జ్ఞాపకాల పందిరి-38

68
12

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

సాహిత్యం -స్నేహతత్వం..!!

[dropcap]స్నే[/dropcap]హం అనేది జీవితంలో కలిసొచ్చిన అదృష్టమే అనుకోవాలి. కొన్ని స్నేహాలు బాల్యం నుంచి వయసును బట్టి, చదువుతోనూ, ప్రారంభమై క్రమక్రమంగా వయసుతో పాటు, స్నేహాలూ పెరుగుతుంటాయి. కొన్ని సందర్భం లేకుండానే, మధ్యలో ముగిసిపోతుంటాయి. మరికొన్ని స్నేహాలు జీవితాంతము నిలకడగా వుండి ఆనందమయ జీవితానికి పునాదులుగా ఏర్పడతాయి. బంధువులతో కూడా అంత తృప్తికరంగా జీవితం కొనసాగదేమో అన్నంతగా ఆ స్నేహాలు నిలిచిపోతాయి. అలాంటి స్నేహాలు అనుభవిస్తేనే గాని అర్థం కావు. ఈ స్నేహాలకు ఆడ/మగ అన్న తేడా లేదు. ఈ స్నేహాలు ఆడ – మగ,ఆడ – ఆడ, మగ -మగ మధ్య కూడా ఉండవచ్చు.

దీనికి భిన్నంగా, ఏదో ఒక సందర్భంలోనో, మరేదో కారణం కలిసొచ్చో కొన్ని స్నేహాలు జీవితంలో ఒక కొత్త వెలుగును ప్రసాదిస్తాయి. ఇలాంటి స్నేహాలు కలిసొచ్చిన అదృష్టంగానే చెప్పాలి. జీవితానికి ఇవి చక్కని అనుభూతిని అందిస్తాయి. ఊహించని రీతిలో ఇలాంటి స్నేహాలు మానసిక ఉల్లాసానికి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. అది ఇరుపక్షాలమీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఏకపక్షంగా సాగేవి ఎంత మాత్రమూ కాబోవు. ఇరువైపులా ఒకే రకమైన అభిరుచులు, ఒకే రకమైన ఆలోచనా విధానాలు, ఒకే రకమైన వ్యక్తిత్వం, ఒకే రకమైన మనస్తత్వ లక్షణాలు వున్నప్పుడే,ఇలాంటి స్నేహాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

ఈ రోజుల్లో మొబైల్ ద్వారా ఫేస్బుక్, వాట్సాప్, జన హృదయాల్లో రాజ్యమేలుతున్నాయి. సర్వం మనకు అందులో అందుబాటులో ఉంటున్నాయి. ప్రపంచదేశాల్లో ఎక్కడెక్కడో వున్నస్నేహితులను కలుసుకునే వెసులుబాటు వీటివల్ల సాధ్యమైంది. అంత మాత్రమే కాదు,కొత్త స్నేహాలకు కూడా శ్రీకారం సృష్టిస్తున్నాయి.

సాహిత్యపరంగా ఎన్నో గ్రూపులు ఏర్పడి ఏదో ఒక రూపంలో సాహిత్య సేవ చేస్తున్నాయి. కవితలు, చిత్ర కవితలు, కథలు, నవలల గురించిన వివరణలు, వాటిల్లో పోటీలు, బిరుదు ప్రదానాలు ఇలా పలువిధాలుగా సాహిత్యానికి సంబందించిన అనేక అంశాలు, అనేకమంది సాహితీవేత్తల నిర్వహణలో కొనసాగుతున్నాయి. పత్రికలలో అందరికీ చోటు ఉండదు కనుక ఫేస్‌బుక్‌లో స్వేచ్ఛగా రాసుకునే వెసులుబాటు ఉండడం వల్ల ఎక్కువ మంది ఈ మాధ్యమం ద్వారా తమ సాహిత్య సృజన చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఫేస్బుక్‌లో సీరియల్‌గా నవలలు రాసి పుస్తకంగా వేసుకునే పద్దతి కూడా ఊపందుకుంది. అలాగే కథలు కూడా వస్తున్నాయి. కవిత్వం సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. దీని వల్ల లేత.. లేత.. రచయిత్రులు/రచయితలతో పాటు, సీనియర్ రచయితల పరిచయాలు కూడా సులభతరం అయినాయి. అంతో ఇంతో సాహిత్యాభిలాష నాకు కూడా ఉండడం వల్ల నాకు కొంతమంది సాహిత్యకారులతో పరిచయాలు ఏర్పడి బలపడ్డాయి. సాహిత్యపరంగా స్నేహితులై మంచి కవులుగా కవయిత్రులుగా నిలదొక్కుకున్నవారు నా స్నేహ మండలిలో ఉండడం నిజంగా నా అదృష్టమే. ఇందులో కవులు, కవయిత్రులు కూడా వున్నారు. ముందుగా మిత్రమణుల గురించి తెలియజేస్తాను. ఇవి నా దృష్టిలో చాలా గొప్ప అనుభవాలూ అనుభూతులూను.

