ఆ అమ్మాయిని నేను చూడలేదు! మొబైల్ తోనే పనులన్నీ చక్కబడిపోతున్నాయి. కరోనా కాలంలో ఎట్లానూ కలిసే అవకాశం లేదు. అది ఎప్పుడు వీలవుతుందో కూడా తెలీదు. అవునూ.. ఆ.. అమ్మాయి పేరు చెప్పనే లేదు కదూ! ఆ.. లేత.. లేత దంత వైద్యురాలు, సంఘ సేవకురాలు డా. (కుమారి) హారిక నాంపల్లి.

డా. హారికా నాంపల్లి
సహకరించిన డా. మంగ

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here