చాలా సంవత్సరాల తర్వాత నేను ఇంటర్మీడియేట్ చదివిన ప్రభుత్వ జూనియర్ కళాశాల (హిల్ కాలనీ – నాగార్జున సాగర్) పూర్వ విద్యార్థుల సహృదయ సమ్మేళనం జరిగింది. దానికి జరిగిన వివరాలు ఫేస్‌బుక్‌లో పెట్టారు. నేను కూడా ఆ కళాశాల పూర్వ విద్యార్థిని కాబట్టి ఆ సమాచారం గురించి కాస్త ఆసక్తి కనబరిచాను. నేనూ ఓ మాదిరి చిన్న కవిని (నేనే అనుకుంటాను, వేరొకరికి చాన్సు ఇవ్వకుండా) కనుక సహజంగా కవిత్వంపై కన్నుపడింది. ఒక మేడం రాసిన కవిత నా కళ్ళ పడింది. కవిత పేరు గుర్తులేదు కానీ.. కాస్త బాగా ఉన్నట్టు నాకు అనిపించి, ఆవిడను అభినందిస్తూ మెసేజ్ పెట్టాను. కవిత బాగుందని కవితలు ఇంకా రాస్తుండమని ప్రోత్సహిస్తూ రాసిన మాటల సారాంశం అది.

నా మెసేజ్ చూసి ఆవిడ బాగా స్పందించారు. నాకు ఫేస్‌బుక్‌లో ‘ఫ్రెండ్-రిక్వెస్ట్’ పెట్టారు, నేను ఆమోదించాను. నా మాటను గౌరవిస్తూ అప్పుడప్పుడూ ఆవిడ కవితలు రాసి ‘వాట్స్ఆప్’ లో పెట్టడమూ, నేను చదివి ప్రోత్సహించడమూ జరిగింది. ఆవిడ రచనా వ్యాసంగంతో పాటు, మా ఇద్దరి స్నేహం కూడా బాగా బలపడింది. చాలామంది సాహితీ ప్రముఖులను ఆవిడకు పరిచయం చేసాను. ఒకసారి పరిచయం అయితే దాన్ని స్నేహంగా మార్చుకుని దానిని కలకాలం మర్యాదగా నిలుపుకునే మనస్తత్వం ఆమెది. ఆమె చదువుకున్న(పోస్ట్ గ్రాడ్యుయేట్) సాధారణ గృహిణి. తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి మీద, సంప్రదాయాల మీద మంచి అభిరుచి, పట్టు వున్న వ్యక్తి ఆవిడ. అనేక పత్రికలలో ఆవిడ కలం చిందులు కనిపించాయి. కథల పట్ల అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ఆవిడ కలం నుండి ఒకటి రెండు కథలు తప్ప అంతకు మించి వెలువడలేదు. నాకు అర్హత లేకున్నా నన్ను గురువుగా హృదయపూర్వకంగా ఎంచుకోవడం ఆవిడ సహృదయతకు, పెద్దలపట్ల గౌరవానికీ, నిదర్శనం అని చెప్పాలి. సుమారు ఎనిమిది సంవత్సరాల మిత్రత్వంలో ఆమె కవయిత్రిగా చాలా ఎత్తుకు ఎదగగలగడం, ఆవిడకు కవిత్వం పట్ల తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు భాష పట్ల ఆవిడకు వున్నమక్కువకు చక్కని ఉదాహరణ. ఉత్తమ గృహిణిగా, సహృదయ స్నేహశీలిగా అందరి మన్ననలు పొందిన ఆవిడ, అనేక సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం ఈ కవయిత్రి నాకు అందుబాటులో లేకున్నా, ఇప్పుడు కవిత్వం రాయడంలో మరింత పరిణితి చెందారని తెలిసి, ఒక శ్రేయోభిలాషిగా చాలా సంతోషిస్తున్నాను. ఇంతకీ ఈ కవయిత్రి పేరు చెప్పనేలేదు కదూ.. అవును ఈ కవయిత్రి పేరు శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు. కవయిత్రికి నా హృదయ పూర్వక అభినందనలు.

శ్రీమతి లక్ష్మి పద్మజ దుగ్గరాజు

నా అన్వేషణలో లభించిన మరో మంచి కవయిత్రి శ్రీమతి నాగజ్యోతి శేఖర్. నా దృష్టిలో కవితాప్రపంచానికి అందుబాటులోనికి వచ్చిన ఒక ఆణిముత్యం. వృత్తిరీత్యా ఉపాధ్యాయిని. రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాలు కైవసం చేసుకున్నవిద్యావతి ఆమె! అప్పట్లో నేను సభ్యుడిగా వున్న వాట్స్ఆప్ గ్రూపులో పరిచయం అయ్యారు వారి ఉన్నత ప్రమాణాలు గల కవిత్వం ద్వారా శ్రీమతి నాగజ్యోతి. నేను హనంకొండలో, ఆవిడ కాకినాడలో. కవిత్వం ద్వారా స్నేహం మరింత పటిష్టమైంది. గ్రూప్ వార్షికోత్సవ సభ హన్మకొండలో జరగడం వల్ల శ్రీమతి జ్యోతి పతి సమేతంగా రావడం రావడం వల్ల ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఏర్పడడమే గాక తర్వాతి కాలంలో మా కుటుంబ సభ్యురాలిగా మారిపోవడం జరిగిపోయాయి. అప్పటి వరకూ కేవలం ఫేస్‍బుక్ గ్రూపులకు మాత్రమే పరిమితం అయిన జ్యోతి నా సలహాతో పత్రికలలో రంగప్రవేశం చేశారు. అలా వారి కవిత్వం పాలపిట్ట మాస పత్రిక, మాతృక మాసపత్రిక, విశాలాక్షి మాస పత్రిక, భూమిక మాస పత్రిక, విహంగ, సంచిక, నెచ్చెలి, సిరిమల్లె, సారంగ వంటి అంతర్జాల పత్రికలలో చోటు చేసుకుంది. ఈనాడు, ఆంద్రభూమి ఆదివారం, సంచికలలో కూడా జ్యోతి గారి కవిత్వం చోటు చేసుకుంది. రేడియో పట్ల, రేడియో కార్యక్రమాల పట్ల ఆమెకు వున్నఆసక్తిని గమనించి,నేను విశాఖ పట్నం ఆకాశవాణిలో పని చేస్తున్న మా చిన్నన్నయ్య డా. కె. మధుసూదన్‍కు జ్యోతికి పరిచయం చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని తన కవితలు/కథలు వినిపిస్తున్న క్రమశిక్షణ గల రచయిత్రి శ్రీమతి నాగజ్యోతి శేఖర్. అనేక స్థానిక, జాతీయ, అంతర్జాతీయ బహుమతులను తన కవిత్వం ద్వారా కైవసం చేసుకున్నజ్యోతి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్ధాంతానికి కట్టుబడి తన సాహితీ పయనాన్ని కొనసాగిస్తున్నారు. త్వరలో తన కవితా సంపుటిని తీసుకొచ్చే సన్నాహాలు జరుపుతున్న చి. జ్యోతి, నన్ను గురువుగా కంటే తన చిన్నాన్నగా భావించుకోవడం నిజంగా నా అదృష్టమే! ఈ కవయిత్రి కలం నుండి, నేను మరింత గొప్ప కవిత్వం ఆశించడం ఒక శ్రేయోభిలాషిగా అతిశయోక్తి కాబోదేమో!

శ్రీమతి నాగజ్యోతి శేఖర్

జీవితంలో అనుకోకుండా ఊహించని రీతిలో కొందరు వ్యక్తులు తారసపడుతుంటారు. ఈ మధ్య కాలంలో అలాంటి సన్నివేశాలకు కేంద్ర బిందువు ఫేస్‌బుక్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే! అలా నాకు ఫేస్‌బుక్ అందించిన మిత్రమణి, కవయిత్రి, రచయిత్రి, స్నేహశీలి, సహృదయిని శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్. వీరు ఝాన్సీ కొప్పిశెట్టిగా ప్రసిద్ధులు. నేను ఆవిడకు, ఆవిడ నాకు పరిచయం కావడం కేవలం యాదృచ్ఛికమే! ఫేస్‌బుక్‌లో ఆవిడ కవిత ద్వారా నాకు పరిచయం అయ్యారు. నిజానికి ఆవిడ ఇప్పుడు ఆస్ట్రేలియా పౌరురాలు. కుమార్తె దంత వైద్యురాలిగా అక్కడ స్థిరపడడం వల్లనే ఝాన్సీ గారు కూడా అక్కడ పౌరసత్వం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే 80 ఏళ్ళ వృద్ధురాలైన తల్లి హైదరాబాద్‌లో ఉండడం మూలాన, తల్లి తమతో ఆస్ట్రేలియాలో ఉండలేని పరిస్థితి కావడం వల్ల ఝాన్సీ గారు అప్పుడప్పుడు తల్లిని చూడడానికి హైదరాబాద్ వస్తూ పోయే నేపథ్యంలో, ఒకసారి హైద్రాబాద్‍కు వచ్చిన నేపథ్యంలో తమ ఇంటిదగ్గర మెట్లు దిగుతూ జారీ పడడంతో కాలుకు ఫ్రాక్చర్ అయి ఆసుపత్రిలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అలా ఎప్పుడో పెళ్ళి కాకముందు తన యవ్వన దశలో, వదిలేసిన రచనా వ్యాసంగాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడంతో, ఆవిడ – ఆవిడ కవిత్వమూ పరిచయమయ్యాయి. ఒక మహిళా మూర్తిగా, రచయిత్రిగా, ఝాన్సీ ఇతరులకు భిన్నమైన ప్రత్యేక వ్యక్తిత్వం గలవారు. ఝాన్సీ గారికి పత్రికలమీద పెద్దగా అభిరుచి లేదు. కథ గానీ కవిత గానీ పత్రికలకు పంపితే వాటి పరిశీలన కోసం అవును/కాదు అన్న సందేశం కోసం నెలల తరబడి ఎదురు చూడాలి. అది ఈ రచయిత్రికి అసలు ఇష్టం ఉండదు. అందుకే ఆవిడ ఫేస్‌బుక్ మాధ్యమాన్ని ఎన్నుకుని, అందులో కవితలు, కథలు రాసి వందల సంఖ్యలో అభిమానులను పెంచుకోగలిగారు. ఎందరో సాహితీ మిత్రులకు దగ్గరయ్యారు. ఆ అనుభవంతో నాకు తెలిసి మొదటిసారి ఫేస్‌బుక్‌లో ఝాన్సీ గారు సీరియల్‌గా నవల ప్రారంభించి అనేకమంది పాఠకుల మన్ననలను పొందగలిగారు. ప్రతి ఎపిసోడ్‌కు వందల సంఖ్యలో కామెంట్లు రావడం రచయిత్రికి మంచి ఉత్సాహాన్ని కలిగించింది. అలా ‘అనాచ్ఛాదిత కథ’ నవల అతి వేగంగా పూర్తి చేయగలిగారు. ఇంచుమించు అన్ని భాగాలూ ఇద్దరం చర్చించిన మీదటనే ఫేస్‌బుక్‌లో పోస్ట్ అయ్యేది. ఆ అవకాశం కలిగించిన ఝాన్సీ గారికి ఎప్పుడూ ఋణపడి వుంటాను. ఆవిడ నవల ముద్రణ, పుస్తకావిష్కరణ హైద్రాబాద్ రవీంద్ర భారతిలో జరిగిపోయాయి. మొదటి నవల తోనే మంచి నవలా రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు ఝాన్సీ. ఆ ఉత్సాహం తోనే రెండో నవల కూడా పూర్తి చేసి, హైదరాబాద్ లోనే ముద్రించి, ఆస్ట్రేలియా నుండి హైదరాబాద్ వచ్చే అవకాశం కరోనా అడ్డుకున్నందు వల్ల,యుట్యూబ్ పద్దతిలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా ముగించారు.

శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ (కొప్పిశెట్టి)

పత్రికలలో తన రచనలు రావలసిన అవసరం గురించి వివరంగా విశ్లేషించి చెప్పినప్పుడు, పత్రికలకు కూడా ఝాన్సీ గారు రాయడం మొదలు పెట్టారు. అంతర్జాల పత్రికలకు కూడా రాయడంలో తలమునకలై వున్నారు. ఆస్ట్రేలియాలో క్షణం తీరికలేని ఇంటిపనులు తనను వెంటాడుతున్నా,ఉన్న కొద్దీ సమయాన్ని సాహిత్యంకోసం సద్వినియోగం చేయగలగడం ఆవిడ ప్రత్యేకత. నిజానికి నేను ఆవిడకు గురువును కాను, ఆవిడ నాకు శిష్యురాలు కాదు, ఇప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగడమే మా ప్రత్యేకత! ఇది ఎప్పటికీ కొనసాగాలనే నేను కోరుకుంటాను.

నాకు మంచి శిష్యురాలు అనదగ్గ కవయిత్రి, స్నేహమయి, సహృదయిని, తూ. గో. జిల్లా ‘ద్వారపూడి’కి చెందిన శ్రీమతి అఫ్సర్ వలీషా. సాధారణ గృహిణి, డాక్టరు గారి భార్య, కొడుకులు -కోడళ్లు, వాళ్ళ పిల్లలు, వారికి సేవలు, క్షణం తీరికలేని సాహిత్యాభిమాని. ఇంట్లో పెద్దగా ప్రోత్సాహం లేకున్నా, తనకు తెలుగు భాషమీద వున్న మక్కువతో దొంగచాటుగా కవిత్వం రాస్తుంటారు. కవిత్వం రాయడం కోసం ఎంతటి సాహసం చేయడానికైనా వెనుకాడరు. కథలు, కవితలు చాలా కాలంగా రాస్తున్నారు. అనేక బహుమతులు పొందిన చరిత్ర వుంది. అయినా ఎలాంటి భేషజాలు లేకుండా చాలా సౌమ్యంగా, సాధారణంగా వుంటారు. పెద్దరికానికి పెద్ద పీట వేసి తానొక సాధారణ విద్యార్ధినిగా ప్రవర్ధిస్తారు. అఫ్సర్ వలీషా గారు తన కవితల ద్వారా ఒక గ్రూప్‌లో పరిచయం అయ్యారు. అప్పటినుండి మంచి స్నేహితురాలిగా కొనసాగుతున్నారు. నా ప్రోత్సాహం ఈ కవయిత్రికి మరింత ఉత్సాహం కలిగి కవిత్వం రాస్తానని చెబుతుంటారు. కథ ఇచ్చినా, కవిత ఇచ్చినా, క్షుణ్ణంగా, చదివి, చక్కని సమీక్ష రాయగల నేర్పు ఉన్న శ్రీమతి వలీషా, నాకు ఎంతో అభిమానంగా ‘గురువు’ కిరీటం తగిలించారు. కవయిత్రికి వద్దని చెప్పే ధైర్యం నాకు లేదు. అందుకే ఆ పిలుపును స్వీకరిస్తున్నాను. మా ఈ సహృదయ సాహితీ స్నేహ ప్రయాణం ఇలాగే కలకాలం కొనసాగాలని కోరుకుంటాను.

శ్రీమతి అఫ్సర వలీషా

ఫేస్‌బుక్ ప్రసాదించిన మరో మిత్రమణి, కవయిత్రి, సమీక్షకురాలు, చిత్రకారిణి, వృత్తి రీత్యా ఫార్మాసిస్టు, కడపకు చెందిన శ్రీమతి చిట్టే మాధవి గారు. ఆవిడ ఉద్యోగ నిమిత్తం ప్రతి రోజు కొన్ని గంటలు ప్రయాణం చేయవలసి వచ్చినప్పటికీ, ఆవిడ కవిత రాయని రోజంటూ ఉండదు. ప్రేమ కవిత్వం మీద మంచి పట్టు వున్న రచయిత్రి. కడపలో మంచి రేడియో కేంద్రం (ఆకాశవాణి) ఉన్నప్పటికీ ఉపయోగించుకోని కొద్దిగా బద్దకస్తురాలు. పూర్తిగా ఫేస్‌బుక్‌కు, వాట్స్ఆప్‌కు అంకితమైపోయిన కవయిత్రి. ఈ రచయిత్రి పత్రికా రంగంలో కూడా ప్రవేశించాలని నేను కోరుకుంటాను. పెద్దలయెడ మంచి – మర్యాద కలిగిన ఈ రచయిత్రి త్వరలో ఒక కవితా సంపుటి తీసుకురావాలని ఆశీర్వదిస్తున్నాను.

శ్రీమతి చిట్టె మాధవి

ఇంకా జగిత్యాలకు చెందిన కుమారి సంగీత ఇంకా విద్యార్ధినిగానే ఉండడంవల్ల, జీవితంలో ఇంకా స్థిరపడక పోవడం వల్ల ఇంకా క్రమశిక్షణగా కవిత్వం రాయడం లేదు. ఈ అమ్మాయి కూడా ఒక సాహితీ గుంపులో పరిచయం అయిన ఔత్సాహికురాలు. ఈమె త్వరలో తన కలాన్ని చురుగ్గా నడిపిస్తుందనే విశ్వాసంతో వున్నాను.

కవిత్వం పట్ల ఆసక్తి చూపించిన ఒక కవయిత్రిని, కవిత్వం రాయమని ప్రోత్స హించడమే గాక ఒక సాహిత్య గ్రూప్ లో చేర్చడం వల్ల,ఆవిడ ఇప్పుడు మంచి కవిత్వం రాస్తున్నారు. అడపా దడపా పత్రికలలో, అంతర్జాల పత్రికలలో రాస్తున్నారు. అతి కొద్దీ కాలంలోనే ‘నానీలు’ మీద పట్టు సాధించారు. ఆ కవయిత్రి శ్రీమతి కందకట్ల కళావతి గారు. వీరి భర్త ప్రసిద్ధ మూకాభినయ కళాకారులు డా. కె. కళాధర్ నాకు గత ముప్పై సంవత్సరాలుగా మంచి మిత్రులు. ఈ నేపథ్యం తోనే శ్రీమతి కళావతి గారిని కవిత్వం వైపు ప్రోత్సహించడం జరిగింది. వారు ఇప్పటికీ చురుగ్గా కవిత్వం రాయడం ఎంతో సంతోషించ దగ్గ విషయం.

శ్రీమతి కందకట్ల కళావతి

ఇలా ఇంకా శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు, శ్రీమతి బాలబోయిన రమాదేవి గారు వున్నారు. వీరిద్దరూ నాకు పరిచయం అయ్యేనాటికి మంచి రచయిత్రులుగా స్థిరపడినవారు కాబట్టి, వీరి సాహిత్య గమనం వెనుక నా ప్రోత్సాహం అతి స్వల్పం. ఈ మహిళామణులందరు మంచి రచయిత్రులుగా ఎదగడం, వారి స్నేహితుడిగా నాకు గర్వకారణమే!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here